రాష్ట్రీయం

అనుకున్నట్టే జరిగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 26: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిరవధిక పాదయాత్ర విషయంలో ఊహించినట్జే జరిగింది. పాదయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనుమతి లేదంటూ యాత్రకు ఉపక్రమించిన ముద్రగడను అడ్డుకుని గృహ నిర్భంధం చేశారు. దీంతో కిర్లంపూడి గ్రామంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తన నివాసం నుండి కాపు జెఎసి నేతలతో సహా పాదయాత్రకు ఇంటి ప్రహరీ దాటి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన ముద్రగడను అక్కడే మోహరించి ఉన్న వందలాది మంది పోలీసులు నిలువరించారు. ప్రభుత్వ అనుమతి లేని కారణంగా పాదయాత్రకు వెళ్లనిచ్చేది లేదంటూ పోలీసు అధికారులు స్పష్టం చేశారు. 151సిఆర్‌పిసి ప్రకారం 24 గంటల పాటు గృహనిర్బంధం విధిస్తూ ముద్రగడకు అధికారులు నోటీసు జారీచేసినట్టు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ ప్రకటించారు. గృహ నిర్బంధానికి ముందు పాదయాత్రకు అనుమతివ్వాల్సిందిగా ముద్రగడ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ‘చేతులు జోడించి మిమ్మల్ని కోరుతున్నా.. పాదయాత్రకు సహకరించండి’ అని పోలీసు అధికారులను కోరారు. ముద్రగడను పాదయాత్రకు అనుమతించకపోవడంతో కాపు జెఎసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. బయటకు అనుమతించకపోవడంతో ముద్రగడ తిరిగి తన ఇంట్లోకి వెళ్ళిపోయారు.
కాగా తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలువురు కాపు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్భంధంలో ఉంచారు. ముద్రగడ నివాసం పరిసరాల్లోను, కిర్లంపూడి గ్రామంలోను డ్రోన్ కెమెరాలు, సిసి కెమెరాలతో పోలీసులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలో ఎవరూ బయటకు రావద్దంటూ పోలీసులు హెచ్చరిస్తుండటం గమనార్హం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 95 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఒక్క కిర్లంపూడిలోనే సుమారు 3వేల మంది కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలను మోహరించారు. గ్రామంలో అన్ని రకాల దుకాణాలను మూసివేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు 10వేల మంది కేంద్ర, రాష్ట్ర బలగాలను బందోబస్తు నిమిత్తం నియమించడం చూస్తే గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.
న్యాయం కోసం పోరాడితే అణిచివేస్తారా:ముద్రగడ
పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేయడంతో తిరిగి ఇంట్లోకి వెళ్ళిన ముద్రగడ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఇసుక సిండికేట్లు, మట్టిమాఫియాలను పెంచిపోషిస్తూ, న్యాయం కోసం పోరాడుతున్న తమను అణచివేస్తారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీ కారణంగానే నేడు కాపులు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. ఎన్నికలకు ముందు బిసిలుగా గుర్తిస్తామని హామీనిచ్చి కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చి, అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబూ మీరు తప్పుచేస్తున్నారు.. మా శాపం తగులుతుంది.. అనుభవిస్తారు’ అని వ్యాఖ్యానించారు. తాను నిరవధిక పాదయాత్రకు నిర్ణయించుకున్నానని, పోలీసులు ఎపుడు ఇక్కడి నుండి వెళితే అపుడే పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. పోలీసులు వెళ్ళిన వెంటనే పాదయాత్ర ప్రారంభిస్తానని ముద్రగడ ప్రకటించడంతో పోలీసులకు ఈ పరిణామం శిరోభారంగా మారింది. ఇక విధిగా ముద్రగడ నివాసం వద్ద కాపలా కాయాల్సిందేనా? ఈ చిక్కుముడి ఎలా వీడుతుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. జిల్లాలో 144 సెక్షన్, 30పోలీస్ యాక్ట్‌లు అమలులో ఉన్నాయి. కిర్లంపూడిలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిసర గ్రామాల్లో బుధవారం సైతం పోలీసులు కవాతు నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున ముద్రగడ స్వగ్రామానికి తరలించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమయ్యింది.