సాహితి

విశ్వనాథ కథన విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు కథ అనగానే కొందరు రచయితల పేర్లు తప్పనిసరిగా వినబడతాయి. కొన్ని కథల పేర్లు తప్పనిసరిగా ఉదాహరిస్తారు. ఇవే కథలు, అవే పేర్లు పలుమార్లు పదే పదే ప్రస్తావిస్తుండటంతో ఆయా పేర్లు ప్రామాణికంగా నిలిచిపోతున్నాయి. దాంతో తెలుగు కథలో పలు ప్రయోగాలు చేసి, నూతన పోకడలు పోయి, కథా ప్రపంచాన్ని పరిపుష్టం చేసిన అనేక కథా రచయితలు, అతి గొప్ప కథలు ప్రస్తావనకు రావటం లేదు. సాహిత్య పిపాసులకు అందటంలేదు. ఎందుకంటే, ఒకరిని చూసి మరొకరు, వారిని చూసి ఇంకొకరు ఇలా ప్రతి ఒకరూ ఒకే బాటలో నడుస్తూండటంతో, ఒకరు చూసినవే అందరూ చూస్తూ, ఒకరు చూపినవే అందరూ చూపుతూండటంతో అనేకానేక అత్యద్భుతము, అత్యంత రమణీయమూ అయిన కథలు మరుగునపడుతున్నాయి. కథకులు మరుగునపడుతున్నారు. సాహిత్యంపై ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరూ చదివి, విశే్లషించాల్సిన కథలు ప్రస్తావనకు రావటంలేదు. సాహిత్య సృజనపై ఆసక్తి ఉన్నవారికి మార్గదర్శకంగా నిలచి ప్రేరణనివ్వగల కథలు వారికి అందటంలేదు. అలా అంతగా చర్చకు రాని, విశే్లషణకు గురికాని, కథా రచయితల జాబితాలో విశ్వనాథ సత్యనారాయణ పేరు ఉండటం విస్మయాన్ని కలిగించటమే కాదు నమ్మశక్యంగా కూడా అనిపించదు. కానీ ఇది చేదు నిజం!
తెలుగు కథ గురించి వచ్చే వ్యాసాలలో కానీ, విశే్లషించే పుస్తకాలలో కానీ విశ్వనాథ స్యనారాయణ కథల ప్రస్తావన సాధారణంగా కనబడదు. కనబడినా అది మొక్కుబడిగా కనిపిస్తుంది తప్ప ఆయన గురించి కానీ ఆయన కథల గురించి కానీ లోతైన విశే్లషణలు, చర్చలు కనబడవు. ఇలాంటి మొక్కుబడి ప్రస్తావనలో కూడా ‘జీవుని వేదన’, ‘మాక్లీదుర్గంలో కుక్క’, అతి అరుదుగా ‘సుజాత’, ఇంకా అరుదుగా ‘ముగ్గురు బిచ్చగాళ్లు’ వంటి కథలే కనిపిస్తాయి. దాంతో కథకుడిగా విశ్వనాథ అనగానే ‘జీవుని వేదన’ కథను ప్రస్తావించటం ఆనవాయితీగా మారింది. మిగతా కథల ప్రస్తావన, విశే్లషణలు అనవసరంగా భావించటం జరుగుతోంది. కానీ కథకుడిగా విశ్వనాథ తన ఇతర కథలలోనూ విశ్వరూపం ప్రదర్శించాడు. వస్తువుల ఎంపికలో, కథనంలో పలు వినూత్నమైన పోకడలు పోయాడు. నిజానికి ఆయన రాసినవి 25 కథలు మాత్రమే అయినా ప్రతి కథలోనూ ఏ కథకు ఆ కథకే ప్రత్యేకమైన శైలిని అవలంబిస్తూ, ఏ కథకు ఆ కథనే ప్రత్యేక ప్రపంచంగా నిలుపుతూ చేసిన ప్రయోగాలు, ప్రదర్శించిన సొగసులు, పోయిన పోకడలను మించి కథలో ప్రయోగాలు చేయటం కుదరని స్థాయిలో విశ్వరూపం ప్రదర్శించాడు. నవల రచనలో లాగే ఆయన సర్వస్వతంత్రమైన రచనా శైలిని అవలంబించాడు. పాశ్చాత్య రచనా ప్రక్రియలుగా పలువురు పండితులు భావించే నవల, కథలను ఆయన సంపూర్ణంగా భారతీరుూకరణం చేసి స్వతంత్రమైన భారతీయ కథ రచన పద్ధతిని తన కథా రచనలో ప్రదర్శించాడు. ‘య్యోఁ హిషీఖేయ్’ అనే కథ అత్యద్భుతమైన కథ. ఆవేకాక ఆంగ్ల రచయిత ‘చినువా అబెబే’ రచనలను తలపునకు తెచ్చే కథ ఇది. ఈ కథను ఆంగ్లంలోకి అనువదించి, రచయిత పేరు చెప్పకుండా చదివిస్తే, సాహిత్యంతో ఏమాత్రం పరిచయం ఉన్న వారయినా ఈ కథా రచయిత ‘చినువా అబెబే’ అనుకుంటారు. అయితే నిజానికి చినువా అబెబేను ఆఫ్రికా రచయితల ‘విశ్వనాథ’గా అభివర్ణించవచ్చు. చినువా అబెబే 1930లో జన్మించాడు. అప్పటికే విశ్వనాథ విజృంభించి జాతీయ భావాలతో, ధార్మికపుటాలోచనలు పొదిగిన రచనలను సృజిస్తున్నారు. చినువా అబెబే నైజీరియా రచయిత. నైజీరియా దేశ ప్రజలు తమ ప్రాచీన సాంప్రదాయిక మతాన్ని, ధర్మాన్ని వదలి క్రిష్టియానిటీని స్వీకరించి తమని తాము మరచిపోయి, ఆత్మవిశ్వాసం కోల్పోయి పరారుూకరణం చెందటంపట్ల నిరసించి, సాహిత్య సృజన ద్వారా దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేసి, గౌరవాన్ని నిలిపి తమ మూలాలు బోధించి, తమ ప్రాచీన ధర్మం, మతం, సంప్రదాయాలను పునరుజ్జీవితం కావించాలన్న తపనతో కలం చేపట్టినవాడు చినువా అబెబే. తన రచనలలో తమ భాషను, పద్ధతులను, క్రిష్టియన్ మిషనరీల దురాగతాల వల్ల నశించిన సంప్రదాయాలను, ఆత్మ విశ్వాసాన్ని ఎత్తిచూపిస్తూ ప్రజలను జాగృతం చేసేందుకు రచనలు సృజించాడు. సరిగ్గా విశ్వనాథ సత్యనారాయణ సృజనకు కేంద్ర బిందువు, లక్ష్యం ఇదే. బానిసత్వానికి గురయిన సమాజాలలో సృజనాత్మక రచయితలు, తమ రచనల ద్వారా తమ ఔన్నత్యాన్ని ప్రజలకు వివరించి వారి ఆత్మగౌరవాన్ని రగిలించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి స్వతంత్ర సాధనకు ఉన్మత్తులను చేస్తారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో విశ్వనాథ రచనల లక్ష్యం ఇదే. ఆయన కవితలయినా, కథలయినా, నవలలయినా, వ్యాసాలు, విశే్లషణలు, విమర్శలు ఏవైనా ఆయా రచనల ప్రధానోద్దేశం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యం తెలపటం. భారత చరిత్రను భారతీయ దృక్కోణంలో సమాజానికి చేరువ చేయటం. ‘య్యోఁ- హిషీఖెయ్’ కథ విశ్వనాథ లక్ష్యాన్ని ప్రతీకాత్మకంగా ప్రదర్శించే అత్యద్భుతమైన సృజన. ‘య్యోఁ హిషీఖెయ్’ కథలో నాయకుడు ఉరిఖిలా. అతడు నీగ్రోల నాయకుడు. అతడు కాంగో దేశానికి చెందిన గొప్ప కవి ‘హిషిఖెయ్’గురించి రచయితకు చెప్తాడు. అతడి మాటల్లోనే చెప్పాలంటే హిషిఖేయ్ గొప్ప కవి. ఆయా భాషలో అతడు వ్రాసిన గీతములు చాలా నున్నవి. అతడడవిపిట్ట. వాగులోని చేప. కాంగో బిడ్డ!’. ఈ వర్ణన హిషిఖేయ్ జాతీయతను, అలాగే సాంప్రదాయ నిబద్ధతను, స్వభావాన్ని స్పష్టం చేస్తుంది. కాంగోనే కాదు పలు ఇతర దేశాలలో, పట్టణాలలో కూడా హిషిఖెయ్ గీతాలు ప్రాచుర్యం పొందుతాయి. ప్రజలలో తమ సంప్రదాయంపట్ల, సంస్కృతి పట్ల అభిమానాన్ని పెంచుకుంటాయి. ‘కానీ కాంగో దేశమున మిషనరీలకు, నిచ్చటి పాలకులకు నతని ప్రబోధము గిట్టినది కాదు’ అని చెప్తాడు ఉరిఖిలా. ఇది అత్యంత ప్రాధాన్యత కల వ్యాఖ్య. హిషిఖేయ్ జాతీయ కవి. తమ కాంగో సంప్రదాయాన్ని తన కవిత్వం ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలలో స్వాభిమానాన్ని పెంచుతున్నాడు. అంటే మిషనరీలు, వారికి మద్దతునిస్తున్న పాలకులకు ఇది వ్యతిరేకం అన్నమాట. వారికి నచ్చని విషయం. అందుకే జాతీయ భావాన్ని, స్థానిక ధర్మాన్ని, సంప్రదాయాలను ప్రబోధిస్తున్న హిషిఖేయ్ వాళ్లకు నచ్చడు. ఇక్కడ మనం ఒక్కసారిగా కథలోని కాంగోను వదలి మన దేశానికి ముఖ్యంగా తెలుగు సాహిత్య ప్రపంచానికి వస్తే, విశ్వనాథ ఈ కథలో చేసిన చమత్కారం స్పష్టమవుతుంది. విశ్వనాథ సాహిత్యాన్ని సృజిస్తున్న కాలం నిర్ణయాత్మకమయిన సమయం. ఓ వైపు దేశంలో స్వాతంత్య్ర పోరాటం తీవ్ర స్థాయిలో సాగుతోంది. దేశభక్తి వెల్లువవుతోంది. మరోవైపు బ్రిటీష్ పాలకులు భారతదేశ ప్రజలకు తమలో తమపైనే విశ్వాసం నశించి, తమ ప్రాచీనులపై ఏహ్యత కలిగి, సంప్రదాయాలపై చులకన భావం కలిగి జాతి మొత్తం ఆత్మన్యూనతా భావానికి గురయ్యేట్టు చేయాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న కాలం అది. ఇలాంటి సమయంలో ఈ దేశం గురించి, ప్రాచీన విజ్ఞానం గురించి, వారసత్వం గురించి చెప్పి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఈ ప్రయత్నాలు చేసే వారు ఓ వైపు ప్రభుత్వ అణచివేతకు, మరోవైపు ఆధునిక విప్లవ భావజాల సమర్థకుల హేళనకు గురవుతోన్న కాలం. రంగుటద్దాలతో సాహిత్యాన్ని చూసి ‘ఇవే కథలు’ అంటూ వికృత ప్రామాణికాలను ఏర్పరచి సాహిత్యాన్ని ఇనుపచట్రాలలో బిగించటం సాగుతోంది. అలాంటి సమయంలో విశ్వనాథ వంటి రచయితలు అపోహలకు, హేళనకు, విమర్శలకు గురవుతూ తమ సాహిత్యాన్ని సాహిత్యంగా గుర్తింపు లభించేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి. అంటే భారతదేశంలో భారతీయతకు పెద్దపీట వేసే సాహిత్యం నిరసనను ఎదుర్కోవాల్సి వస్తోందన్నమాట. ఈ మొత్తం పరిస్థితిని విశ్వనాథ ఈ కథలో ఈ ఒక్క వాక్యం స్పష్టంగా ప్రదర్శిస్తాడు. హిషిఖేయ్ ఉన్న ప్రాంతానికి కొత్త గవర్నరు వస్తాడు. ఆయన వచ్చిన రోజున హిషిఖేయ్ మాట్లాడతాడు. ‘పడవలను తలక్రిందులు చేయు కాంగో పాలకుల వలె హిషిఖేయ్ అల్పభావముల మీదకి లంఘించెను’ అంటాడు ఉరిఖిలా. ఈ వాక్యం వెనుక ఎంతో లోతైన అర్థం ఉంది. ఆవేదన ఉంది. ఆ కాలంలో మనదన్న ప్రతిదీ దాడికి విమర్శకు గురవుతోంది. ప్రామాణిక రచనలకు ఆదరణ లేక చిల్లరి పదాలు సాహిత్యంగా చలామణీ అవుతోంటే విశ్వనాథ వంటి వారు తమ రచనల ద్వారా ‘ఇదీ సాహిత్య ఔన్నత్యం’ అని నిరూపిస్తూ వచ్చారు. వ్యతిరేకతకు గురయ్యారు. ఇక్కడ కాంగోలో హిషిఖేయ్ చేసింది అదే. ‘కాంగో పాలకుల వలె హిషిఖేయ్ అల్పభావముల మీదికి లంఘించెను’. దాంతో అతడు గర్వి అని, రాజద్రోహి అని గవర్నర్‌ను నిందించాడని, క్రైస్తవ మతాన్ని తిట్టాడని ఆరోపణలు చేస్తాడు. ఇవన్నీ విశ్వనాథపై ఈనాడూ అనేకులు చేసే ఆరోపణలు. ’హిషిఖేయ్ కవితాశక్తి ముందు తామందరు నిలవజాలమని హిషిఖేయ్ మీద కత్తిగట్టి క్రైస్తవులయిన నీగ్రోలును, పాలకులయందలి మిషనరీలను హిషిఖేయ్‌ని పత్రికలలో దూషించిరి.’ అతడిని జైలులో పెడతారు. జైలులోని దుర్భర పరిస్థితులకు తట్టుకోలేక హిషిఖేయ్ మరణిస్తాడు. ఆ తరువాత నీగ్రో జాతిమీద పాలకులు పగ సాధిస్తారు. ఉరిఖెలా మాటల్లో ‘మా ప్రజలు మా యాచారములు సర్వమునెడల విరోధభావమెక్కువైనది’ అంటాడు. అయితే హిషిఖేయ్ మరణం తరువాత అతడి రచనలపట్ల ప్రజలలో మక్కువ పెరుగుతుంది. ప్రజలు జాగృతులవుతుంటారు. కథ చివరలో పల్లెవాళ్లు ఓ నీటి గుర్రాన్ని పట్టుకుంటారు. విశ్వనాథ ఈ వర్ణన కథను మామూలు కథ స్థాయినుంచి మహాద్భుతమైన కథ స్థాయికి ఎదిగింపచేస్తుంది. వంద కాగడాల వెలుగులో వెల్లకిలబడి చాల బ్రతుకుల మధ్యనున్న యా మహాజంతువు పడియుండెను. అన్ని వైపుల వలలు పట్టుకొన్నవారు, దాని తాళుల బిగించిన పగ్గములు పట్టుకొన్నవారు నా జంతువును కదలకుండ చేయుచుండిరి’. ఆ రాత్రి ఉరిఖిలా నిద్రపోయేముందు హిషిఖేయ్ వ్రాసిన కాంగో పాట పాడి నిద్రించాడు అనటంలో కథ పూర్తవుతుంది. కథ పూర్తయ్యేసరికి పాఠకుడి గుండె బరువెక్కుతుంది. ఆ అన్ని వైపు వలలతో పట్టుకుని, వాళ్లను పగ్గాలు బిగించి కదలకుండా ఉన్న మహాజంతువుల ‘సనాతన ధర్మం’ అని భారతదేశానికి ప్రతీక అన్న భావన మనసులో కదలి బాధ అల్లకల్లోలమై సముద్రంలా మనసును తొలిచివేస్తుంది. ఇదీ విశ్వనాథ రచన సంవిధానంలోని గొప్పతనం.
ఆయన రాసింది కాంగో జాతీయ కవి హిషిఖేయ్ గురించి. కానీ, ఇది ఆయన తనలాంటి కవులు, రచయితల పరిస్థితిని ప్రదర్శిస్తూ రాశాడనిపిస్తుంది. మరోవైపు నుంచి చూస్తే, ఇది భారతదేశంలోని సామాజిక దుస్థితిని, సాంప్రదాయం, సనాతనధర్మం పట్ల ద్వేషాన్ని ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తున్నట్టు అనిపిస్తుంది. గమనిస్తే, కథలో హిషిఖేయ్ కవితల్లా ఈనాడు విశ్వనాథ రచనలు ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయి. ఆలోచింపచేస్తున్నాయి. ఆయన సమకాలీకులలో యుగపురుషులమని చెప్పుకున్న అనేకులు విమర్శలకు గురయి, నిరసనను ఎదుర్కొంటుంటే ఈనాడు విశ్వనాథ రచనలు ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటికీ విశ్వనాథ వ్యతిరేకత రంగుటద్దాల సాహిత్యవాదులు ప్రదర్శిస్తూన్న వారి వ్యతిరేకత బలహీనమైపోయింది. ఇలాంటి కథలు, రచయితలు గుర్తింపును నోచుకోరు. ఈనాడు దేశవ్యాప్తంగా, ఇంతకాలం అణచి ఉంచాలని ప్రయత్నించిన అనేక ఆలోచనల గురించి నిర్మొహమాటంగా చర్చలు సాగుతున్న తరుణంలో తెలుగు సాహిత్యం గురించి కూడా నిర్మొహమాటము, నిష్పక్షపాతమైన విమర్శలు, విశే్లషణలు సాగించాల్సి ఉంటుంది. ఆత్మన్యూనత భావంతో మనల్ని మనం దిద్దుకోవాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతో ఎదిగిన తెలుగు కథకు ఆత్మగౌరవాన్నిచ్చి, ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్రపుటాలోచనలను ఇవ్వాలని ప్రయత్నించిన కథలు, కథకుల గురించి నిర్మొహమాటంగా చర్చించుకోవాలి.

- కస్తూరి మురళీకృష్ణ, 9849617392