విశాఖ

సమస్యలు పరిష్కరిస్తా: అచ్చెన్నాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం జూలై 21: ఆర్టీసీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అక్కయ్యపాలెం పోర్టు కళావాణి ఆడిటోరియంలో శుక్రవారం ఆర్టీసీ ఎన్‌ఎంయు ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల 60 రోజుల సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవుగా ప్రకటించేందుకు తాము కృషి చేస్తామన్నారు. అలాగే కార్మికుల వయో పరిమితిని 60 ఏళ్ళకు పెంచడం, ప్రభుత్వంతో చర్చించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. గ్రామీణ, మండల కేంద్రాలకు వెళ్ళే ప్రయాణికుల కోసం నడుస్తున్న పల్లె వెలుగు బస్సులను మరిన్ని పెంచుతామన్నారు. తనకు జరిగిన సత్కారం మరువలేనిదిగా పేర్కొన్నారు. ఎన్‌ఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి లీవును స్పెషల్ క్యాజువల్ లీవుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. సమ్మెకాలం జీతాన్ని ఇవ్వాలన్నారు. డ్రైవర్లు, కండక్టర్లను పర్మినెంట్ చేయాలని, కారుణ్య నియామకాలను తక్షణమే నిర్వహించాలని, కార్మికులకు యూనిఫారం ఇవ్వాలన్నారు. చిన్నచిన్న పొరపాట్లకు సైతం కార్మికులు బలైపోతున్నారన్నారు. పనిష్‌మెంట్‌లు కఠినంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, ముఖ్యంగా ఆర్టీసీ సంస్థను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎన్‌ఎంయు ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 1967 ఆగస్టులో ఆర్టీసీ ఎన్‌ఎంయు స్థాపించబడిందన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతా ఆర్టీసీ కార్మికుల న్యాయమ్నై కోర్కెల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. తప్పు చేయలేని, చిన్నచిన్న పొరపాట్లుకు కార్మికులు పనిష్‌మెంట్‌లకు గురవుతున్నారని, ఈ విధానాన్ని యాజమాన్యం విడనాడాలన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ఆర్టీసీ బస్సులు పెంచాలన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ నిరంతరం శ్రమించే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. విజయవాడ నుంచి సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ అన్సారీ, విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.రామకృష్ణ, ఆర్టీసీ విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ సుదేశ్‌కుమార్, ఎన్‌ఎంయు ప్రచార కార్యాదర్శి ఎంవిఆర్ మూర్తి, జోన్ కార్యదర్శి పివిఎన్ మోహన్ తదితరులు పాల్గొని మంత్రిని సేవలను కొనియాడారు.

పీలా.. ఇప్పుడేమంటారు?
విశాఖపట్నం, జూలై 21: తన తాతలు.. తండ్రులు ఇచ్చిన భూములే కోకొల్లలు. ప్రభుత్వ భూమిని ఆక్రమించాల్సిన అగత్యం తనకుపట్టలేదని మీడియా ముందు బీరాలు పలికిన పీలా గోవింద్ సత్యనారాయణ కబ్జాకు పాల్పడినట్టు సిట్ ధృవీకరించింది. ఒకటి, రెండు ఎకరాలు కాదు.. ఏకంగా 300 కోట్ల రూపాయల విలువైన 95 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేశాడు. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ కబ్జాలో భాగస్వాములు కావడం గమనార్హం. సిట్ వలన ప్రయోజనం లేదని, నిజమైన దోషులు తప్పించుకుంటారని అంతా భావించారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు చేయడానికి వెనకాడలేదు సిట్ అధికారులు. పీలాపై కేసు నమోదు కావడంతో సిట్‌పై విశాఖ ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఈ కేసునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం మండలం రామవరంలో సుమారు 95 ఎకరాల స్థలాన్ని పీలా గోవింద్, అతని కుటుంబ సభ్యులు 1995-2006 మధ్య ఆక్రమించుకున్నారు. ఈ విషయాన్ని చాలా కాలం గోప్యంగా ఉంచారు. భూమి కబ్జా చేయడంతోపాటు రికార్డులను కూడా ట్యాంపర్ చేశారు. ఈ భూ కబ్జాపై హైదరాబాద్‌కు చెందిన పి మనోహర్ సిట్‌కు ఫిర్యాదు చేశారు. మనోహర్ ఇచ్చిన ఫిర్యాదుపై సిట్ అధికారులు దర్యాప్తు జరిపి, కలెక్టర్‌ను అంద చేశారు. ఈ భూమికి సంబంధించి, పూర్తి వివరాలు ఇవ్వడానికి కలెక్టర్ పది రోజులకు పైగా పట్టినట్టు తెలుస్తోంది. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తరువాత పీలా గోవింద్, తదితరులు ఈ భూమిని కబ్జా చేసినట్టు ధృవీకరించారు. వెంటనే సిట్ అధికారులు, కలెక్టర్ సిఫార్స్ మేరకు ఆనందపురం పోలీస్ స్టేషన్‌లో 11 మందిపై కేసు నమోదు చేశారు. పాలకపాటి సత్యనారాయణరాజు, పాకలపాటి బైరాగిరాజు, పాకలపాటి రమేష్, పీలా పంకజాక్షి, బొడ్డేటి సుభద్రమ్మ, పీలా ధనలక్ష్మి, పీలా కృష్ణఅప్పారావు, పీలా గోవింద్ సత్యనారాయణ, పీలా శ్రీనివాసరావు, శరగడం అప్పారావుపై ఐపిసి సెక్షన్‌లు 418, 420, 465, 466, 467, 468, 471, 204, 409, 120(బి)తోపాటు ఏపి ల్యాండ్ గ్రాబింగ్ యాక్స్ సెక్షన్ 3,4 కింద కేసు నమోదు చేశారు. ఇంకా ఈ కబ్జాకు సహకరించిన తహశీల్దార్లు సుమారు 10 మంది వరకూ ఉంటారని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇద్దరు తహశీల్దార్లను ఈ కేసులో చేర్చనున్నారు.
తమ జోలికి రారన్న ధీమా
పీలా గోవింద్ సత్యనారాయణ 1995 నుంచి భూ కబ్జాలకు పాల్పడ్డారన్న విషయం ఈ కేసుతో తేటతెల్లమైంది. తను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి, తన జోలికి ఎవ్వరూ రారన్న ధీమాతో పీలా వ్యవహరించారు. ఇటీవల పీలా గోవింద్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు కూడా, తను నిర్దోషినని నిరూపించుకునేందుకు మీడియా ముందుకు వచ్చారు. కానీ ఇవేవీ చెల్లుబాటు కాలేదు.
అధికార పార్టీకి ఎదురు దెబ్బ
విశాఖ భూ కుంభకోణంతో ప్రభుత్వం పరువు గంగలో కలిసింది. కబ్జాలతో సంబంధం ఉన్న ఎంతటివారినైనా వదిలిపెట్టబోమని సిఎం ప్రకటించారు. అయితే తొలి వికెట్ తమ పార్టీకి చెందిన వారిదే పడిపోతుందని ఆయన భావించి ఉండరు. పీలాపై కేసులు బలంగా నమోదైనాయి. దీంతో పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ మరింత దిగజారే పరిస్థితి ఏర్పడింది. పీలాపై చంద్రబాబు నాయుడు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
కనె్వన్షన్ సెంటర్ షురూ
విశాఖపట్నం, జూలై 21: ప్రభుత్వం తరపున భారీ సమావేశాలు నిర్వహించాలంటే, అన్ని వసతులతో కూడిన కనె్వన్షన్ సెంటర్ లేదు. ఇటువంటి సమావేశాలు నిర్వహించడానికి ఓ భారీ సమావేశ మందిరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అది ఇప్పటికి సాధ్యమైంది. స్థానిక సుబ్బరామిరెడ్డి గెస్ట్ హౌస్‌కు సమీపంలో ఉన్న ఏపిఐఐసికి చెందిన స్థలంలో ప్రపంచ శ్రేణి కనె్వన్షన్ సెంటర్‌ను నిర్మించనున్నారు. గతంలో రెండుసార్లు సిఐఐ భాగస్వామ్య సదస్సులు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే స్థలంలో ఏడు అంతస్తుల అధునిక కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. ఇందులో ఒక ఫ్లోర్‌లో భారీ సమావేశ మందిరం ఉంటుంది. చిన్న చిన్న సమావేశమందిరాలు కూడా ఉంటాయి. మరో అంతస్థులో ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది. మిగిలిన ఫ్లోర్స్‌లో షాపింగ్ మాల్స్, మల్టీప్లక్స్‌లను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఏపిఐఐసి దగ్గరున్న స్థలంతోపాటు, దాన్ని ఆనుకునే ఉన్న సిఎంఆర్‌కు చెందిన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ స్థలాన్ని కూడా ఇందులో కలుపుకొన్నారు. సిఎంఆర్ యాజమాన్యానికి వేరేచోట స్థలాన్ని ఇచ్చారు. ఈ కనె్వన్షన్ సెంటర్ నిర్మాణ బాధ్యతలను దుబాయ్‌కు చెందిన లుల్లూ గ్రూప్‌నకు అప్పగించారు. సుమారు 700 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించనున్నారు. ఒక సంవత్సర కాలంలో దీన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు తెలుస్తోంది. దీని నిర్మాణ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.

వారోత్సవాల కట్టడికి పోలీసుల వ్యూహం
నర్సీపట్నం,జూలై 21: సి.పి. ఐ. మావోయిస్టులు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీస్ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఎ. ఓ.బి.లో ఈనెల 28 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మావోయిస్టుల అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సంగతి తెలిసిందే. ఈవారోత్సవాలను తిప్పికొట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఈనేపధ్యంలో శుక్రవారం నర్సీపట్నంలో రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఏజన్సీ , మైదాన ఫ్రాంత సి. ఐ.లు, ఎస్సైలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారోత్సవాలను విజయవంతం చేయడం కోసం ఇప్పటికే మావోయిస్టులు ఎ. ఓ.బి.లో చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఏజన్సీ అంతటా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు అతికించడం , కరపత్రాలను వెదజల్లడం వంటివి చేస్తున్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో మావోయిస్టులు ఉత్సవాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలో నర్సీపట్నంలో ఏజన్సీ పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈసమావేశంలో గంజాయి రవాణా, పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించినప్పటికీ ఫ్రధానంగా ఈనెల 28 నుండి ప్రారంభం కానున్న మావోల అమర వీరుల సంస్మరణ వారోత్సవాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఏజన్సీకి ఇప్పటికే అదనపు బలగాలను తరలించగా అవసరమైతే మరిన్ని బలగాలన సైతం పంపించేందుకు సైతం పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మావోలు ఉనికి చాటు కోవడం కోసమే వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, వీటిని తాము భగ్నం చేస్తామని సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తెలిపారు. మావోల కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు తెలిపారు. విశాఖ ఏజన్సీలో మావోయిస్టుల ప్రభావం తగ్గినప్పటికీ కొత్త క్యాడర్‌ను రిక్రూట్ చేసుకునే చర్యలు మావోయిస్టులు చేపడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టులు విడుదల చేస్తున్న లేఖలు కూడా వారి ఉనికిని చాటుకోవడానికేనని ఎస్పీ పేర్కొన్నారు. వారోత్సవాలను భగ్నం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఎస్పీ వివరించారు.

గంజాయి రవాణా సమూల నిర్మూలనకు చర్యలు
నర్సీపట్నం,జూలై 21: గంజాయి రవాణాను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు. గంజాయి రవాణా వెనుక ఉన్న వారు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. శుక్రవారం నర్సీపట్నం వచ్చిన ఆయన ఎ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు గంజాయి రవాణాలో కీలక సూత్రధారిగా ఉన్న నిక్కేటి శ్రీనివాసచౌదరి అలియాస్ బాబాను అరెస్ట్ చేసామన్నారు. బాబా నుండి సేకరించిన సమాచారం ఆధారంగా 15 మంది కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేయగా వీరిలో 8 మందిని అరెస్ట్ చేసామన్నారు. నర్సీపట్నంకు చెందిన సమ్ము అనే స్మగ్లర్ కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నాడన్నారు. మిగిలిన వారు ఏజన్సీ మారుమూల ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తమకు సమాచారం ఉందని, వారిని విడిచిపెట్టేది లేదన్నారు. అరెస్ట్ అయిన వారి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా త్వరలో మరింత మంది గంజాయి వ్యాపారులు, వారికి సహకరిస్తున్న వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ ఏడాది 20 వేల కిలోల గంజాయిని, 400 మంది నేరస్తులను పట్టుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని నాశనం చేయడం జరుగుతుందన్నారు. కొలిమిలో పెట్టి కాల్చేందుకు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా గంజాయి సాగును గుర్తిస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గంజాయి తోటలను ఎక్సైజ్ శాఖతో కలిసి ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. గిరిజన యువకులు పెడదోవ పట్టకుండా పోలీస్ శాఖ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇటీవల 300 మంది గిరి యువతకు పోలీస్ కానిస్టేబుల్ నియామకాల కోసం శిక్షణ ఇవ్వగా వీరిలో 20 మంది కానిస్టేబుల్స్‌గా ఎంపికయ్యారన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలపై యువతకు అవగాహన కల్పించడం కోసం అనకాపల్లి,నర్సీపట్నం ప్రాంతాల్లో మోడల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందు కోసం ప్రభుత్వం ఒక్కొక్క పోలీస్ స్టేషన్‌కు కోటి 50 లక్షలు వంతున నిధులు మంజూరు చేసిందన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు వీలుగా వాలీబాల్ కిట్లు పంపిణీ చేసామన్నారు. స్వయం ఉపాధి కల్పించడం కోసం గిరిజన యువకులతో చింతపల్లి డి ఎస్పీ ప్రత్యేకంగా టూర్ ప్రొగ్రాంను ఏర్పాటు చేసారన్నారు. 500 మంది గిరిజన యువతకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి వారికి డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేయడం జరిగిందన్నారు. వీరిలో కొంత మందికి ఐ.టి.డి. ఎ. ద్వారా ఆటోలను కొనుగోలు చేసి పంపిణీ చేసామన్నారు. ప్రస్తుతం ఏజన్సీలో మలేరియా, సాధారణ జ్వరాలు ప్రబలి ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసామన్నారు. మలేరియా జ్వరంతో ఉన్న రోగులను గుర్తించి మండల కేంద్రాల్లోని పి.హెచ్.సి.లకు అంబులెన్స్‌లో తరలించి వైద్యం చేయిస్తున్మామన్నారు. జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. జాతీయ రహదారి పొడవునా ప్రధాన కూడళ్ళ వద్ద 50 వరకు సి.సి. కెమెరాలను ఏర్పాటు చేసామని ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు.

సమస్యలు పరిష్కరించాలని కళాశాల విద్యార్థుల ఆందోళన
అరకులోయ, జూలై 21: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. కళాశాల నుంచి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించి అధికారులు, పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా పోలీసు స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆరు వందల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నప్పటికీ అధ్యాపకులు లేకపోవడం వలన పాఠ్యాంశాల బోధన సక్రమంగా జరగడం లేదని ఎస్.ఎఫ్.ఐ. నాయకుడు పి.రామన్న చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా కళాశాలలో ఖాళీగా ఉన్న అద్యాపక పోస్టులను భర్తీ చేయాలని వివిధ రూపాలలో ఆందోళన చేపడుతున్నప్పటికీ అధికారులు, పాలకులు స్పందించకపోవడంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు.
గిరిజన విద్యార్థినీల వసతి గృహంలో సరైన మరుగుదొడ్లు, నీటి సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. జూనియర్ కశాళాల చాట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని లిఖిత పూర్వకంగా కోరినప్పటికీ ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం వలన కళాశాల ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరిపోయాయని ఆయన అన్నారు. పాలకులు, అధికారులు ఇకనైనా స్పందించి కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని రామన్న కోరారు. అనంతరం రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ. నాయకులు రమేష్, రామ్మూర్తి, లక్ష్మణ్, మోహన్, బుజ్జి పాల్గొన్నారు.

60 కిలోల గంజాయి స్వాధీనం: ఆరుగురి అరెస్ట్
కోటవురట్ల, జూలై 21: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసారు. వారి నుంచి లక్షా 20 వేల రూపాయల విలువైన 60 కిలోల గంజాయిని, 40,200 రూపాయల నగదు,నాలుగు సెల్‌పోన్లు, ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి స్థానిక ఎస్సై తారకేశ్వరరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒక అజ్ఞాత వ్యక్తి అందించిన సమాచారంతో స్థానిక పోలీసులు మండలంలో పాములవాక పట్టాలమ్మ గుడి వద్ద ఉదయం 11 గంటలకు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో గంజాయి మూటలతో అటుగా వస్తున్న అక్రమ రవాణదారులు వాహనాల తనిఖీ విషయమై పొదల్లో గంజాయి మూటలను దాచి , పొలాల్లోకి పారిపోతుండగా పోలీసులు దాడి చేసి వారిని పట్టుకుని ప్రశ్నించగా గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న విషయాన్ని తెలియజేసారు. దాచి ఉంచిన గంజాయి మూటలను చూపించారు. పోలీసులు గంజాయి మూటలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా గంజాయిని చింతపల్లి నుండి పాములవాక మీదుగా తుని రైల్వే స్టేషన్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఒక మైనర్ బాలుడితో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన బోడా ఉదయ్‌కుమార్, బోడా ప్రవీణ్, మహారాష్టక్రు చెందిన అబ్దుల్ జబీర్, షేక్ అబీన్, తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగికి చెందిన రొంగలి దుర్గా ప్రసాద్‌లు ఉన్నారు.