విజయవాడ

సాహిత్య సన్నిధానం.. విశే్లషణ పెన్నిధానం! (సభా సందర్భం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పోతన గారు భాగవతంలో దేవుడి చేత అబద్ధం ఆడించలేదు. ఇందుకు వామనావతార కథా ఘట్టంలోని ఈ కింది పద్యమే నిదర్శనం:-
‘గొడుగో, జన్నిదమో, కమండలులొ, నాకున్ ముంజియో, దండమో
వడుగేనెక్కడ? భూములెక్కడ? కరుల్, వామాక్షులశ్వంబులె
క్కడ? నిత్యోచిత కర్మమెక్కడ? మదాకాంక్షా మితంబైన మూఁ
డడుగుల్ మేరయె త్రోవకిచ్చుటది- బ్రహ్మాండంబు నాపాలికిన్’
బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి వామనుడు వచ్చాడు. ‘నీకేం కావాలో కోరుకో!’ అన్నాడు బలి. ‘నాకు మూడడుగుల త్రోవ చా’లన్నాడు వామనుడు. గొప్ప దాత, అహంకారి అయిన బలి ‘దాతపెంపు- సొంపు తలపవలదె?’ సకలైశ్వర్యాలలో వేటినైనా సరే కోర’మన్నాడు. ఇస్తాన’న్నాడు. కానీ వామనుడు మూడడుగులే తనకు చాలన్నాడు. కొంతమంది అంటూ ఉంటారు- ‘మూడగుడులే చాలు’ అని అంటూ వామనుడు భూమ్యాకాశాలనన్నిటినీ త్రివిక్రముడై ఆక్రమించి బలిని అణచివేశాడు అని, అబద్ధమాడాడు’ అనీ అంటారు. కానీ, అది నిజం కాదు. దేవుడి చేత పోతన గారు అబద్ధమాడించలేదు. ఐశ్వర్యాలను కోరమన్న బలిచక్రవర్తికి సమాధానంగా వామనుడు పలికిన పై పద్యంలో సత్యమే ఉంది. తాను చెప్పిందే చేశాడు. ‘గొడుగో, జంధ్యమో, కమండలులో, ముంజియో, బ్రహ్మదండమో నాకు చాలు. బ్రహ్మచారినైన నేనెక్కడ? భూములూ, ఏనుగులూ, స్ర్తిలూ, గుర్రాలూ ఎక్కడ? నానిత్యోచితమైన జపతపాది కర్మములెక్కడ? నా ఆకాంక్షకు పరిమితమైనది- మూడడుగుల నేలయే నీవిస్తే అదే నా పాలిట బ్రహ్మాండం. అంటే నీవు మూడడుగుల నేలనిస్తే అదే నా పాలికి చాలా గొప్ప. ఇక్కడ ‘బ్రహ్మాండం’ శబ్దం ‘చాలా గొప్ప’ అనే అర్థంలో తెలుగు వారు నేటికినీ వాడుకునే సజీవ వ్యావహారిక శబ్దం. ‘నా ఆకాంక్షకు అమితమైనది నీవిచ్చే మూడడుగుల త్రోవ. అదే నేను బ్రహ్మాండాల నాక్రమించడానికి మార్గం. నీవిచ్చే మూడడుగుల ద్వారా నేను బ్రహ్మాండాల నాక్రమిస్తాను సుమా!’ అనే అర్థం కూడా ‘మదాకాంక్షా మితంబైన మూడడుగుల్ మేరయె త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్’ అని వామనుడు పలికిన వాక్యంలో ఉంది. సంస్కృతంలో ఆకాంక్ష శబ్దం ఆకారాంతం. మత్+ ఆకాంక్షా+ అమితంబైన’ అని ఇక్కడ పద విభాగం చేసుకోవాలి. ఈ అర్థంలోని ‘బ్రహ్మాండ’ శబ్దం సంస్కృత పదం. నీవిచ్చే మూడడుగులూ నా పాలిట బ్రహ్మాండాల నాక్రమించటానికి త్రోవ అవుతుంది- అన్న అర్థం స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి వామనుడు చెప్పిందే చేశాడు. బలిని ఏమీ మోసం చేయలేదు. బలియే అహంకారంతో వామనుని చేతిలో మోసపోయాడు. ఇటువంటి విశేషాలు పోతన భాగవతంలో ఎన్నో ఉన్నాయి. శ్రీ మల్లంపల్లి శరభేశ్వరశర్మ గారు ఒక మాటన్నారు. ‘పోతన గారి భాగవతం ఓ మురళి. ముఖ్యంగా దశమ స్కంధం- మురళీ నాదమే’ అని.
(ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ సన్నిధానం నరసింహశర్మ గారు గత నెలాఖరులో గుంటూరులో గుంటూరు జిల్లా రచయితల సంఘం ద్వారా డా. రామడుగు వేంకటేశ్వరశర్మ సాహితీ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా జరిగిన సభలో చేసిన ప్రసంగంలోని ఆసక్తికర భాగం ఇది)

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ, గుంటూరు. చరవాణి : 9866944287