నెల్లూరు

నిజాయతీకి పట్టం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రలో వున్న జాలయ్యకి ఒక పెద్ద కేక

వినిపించింది. లేచి బయటికి వెళ్లి చూశాడు.

‘రాజుగారి మందిరంలో దొంగలు పడ్డారు’ అని

బయట విన్నాడు. ‘నేను పుట్టినప్పటి నుంచి

ఎప్పుడూ మన రాజ్యంలోకి దొంగలు అడుగేపెట్టి

ఎరుగరు. అటువంటిది ఈ రోజే ఇలా

జరిగిందంటే’ అని ఆలోచనలో పడ్డాడు

జాలయ్య. ఆలోచన ఎందుకంటే ఆ రోజు రాత్రి

పక్క దేశం రాజు చంద్రశేఖరుడు తమ

రాజ్యానికి అతిథిగా వచ్చాడు. తమ

ప్రియాతిప్రియమైన రాజు కరికాలుడు అతిథి

పట్ల ఎంతో ప్రేమ చూపాడు. జాలయ్య వృత్తిరీత్యా

వందిమాగధుడు అయినప్పటికీ రాజు గారిపై

అభిమానం కలవాడు అయినందున, రాజుగారికి

సన్నిహితుడు. దాంతో ఇద్దరి రాజులకు ఆరోజు

రాత్రి నిద్రపోయే వరకూ సపర్యలు చేశాడు.

చంద్రశేఖరుడి మాటలు, ప్రవర్తన వింతగా

తోచాయి జాలయ్యకి. దానివల్ల చంద్రశేఖరుడే

ఈ దొంగతనం చేయించి ఉంటాడని జాలయ్యకి

అనుమానం. దొంగతనం జరిగితే జరిగింది.

రాజుగారి ప్రాణానికి ఎవరైనా హాని తలపెట్టలేదు

కదా! ‘రాజాధిరాజ రాజమార్తాండ శివభక్తా

శ్రీకంఠీరవ శ్రీశ్రీశ్రీ కరికాల మహారాజు గారు

వేంచేస్తున్నారహో!’ అని పొగడవలసిన నా

నోటి వెంట ఈ అశుభవాక్యములెందుకు

వస్తున్నాయి. ‘నాలుకా! జాగ్రత్త నాతో

పెట్టుకున్నావా అయిపోతావ్’ అన్నాడు.

అయ్యో! నేను నా నాలుకనెందుకు

దూషించుచున్నాను. నాలుకతో మాట్లాడించే

మెదడును కదా దూషించవలసినది.

మెదడును తానే దూషిస్తూ రాజమందిరానికి

బయలుదేరాడు. జాలయ్య మనసులో

దుస్సంఘటనలే మెదులుతున్నాయి.

అడుగులు వడివడిగా వేస్తూ దిక్కులు చూస్తూ

వెళ్తున్నాడు. రాజుగారిని చంద్రశేఖరుడు

చంపివేసి ఉంటాడు అనే తలంపులోనే

నడుస్తున్నాడు. కంట నీరు వచ్చేస్తున్నాయి.

ఒళ్లంతా చెమటలు పట్టి పాదాలు సైతం తడిసి

ముద్ద అయినాయి. అడుగుల అచ్చు ముద్రలు

చిన్నికృష్ణుని పాదాలవొలె వెంబడించసాగాయి.

ఆ పాదముద్రలను చూసి ఒక భటుడు

జాలయ్యని వెంబడించాడు. జాలయ్య నేరుగా

శయన మందిరానికి వెళ్లాడు. కిటికీలో నుంచి

పాన్పుపై చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు.

కరికాలుడు, చంద్రశేఖరుడు ఇరువురూ

నవ్వుతూ చదరంగం ఆడుతున్నారు. జాలయ్య

ఒత్తిడి ఒక్కసారిగా తరిగిపోయింది. ఇంతలో

భటుడు జాలయ్య పీకకు చెయ్యి మెలివేసి

నేలకూల్చాడు. కొడుతున్నది ఎవరో దొంగ

అయి ఉంటాడని తలచి పిడిగుద్దులు గుద్దాడు

జాలయ్య. ఆ పిడిగుద్దులకు పడసాగాడు.

చంద్రశేఖరుడు ‘కరికాలా ఈ దొంగలు మీ

రాజ్యం వారేనని నా అనుమానం, నాతోపాటు

పదిమంది భటులను పంపండి చాలు’

అన్నాడు. జాలయ్యకి విపరీతమైన కోపం

వచ్చింది. ‘అయ్యయ్యో! దొంగతనం మన రాజ్య

ప్రజలపై వేశాడయ్యా. దుర్జనుని మాటలు

తియ్యగా ఉంటాయి కదా. ఈయన ఏదో పథకం

వేసినట్లు నాకనిపిస్తుంది. వీళ్లతో పాటే వెళ్లి ఆ

పథకంను బట్టబయలు చేస్తాను’ అని

మనసులో అనుకుంటూ క్షోభపడుతున్నాడు.

చంద్రశేఖరుడు ‘ఏం జాలయ్య ఏదో

ఆలోచిస్తున్నట్లున్నావే’ అనగా కరికాలుడు

కూడా ‘ఎవరి మీదో అనుమానం ఉన్నట్లుంది

జాలయ్యకి, ఆందోళన ముఖంలో తాండవిస్తూ

ఉన్నది’ అని ఇద్దరు రాజులు నవ్వారు.

జాలయ్య ‘అలాంటిదేమీ లేదు ప్రభూ’ అన్నాడు.

‘చంద్రశేఖరా నేనూ మీతోపాటు వస్తాను’ అని

కరికాలుడు అనేలోపు జాలయ్య ‘రాజా నేను

కూడా వస్తాను’ అన్నాడు. అప్పుడు ‘అలాగే

అందరం వెళ్దాం’ అన్నాడు చంద్రశేఖరుడు.
రాజమందిరం మొదలుకొని పట్టణాలు,

గ్రామాలు, అడవులు వెతికారు. దొంగల జాడ

దొరకలేదు. ‘మన రాజ్య ప్రజలు

కాదనుకుంటాను ప్రభూ’ అన్నాడు జాలయ్య.

అప్పుడు చంద్రశేఖరుడు ‘ఇంకా ఉద్యోగ

మందిరములు ఉన్నాయి కదా కరికాలా’ అని

రాజులిరువురు నవ్వుకున్నారు. జాలయ్య

కోపంగా ‘అంటే మా ఉద్యోగులు దొంగతనం

చేశారని మీ అభిప్రాయమా చంద్రశేఖర రాజా’

అన్నాడు. దానికి కరికాలుడు ‘శాంతించు

జాలయ్యా ఆయన మన అతిథి’ అన్నాడు. ‘సరే

ఆయన ఇష్ట ప్రకారమే వెతుకుదాం’ అన్నాడు

జాలయ్య. అక్కడ కూడా దొంగల జాడ

దొరకకపోయే సరికి జాలయ్య ఆవేశం కట్టలు

తెంచుకుంది. కరికాలుడి వైపు చూసి ‘రాజా

అత్యంత పటిష్టమైన మన రక్షణ వలయం

నుంచి దొంగలు తప్పించుకుని రావడం

అసంభవం. మన రాజ్యంలో చంద్రశేఖరుడు

తప్ప బయటివారు ఎవరూ లేరు. కాబట్టి

చంద్రశేఖరుడే దొంగ. నామాట విని ఈయన్ని

బంధించండి’ అన్నాడు. కరికాలుడు ‘

్భటులారా ఈయన్ని బంధించి న్యాయ

మందిరానికి తీసుకెళ్లండి’ అని ఆజ్ఞాపించాడు.
న్యాయ మందిరంలో ప్రజలు రకరకాలుగా

మాట్లాడుకుంటున్నారు. కరికాల మహారాజు

జాలయ్య పొగడ్తల సంద్రంలో ఎగిసిన అలవోలె

వేంచేశాడు. సభనుద్దేశించి కరికాలుడు

‘చంద్రశేఖర మహారాజుపై అభియోగం వచ్చింది.

మన రాజ్య ధర్మం ప్రకారం అభియోగం వచ్చిన

వ్యక్తిపై ఫిర్యాదు ఇవ్వకుండా విచారణ

జరుపరాదు. కావున ఈయనపై ఫిర్యాదు ఇచ్చే

వారు ఎవరైనా ఉన్నారా’ అని అడిగాడు.

జాలయ్య ముందుకొచ్చి ‘నేను ఫిర్యాదు ఇస్తాను

ప్రభూ’ అన్నాడు. విచారణలో ‘ఈయన దొంగ

కాదు అని తేలితే నీకు కఠినశిక్ష

విధించబడుతుంది’ అన్నాడు కరికాలుడు.

జాలయ్య ‘నేను అన్నింటికీ సిద్ధమే ప్రభూ పక్క

రాజ్యం నుంచి అతిథిగా వచ్చి దొంగతనం

జరగడానికి కారణమై మన రాజ్య ప్రజలే

దొంగతనం చేశారని మిమ్మల్ని నమ్మించాడు

ప్రభూ. కాబట్టే ఈ నేరస్తున్ని శిక్షించండి’

అన్నాడు. చంద్రశేఖరుడు ముందుకు వచ్చి

అవును కరికాలా ‘నేను దొంగతనం చేశాను’

అన్నాడు. జాలయ్య ‘చూశారా ప్రభూ ఆయనే

ఒప్పుకున్నాడు’ అన్నాడు. కరికాలుడు నవ్వి

‘ఏం దొంగతనం చేశాడో అడుగుదాం. చంద్రశేఖరా

నీ దొంగతనం గురించి వివరించు’ అన్నాడు.

దానికి చంద్రశేఖరుడు ‘జాలయ్య నమ్మకాన్ని,

అభిమానాన్ని, దేశభక్తిని దొంగిలించిన నన్ను

కచ్చితంగా శిక్షించవలసినదే’ అని నవ్వుతూ

చెప్పాడు. ‘ఏమిటీ ప్రభూ మీరంటున్నది.

నాకేమీ అర్థం కావట్లేదు’ ఆశ్చర్యంతో అన్నాడు

జాలయ్య. ‘జరిగిన విషయమంతా చెప్తాను

అందరూ వినండి’ అంటూ కరికాలుడు చెప్పడం

మొదలుపెట్టాడు. ‘అసలు ఈ చంద్రశేఖర

మహారాజు ఎందుకు వచ్చారో తెలుసా. మన

రాజ్యానికి మంత్రిని ఎంపిక చేయడానికి..

మొన్నటి దినము విందులో ఉండగా మనకు

మంత్రి అయ్యే లక్షణాలున్న ఒకరి పేరు

ప్రతిపాదించాను. ఆయన అతనికి ఒక పరీక్ష

పెడతాను వాస్తవంగా జరిగినట్లుగానే ఉండాలి.

మా ఇరువురికి తప్ప మరెవ్వరికీ తెలియరాదని

మాట తీసుకున్నారు. దొంగతనం జరిగినట్లు

పుకారు పుట్టించాం. దానికి స్పందించిన వ్యక్తి,

నేను ప్రతిపాదించిన వ్యక్తి ఒకరే అయితే తననే

మంత్రిగా ప్రకటిస్తానన్నారు. మేము

అనుకున్నట్లుగానే మా కార్యం సిద్ధించింది. ఈ

కార్యసిద్ధి కోసం చంద్రశేఖర మహారాజుగారు

ఎన్నో అవమానాలు చవిచూశారు. ఆయనకి

నా ప్రజలందరి తరపున క్షమాపణలు

తెలుపుతూ, అసలు దొంగతనమే జరుగలేదు

కాబట్టి ఆయన్ని నిర్దోషిగా ప్రకటిస్తున్నాను’ అని

కరికాలుడు ముగించాడు. అంతా విన్న

జాలయ్య ‘ఏంటి ప్రభూ దొంగతనం జరగలేదా

అయితే రాజ్యమంతా వెతికించాం ఎందుకు

ప్రభూ’ అన్నాడు. ‘నీ కోసమే జాలయ్యా నిన్ను

మంత్రిగా ఎంపిక చేయడానికి’ అన్నాడు

చంద్రశేఖరుడు. ‘రాజా నాతో పరాచికాలు

ఆడకండి. మా రాజ్యంలో దొంగతనం జరిగిందని

స్పందించాను. మా రాజు గారిపై, మా రాజ్యంపై

అభిమానంతో మిమ్మల్ని అనుమానించి,

అవమానించాను నన్ను క్షమించండి. మంత్రి

పదవి ఇచ్చి నన్ను పెద్దవాన్ని చేయకండి.

నేను సాధారణ పౌరుడిగానే స్పందించాను’

అన్నాడు జాలయ్య చంద్రశేఖరుడి వైపు

చూస్తూ. కరికాలుడు అంతా విని ‘జాలయ్యా!

అందరూ వచ్చారు. దొంగతనం ఎలా జరిగిందో

తెలుసుకుని వెళ్లిపోయారు. కానీ నీకు

చంద్రశేఖరుడిపై అనుమానం వచ్చి నన్ను

వదిలి వెళ్లలేకపోయావు. తరువాత తార్కికంగా

ఆలోచించి ఒక మహారాజుని ధైర్యంగా దొంగ

అని పట్టించావు. ఫిర్యాదు చేయడానికి సైతం

తెగించావు. దీనికంతా కారణం నీ దేశభక్తి, నా

మీద అభిమానం. మన రాజ్య ప్రజలపై నింద

వేశారని బాధపడ్డావు. నీకు మన ప్రజలపై గల

నమ్మకం, ప్రేమలకు ఇది తార్కాణం. అందుకే

నీకు మంత్రి అయ్యే యోగ్యత కలదని

చంద్రశేఖరరాజు కూడా తీర్మానించారు’ అని

పలికాడు.
జాలయ్య ఆనంద బాష్పాలు రాల్చి ‘ప్రభూ మన

రాజ్యధర్మం ప్రకారం నా ఫిర్యాదు

విఫలమైనందున నేను శిక్షింపబడాలి’ అంటూ

పాదాలపై పడ్డాడు. ‘ఆ నిజాయితీయే నాకు

నచ్చింది మంత్రివర్యా! జాలయ్యా!’ అంటూ

కిరీటాన్ని జాలయ్యకు ధరించాడు కరికాలుడు.

మంత్రి జాలయ్య ఆసనంలో కూర్చుని ‘ఎవరైనా

సరే ముందు తనని తాను

అభిమానించుకోవాలి. తదుపరి తల్లిదండ్రులను,

రాజును, రాజ్యాన్ని అభిమానించాలి. అప్పుడే

మన రాజ్యం సుభిక్షమవుతుంది. నాకున్న

అభిమానమే నాకు మంత్రి పదవిని

తెచ్చిపెట్టింది’ అని తొలి పలుకులు పలికాడు.

మంత్రిగారి సూచనలను సలహాలను నేను

పాటిస్తాను, తప్పకుండా ప్రతి ఒక్కరూ

పాటించాలని కరికాలుడు ఆజ్ఞాపించాడు.

జాలయ్య, కరికాలుడు చంద్రశేఖరుడికి

సన్మానం గావించి సకల వైభవములతో

ఆయన రాజ్యానికి సాగనంపారు.

- యర్రాబత్తిన మునీంద్ర, నాయుడుపేట