నెల్లూరు

రాబో(పో)యే కాలం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఊరుకింత మహర్దశ పడుతుందని నేను

కలలో కూడా ఊహించలేదు. కాకపోతే మా

ఊరు రెండు పట్టణాలను కలిపే రహదారిలో

సరిగ్గా మధ్యలో వుంది. ఊరికి తూర్పువైపు

రోడ్డు, రోడ్డు తర్వాత అంతా పచ్చని పొలాలు,

రోడ్డుకి పడమర వైపు మాత్రం ఊరు. అంతా

కలిసి నాలుగైదు వందల ఇళ్లు

వుంటాయోమో! చెట్టూచేమా పచ్చదనానికి

కొదువలేదు. ప్రయాణ సౌకర్యాలకూ

కొదువలేదు. ఆర్టీసీ బస్సులు రెండు

పట్టణాల మధ్య అనేక పల్లెల్ని కలుపుతూ

తిరుగుతూనే వుంటాయి. అదే మాకు ఫ్లస్

పాయింట్ అయింది. కొత్తపార్టీ అధికారంలోకి

వచ్చాక, తాలుకాలు పోయి, మండలాలు

ఏర్పాటు చేయడంతో మా ఊరికి దశ

తిరిగింది. మా ఊరు మండల కేంద్రం

అయిపోయింది. మరో ఊరు పోటీలో

వున్నప్పటికి మా ఊర్లో అధికారపార్టీ

నాయకులు గట్టివారు కావడంతో మా ఊరే

మండల కేంద్రం అయింది.
రోడ్డుకి తూర్పువైపున వున్న పచ్చని

పొలాల్లో మండల పరిషత్ కార్యాలయం

వచ్చింది. మండల రెవెన్యూ అధికారి

కార్యాలయం ఏర్పడింది. ఒకటీ, రెండు

బ్యాంకులు అద్ద్భెవంతుల్లో పోటీగా

శాఖలేర్పరచాయి. ఎలిమెంటరీ స్కూల్ కాస్తా

హైస్కూల్ అయిపోంది. దీనికి హాస్టల్

ఏర్పడింది. ఎక్కడెక్కడ నుండో వచ్చి

విద్యార్థులు చేరారు. తర్వాత కాలంలో

ప్రయివేటు జూనియర్ కాలేజీలు వచ్చాయి.
దురాభారాన ఉద్యోగాలు చేస్తున్న వారంతా

ఎవర్నో ఒకర్ని పట్టుకుని మండల కేంద్రంలో

వున్న ఆఫీసుల్లో, బ్యాంకుల్లోకి ట్రాన్స్‌ఫర్లు

చేయించుకున్నారు. రోడ్డుకి తూర్పువైపున్న

పొలాలన్ని ప్లాట్లుగా మారాయి. పొలాలను

చవకగా కొని ప్లాట్లు వేసి బెంగళూరు

ధరలకు అమ్మేశారు. ఏజెంట్లను పెట్టారు.

కమీషన్లు యిచ్చారు. ఆశల లోకంలో

విహరింపజేసి ప్లాట్లను అంటగట్టేశారు.
రోడ్డుకిరువైపులా కాఫీ హోటళ్లు, మెస్‌లు

వచ్చేశాయి. దినపత్రికలు వేలాడకట్టి వుండే

చిన్నబంకులు, ఫ్యాన్సీ దుకాణాలు

వచ్చేశాయి. పొలాలు అమ్మేయడంతో

వచ్చిన డబ్బుతో కొందరు యిళ్లు

కట్టుకున్నారు. కొందరు కార్లు కొన్నారు.

ఉదయం నుండి సాయంత్రం దాకా ఆఫీసుల

దగ్గర జనం. కాఫీ, టీ హోటళ్ల దగ్గర జనం.

పోలీసుస్టేషన్ దగ్గర మధ్యవర్తిత్వాలు!

దినపత్రికలు చూసేసి, టీవీల్లో వార్తలు వినేసి,

రోజంతా రాజకీయాలు, చర్చలు,

వాదోపవాదాలు!
ఒకప్పుడు వ్యవసాయం గురించి

మాట్లాడేవాళ్లు. యిప్పుడు అలాంటి వాళ్లు

అరుదుగా కన్పిస్తున్నారు. రైతుల సంఖ్య

బాగా తగ్గిపోయింది. ప్లాట్ల ధరల గురించి

మాట్లాడేవాళ్లే ఎక్కువ.
ప్లాట్లు కొన్నవాళ్లు ప్రతీ ఒక్కడూ ‘‘నేను

యింత’కు కొన్నాను, ఇప్పుడు యింతకు

అడుగుతున్నారు’’ అంటూ ఎచ్చులు, సొల్లు

కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం

చేస్తున్నారు. ప్లాట్లు కొన్నవాళ్లున్నారు గాని,

ఆ ప్లాట్లల్లో యిళ్లు కట్టిన వాడు లేడు. ప్లాట్ల

మధ్య నాటిన రాళ్లు వ్యవసాయానికి కట్టిన

సమాధి రాళ్లల్లా వున్నాయి. ఉన్న

పశువులు కొద్ది శాతానికి తినడానికి గడ్డి

కూడా కరువై పోయింది!
ఇంతలో ఎన్నికలు ముంచుకొచ్చాయి.

ఒకప్పుడు మా ఊర్లో వరదయ్య పెద్దరైతు.

ఒక్కగానొక్క కొడుకు తిరుపాలు.

పదవతరగతయ్యాక పట్టణానికి పంపిస్తే

తిరుపాలు సినిమాలు చూసి, షికార్లు కొట్టి

డింకీలు కొట్టాడు. చదువుకిక పనికిరాడని

వరదయ్య తిరుపాలుని తీసుకొచ్చి ఊర్లోనే

వుంచి ఏదో వ్యాపారం పెట్టించాడు.
కుదురులేక, గాలికి తిరగే తిరుపాలు ఆ

వ్యాపారాన్ని కొండెక్కించాడు. వరదయ్య

కోలుకొని పొలాలమ్మిన డబ్బు కొంత వుంటే

జాగ్రత్త చేసుకుని, ఆ డబ్బు కొడుకు

చేతికందకుండా కుటుంబాన్ని

లాక్కొస్తున్నాడు. కొడుకునేమీ అనడానికి

లేదు. ఒక్కగానొక్క కొడుకాయే!
టీ అంగళ్ల దగ్గరే ఎక్కువ కాలం గడుపుతూ

రాజకీయాలు మాట్లాడుతూ తిరుపాలు

తనంత తెలివిగలవాడు ఈ ఊర్లోనే లేడు అనే

నిర్ణయానికి వచ్చేశాడు. ఎన్నికలు

ముంచుకు రాగానే అతను టీ తాగిస్తే

తాగేవాళ్లు, మందుపోయిస్తే చప్పరించేవాళ్లు

అతన్ని గిల్లారు. ‘‘నీ అంతటోడు యిలా

వుంటే ఎలా? రాజకీయాల్లో దిగు రాణిస్తావు’’

అని.
తిరుపాలుకి తన మీద అపారంగా నమ్మకం

పెరిగిపోయింది. వార్డుమెంబరుగా

నిలబడాలని నిర్ణయానికొచ్చాడు,

‘‘మనకెందుకురా? రాజకీయాలు నీ

చదువులకి, వ్యాపారాలకు చాలా డబ్బు

ఖర్చయిపోయింది. మిగిలిందేదో నువ్వు

రాజకీయాలకి పెట్టేస్తే వృద్ధాప్యంలో మా గతేం

కాను? నీ గతేం కాను?’’ అని తండ్రి చిలలకు

చెప్పినట్టు చెప్పాడు.
మంచి చెపితే వినే అలవాటు తిరుపాలుకి

లేదు. ఉడుం పట్టుపట్టాడు. తండ్రి తలొంచక

తప్పలేదు. డబ్బు మంచినీళ్లల్లా ఖర్చయిపో

సాగింది. పోటీకి నిలబడ్డవాడు

విద్యావంతుడు, మంచి పేరున్న వాడు

కావడంతో తిరుపాలు గెలుస్తాడన్న ఆశలు

అందరిలో ఆవిరయిపోసాగాయి.
చివరకు తిరుపాలుకి కూడా సందేహం

మొదలైంది ఏం చెయ్యాలి? తను రోజూ చదివే

దినపత్రికల జ్ఞానం అంతా రంగరించి పథకం

ఒకటి వేశాడు. ఆ ఆలోచన తనకి రావడం

నిజంగా తన అదృష్టం అనుకున్నాడు. తన

విజయానికిక తిరుగులేదనుకున్నాడు.
ప్రచారం జోరందుకుంది. ఆ రోజు తిరుపాలు

ఊరి మధ్యలో రచ్చబండ దగ్గర పెద్ద మీటింగ్

పెట్టాడు. ఆవేశంగా ‘ప్రజలారా ఎంతో

ఆవేదనతో చెప్తున్నా వినండి మండల

కేంద్రం అయితే మన ఊరేదో

బాగుపడుతుందని అనుకున్నాం. మనందరి

జీవితాలు బాగుపడతాయని అనుకున్నాం.

కానీ ఏమీ జరగలేదు. మన ఊర్లో పేదలలాగే

ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల బతకులు

మరింత దిగజారిపోయాయి. ఎక్కడెక్కడి

వాళ్లు వచ్చి పొలాలు కొని ప్లాట్లు వేసి కోట్లు

గడించారు. మన ఊరికి ప్రభుత్వ

కార్యాలయాలు వచ్చాయి గదా అని

మీరనవచ్చు. అవును వచ్చాయి. బ్యాంకులు

కూడా వచ్చాయి, హైస్కూల్, హాస్టల్ కూడా

వచ్చాయి ఏంలాభం?
మన ఊర్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో

మన ఊరు వాడొకడైనా ఉద్యోగం

చేస్తున్నారా? లేదు, ఎక్కడెక్కడివాళ్లో ఇక్కడ

ఉద్యోగాలు చేస్తున్నారు. మన వార్డులో

రెండు బ్యాంకులు ఉన్నాయి. ఆఫీసర్

సంగతటుంచి కనీసం అటెండర్ అన్నా మన

ఊరి వాడున్నాడా? లేడు. మండల కేంద్రం

అయింది మన ఊరు. కానీ బాగుపడింది

పరాయి ఊళ్లలోని వారు, కోటీశ్వరులైంది

పట్టణాల నుండి వచ్చి ఇక్కడ వ్యాపారాలు

చేస్తున్నవారు. దీన్ని ఇక సహించేది లేదు.

మన ఊర్లో ఉద్యోగాలన్నీ మన ఊరి వాళ్లకే

ఇవ్వాలి. మన వార్డులో ఉన్న బ్యాంకులలో

ఉన్న ఉద్యోగాలన్నీ మనవాళ్లే చేయాలి. ఇదే

నా ఆశయం, నాలక్ష్యం, దీనికోసం నేను ప్రాణ

త్యాగానికన్నా సిద్ధం అంటూ ఆవేశంగా

మాట్లాడాడు. సభ జనం చప్పట్లతో

దద్దరిల్లిపోయింది. ‘అన్నా మీరు చెప్పింది

నిజం, మీకు మేము తోడున్నాం. కానివ్వండి

ఎంతవరకైనా పోరాడుదాం’ అంటూ

జనంలోంచి కేకలు అరుపులు తిరుపాలుకి

జయజయధ్వానాలు
తిరుపాలు చెప్పింది ఎంతవరకు వాస్తవం?

ఎంతవరకు జరిగే వీలుంది? ఇవేమీ జనానికి

పట్టలేదు, తట్టలేదు.
పంచాయతీ ఎన్నికల్లో తిరుపాలు

వార్డుమెంబర్‌గా బంపర్ మెజార్టీతో

గెలిచాడని వేరేగా చెప్పాలా?

- గంగిశెట్టి శివకుమార్ నెల్లూరు. చరవాణి : 9441895343