Others

తరగతి గది జ్ఞాన నిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది రెండు చైతన్యరాశుల కూడికే గానీ ఇందులో ఇచ్చేవారు ఒకరు, తీసుకునే వారు ఇంకొరు అని ఎవరూ లేరు. ఇద్దరూ నేర్చుకునేవారే. తరగతి గది ఒక అధ్యయన మందిరం. ఇది ఒకరికి ఒకరు దానం చేసుకునే క్షేత్రం కాదు. జ్ఞానం వేరు, సమాచారం వేరు. విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎంత అవసరమో, ఉపాధ్యాయునికి కూడా విద్యార్థి అంతే అవసరం. ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటేనే జ్ఞాన ఉత్పత్తి జరుగుతుంది. విద్యార్థి తరగతి గదిలో ప్రవేశించకముందే అధ్యయనశీలి, లెర్నర్ అయి ఉన్నాడు. అధ్యయనం అనేది ఒక తృష్ణ. విద్యార్థులు బడికి రాకముందే ఎవరి సహాయం లేకుండానే చాలా విషయాలు కుటుంబం నుంచి, ప్రకృతి నుంచి, తమ పరిసరాల నుంచి నేర్చుకుంటారు.
పసితనంలో రెండేళ్ల వయసు రాగానే బిడ్డకు ఏ టీచరు మాట్లాడటం నేర్పాడు? ఉపాధ్యాయుడు సమాచారంతో తరగతికి రావొచ్చును కానీ జ్ఞానం అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషిలోకి ప్రవేశించేది కాదు. రెండు ఆలోచనల మధ్య సంఘర్షణల వల్లనే జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. సమాచారమే జ్ఞానమనుకునే రోజులు పోయాయి. అందుకే తరగతి గదిని జ్ఞాన మందిరంగా పరిగణించాలి. కానీ అది సమాచారం అందించే కేంద్రం కాదు. జ్ఞానం రెండు, మూడు రకాలుగా ఉంటుంది. అకడమిక్ జ్ఞానం అంటే గతంలో జరిగినటువంటి సమాచారాన్ని రెండు జీవులు మథనం చేస్తాయి. దాని నుంచి వచ్చే శక్తే జ్ఞానం. అదే ఉభయులకు శక్తినిస్తుంది. ఆ శక్తివలన ఉభయులు కూడా మరింతగా శక్తివంతులవుతారు.
తరగతి గదిలో ఉపాధ్యాయుడిచ్చే లెక్క విద్యార్థి మెదడులో రాపిడి జరిగి ఒక సమస్యకు పరిష్కారం వస్తుంది. ఆ పరిష్కారం ఉపాధ్యాయుని మెదడుకు మేధస్సు కాదా? నాకు విద్యా రంగంలో 50 ఏళ్ళ అనుభవం వుందని చెప్పుకోవటం నేను నేర్చుకున్నదానికి కొలమానం మాత్రమే. నేర్చుకోవటంలో కాలాంశం ఉంటుంది. నేను భువనగిరిలో హైస్కూల్ టీచర్‌గా నేర్చుకున్నది- సిద్ధిపేట, నాగార్జునసాగర్ డిగ్రీ కాలేజీల్లో నేర్చుకున్నది వేర్వేరు కదా! కాలం, స్థలం, సందర్భం ఈ మూడు అంశాల కలయిక వల్ల నాకు విద్యారంగం బోధనలో శక్తివచ్చింది. ఆ శక్తే నా ఆలోచనా విధానానికి కూడిక. తరగతి గది శక్తినిచ్చే ఒక టాంకర్. సూర్యుని ద్వారా వచ్చేది సోలార్ ఎనర్జీ, బొగ్గు ద్వారా వచ్చేది థర్మల్ ఎనర్జీ, నీటి ద్వారా వచ్చేది హైడ్రో ఎనర్జి లానే తరగతి నుంచి వచ్చేది జ్ఞానశక్తి. అందుకే తరగతి గది జ్ఞానాన్ని ప్రసాదించే ఆలయం.

-చుక్కా రామయ్య