రివ్యూ

‘తీవ్ర’న్యాయ ప్రతిపాదన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు ** వాసుకి

తారాగణం: నయనతార, ముమ్ముట్టి, షీలూ అబ్రహం, బేబీ అనన్య, అజూవర్గీస్, రచన, ఎస్‌ఎన్ స్వామి, సోహన్ శీనూలాల్, ప్రదీప్ కొట్టాయం, రోషన్ మాథ్యూ, సౌంద్రియన్, జెన్నిఫర్ ఆంటోని, అనియప్పన్, అనిల్ కె.రెబీ
సంగీతం: గోపీసుందర్
నిర్మాత: ఎస్‌ఆర్ మోహన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎకె సాజన్
*
తనకు జరిగిన తీవ్ర అన్యాయానికి ప్రతిగా ఓ వనిత సంబంధితులందరికీ ‘తీవ్ర’న్యాయం జరిగేలా ఎలా చేసిందన్నది ‘వాసుకి’ కేంద్ర కథా వస్తువు. అయితే అలా కల్పించిన ‘తీవ్ర’న్యాయం మాత్రం కేవలం అవాంఛనీయమే కాదు అలా చేసినవారందరూ శిక్షార్హ నేరాల పరిధిలోకి తప్పనిసరిగా వస్తారు.
భర్త వెంకట్ (ముమ్ముట్టి) కూతురు అక్షయ (బేబీ అనన్య)లతో సంతోషకర జీవితాన్ని సాగిస్తున్న వాసుకి (నయనతార), వారున్న అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు యువకులు, ఇస్ర్తి చేసుకునే పాండుల చేతుల్లో అత్యాచారానికి గురవుతుంది. అలాంటి అరాచకానికి గురైన వాసుకి మాత్రం విషయాన్ని న్యాయవాది అయిన భర్త సహా ఎవ్వరితోనూ చెప్పదు. కానీ వారంతట వారే చనిపోయేలా వాసుకి ఎవరి సహాయంతో ఎలా చేసిందన్నది మిగతా స్టోరీ.
నిజానికి ఈ ధోరణి అనుసరణీయం కాదు. ఇలా ఎవరికివారు న్యాయం సత్వరమే జరగదు కనుక తీవ్రన్యాయ ప్రతిపాదనా మార్గాన్ని అనుసరిస్తే సమాజం తీరు ఏరీతిగా ఉంటుందో ఊహించడానికే భయమేస్తోంది. చిత్రంలో ఓ ముఖ్యమైన పాయంట్, మనకు జాగ్రత్తను సూచిస్తుంది. చుట్టూ ఉన్నవారే, అందులోనూ ‘అక్కా..’ అన్న సంబోధనతో వాసుకిని పిలుస్తూనే అత్యాచారానికి పాల్పడతారు. అదీ వాళ్లంతా ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్‌లో హాట్ టాపిక్ అయిన మాదకద్రవ్యాల ప్రేరణతోనే చేయడం. అంటే పరిసరాలపట్ల, తారసపడే వ్యక్తులతోనూ ఎంత జాగ్రత్తగా ఉండాలో అన్నది ఈ సినిమా తెలుపుతుంది. అత్యాచారం జరిగిందని డైరెక్టుగా తొలిగా చెప్పకుండా నేను భారతీయ శిక్ష్మాస్మృతి సెక్షన్ 376 బాధితురాలనని వాసుకి అంటుంది. లాయర్ భర్త నేపథ్యంలో అలా చెప్పడం అక్కడ సమంజసం. మరి అలాంటి వాసుకికి తనంత తానుగా ఇద్దరు వ్యక్తుల్ని ఆత్మహత్యకు పురికొల్పేలా చేయడం, తాను పేర్కొన్న శిక్ష్మాస్మృతి సెక్షన్ 306 పరిధిలోకి వచ్చే అవకాశముందని తెలియదా అన్నదీ ప్రేక్షకుల్ని వేధిస్తుంది. ఇక ఇస్ర్తి వ్యక్తి పాండు పీల్చే ఇన్‌హేలర్‌లో మిరియాలాపొడి కలపడం అన్నది మరింత తీవ్ర నేరాల సెక్షన్‌కు అర్హం అవుతుంది. అంటే విషయాన్ని కన్వీనియంట్‌గా మరిచిపోడం అన్నదీ జరిగిందని తెలుస్తుంది. అన్నిటికీ మించి చట్టాలన్నీ తెలిసిన లాయర్ భర్త ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరగడం విచిత్రం. అంతకన్నా విషయం డిసిపి ద్వారా తేల్చేలా చేయడం చేసుంటే చట్టాన్ని గౌరవించినట్లయినా ఉండేది. ఈ తరహా ప్రధాన ప్రతిబంధక విషయాన్ని విస్మరించి మిగతా అంశాలు చూస్తే- సినిమాలో సస్పెన్సు కొనసాగింపు తద్వారాలు గతంలో మనం చూసిన ‘దృశ్యం’, ‘ఐ’ (శంకర్ అందించినది) చిత్రాలను అనివార్యంగా గుర్తుచేశాయి. అయితే సినిమాలో ప్రథమార్థం మొత్తం సమయాన్ని ఎలా గడపాలా అన్న ధోరణిని దర్శకుడు అనుసరించడం విసుగనిపిస్తుంది. కానీ సాజన్ (దర్శకులు) శక్తియుక్తులన్నింటినీ రెండవ సగంలో కేంద్రీకరించి సన్నివేశాల్ని నడిపించడం బాగుంది. పాత్రల రూపకల్పనలో సాధ్యమైనంత వరకూ సాజన్ వాస్తవ ఛాయలకే వెళ్లారు. ప్రత్యేకించి కొన్ని కొన్ని అననుకూల అంశాలు ఉన్నా, వాసుకి పాత్ర తన కూతురిని స్కూల్ బస్ సిబ్బందిలో ఒకరు ఒంటిమీద చేయి వేస్తే స్పందించిన తీరు వగైరా ఆమె పరిస్థితికి అనుగుణంగా చూపడం బాగుంది. అలాగే ఆ పాత్ర (వాసుకి)ను పోషించిన నయనతార కూడా శిఖరాయమాన నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా అతి సాధారణ పరిస్థితిలో అసాధారణ పరిస్థితి ఎదురై తీవ్ర బాధితురాలైన సందర్భానంతరం ఆ బాపతు మానసిక సంఘర్షణను అత్యద్భుతంగా నయనతార పలికించారు. అదే రీతిలో వెంకట్ పాత్రలో ముమ్ముట్టి కూడా చాలా కూల్‌గా ఉన్నట్లే కనిపిస్తూ కీలకాంశాల్ని నడిపించిన తీరుని తన అభినయంతో బాగా పండించారు. ఆ పాత్ర మధ్య మధ్యలో ‘ఆక్రోఫోబియా’, పి.ఎం.ఎస్‌తోపాటు అమెరికా విడాకుల తీరూ చెప్తూండడం చూపారు. వాటికి సరైన సమన్వయం సన్నివేశాల్లో చూపిస్తే బాగుండేది. అలాగే పాండు పాత్రధారీ పాత్రకవసరమైన రీతి నటనను ప్రదర్శించి రక్తి కట్టించారు. ఇలాంటి చిత్రాల్లో పాటల ప్రాధాన్యం ఉండదు కనుక, ఆ ప్రస్తావన లేదు. కానీ నేపథ్య సంగీతం అందివ్వడంలో చక్కటి ప్రతిభ కన్పించారు సంగీత దర్శకులు గోపీసుందర్. చిత్రం ఫస్ట్ఫా విషయంలో వివేక్ హర్వాన్ (ఎడిటర్) కొంత నిడివిని తగ్గించి ఉంటే వివేకవంతంగా, మరింత హర్షణీయంగా తయారయ్యేది. అనువాద చిత్రం అయినందున (పుదియ నియమం -మలయాళం) డబ్బింగ్ గొంతుకలు తప్పవు. కానీ ఒకే గొంతును రెండు మూడు పాత్రలకు వాడటం బాగలేదు. అందరూ పట్టిన బాట పట్టకుండా ఊహించని అంశానికి గురైన వనిత హృదయన్ని ఆవిష్కరించడం వంటి ఆలోచనాత్మక సబ్జెక్టుని సాజన్ తీసుకోవడం స్వాగతించదగ్గదైనా అమలులో ఉన్న చట్టాలను గౌరవిస్తూ, అవసరమైతే సమంజస సవరణలు వాసుకి ద్వారా ప్రతిపాదించి ఉంటే స్ఫూర్తిమంతంగా ఉండేది.

-అనే్వషి