అక్షర

నేలకొండపల్లి మహాస్థూపం తెలంగాణ బౌద్ధ చరిత్రలో కొత్త కోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరుల గిరుల కోన తెలంగాణకు రక్తసక్త పోరు చరిత్ర, ఆత్మ బలిదానాల గతమే కాదు.. అహింసా సూత్ర శాంతి ప్రవచనాల వారసత్వం కూడా.. నిజాం జులుం, రజాకార్ దౌర్జన్యాల హింసా గీతానికి వేల ఏళ్ల ముందు వల్లె వేయబడిన శాంతి మంత్రం.. సాయుధ బలగాల తుపాకుల తూటాల పద ఘట్టనలకు పూర్వం ప్రబలిన అహింసా విప్లవం..
గత వలస పాలకుల ప్రభావంతో నాటి చరిత్రకారులు ఈ మహత్తర కోణాన్ని రేఖామాత్రంగానే స్పృశించినప్పటికీ కాల గర్భంలో నిక్షిప్తమైన చరిత్ర సాక్షిగా తెలంగాణలో వర్థిల్లిన బౌద్ధ మత ఉనికి గొప్పది. తెలంగాణ ఇది బౌద్ధం వికసించిన నేల. బుద్ధుడు జీవించిన కాలంలోనే విప్లవాత్మకంగా ఇక్కడ బౌద్ధమతం విలసిల్లింది. వాస్తవ చరిత్రకు ఎంత వక్రీకరణ జరిగినా ఆంధ్ర ప్రాంతంకన్నా ముందే ఈ గడ్డపై బౌద్ధం నడయాడింది.
చరిత్ర పునాదుల మీదే సమాజం నిర్మించబడుతుంది. చరిత్ర ఆలంబన లేని నాగరికత పేకమేడల సాదృశ్యమే.
గతించిన కాలం సాక్షిగా ఇక్కడ బౌద్ధం వర్థిల్లింది. బుద్ధుని ధర్మం వెల్లివిరిసింది. నిర్మల్, కొమరం భీం, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ, వరంగల్, జనగాం, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల వరకూ బౌద్ధం విస్తరించింది. సరిహద్దు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మీదుగా ఆంధ్రాలోని అమరావతికి అక్కడి నుండి శ్రీలంక, బర్మా తదితర ఆగ్నేయాసియా దేశాలకూ వ్యాప్తి అయ్యింది. తెలంగాణ ప్రాంతంలో బాదన్‌కుర్తి నుండి నేలకొండపల్లి వరకు విస్తరించిన బౌద్ధం ప్రపంచవ్యాప్తం అయ్యేందుకు తెలంగాణ ‘గేట్ వే’గా ఉపకరించింది.
ఎంత పదునైందో కదా కలం చీమ తల మొనతో చరిత్ర కొండను సైతం తవ్వేస్తుంది. కాలం కలుగులో నిద్దరోతున్న గతాన్ని తట్టి లేపుతుంది. నిక్షిప్త రహస్యాలను వెలికితీస్తుంది. జ్ఞాపకాల మన్నును తట్టలతో ఎత్తి గుట్టలుగా మన మస్తిష్కాల్లో గుమ్మరిస్తుంది. గతించిన రాజులను రాజ్యాలను బతికిస్తుంది. కథలాడిస్తుంది. మన కళ్ల ముందు కదలాడిస్తుంది. సృష్టి మూలాలను మానవ పరిణామ దశలను ఎరుకలోకి తెస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఎందుకు మొదలయ్యాయో విశదపరుస్తుంది.
ఎంత సాంకేతిక పరిజ్ఞాన మేధావో కదా సాహిత్యకారుడు. తన సృజనతో చెక్కుచెదరని భవిష్యత్ నిర్మాణం ప్రతిష్ఠిస్తాడు.
సరిగ్గా ఇప్పుడు అదే సాక్షాత్కరించింది. ‘బౌద్ధ దర్శన శిఖరం నేలకొండపల్లి మహా స్థూపం’ అనే పరిశోధనాత్మక సాహిత్యం ద్వారా ఆ పురాతన ఘన చరిత్ర వివరాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. జులై 8న ఖమ్మంలో విడుదలైన ఈ బౌద్ధ పరిశోధనా పుస్తకాన్ని సీనియర్ రచయిత జీవన్ రచించారు. ఈయన తొమ్మిది నెలల పాటు శోధించి ఈ పుస్తకాన్ని రూపొందించారు. డెబ్బై పేజీల ఈ పుస్తకంలో అయిదు అధ్యాయాల ద్వారా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ విశిష్ట చరిత్రను వివరించారు.
పుస్తకంలోని అంశాలను పురావస్తు శాఖ అధికారికంగా ధృవీకరించిన దాని ప్రకారం, అమరావతి స్థూపం ఏర్పాటుకు పూర్వమే నేలకొండపల్లి మహాస్థూపం ఏర్పాటయ్యింది. క్రీ.పూ.3వ శతాబ్దం నుండి క్రీ.శ.3వ శతాబ్దం వరకు 600 ఏళ్లపాటు ఇక్కడ బౌద్ధం వర్థిల్లిందని చరిత్ర పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
అప్పటి చరిత్రకారుల అభిప్రాయానికి భిన్నంగా ధరణికోట, అమరావతిల కన్న ముందే ఇక్కడ బౌద్ధం వర్థిల్లింది. నాటి కాలంలో ప్రముఖ పట్టణంగా వర్థిల్లిన నేలకొండపల్లిని ఆనుకొని ఇక్కడ బౌద్ధ మత విస్తరణ జరిగింది. స్థానికంగా ఏర్పాటైన బౌద్ధ నిర్మాణమే కాదు.. నేలకొండపల్లి కేంద్రంగా బుద్ధ ప్రతిమలు, శాసనాల తయారీ జరిగింది. ఇందుకోసం ఇక్కడ శిల్పుల వర్క్‌షాప్ కొనసాగినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇందుకోసం వారికి ఆవాసాలు సైతం ఏర్పాటయ్యాయి. స్థానికంగా శిల్పాల తయారీకి అనువైన రాయి లభ్యత దృష్ట్యా ఇక్కడ నుండే బౌద్ధ శిల్పాల తయారీ ఎగుమతి జరిగినట్టు చరిత్రకారుల అభిప్రాయం. అమరావతి ధరణికోట తదితర ఆగ్నేయాసియా దేశాలకు సైతం ఇవి ఎగుమతి అయినట్టు తెలుస్తోంది.
చరిత్ర సంబంధిత రచన కోసం ఈ పుస్తక రచయిత తాను సొంతంగా సేకరించిన సమాచారంతో పాటు ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రఖ్యాత వ్యాసకర్తలలు డీడీ కోశాంబీ, బాలగోపాల్ వ్యాసాలను, నేలకొండపల్లి బౌద్ధ స్థూపం వద్ద 1976-96 కాలంలో పురావస్తు శాఖ 8 దఫాలుగా సాగించిన తవ్వకాల నివేదికలను, పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ వీవీ కృష్ణశాస్ర్తీ ద్వారా సమాచారాన్ని, ‘బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఇన్ నేలకొండపల్లి’ అనే అంశంపై ఎం.్భక్షంపతి సమర్పించిన నివేదికను ఆధారం చేసుకొని ఈ సమగ్ర సమాచారం పొందుపరిచారు.
1976 నుండి 96 వరకు నేలకొండపల్లిలో కొనసాగిన పరిశోధనలూ వాటి తాలూకు నివేదికల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకం ప్రకారం తెలంగాణ ప్రాంతంలోని నేలకొండపల్లిలోని బౌద్ధ చరిత్ర విశిష్టమైనది.
నేలకొండపల్లి బౌద్ధ స్థూపం భారత దేశవ్యాప్తంగానే కాదు.. ఆగ్నేయాసియా దేశాల్లోకెల్లా ప్రాధాన్యత కలది. 212 అడుగుల వ్యాసం 54 అడుగుల ఎత్తుతో ఇది ఏర్పాటయ్యింది.
శాతవాహనుల కాలంలోనో లేక అంతకు పూర్వమో నిర్మింపబడిన ఈ బౌద్ధ ఆరామం ఆ తరువాత ఇక్ష్వాకుల కాలంలో అభివృద్ధి పరచబడింది. పురాతన తవ్వకాలకు ముందే స్థానిక రైతులు సాగించే వ్యవసాయ పనుల సందర్భంగా వెలుగు చూసింది. తదుపరి పురావస్తు శాఖ పరిశోధనల కాలంలో లభించిన ఇటుకలు, పాత్రలు, నాటి కాలాల్లో వాడిన పాత్రలు వాటిపైగల రాజముద్రలు, రాజుల పేర్లను బట్టి చిత్రకారులు స్థూప విశిష్టతను లెక్కగట్టారు.
బౌద్ధం తెలంగాణ గుమ్మం నుండి ప్రయాణిస్తూ వచ్చి అనేక సంవత్సరాల అనంతరం ఆంధ్రాలో ప్రవేశించిందనటానికి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచ చరిత్ర వర్గ పోరాటాల చరిత్ర - ప్రపంచ దేశాల తీరును శాస్ర్తియంగా అధ్యయనం చేసి వ్యక్తపరిచిన కమ్యూనిస్టు మేధావి కార్ల్‌మార్క్స్ అభిప్రాయమిది. దేశంలో బౌద్ధ ఘన చరిత్రను సొంతం చేసుకునే విషయంలోని నాటి వలస పాలకులు అనుసరించిన ఎత్తుగడల్లోనూ అదే తరహా వర్గ స్వార్థం.. తమ ప్రాంతం తమ వర్గానికే ఆ ఘనత చెందాలన్న కాంక్షతో తెలంగాణ బౌద్ధ ఘనతను చరిత్ర మట్టి అడుగున తొక్కిపట్టినట్లుగా ఇపుడు తెలంగాణ చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు.
భారతదేశ గమనాన్ని వాస్తవిక దృష్టిగల లోతైన విశే్లషణతో అర్థం చేసుకున్న బాబా సాహెబ్ అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం.. భారతదేశ చరిత్ర బౌద్ధానికి హిందూ మతానికి మధ్య జరిగిన యుద్ధం.. ప్రపంచానికి ఆదర్శమైన బౌద్ధ చరిత్ర వ్యాప్తి గొప్పదనాన్ని సొంతం చేసుకునే విషయంలో నాటి సమైక్య తెలుగు రాష్ట్రంలో సైతం ప్రాంతాల మధ్య అదే యుద్ధ తీరు నెలకొంది.
1956కు పూర్వం నుండి తెలంగాణ ప్రాంత బౌద్ధ చరిత్రను వెలికితీసేందుకు సాగించిన మహా యజ్ఞానికి సంబంధించి, కొమర్రాజు లక్ష్మణ్‌రావు, శేషాద్రి రమణ కవులు, ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి, యజ్దాని వంటి మేధావులు, బీఎన్ శాస్ర్తీ, ఠాకూర్ రాజారాం సింగ్, డా.దామెర రాజారెడ్డిల కృషికి కొనసాగింపుగానే ఈ పుస్తకం వెలువడిందని ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు అడపా సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ మట్టిలో కప్పిపెట్టబడి నేలలో పూడ్చిపెట్టబడిన బౌద్ధం భూమిని చీల్చుకొని కొండలను పగులగొట్టుకొని నదులు, కాలువలు దాటి మళ్లీ పునర్జీవం పోసుకుంటోంది. దాన్ని ఎవరూ ఆపలేరు. అది ఒక మహా ప్రభంజనం కాక తప్పదని చరిత్ర రుజువు చేయబోతోంది.. -బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య స్పందన ఇది.
తెలంగాణ నేలకు మహత్తర చరిత్ర ఉంది. మట్టి దిబ్బల్లో కూరుకున్న ఘనతను వెలికితీయాలి. ఇందుకు సాహిత్యకారులూ చరిత్రకారులుగా అవతరించాల్సిన అవసరం ఉంది. నాటి పాలకులు అనేక కోణాల్లోని తెలంగాణ గొప్పతనాన్ని వెలుగులోకి తేవటంలో శ్రద్ధ చూపలేదు సరికదా ఇక్కడి ప్రత్యేక చరిత్రను సైతం తరలించుకపోయే యత్నాలు చేశారు. ఈ ఆవేదన రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ నందిని సిధారెడ్డిది.

బౌద్ధ దర్శన శిఖరం
నేలకొండపల్లి మహా స్తూపం
(పరిశోధనాత్మక సాహిత్యం)
-జీవన్
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

- కంచర్ల శ్రీనివాస్