విశాఖపట్నం

సామాజిక అసమానతలపై తిరుగుబాటు బావుటా (సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హింస, అసమానతలు, అక్రమాలు, కులమత ద్వేషాలు అడుగడుగునా విజృంభిస్తున్నాయి. రాజకీయాలు ధనార్జనకు, పెట్టుబడిగా మారాయి. ఈ దేశం, ఈ సమాజం పయనమెటో, గమ్యమెటో తెలియని పరిస్థితి దాపురించింది. నేటి ఈ అగమ్యగోచరమైన పరిస్థితులను గమనంలోకి తీసుకుని ప్రముఖ అభ్యుదయ రచయిత, విశ్రాంత అధ్యాపకుడు కాలిపు కూర్మావతారం స్పందించారు. ఫలితంగా ఆయన కలం నుండి ఓ గొప్ప కావ్యం జాలువారింది. ఆ కావ్యమే శాంతి ప్రసూనాలు. ఈ కవితా సంపుటి పాఠకులను ఆలోచింపజేస్తుంది. కర్తవ్యాన్ని ప్రబోధదిస్తుంది. శ్రీశ్రీ మార్గాన్ని అనుసరించి ఆయన కవిత్వీకరించిన తీరు, హోరు, జోరు ఈ పుస్తకంలో కనిపిస్తుంది. మొత్తం 28 కవితలలో ఈ సంపుటి అక్రమార్కులపై అగ్నివర్షం కురిపిస్తుంది. సమా సమాజ స్థాపన ఆవిష్కరణకు రచయిత పడిన తాపత్రాయం అన్ని కవితల్లో కనిపిస్తుంది.
‘వ్యవస్థ మారాలి’ అనే ఖండికలో దేశంలోని అరాచకాలు, అల్లర్లు, దమనకాండతో భరతమాతకు సుఖశాంతులెక్కడివి/అవినీతి రాకాసి అంతం కానంత వరకు ఈ దేశాని మంచి రోజులు రావంటారు. ‘ ఎటు పోతుందీ దేశం’ అనే కవితలో ‘సారేజహాసే అచ్చా, హిందూస్తాన్ హమారా’ అని మనసారా పాడుకోవడానికి మనసు అంగీకరించలేదీనాడు’ అంటూ ఆవేదన స్వరం వినిపిస్తారు. ‘దేశ సంపదంతా స్విస్ బ్యాంకుల్లో సుఖ నిద్రపోతుంది/ ఈ దోపిడీ వ్యవస్థలో మరి బీద ప్రజల బాధలు తీరేదెలా? అంటూ నిర్వేదాన్ని వ్యక్తం చేస్తారు.
‘వ్యత్యాసాలు’ అనే కవితలో ‘ ఏడంతస్తుల భవనాల్లో, ఎసి రూముల్లో/విలాసవంతంగా జీవితాన్ని సాగించేవారు కొందరు/ ఏడు రోడ్ల జంక్షన్‌లో ఫట్‌పాత్‌లపై/మురికి బతుకుల్లోంచి బయటపడని/బడుగు జీవులెందరో నిర్భాగ్యులెందరో’ అంటూ నేటి సామాజిక అసమానతలపై ధ్వజమెత్తారు.
‘దేశం బాగుపడాలంటే’ ఖండికలో నాణ్యత లోపించిన ఇరిగేషన్/ప్రజా పనుల శాఖల పనులన్నీ/ముచ్చటైన ముడుపులే పూర్తి చేస్తున్నాయని ఎలుగెత్తి చాటారు. ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం/అందుకే ఈ దోపిడీ నశించాలి, వ్యవస్థ మారాలని పిలుపునిచ్చారు. ఫైర్ ఇంజన్‌కి అగ్ని అంటుకుంటే ఇక ఆర్పేది ఎవరని ప్రశ్నిస్తారు. మానవతకు శంకుస్థాపన కవితలో గాంధీ పుట్టిన గుజరాత్ రాష్ట్రంలోనే/సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌లో తన ఉనికిని/దానవత్వం బుసలు కొడుతూ ఎక్స్‌పోజ్ చేసిందని అక్షరాగ్నులు కురిపించారు. దానవతకు చేయాలి భూస్థాపన, మానవతకు చేయాలి శంకుస్థాపన అని హితోపదేశం చేశారు. ఆశయం కవితలో రాజకీయ వాదులు ఓ సిద్ధాంతానికి కట్టుబడక/ ఏ ఎండకా గొడుగు పడుతూ/సిగ్గుయెగ్గూ లొదిలేసి/పార్టీ ఫిరాయింపు కంపుతో/స్వార్ధపరులై దేశాన్ని నిలుపునా దోచుకు తింటున్నారు అంటూ రాజకీయ వ్యవస్థపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
శాంతి ప్రసూనాలు కవితలో సామాజిక న్యాయం కోసం ఆలోచించని నేతలు/సమాజంలో ఎలా తీసుకు వస్తారు సమానత్వం/ప్రజలే దేవుళ్లు అని అంటున్నారు/ ఆ దేవుళ్ల ఓట్లతో గెలిచాక/నిర్లజ్జగా టోపీ వేసి/ ఆర్జిస్తున్నారు లక్షలు కోట్లు అని ఆవేశంతో తన మనోగతానికి అక్షరరూపం ఇచ్చారు. ఆగండి బాగా ఆలోచించండి ఖండికలో ఓ రాజకీయమా నీ పేరు రాక్షసీయమా, నీకు ధర్మాధర్మాలతో పని లేదు/సామాన్యుని ఘోష వినిపించుకోవు/రౌడీలను, గూండాలను పెంచి పోషిస్తావు/చేయాలనుకున్నది ఎంతటి ఘోరమైన, పాపమైన చేస్తావు/రాయలసీమలో ఏ ప్రాంతంలోనైనా మట్టి తీసి వాసన చూడండి/రక్తసిక్తమైన మనే్న చేతికంటుంది/అనంత హత్యలకు అంతంలేదా/ ఆంధ్రమాత ముఖం కడుక్కుందామని/కలశం తీస్తే దాని నిండా రక్తమే/సీమలో శాంతి కపోతాలు ఎగురవేసే/సాహసం చేతల్లో ఒక్కరైనా చేశారా అంటూ ప్రశ్నిస్తారు. దయా సముద్రులై జీవించండి/ ఆరోగ్యకరమైన సామాజిక జీవనానికి/మీరంతా నాంది పలకాలని ప్రజలనుద్దేశించి రాసిన తీరు అద్భుతం.
రంగు వెలసిన సమాజం కవితలో అవినీతి అంతం కావాలి/నైతిక విలువల పూలు మరల పూయాలి అంటూ రచయిత ఆశయం, ఆకాంక్షలు నెరవేరాలని ఆశిద్దాం. ఈ దశాబ్దంలో వెలువడిన మంచి పుస్తకాల్లో ఇదొకటని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ పుస్తకం చదవాలని ఆసక్తి ఉంటే రచయిత కాలిపు కూర్మావతారం సెల్ 9491838718లో సంప్రదించవచ్చు.

- వాండ్రంగి కొండలరావు, పొందూరు-532168. సెల్ : 9490528730.