విజయవాడ

సినారె ప్రభ (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నుదురెంత వెడదయో హృదయాబ్జమింకను
వింగడమ్మయితోచు వెలుగులిడుచు
కనులెంత విరివియో కనుచూపులింకను
విస్తృతమ్ముగతోచు వీక్షకులకు
అధరమ్ములవి యెంత నత్యంత నవకమో
మాటలింకనుతోచు మార్దవముగ
కరశాఖలవి యెంత కమనీయమైనవో
కైతలింకనుతోచు నూతనముగ
ఆకృతదెంత గంభీరమో! అరయమోము
పై ప్రశాంతమ్మెతోచు నవాంతముగ
వేషమును చూచినంత, కవివరుండంచు
తెలిసికొను విద్యనేర్వని తెరువరైన

నీ తనువందు పారునది నెత్తురె! కాదులె! సాహితీఝరుల్
చేతము నింద్రియమ్ముల విశేష విభూతులు పొంగిపొర్లు స
త్కైతలె! పద్యమైన, నదికమ్మని గేయము పాటమాటలున్
చూతములే! గజల్ ప్రసవశోభిత చక్కని చల్వపందిరే!

బంభరవేణులున్ వికచ పద్మముఖుల్ సునభామినీమమిల్
రంభ సుఖంబును గూర్తురె? ధరాతలమందు నెవానికైన వి
శ్వంభర కావ్యమున్ గనిన స్థానము పొందితె జ్ఞానపీఠిపై
జృంభిత సత్కవీశ! గయిసేసిన నేమిలె స్వర్గ్ధామమున్

తల్లిపెళ్లాము చిత్రాన తెలుగుజాతి
ఖ్యాతినే చాటిన కవివి నీవు
కృష్ణవేణిని తెలుగింటికే విరిబోణి
గా వెలయించిన కవివి నీవు
ఆ మహారథి కర్ణ అద్భుత చిత్రాన
గాలికేకులమన్న కవివి నీవు
జక్కన చిత్రాన చాననే రాతిలో
కనిపింపజేసిన కవివి నీవు
పూజఫలము చిత్రమ్ములో పొలుపు మిగుల
దినదినమ్మునకొక్క నూతనమునైన
అందమును చూపితే కడు అందగించ
ఎన్ని చిత్రాలకయి పాటలెన్ని తేనె
లూర వ్రాసితో కవిచంద్ర ఉచ్చరింప
ఒక్క సీస పద్యమ్మున ఒదుగగలదె?
కాన ముగియించుచుంటి నా కవితనింక

అది కలవౌనె పట్టినది హస్తమునన్ హృదయాబ్జమందునన్
పొదలెడి భావజాలమును పొల్పుగ వ్రాయ సుభాజదత్త స
ద్విదిత సువర్ణలేఖిని పవిత్ర మధూళియె అందునన్ సిరా!
ఇది నిజవౌను కానియెడనెట్లు మహత్వ కవిత్వమబ్బుటల్
- కలవకొలను సూర్యనారాయణ,
చరవాణి : 9849268659

ఆరిపోనీయకు

ఆహార నిద్రా భయ మైథునాలు
అన్ని ప్రాణులకూ సహజాతాలే కాని
కడుపు నింపుకోవడంతోనే
తృప్తిపడలేడు కదా మనిషి

కళ్ల నిండా ఆశల రాశులు నింపుకొని
గుండెల్లో ఆశయాల సోపానాలు పేర్చుకొని
ఏ ఎత్తులకో ఎగిరిపోదామని
ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాడు
గతానుగతికంగా బతకడం గాక
ఏ మహానంద సీమల్లోకో
వాహ్యాళి పోయేందుకూ
ఏ మంత్రనగరి కవాటాలో తెరుచుకొని
ఊహాలోకాల సాకార రూపాలను
వెతుక్కునేందుకూ
ఉవ్విళ్లూరుతుంటాడు
ఒక రసావిష్కారం కోసం
ఒక ఉజ్వల జ్వలనోత్సవం కోసం
ఒక నిరంతర పరవశ వర్షంలో
నిలువునా తడిసిపోవటం కోసం
అంతరంగంలోని ఆర్ద్రత ఆరిపోకుండా
ఇంత చెమ్మను
చిలకరించుకుంటూనే ఉంటాడు

కంచె నిండా విరగబూసిన కాశీరత్నప్పూల
అరుణారుణ వౌన నిశ్శబ్ద సంకేతాలను
ఆకాశంలో ఆడుకునే సీతాకోక చిలుకలు
అందిపుచ్చుకొని దిగొచ్చినట్లు
ఏ మధుమాస మాధుర్యం కోసమో
ఏ పుప్పొడి తావుల ఉప్పెన కోసమో
రసోద్విగ్నంగా ఎదురెదుర్లు చూస్తుంటుంది
అనుభూతి కోసం
అలమటించే హృదయం
ఒక అనుభవపు తేనె పెర
గుండె నాలిక్కు సోకగానే
హేమంతపు తొలి వేకువ వేళ
ఒక చిన్న గాలి అలకు పొలమారిపోయి
మంచుస్నానం చేసిన చిట్టిచిట్టి పారిజాతాలను
జలజలా రాల్చుకొని జలదరించే
పూలచెట్టైపోతుంది కదా మనస్సు!
చల్లని తెల్లని రాత్రివేళ
గులకరాళ్ల మీద గునగున సంగీతమయ్యే
చిట్టి అలల సెలయేరు దగ్గరికి
కుందేలు పిల్లలు గంతులేస్తూ వచ్చినట్లు
ఎనె్నన్నో ఆశలు
ఏవేవో పరవశాల సంబరాల దగ్గరికి
వేడుకను వెతుక్కుంటూ
వెడుతూనే ఉంటాయి
దుఃఖం మజిలీ నించి సుఖానికీ
సుఖం మజిలీ నుండి దుఃఖానికీ
చేసితీరాల్సిన ప్రయాణమే గదా జీవితమంటే
పయనించే దారిని పూరేకులతో
సజ్జితం కావించుకునే
ప్రయత్నాలే గదా కలలంటే!
బతుకులో తీయదనం దొరికేదాకా
కలలు కంటూనే ఉండాలి
కలల గంధం కాలపు గ్రీష్మంలో ఎండి
కేవలం జ్ఞాపకంగా ఇగిరిపోకుండా
కాస్త కాస్త అనుభవపు చెమ్మను చిలకరిస్తూ
కన్న కలలను ఎప్పుడూ
తడితడిగా ఉంచుకోవాలి!
- సి మనస్విని,
చరవాణి : 9963399189

పాటల తోట

కావ్యాల కొలనులో విరబూసిన కలువ
సుమాల తోటలో ఎగిరే తుమ్మెదలన్నీ కలిసి
కలంలోంచి జాలువారిన పాటల్లా
నీ గళంలో సుమాల హారమై నిలిచాయి
మట్టిమనిషిగ పుట్టి మహనీయుడిగా ఎదిగి
కలం హలంతో కవితా వ్యవసాయం చేసి
కావ్యాల పంట పండించిన సినారె
చిత్రంగా చిత్రంలోకి మారావు!
తెలుగు సాహిత్య ప్రజ్ఞాశాలి
మధుర భాషలలో రసరమ్య సంగీత
సౌరభాలు విరబూయించి
ఎన్నటికీ వాడిపోని సౌగంధికా పరిమళాలై
రసజ్ఞుల హృదయాలు దోచుకున్న
పాటల కవీ.. నీకు విశ్వంభర నీరాజనం
ఏ పాట చూసినా అద్వితీయమైన
అనురాగం ఒలకబోసి
వనె్నచినె్నల శృంగార గీతాలు
లలిత లావణ్య యుగళ పదాలతో
జోలపాటలతో జోకొట్టి
గజల్స్ గాయకుడివై ప్రేమకావ్యాలకు ప్రాణంపోసి
సాహితీ సంస్కృతి సంపదతో
తెలుగు భాషకే వనె్నలద్దిన సోయగాలు
అమ్మ ఘనతను విశ్వమంతటికీ చాటి
అవధులు లేని కవితా ప్రవాహంలో
కన్ను మూసేవరకూ పెన్ను మూయని
నిత్య అక్షర యజ్ఞంలో సమిధలా వెలిగావు
ఎందరికో స్ఫూర్తినిచ్చిన సాహితీ కిరణానివి
పదవులకే వనె్న వాసి తెచ్చినవాడివి
పద్మభూషణ్, జ్ఞానపీఠ్ పురస్కారాలతో
సాహిత్యమే ఆలంబనగా
సాంస్కృతిక వేదికలనలంకరించి
ఎందరో యువకవులను ప్రోత్సహించి
కవితా సంపుటాలన్నిటిలో ముందుమాటవై
ముందుతరాలకు ఆదర్శప్రాయంగా
అభ్యుదయ, మానవతావాదాల సమ్మేళనంలో
దివి నుంచి భువికేగిన మహాకవీ..
అందుకో నీకిదే మా నీరాజనం!
- తాటికోల పద్మావతి,
గుంటూరు.
చరవాణి : 9441753376

స్వప్న విహారి

నువ్వు నాతో వుంటే మాటలు
నువ్వు లేకపోతే పాటలు
నువ్వు గుర్తుకు వస్తే కవితలు
నువ్వు రావు అనుకుంటే జ్ఞాపకాలు
నువ్వు రావాలంటే ప్రార్థనలు
నువ్వు వచ్చి వెళ్లిపోతే విరహాలు
నువ్వు నువ్వే ఇంకా నేను లేనా అనుకుంటా
మళ్లీ నువ్వులోనే నేను వున్నాగా అనుకుంటా!
- అయ్యల శివశంకర వరప్రసాద్,
నూజివీడు, కృష్ణా జిల్లా.
చరవాణి : 9848587999