మెయిన్ ఫీచర్

సంపదలిచ్చే సింహాచలేశ్వరస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో సింహగిరిపై 800 అడుగుల ఎత్తున పుష్ప, ఫలవృక్ష శీతలచ్ఛాయల్లో, ప్రశాంత వాతావరణంలో అరుదైన శిల్ప కళానైపుణ్యంతో అలరారే ఆస్థాన, భోగ, నవరత్న మండప, ప్రహ్లాద మండపాల్లో కొలువై సుగంధ పరిమళ భరిత చందనాచ్ఛ్ధాతుడై, లక్ష్మీ సమేతుడై వెలసిన స్వామియే శ్రీ వరహా లక్ష్మీ నృసింహస్వామి.
సింహాచలం, కృతశౌచం, హరంపాపం, అహోబలం ఈ నాలుగు దివ్యక్షేత్రాల్లో ప్రహ్లాదుణ్ణి రక్షించిన శ్రీలక్ష్మీనరసింహుడుఇక్కడ కొలువై భక్తుల ఆరాధనలందుకుంటున్నాడు. ఈ సింహా చల క్షేత్రం విహంగ వీక్షణంలో ఆ పర్వతం సింహాకారముగా కనిపిస్తోంది. దీనివల్లనే ఈ క్షేత్రానికి సింహాచలం అని పేరు వచ్చినట్టు రూఢి అవుతోంది.
హిరణ్యకశిపుని సంహారానంతరం భక్తప్రహ్లాదుడు, శ్రీహరిని, తన పిన తండ్రిని చంపిన వరాహ అవతారం తన తండ్రిని చంపిన నారసింహావతారం కలయికతో శాంతిమూర్తిగా దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించాడట. అప్పుడు శ్రీ హరి ప్రహ్లాదునికి- తాను సింహాచలం క్షేత్రాన వెలస్తున్నానని, అయతే కొంతకాలం అహోబల క్షేత్రాన తనని పూజించాలని, తర్వాత సింహాలచం వెళ్ళి ప్రహ్లాదుడు కోరిన వరహా నిృసింహావతార కలయికతో ఉన్న రూపం దర్శించి పూజించవల్సిందిగా ఆజ్ఞాపించాడట శ్రీహరి. ఆ ప్రకారం ప్రహ్లాదుడు అహోబలం క్షేత్రాన నారసింహుని భక్తిశ్రద్ధలతో కొంతకాలం పూజించాడని ఇక్కడి స్థలప రాణాలు చెబుతున్నాయ. తర్వాత శ్రీహరి ఆదేశించినట్టుగానే సింహాచలం క్షేత్రానికి వచ్చి, సింహగిరిపై వెలసిన వరాహనృసింహుని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వర్తించి, ధన్యుడయ్యాడని ఇక్కడిస్థలపురాణాలు, నివాసితులు చెప్తారు.
కాని, ఆ ప్రహ్లాదుని పూజల అనంతరం స్వామి మరుగున పడి, ఆ స్వామిపై పెద్ద పుట్ట వెలసినదట. ఇలా జరిగిన చాలాకాలం తర్వాత, షట్ చక్రవర్తుల్లో ఒకరైన పూరురువశ్చక్రవర్తి ఊర్వశితో సింహగిరిపై విహరించేందుకు వచ్చా డట. ఆ పూరూరవునికి స్వామి కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నానని ఆ పుట్టను తొలగించి ఆలయ ప్రతిష్ఠ చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడట.పూరూరవుడు తక్షణమే మేల్కొని స్వామి తెలియజేసిన ప్రకారం ఆ ప్రదేశానికి చేరిఅక్కడ వెతకగా పూరూ రవునికి స్వామి నివసించే పుట్ట కనిపించింది. వెంటనే ఆ పుట్టను తొలగించి వరాహనారసింహ స్వామిని దర్శించాడట. ఆ రోజు వైశాఖ శుక్ల తృతీయ. సంవత్సరం పొడవునా పుట్టకు బదులు తనపై పుట్టమట్టికి సమానతూకపు గల చందనం అద్ది, ఒకే ఒక్క రోజు అంటే వైశాఖ శుక్ల తదియ రోజున నిజరూప దర్శనం భక్తులకు ఉండేలా తన్ను అలంకరిం చమని స్వామి కోరారట. ఈ నిజరూప దర్శనపు రోజే చందనోత్సవం స్వామి వారికి వేడుకగా చేస్తుంటారు.
ఈ క్షేత్రాన జరుగు ఉత్సవాలన్నింటిలోనూ ఈ చందనోత్సవం మరీ పాముఖ్యత సంతరించు కుంటుంది. వేలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి స్వామి వారిని దర్శంచుకుంటారు. ఈ స్వామివారి చంద నాన్ని ప్రసాదంగా తీసుకొంటారు. పవిత్ర గంగాధార నుంచి వేయి కలశాల గంగాధార జలం తీసుకుని వచ్చి అర్చకస్వాములకు అందించగా వారు శ్రీ స్వామి వారికి అభిషేకం కూడా కనులపండుగగా చేస్తారు. ఇది పురూరవుని నాటి నుంచి కొనసాగుతున్న అభిషేకంగా ఇక్కడి వారు చెబుతారు. 108 కొబ్బరి కాయలు స్వామికి అభిషేకించి 108 పర్యాయాలు కర్పూర హారతి సమర్పిస్తారు.
ఉత్సవాలు
ఈ క్షేత్రంలో ఉగాది, రథోత్సవం, నృసింహజయంతి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాడ పౌర్ణమి, శ్రావణమాసం ప్రతీ శుక్రవారం లక్ష కుంకుమార్చన, శ్రావణ పౌర్ణమి, భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, విజయదశమి, ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి, భోగి, కనుమ, పుష్య బహుళ అమావాస్య, ఫాల్గుణ పౌర్ణమి(డోలా పౌర్ణమి). ఈ ఉత్సవాలే కాకుండా 12మంది ఆళ్వారులు, ఆచార్య తిరునక్షత్రాన(పుట్టిన రోజులు) ద్రావిడ దివ్య ప్రబంధ అధ్యాపకులచే శ్రీవారి ఆస్థాన మండపాన జరుగుతాయి. స్వామివారికి నిత్యకల్యాణోత్సవం కూడా జరుగుతుంటుంది. అండాళ్ సన్నిధి(గోదాదేవి), చతుర్ భుజతాయార్ సన్నిధి (శ్రీ సింహవల్లీ తాయారు), లక్ష్మీనారాయణస్వామి సన్నిధి, కప్పస్తంభం, రాతి రథం, త్రిపురాంతకస్వామి దేవాలయం, గంగాధార వద్ద ఉన్న సీతారామస్వామి దేవాలయం, శ్రీ రామక్రతు స్తంభం, ఆంజనేయస్వామి దేవాలయం, తొలిమెట్లు దరి భైరవ స్వామి, కొండ దిగువ పూలతోట. వెంకటేశ్వరస్వామి దేవాలయం, వరహా పుష్కరిణి, శ్రీ గోకులం ఇట్లాంటివన్నీ ఇక్కడ దర్శనీయ స్థలాలుగా భక్తులు దర్శిస్తుంటారు. ఈ సింహాచ లేశ్వరునికి వరహలక్ష్మీనరసింహ నామంతో పాటుగా ‘సింహాద్రి అప్పన్న’ అనే పేరుకూడా ఉంది. ఈ అప్పన్నస్వామికి కోడెదూడలను సమర్పిస్తే సకల సంపదలనిస్తాడన్న ఖ్యాతి ఉంది.

- జంగం శ్యామసుందరి