అక్షర

‘పరిపూర్ణ’ ఆత్మవిశ్వాసంతో ‘వెలుగుదారుల్లో’కి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటివరకు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అపజయం అనేదే ఎరుగక ధీరోదాత్తగా దూసుకుపోతున్న ఓ యువతికి ‘ఇక బతుకే చాలిద్దాం’.. అనుకునే బలహీన క్షణం ఎదురైతే ఎలా ఉంటుంది? సాధారణంగా అయితే అలాంటివారి జీవితం విషాదంగానే ముగుస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జీవితాన్ని ‘వెలుగుదారుల్లో’కి నడిపించుకున్న ఓ ‘పరిపూర్ణ’ మహిళ గురించి.. ఆత్మస్థయిర్యానికి అచ్చమైన ప్రతినిధి గురించి! ఆమె మరెవరో కాదు, ఒకప్పటి కమ్యూనిస్టు యోధునికి అర్ధాంగిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా సుపరిచితురాలైన నంబూరి పరిపూర్ణ.
పుట్టింది నిమ్న కులంలోనైనా చిన్ననాటి నుంచి ఆమె తన ప్రతిభాపాటవాల్ని నిరూపించుకుంటూనే వచ్చారు. చదువులో ఫస్ట్‌గా, ఆటపాటల్లో, నటనలో, వక్తృత్వంలోనూ బెస్ట్‌గా రాణించారు. విద్యార్థి దశ నుంచి కూడా ఎనె్నన్నో అవరోధాలు ఎదురైనా వాటన్నింటినీ వ్యక్తిగత సామర్థ్యంతో ఎదుర్కొంటూ తానేమిటో నిరూపించారు. అంతేకాదు పుట్టింటా, అత్తింటా కమ్యూనిస్టు నేపథ్యం వున్న కారణంగా ప్రజారంగానికి చెందిన ఎన్నో ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. నిత్య చైతన్యస్రవంతిగా సాగుతున్న ఆమె జీవితంలో పెళ్లి అనే మలుపు పెను మార్పునకు కారణమైంది. కొందరి జీవితాల్లో అది పూలబాట పరిస్తే, మరికొందరి బతుకుల్లో ముళ్లబాటగా మిగిలిన నిదర్శనాలెన్నో ఉన్నాయి. పరిపూర్ణగారిది రెండో రకమైన చేదు అనుభవమే. అయినా ఆమె స్థిరచిత్తంతో దాన్ని వెలుగుదారుల్లోకి ఎలా మలుచుకున్నారో తన స్వీయ చరిత్రలో చక్కగా వివరించారు.
బాల్యంలో ఓ సినిమాలో ప్రహ్లాదుడిగా వేషం వేసినప్పటి నుంచీ జీవితంలో వివిధ దశలను ఆమె అక్షరబద్ధం చేసిన తీరు మనల్ని ఆకట్టుకుంటుంది. ప్రతి దశలోనూ ఆమె ఆయా రంగాల్లో నిష్ణాతులైన ఎందరో ప్రముఖులతో కలిసి పనిచేయగలగడం ఓ అరుదైన సువర్ణావకాశమనే చెప్పాలి. ప్రహ్లాదుడి వేషం కోసం బాలనటిగా మద్రాసులో అడుగుపెట్టినప్పుడు అక్కడ సినీ రంగ ప్రముఖులు చిత్రపు నారాయణమూర్తి, జి వరలక్ష్మి, సి పుల్లయ్య, రేలంగి, సాలూరు రాజేశ్వరరావు, గూడవల్లి రామబ్రహ్మంగారు, వేదాంతం రాఘవయ్యగారు, అశ్వత్థామ, పుండరీకాక్షయ్య, మాస్టర్ వేణు, చిత్తూరు నాగయ్య వంటి మహామహులతో సన్నిహితంగా మెలిగిన, వారితో కలిసి నటించ గలిగిన విలువైన జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. రేడియో గాయనిగా బాలాంత్రపు రజనీకాంతారావుగారు, ఆచంట జానకీరామయ్యగారు, కొత్తపల్లి వీరభద్రరావు, తదితర మేటి కళాకారులు, ప్రముఖుల వాత్సల్యాన్ని చవిచూశారు. ప్రజానాట్య మండలి కళాకారులతో కలిసి జనచైతన్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఆమె సాంస్కృతిక రంగ నేపథ్యాన్ని తెలియజేస్తుంది. ఇంటాబయటా కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఎదిగిన రాజకీయ రంగ అనుభవాలను ఆమె నెమరువేసుకున్నారు. అన్నదమ్ములు నంబూరి శ్రీనివాసరావు, దూర్వాస మహర్షి అప్పటికే కమ్యూనిస్టు ఉద్యమాల్లో పనిచేసి మంచి నాయకులుగా గుర్తింపు పొందారు. వారు తల్లి లక్ష్మమ్మ, తమ్ముడు జనార్దనతో కలిసి సోదరికి అన్నింటా కొండంత అండగా నిలిచారు. వారితోపాటు తోడబుట్టినవారు కాకపోయినప్పటికీ పార్థసారథి, బాలకృష్ణ, గోవిందయ్య అనే మరో ముగ్గురు సోదర సమానులు కూడా ఆమె అభ్యున్నతికి బాటలు వేసిన తీరు వెలకట్టలేనిది.
ఇక పార్టీపరంగా చూస్తే నిబద్ధత కలిగిన అలనాటి కమ్యూనిస్టు నాయకుల గొప్పదనాన్ని చేరువగా చూసే సదవకాశం ఆమెకు వరంగా లభించింది. అంతేకాదు వారినుంచి ఎంతో స్ఫూర్తిని, చేయూతను అందుకోగలగడం ఓ అదృష్టంగా భావించారు. చండ్ర రాజేశ్వరరావుగారు, దర్శి చెంచయ్యగారు, మహీధర సోదరులు, చిట్టూరి ప్రభాకరచౌదరి వంటి గొప్ప నాయకులు ఆమెకు అందించిన తోడ్పాటు ఎనలేనిది. వారి మార్గదర్శకత్వంలో ఆమె మంచి వక్తగా, నాయకురాలిగా ఎదిగారు. తరగతి గదుల్లో చదువుతో బాటు సమాజాన్ని చదవడం నేర్చుకున్నారు. తాను చైతన్యవంతురాలు అవుతూనే తోటి మహిళలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో ప్రతిభ చూపారు. కమ్యూనిస్టు కార్యకర్తగా తానేమిటో నిరూపించారు. ఈ ప్రత్యేకతలు గుర్తించిన అప్పటి విద్యార్థి నాయకుడు దాసరి నాగభూషణరావు ఆమె పట్ల ఆకర్షితుడై తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అప్పటికే వివాహితుడైన ఆయన తన మొదటి పెళ్లి గురించి చెప్పిన కట్టుకథని నమ్మి ఆయన జీవితంలో రెండో భార్యగా ప్రవేశించానంటారు పరిపూర్ణ. ఆమెకు క్రమంగా ఆయన నిజస్వరూపమేమిటో తెలిసి నివ్వెరపోయి, నిర్వేదంలో చిక్కుకున్నారు. సమాజంలో ఎవరో ఓ మామూలు వ్యక్తి నుంచి అలాంటి అనుభవం ఎదురైతే చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ ఆయన సమాజంలో ఎంతోపేరున్న ఓ నాయకుడు. అందులోనూ వీర కమ్యూనిస్టు నేత దాసరి నుంచి ఆమెకు అలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం ఆశ్చర్యపరిచే అంశం. అప్పటి దేశ, సామాజిక పరిస్థితులను బట్టి దాసరితో పెళ్లి, తరువాత కాపురంలోనూ రహస్యంగానే గడపాల్సివచ్చినా ఆమె బాధపడలేదు. కానీ ముగ్గురు బిడ్డల తండ్రి అయ్యాక కూడా ఆయన తనకేమీ పట్టనట్లు వ్యవహరించిన తీరు ఆమెను కలవరపర్చింది. అగ్రకుల ఆధిపత్యం, భూస్వామ్య లక్షణం, మగ దురహంకారం.. మూడూ కూడా ఆయనలో ముప్పేటగా బయటపడడంతో ఆమెకు భవిత అంధకారంగా తోచింది. ఓ మామూలు వ్యక్తిలో కనబడే అవలక్షణాలు సమాజంలో సమానత్వాన్ని కాంక్షించే ఆదర్శ కమ్యూనిస్టులోనూ వుండడం ఏమిటనేది ఆమెను ఆవేదనకు గురిచేసింది. తనను చులకనగా చూసినా ఫర్వాలేదు, కనీసం కన్నపిల్లలనైనా ప్రేమగా దగ్గరకుతీస్తే చాలనుకున్న ఆమె కనీస కోరిక కూడా నెరవేరలేదు. పైగా వాళ్లను భయపెట్టి అల్లంత దూరంలోనే ఉంచేసిన ఆ తండ్రిని ఏమనుకోవాలి? కుటుంబ బాధ్యతల్ని మోయాల్సిన భర్త అవేమీ చేయకపోగా ఆమెకు అందివచ్చిన అవకాశాల్ని కూడా అడ్డంకొట్టడమే గాక ఎదురు ఆమె నుంచే డబ్బులు దండుకోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పైగా ఆమెను చేసుకోవడం వల్ల భారీగా కట్నం డబ్బులు రాకుండా పోయాయని దెప్పిపొడవడమే కాకుండా సూటిపోటి మాటలతో తన మనసును రంపపుకోతకు గురిచేశాడని గుర్తుచేసుకున్నారు పరిపూర్ణ. తాను అడిగినంత డబ్బులు ఇవ్వడంలేదనే అక్కసుతో ‘ఇక నీ ముఖమే చూడన’ని శపథం చేసి వెళ్లిపోయాడు. అయినా అవన్నీ ఆవేశంలో అన్నమాటలని, ఎప్పటికైనా మళ్లీ మనసు మార్చుకుని తిరిగి వస్తారని ఎదురుచూసిన ఆమెకు ఆయన సకల లాంఛనాలతో శాస్త్రోక్తంగా మొదటి భార్యను తెచ్చుకుని కాపురం చేస్తున్నాడని తెలిసి పూర్తిగా మనసు విరిగిపోయింది. ఇక తన పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వడమొక్కటే ధ్యేయంగా ఆమె ముందుకుసాగారు. తన సామర్థ్యంతో, మనోస్థయిర్యంతో తాననుకున్న రీతిలో ముగ్గురు పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా, ఉన్నత వ్యక్తిత్వంతో తీర్చిదిద్దారు. తండ్రి ఉండీ లేనివాళ్లుగా పెరిగినా ఏనాడూ వాళ్లలో ఆత్మన్యూనతా భావం తలెత్తకుండా చూశారు. కేవలం తన పిల్లల్నే కాకుండా తనకు తారసపడిన ఎందరో స్ర్తిలకు కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఎలా బతుకును తీర్చిదిద్దుకోవాలో మార్గనిర్దేశం చేశారు.
అసలు చిన్ననాటి నుంచి కూడా ఆమె జీవితం అన్ని దశల్లోనూ ప్రజా ఉద్యమాలతో పెనవేసుకుని నడిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె జీవితమంతా ప్రజారంగానికి చెందిందే. ‘చేపట్టిన అన్ని రంగాల్లోనూ పరిపూర్ణత సాధించగలదన్న నమ్మకంతో, దూరదృష్టితో ఆమెకు ‘పరిపూర్ణ’ అని సార్థక నామకరణం చేసివుంటారు’ అని గబ్బిట కృష్ణమోహన్ అనడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఎనిమిది పదుల పండు వయసులోనూ తన జీవితానుభవాన్నంతటినీ నెమరువేసుకుని ఆమె వెలువరించిన స్వీయచరిత్రే ఈ ‘వెలుగుదారులలో...’! అసలు ఆ శీర్షిక పెట్టడంలోనే బతుకు పట్ల ఆమెకున్న ఆశావహ దృక్పథం కనబడుతుంది. ఈ పుస్తకం చదివినవారికి ఆత్మవిశ్వాసమే సోపానంగా ‘వెలుగుదారులలో..’ ‘ శిఖరారోహణ’ చేసిన ‘పరిపూర్ణ’ మహిళగా ఆమె సాక్షాత్కరిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. అందుకే ఈ పుస్తకం అవశ్యం పఠనీయం.

స్వీయచరిత్ర
‘వెలుగు దారులలో..
రచన: నంబూరి పరిపూర్ణ
వెల: రూ.120
పేజీలు: 248
లభించే స్థలం : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

-డి.స్వాతి