జాతీయ వార్తలు

ప్రాథమిక హక్కే కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించే అవకాశం ఉన్నప్పటికీ దీనికి కొన్ని రకాల పరిమితులు అవసరమని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో వివరించింది. వ్యక్తిగత గోప్యతా హక్కుకు సంబంధించి అనేక అంశాలు ముడివడి వున్నందున దీన్ని పరిపూర్ణమైన రీతిలో ప్రాథమిక హక్కుగా పరిగణించజాలమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వివాదాన్ని రేకెత్తించిన ఈ అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. 1950, 1962లలో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించిన కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిస్థాయిలో ప్రాథమిక హక్కుగా పరిగణించజాలమని స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని 2015లోనే సర్వోన్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనానికి నివేదించిన విషయం తెలిసిందే. తాజాగా ఆధార్‌ను పాన్‌కు ముడిపెట్టడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దాంతో తొమ్మిదిమంది సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం గత కొన్ని రోజులుగా ఈ అంశాన్ని విచారిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వాదన వినిపించిన అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ ‘వ్యక్తిగత గోప్యతా హక్కు ప్రాథమిక హక్కే అయినప్పటికీ అది పరిపూర్ణం కాదు’ అని ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనానికి వివరించారు. వ్యక్తిగత గోప్యతా హక్కులో వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు, ఇతర భిన్నకోణాలు ముడివడి ఉన్నాయని ఆయన వివరించారు. ప్రతి అంశాన్ని, లేక ఉప అంశాలను పూర్తిస్థాయిలో ప్రాథమిక హక్కుగా పరిగణించజాలమని తేల్చిచెప్పారు. గోప్యత అన్నది స్వేచ్ఛా హక్కులోని భాగాల్లో ఒకటని అటార్నీ జనరల్ తెలిపారు. వ్యక్తిగత గోప్యతా హక్కు ప్రాథమిక హక్కు కిందికి వస్తుందా రాదా అన్నదానిపై మీ వాదన ఏమిటి అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు సమాధానంగా అటార్నీ జనరల్ ఈ వివరణ ఇచ్చారు. ‘మీరు బాధ్యత కలిగిన ప్రభుత్వ అధికారి. గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా మీరు పరిగణిస్తే మీ ప్రకటనను రికార్డు చేసి ఈ కేసును మూసివేస్తాం’ అని ధర్మాసనం అటార్నీ జనరల్‌కు స్పష్టం చేసింది. కొన్ని గంటలపాటు ఈ అంశంపై విచారణ జరిగింది. వ్యక్తిగత గోప్యతా హక్కును భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకే రకమైన అంశాలతో ముడివడిన హక్కుగా పరిగణించజాలమని వేణుగోపాల్ వివరించారు. ఎందుకంటే భారత్ వంటి దేశాల్లో కేవలం కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును అడ్డం పెట్టుకుని 60నుంచి 70 మిలియన్ మంది ప్రజల హక్కులను కాలరాసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఇంతమంది ప్రజలకు ఇప్పటికీ ఆహారం, ఆవాసం వంటి వౌలిక సౌకర్యాలు కూడా లేవని వివరించారు. ‘మనది చాలా పేద దేశం. కలహండిలో ఓ తల్లి తన కుమార్తెను యాభైవేల రూపాయలకు అమ్మేస్తుంది. ఆ చిన్నారి అంతిమంగా వ్యభిచార గృహానికి చేరుతుంది. అక్కడ ఆమె వ్యక్తిగత గోప్యత హరించుకుపోవడమే కాకుండా శరీరం కూడా ఛిద్రమవుతుంది’ అని వేణుగోపాల్ వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నేరుగానే ప్రజలకు డబ్బును అందిస్తోందని, వారి ఖాతాల్లో జమచేస్తోందని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం వారి ఖాతాలను ఆధార్‌తో సంధానం చేయడమేనని వివరించారు. గతంలో ఈ రకమైన పరిస్థితి ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలను ప్రపంచ బ్యాంక్ ప్రశంసించిందని, అనేక దేశాలు కూడా ఈ విధానానే్న అనుసరిస్తున్నాయనీ కోర్టుకు నివేదించారు. దానికి సమాధానంగా మాట్లాడిన జస్టిస్ నారిమన్ ‘ఓ సాధారణ వ్యక్తి వ్యక్తిగత గోప్యతా హక్కును విస్మరించకండి. ప్రతిదీ ఆధార్‌తో ముడిపడింది కాదు. మేము అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని అత్యంత సమగ్రమైన రీతిలో తీర్పును ఇవ్వబోతున్నాం. ఈ హక్కుకు సంబంధించి భావపరమైన స్పష్టతను అందిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి పరిణామాలను కూడా అటార్నీ జనరల్ తన వాదనలో వినిపించారు. 1975-77 మధ్యకాలంలో దేశంలో అమలైన ఎమర్జెన్సీ అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. భారతదేశ ప్రజలపై కుటుంబ నియంత్రణను బలవంతంగా అమలుచేయడమన్నది అత్యంత హేయమైన ప్రయోగమని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. వ్యక్తిగత గోప్యతా హక్కుకు సంబంధించిన భిన్నమైన అంశాలను అటార్నీ జనరల్ వివరిస్తున్న సమయంలో బెంచ్‌లోని ఓ న్యాయమూర్తి ఎమర్జెన్సీ నాటి పరిణామాలను ప్రస్తావించారు. భారతదేశ చరిత్రలో అదొక దురదృష్టకరమైన శకమని అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో వ్యక్తుల ప్రాథమిక హక్కులు హరించుకుపోయాయని తెలిపారు.