అక్షర

వైతాళికుల చైతన్య గీతికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు వేల సంవత్సరాల చారిత్రక గమనంలో ఒక వందేళ్ల చరిత్ర తెలంగాణకు చాలా కీలకమైంది. అణచివేతలు, పోరాటాలు, నిర్బంధాలు, వికాసాలు, స్తబ్దత చైతన్యం.. ఇట్లా భిన్నమైన గుణాలతో కూడిన పరిణామాలు ఈ కాలంతో మిళితమై కన్పించినా, చిట్టచివరకు జనం జాగ్రత్తలో చైతన్య గీతికలను పాడటమే స్పష్టంగా కన్పిస్తుంది. ఈ చైతన్య గీతికలను ప్రజాసమూహాలకు పరిచయం చేసిన వారు ఇక్కడి వైతాళికులు. ఒక్కొక్కరూ తమదైన విశిష్ట వ్యక్తిత్వంతో, విలక్షణమైన కార్యశైలిలో తెలంగాణ బహుముఖీనమైన పురోగతికి తమదైన మార్గంలో చేయూతనందించారు. తమ మార్గంలో ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నా వెరవకుండా, వెనుకంజ వేయకుండా ఈ ప్రాంత వికాసానికి, ఇక్కడి వైలక్షణ్యాన్ని కాపాడటానికి, సంస్కృతిని నాశనం కాకుండా పరిరక్షించుకోవటానికి, భాష కలుషితం కాకుండా ఉండటానికి వీరు చేసిన కృషి అనితరసాధ్యమైంది. రాజపోషణ లేదు.. రాజ్యాల ప్రోత్సాహం లేనే లేదు. ప్రభుత్వాల ఆదరణ లేదు. కానీ, పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో తెలంగాణ మాగాణాన్ని బీడుపోకుండా పొత్తిళ్లలో పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చారు. 40వ దశకం నుంచి ఇప్పటి వరకూ కూడా వీరిని, వీరి కృషిని వెలుగులోకి తీసుకురావటానికి కానీ, భావి తరాలకు అందించే ప్రయత్నాలు కానీ ఏవీ జరగలేదు. తెలంగాణ రాష్ట్రంగా విడిపోయిన తరువాత కూడా ఈ మూడేళ్లలో వౌలిక మైన కృషి ఎవరూ చేయనే లేదు. ఎక్కడికక్కడ చిన్నాచితక కూటములు ఏర్పడటం, ఎవరికి వారు సభలు, సమావేశాలు పెట్టుకోవటం, నినాదాలు చేయటం, పాటలు పాడుకోవటంతో పాటు సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవటంలో ఆరితేరిపోయారు. రాష్ట్రం ఏర్పడటం ఇక్కడి మేధోవర్గానికి అందివచ్చిన అపూర్వ వరం. ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోవటంలో పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పలేం. ఇంతకాలంగా ఇక్కడ మరుగున పడిపోయిన మహానుభావుల గురించిన సమగ్రమైన సమాచారం లేని కొరత వేధిస్తూనే ఉంది. ఈ కొరతను తీర్చేందుకు నీల్‌కమల్ ప్రచురణ సంస్థ తెలంగాణ వైతాళికులు పేరుతో డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సంపాదకత్వంలో మూడు బృహత్ సంపుటాలను వెలువరించింది. జననేతలు, అక్షరమూర్తులు, ప్రతిభామూర్తులు పేరుతో ఈ సంపుటాలను నీల్‌కమల్ ప్రచురించింది. దాదాపు 130మంది ప్రముఖులను ఎంపిక చేసుకోవటంలో సంపాదకుడి ప్రతిభ, దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజాజీవితంలో తెలంగాణాను తీవ్రంగా ప్రభావితం చేసిన వామన్ నాయక్, వినాయకరావ్ విద్యాలంకార్, బద్ధం నర్సింలు, బత్తిని మొగిలయ్యగౌడ్‌ల వంటి ప్రముఖుల సమగ్ర సమాచారం ‘జననేతలు’ అన్న సంపుటంలో పొందుపరిచారు. ఇక ‘అక్షరమూర్తులు’ అన్న సంపుటం తెలంగాణను భాషా సాహిత్యాల్లో సుసంపన్నం చేసిన ప్రముఖులందరి స్ఫూర్తిదాయకమైన జీవనగాథలు ఉన్నాయి. హీరాలాల్ మోరియా, పొట్టపల్లి రామారావు, పాములపర్తి సదాశివరావువంటి ప్రముఖుల జీవన చిత్రపటాన్ని ఈ సంపుటం ఆవిష్కరించింది.
తెలంగాణలో ప్రతిభామూర్తులకు కొదువలేదు. కానీ వారు లైమ్‌లైట్‌లోకి రావటానికి ఇంతకాలం పట్టింది. నేరెళ్ల వేణుమాధవ్, చుక్కసత్తయ్య, ఎం ఎల్ జయసింహ, చుక్కరామయ్య, లైబ్రరీ పితామహుడు ముదిగొండ శంకరారాధ్యుల వంటి వారికి ‘ప్రతిభామూర్తులు’ సంపుటం కీర్తి కిరీటాన్ని తొడిగింది.
ఈ మూడు సంపుటాలకు ముగ్గురు ప్రముఖులు ముందుమాటలు రాశారు. కెవి రమణాచారి, పొత్తూరి వెంకటేశ్వరరావు, జితేంద్రబాబులు రాసిన ముందుమాటలు ఎన్నదగినవి. సుమారు 80మంది రచయితలు ఈ సంపుటాలలో భాగస్వామ్యం పంచుకున్నారు. సంకల్పం పేరుతో ఈ మూడు సంపుటాలకు సంపాదకులు డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సంకల్పం పేరుతో సంపాదకీయం రాశారు. మూడేళ్లలో అనేకమంది చేయాల్సిన కృషిని ఒక్కరి చేతి మీదుగా జరగటం నిజంగా అభినందనీయం. అయితే ఈ సంపుటాల్లో కేవలం 130మందికి మాత్రమే చోటు దక్కింది. ఇంకా చాలామంది ప్రముఖుల జీవిత చిత్రాలు ఆవిష్కారం కావలసిన అవసరం ఉంది. ముకురాల రామిరెడ్డి, ఉత్పల, జయసూర్య, అనేకమంది అవధానులు, ప్రతిభామూర్తులు, నేతల జీవితాలు జాతికి ప్రేరణనిస్తాయి. ఈ సంపుటాలకు నీల్‌కమల్ కొనసాగింపును కూడా చేస్తుందని ఆశిద్దాం.

తెలంగాణ వైతాళికులు
-ప్రతిభామూర్తులు
-జననేతలు
-అక్షరమూర్తులు
మూడు సంపుటాలు
సంపాదకత్వం: డా.జి.బాలశ్రీనివాసమూర్తి
నీల్‌కమల్ పబ్లికేషన్స్
వెల: రూ.1000
(మూడు సంపుటాలు)

- ఆనంద