అక్షర

విద్యార్థులు రాసిన రామాయణ గాథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష మీద పట్టు, తెలుగు గ్రంథాల పట్ల ఆసక్తీ తగ్గిపోతున్నదని అంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు రామాయణంపైన వ్రాసిన వ్యాసాలను చూస్తే ఆ అంచనా తప్పు అని అర్థమవుతుంది. ఈ వ్యాసాలు వ్రాసినది పదవ తరగతి విద్యార్థులే అయినా స్థాయి మాత్రం అంతకు మించి వుంది. తెలుగు రాష్ట్రాలలోనే ఇది తొలి ప్రయోగం అని సంపాదకులు పేర్కొన్నారు. అయితే ఇది దేశంలోనే తొలి ప్రయోగమని ముందు మాటలోని వక్తలు ప్రశంసించారు. విద్యార్థి రామాయణము అనే సంకలన గ్రంథానికి పల్లెర్ల రామమోహనరావు, సిద్ధాంతి రాజశేఖర్‌లు సంపాదకులు. ఇది వివిధ ప్రక్రియల్లో విద్యార్థుల రామాయణ విశే్లషణ. ఇందులో ముప్పై ఏడు అంశాలున్నాయి. ప్రేరణ నిచ్చిన అధ్యాపకులు, పిన్న వయస్సులోనే స్ఫూర్తిని పొంది రచనలు చేసిన విద్యార్థులు - వీరి ఇద్దరి కృషీ అభినందనీయమే. ఇవి పసితనపు వ్రాతలుగా లేవు. పరిణతిని కలిగి వున్నాయి. వాక్య ప్రయోగంలో కూడా ఎక్కడా అస్పష్టత లేదు. కథను ఆకళింపు చేసుకుని ఒక అవగాహనకు వచ్చి వ్రాసిన వ్యాసాలుగా కనిపిస్తాయి. ఉదాహరణకు ధర్మాన్ని గురించి వ్రాయబడిన వ్యాసం పరిశోధనాత్మక వ్యాసంలా ఉంది. దాదాపు అన్ని వ్యాసాలు ఇలానే ఉన్నాయి. ‘రమయతీతిరామః’ వాల్మీకి రచనా వైభవం, శ్రీమద్రామాయణము - వ్యక్తిత్వ వికాసము, శ్రీమద్రామాయణము - ధర్మము - ఇలా పేర్లు కూడా శబ్ద గాంభీర్యంతో నిండి వున్నాయి. కవితలు, గేయ కవితలు, గేయ రామాయణం, శ్రీరాముని పాట, ఆత్మకథలు, ఏకాంకిక, హనుమయ్య పాటలు వున్నాయి. రామాయణ వైభవం అనే ఏకాంకికలో రామాయణంలోని ప్రధాన ఘట్టాలు, విశేషాలు వివరంగా వున్నాయి. రామాయణంలో కలిగే సందేహాలకు సమాధానాలు తెలుసుకునేందుకు వీలుగా రామాయణ విశేషాలు వున్నాయి. ‘సులభా పురుషా రాజన్.. వంటి ప్రసిద్ధ రామాయణ శ్లోకాలు కూడా ఉదహరించబడినాయి. రామాయణం సమాజానికి పట్టిన నిలువెత్తు దర్పణం లాంటిదనే వాక్యాలు, ‘చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు’ ‘ఇంటి గుట్టు లంకకు చేటు’ వంటి సామెతలున్నాయి. రామాయణంలోని ముఖ్య ఘట్టాలు, రామాయణంలోని పాత్రలలో ఎక్కువ భాగం ఇందులో చోటు చేసుకున్నాయి. శ్రీరామ నవమిని ఆదర్శ దాంపత్య దినోత్సవంగా జరుపుకోవాలంటుంది ఒక విద్యార్థిని, మనిషి మనిషి లాగా మారాలంటే రామాయణం అవసరం అంటుంది మరొక విద్యార్థిని. భరతుని మనస్సులో ఎప్పుడూ రాముడే ఉంటాడని భరతుని భ్రాతృభక్తిని ప్రశంసించింది ఒక విద్యార్థిని. శత్రువుల ఇంట ఎడమ కాలు పెట్టడమనే చర్యను పేర్కొనడంతోపాటు రామాయణం సమాజానికి అవసరమని రామాయణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ రచనకు ముందు తరగతి గదిలో జరిగిన రామాయణ పారాయణ విశేషాలు ఉన్నాయి. రామాయణ ప్రేరణ పాటం కలిగించిన అనుభూతులున్నాయి. రామాయణం తమలో తెచ్చిన మార్పులను, దాని ద్వారా నేర్చుకున్న నీతులను, తాము ఆచరణలో పెడుతున్న నీతులను కూడా విద్యార్థులు వివరించారు. లక్ష్మణునితో ముఖాముఖి, ఆంజనేయునితో ఇంటర్వ్యూ, దశరథునితో పరిపృచ్ఛ, సీత లేఖ వంటి సరికొత్త ప్రయోగాలు కూడా మనం ఇందులో చూడవచ్చు.

విద్యార్థి రామాయణము
-పల్లెర్ల రామమోహనరావు
వెల: రూ.51
ప్రతులకు: రయిత
4-3-5, తూర్పు కమాన్
మహబూబ్‌నగర్ - 509 001
* సిద్దాంతి రాజశేఖర్
1-4-21/ఎ/1, రాజేంద్రనగర్
మహబూబ్‌నగర్ - 509 011

-కె.లక్ష్మీ అన్నపూర్ణ