సాహితి

కుంచెలో ఒదిగిన సాహితీ కలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశవాణి కళానిలయం. రకరకాల కళాకారులు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులు - ఇలా పలు రంగాలకు చెందిన ప్రముఖులు రోజూ అక్కడికి వస్తూంటారు. విలువైన వారి వాణిని రికార్డు చేసి, శ్రోతలకు వినిపిస్తూంటారు. అలాంటి ఆకాశవాణిలో శంకర నారాయణ 32 సంవత్సరాలపాటు పనిచేశారు.
పనిచేసే రోజుల్లో ‘ఈ కళాకారుల సాహితీవేత్తల బొమ్మల్ని వేయగలిగితే రాబోయే తరానికి ఉపకరిస్తుంది కదా’ అని అనిపించిందాయనకు. పనిచేసినన్నాళ్లూ వివిధ ఉన్నత పదవుల్ని ఆకాశవాణిలో నిర్వహిస్తూండటంతో ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు.
1995 నుంచి సత్తిరాజు శంకరనారాయణ ప్రముఖుల పోట్రైట్స్‌ని పెన్సిల్‌తో వేయడం ప్రారంభించారు. సత్తిరాజు అనగానే మనకు సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) గుర్తుకు వస్తారు. ఆయన సోదరులే శంకర నారాయణ. వీరి తండ్రి గోపాలరావుగారు మంచి చిత్రకారులు! ఆయన స్ఫూర్తి, ప్రోత్సాహాలతోనే ప్రముఖ రచయిత బుచ్చిబాబు, చక్కటి లాండ్‌స్కేప్స్ ఎన్నింటినో గీశారు. అలాంటి చిత్రకారుల కుటుంబం నుంచి వచ్చారు శంకర నారాయణ. వృత్తి అందుకు తోడ్పడేదే కావడంతో ఆయన పెన్సిల్ పోట్రైట్స్ ఇప్పటికే మూడు సంపుటాలుగా వచ్చాయి. అవి హస్తరేఖలు, నాద రేఖలు, మాస్టర్ ఆఫ్ కర్నాటిక్ మ్యూజిక్. నాల్గవ పుస్తకం ‘కలం రేఖలు’ ఇటీవలే ఆవిష్కృతమైంది. మామూలుగా రచనలని బొమ్మలతో అలంకరించి ప్రచురిస్తుంటారు. కా నీ ఈ పుస్తకంలో బొమ్మలకి రైటప్ ఇచ్చారు.
ఆదికవి నన్నయ్య నుంచి నేటి ఆధునిక రచయితల దాకా రెండు వందల మంది తెలుగు సాహితీవేత్తల పెన్సిల్ పోట్రైట్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. వాటిని చూస్తూంటే ఆ సాహితీవేత్తల్ని చూస్తున్నట్టే ఉంటుంది. ముఖ్యంగా కళ్లలో జీవకళ ఉట్టిపడుతుండటంతో వాళ్లు మనల్ని చూస్తున్నట్లుంటుంది. ఇంతమంది సాహితీవేత్తల పోట్రైట్స్ ఒకచోట దొరకడం కళ్లకి పెద్ద విందు. మనం ఏ సాహితీవేత్తను పాఠకులకు పరిచయం చేయాలన్నా ఈ బొమ్మలని మనం శంకర నారాయణగారికి కృతజ్ఞతలతో వాడుకోవచ్చు.
ఈ రేఖలు ఒక్కో పుటలో రెండు వంతులు ఆక్రమిస్తే, వారి గురించిన వివరాలు క్లుప్తంగా, స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలోని బొమ్మల్ని శంకర నారాయణ గీస్తే, కింద వివరాలందించిన కలం ముళ్లపూడి శ్రీదేవిగారిది. ఆవిడ ముళ్లపూడి వెంకటరమణ గారి శ్రీమతి. ఈ పుస్తకాన్ని డా.చంద్రకాంతరావుగారికి అంకితం ఇచ్చారు శంకర నారాయణ. ఇంత చక్కటి చిత్రకళా రూపాల్ని అందించిన శంకర నారాయణ ధన్యులు.

కలం రేఖలు
- ఎస్.శంకర నారాయణ
పెన్సిల్ పోర్‌ట్రైట్స్
వెల: రూ.200/-
ప్రతులకు:
నవోదయ బుక్
డిస్ట్రిబ్యూటర్స్
సుల్తాన్‌బజార్, కోఠి,
హైదరాబాద్.

- వి.రాంబాబు