విశాఖపట్నం

నీతి నిజాయితీ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివాజీ సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్. ప్రభుత్వ సచివాలయంలో ఒక కీలక శాఖకు కార్యదర్శిగా పని చేస్తున్నాడు. శివాజీకి ఒక కూతురు, ఒక కొడుకు. శివాజీ భార్య హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు. శివాజీ కూతురు ఐశ్వర్య బిటెక్ పూర్తి చేసి ఎంబిఎ కోర్సు కూడా చదివింది. కొడుకు రాంగణేష్ ఎంబిఎ చేస్తున్నాడు. శివాజీ ఇద్దరు పిల్లలకి సివిల్స్ ఎగ్జామ్స్‌కి, గ్రూప్స్‌కి ప్రిపేరవ్వమని సలహా ఇచ్చేవాడు. పిల్లలు కూడా తండ్రి బాటలోనే నడవాలనుకున్నారు. కానీ పరిమిత ప్రయత్నాలతో వాళ్లు సివిల్స్‌కి గానీ, గ్రూప్స్‌కి గానీ ఎంపిక కాలేకపోయారు.
ఐశ్వర్య బిఎస్‌ఎన్‌ఎల్ టెక్నికల్ ఇంజనీర్ అయింది. రాంగణేష్ ఒక ప్రముఖ టివి ఛానల్‌కి సిఒఒగా ఎంపికయ్యాడు. శివాజీ రిటైర్ అయ్యే ముందు పిల్లలకు పెళ్లిళ్లు జరిపించేయాలన్న ఉద్దేశ్యంతో కూతుర్ని ఒక జిల్లా జాయింట్ కలెక్టర్‌కి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. కూతురు పెళ్లయిన కొద్ది నెలలకే ఒక ఎమ్మెల్యే కూతురుతో కొడుక్కి పెళ్లి చేశాడు. అందరూ వెల్ సెటిల్డ్. ఎగువ మధ్య తరగతి కుటుంబాల జాబితాలోకి చేరింది అతని కుటుంబం.
శివాజీ రిటైర్ కావడానికి ఇంకా ఆరు నెలలే ఉంది. తన ముప్పయి అయిదేళ్ల సర్వీసులో ఎటువంటి అవినీతికి, అక్రమాలకు, అనైతికతకు పాల్పడని నిజాయితీ, క్రమశిక్షణ గల ఆఫీసర్‌గా శివాజీ పేరు సంపాదించుకున్నాడు. పిల్లలకి కూడా హానెస్ట్‌గా ఉండండి అంటూ హితబోధ చేసేవాడు. ఇక శివాజీ భార్య వినోదబాల అయితే ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతినిధిగా ఉండేది. అందరూ నిజాయితీ ఆఫీసర్ల కుటుంబం అనుకుంటున్న సమయంలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
* * *
‘‘నిజాయితీ గల ఆఫీసర్‌గా పేరున్న మీరు రిటైర్‌మెంట్‌కి కొన్ని నెలల ముందు ఇలా జైలుకు రావడం, శిక్ష అనుభవించడం వింతగా ఉంది’’
‘‘వింతేముంది? నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. అందుకే గతి లేక ఇలా ఇక్కడికి రావలసి వచ్చింది’’
‘‘ఇంతకీ మీరేం నేరం చేశారు?’’
‘‘గనుల కుంభకోణంలో ప్రధాన ముద్దాయిని’’
‘‘ఇలా అడిగానని ఏమీ అనుకోకండి. మీరు నేరం చేశారా? లేక నిర్దోషా?’’
‘‘ఆ వివరాలు ఇప్పుడు అనవసరం’’
‘‘ఓకే. మిమ్మల్ని చూడడానికి ఎప్పుడూ మీ భార్య, కొడుకు, కోడలే వస్తున్నారు. మీకు కూతురు, అల్లుడు కూడా ఉన్నారని విన్నాను. వాళ్లు రావడం లేదు ఎందుకని?’’
‘‘కూతురు చనిపోయింది. అల్లుడితో సంబంధాలు తెగిపోయాయి. ఇక వాళ్ల గురించి ప్రస్తావించకండి’’
‘‘ఆశ్చర్యంగా ఉందే. మీ అల్లుడు ఇప్పుడు జిల్లా కలెక్టర్. ఈ మధ్యనే ఒక ఫంక్షన్‌లో అతను భార్యతో కలసి రావడం చూశాను’’
‘‘ఆమె బతికి ఉన్నా చనిపోయినట్లే లెక్క’’
‘‘మీ కథ ఆసక్తికరంగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ కుటుంబ వివరాలు, మీరు జైలుకు రావడానికి కారణాలు చెబుతారా?’’
‘‘నా వ్యక్తిగత విషయాలు మీకు అనవసరం. మీకు అఫీషియల్ విషయాలు కావాలంటే అడగండి’’
‘‘మీ అఫీషియల్ వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు, కోర్టులు ఉన్నాయి. నేను మానసిక వైద్య నిపుణుడిని. నేను మీ మేలు కోరి వచ్చాను. మీరు మానసికంగా ఆనందంగా ఉండాలని కోరుకునే వాడిని’’
‘‘నేను నేరం చేశాను. అయితే అవి నా జల్సాల కోసం కాదు. నా పిల్లల భవిష్యత్ గురించే. అయినా నా కూతురు నమ్మక ద్రోహంతో నేను పోలీసులకు పట్టుబడ్డాను’’
‘‘మీ అమ్మాయి మీకు విరోధి కాదు కదా. ఆమె మీకెలా నమ్మక ద్రోహం చేస్తుంది’’
‘‘నా అవినీతి వివరాలను తన భర్త ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి నన్ను అరెస్టు చేయించింది’’
‘‘మీరంటే మీ అమ్మాయికి ప్రేమాభిమానాలు లేవా’’
‘‘ఉన్నాయనే అనుకున్నాను’’
‘‘ఆమె అంటే మీకు ప్రేమ, ఆప్యాయతలు లేవా’’
‘‘ ఆమెను ప్రాణ సమానంగా చూసుకునే వాడిని’’
‘‘అల్లుడితో విరోధం ఉందా?’’
‘‘అతన్ని కొడుక్కన్నా ఎక్కువగా అభిమానించే వాడిని’’
‘‘మరేమైంది’’
‘‘నా కొడుకు మామ ఎమ్మెల్యే కదా. అతగాడి చుట్టమే మా గనుల శాఖ మంత్రి. వియ్యంకుడు చెప్పాడు కదా అని గనులను, ఇసుక రీచ్‌లను, క్వారీలను మంత్రిగారు చెప్పినట్లు, మా వియ్యంకుడు చెప్పినట్లు ఇష్టానుసారం ధారాదత్తం చేస్తూ ఫైల్స్ మీద సంతకాలు చేశాను. అయితే దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకో అని మంత్రి, ఎమ్మెల్యే చెప్పడంతో నయానో భయానో పని చేయించుకోవాలి అన్న వాళ్ల తీరును ఎదిరించలేకనో, నేనూ విపరీతమైన లంచాలు తీసుకుంటూ నేరాలకు పాల్పడ్డాను. అంతే కాదు నేను నా సర్వీసు మొత్తంలో సంపాదించిన దాని కంటే రెండు రెట్లు ఆరు నెలల్లో సంపాదించాను. అయితే నా కోసం కాదు. నా పిల్లల కోసమే కదా’’
‘‘ముప్పై అయిదు సంవత్సరాల కాలం కంటికి రెప్పలా మీ నీతి నిజాయితీలను కాపాడుకుంటూ నిప్పులాంటి అధికారి అనిపించుకున్న మీరు మీ వియ్యంకుడు వేసిన అవినీతి నీటిధారతో తుస్సుమన్నారన్న మాట’’
‘‘తప్పు చేశానే అనుకోండి స్వయంగా నా కూతురే నన్ను పోలీసులకు పట్టించి అరెస్టు చేయించింది. అది క్షమించరాని నేరం కదా’’
‘‘కాదు కాదు మీ కూతురు మంచి పనే చేసింది. మీరు చేసిన తప్పును తాను సరిదిద్దుకుని మీ పరువు మరో కోణంలో కాపాడింది’’
‘‘అంటే’’
‘‘సిన్సియర్, సీనియర్ ఐ ఎ ఎస్ ఆఫీసర్ కూతురు కాబట్టి అంత డేరింగ్‌గా, నిజాయితీగా తప్పు చేసిన తండ్రిని జైలుకు పంపింది. అలాంటి కూతుర్ని చూసి మీరు గర్వపడాలి’’
‘‘నాకు శిక్ష పడకూడదని నా భార్య స్వయంగా వెళ్లి మా అమ్మాయిని బతిమాలినా ససేమిరా అంది నా కూతురు. నా భర్త సిన్సియారిటీని కాపాడమ్మా, నా భర్త గౌరవానికి భంగం కలిగించకమ్మా అంటూ నా భార్యకి నిరాశనే మిగిల్చింది’’
‘‘మీ భార్య మీ మేలు కోరితే మీ కూతురు ఆమె భర్త నిజాయితీకి సపోర్ట్ చేసింది’’
‘‘మా ఇంటి గుట్లన్నీ భర్తకి చెప్పి అతని చేత పోలీసులు, ప్రభుత్వానికి, ఇన్‌కమ్‌ట్యాక్స్ వారికి, అవినీతి నిరోధకశాఖ వారికి ఫిర్యాదు చేయించింది నా కూతురు’’
‘‘మంచిపని చేసింది’’
‘‘నా భార్య, నా కొడుకు, నా కోడలు నా పక్షాన ఉన్నారు’’
‘‘నిజానికి మీ కూతురే మీ పక్షాన ఉంది. మీ తప్పుకు శిక్ష వేయించి, శిక్ష తరువాత మలినం కడిగివేయబడ్డ ముత్యంలా నిన్ను చూడాలనుకుంది. మీ భార్య, కొడుకు, కోడలు మీకు సపోర్ట్ చేసి మురికి పట్టిన ముత్యంలాంటి మీకు మరింత మురికిని అంటించారు’’
‘‘ఇంతకీ మీరు ఏం చెప్పదలచుకున్నారు’’
‘‘మీరు మానసిక రోగంతో కూతుర్ని చంపేస్తాను, అల్లుడిని నరికేస్తాను అంటూ పలవరిస్తూ జైల్లో అశాంతిగా ఉన్నారని జైలర్ నన్ను పిలిపించారు. మీ కూతురు మీకైతే చట్టపరంగా శిక్ష వేయించింది. తాను వ్యక్తిగతంగా నన్ను కలసి మా నాన్నకు ప్రాణభిక్ష పెట్టండి. అతడు మానసిక రుగ్మతతో బాధ పడుతున్నాడు. అతని సమస్యకు పరిష్కారం చూపండి’’ అంటూ నా దగ్గర కన్నీరు పెట్టుకుంది. అదీ ఆమెకున్న నిబద్ధత’’
‘‘నా కూతురు నాకు విరోధి కాదా?’’
‘‘కానే కాదు. ఆమెకు మీరంటే ప్రాణం. తన ప్రాణమే తప్పు చేసిందని తెలిసి శిక్ష వేయించింది’’
‘‘నా కూతురు నన్ను క్షమించగలదా?’’
‘‘మీరు శిక్ష అనుభవిస్తున్నారు కనుక క్షమిస్తుంది’’
‘‘నేను నా కూతుర్ని చూడవచ్చా’’
‘‘తప్పకుండా రేపే ఆమె తన భర్తతో కలసి మిమ్మల్ని చూడడానికి వస్తుంది. అయితే మీరు ఒక పని చెయ్యాలి. మీకున్న ఆస్తినంతా ప్రభుత్వానికి అప్పగించాలి. మీకు పెన్షన్, మీ పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాటితో తృప్తిపడాలి’’
‘‘అలాంటి షరతులు నా కూతురు విధించింది’’
‘‘అవును. అలా కాకపోతే మీ ముఖం చూడనంది’’
‘‘నిజమే నేను దుర్మార్గులు, అవినీతిపరులు పన్నిన వలలో చిక్కుకున్నాను. నా కూతురిని తప్పుబట్టాను’’
‘‘అంతే కాదు ఈరోజు నుండి మీకు నెల రోజుల పాటు ట్రీట్‌మెంట్ రెగ్యులర్‌గా ఉంటుంది. అప్పుడు మీ కూతురు చేసిన పనికి మీరు గర్వపడతారు’’
* * *
‘‘శివాజీ గారి ట్రీట్‌మెంట్ అయిపోయింది’’
‘‘అవును సార్ నేను నిజానికి ఎంతో నిజాయితీపరుడిని. నా చుట్టూ ఉన్న అవినీతిపరులు, బంధువుల మాయమాటలు నమ్మి చివరి దశలో అవినీతి అంట కాగి, జీవితంలో మాయని మచ్చ తెచ్చుకున్నాను’’
‘‘్థంక్ పాజిటివ్ బి పాజిటివ్. ఇంకా జీవితం ఉంది. మీ ఆస్తి ప్రభుత్వపరం అయిపోయింది. ఇప్పటికైనా మీ కుటుంబంతో కలసి హాయిగా జీవించండి’’
‘‘అంతే కాదు నా జీవిత చరిత్రనే ఒక ప్రముఖ న్యూస్‌పేపర్లో సీరియల్ కథగా రాస్తాను. మరెవరూ నాలాగా తప్పు చేయకుండా’’
‘‘గుడ్ నేను ఆ విషయంలో మీకు సహకరిస్తాను. మీరు తప్పులు ఒప్పుకుని ఆస్తిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించినందుకు మీకు క్షమాభిక్ష పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అందుకు మీ కూతురు, అల్లుడు ప్రయత్నిస్తున్నారు’’
‘‘గతం మరిచిపోతాను. నా శేషజీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తాను. లక్షలాది మంది యువతకు సివిల్స్‌కి, గ్రూప్స్‌కి ఉచిత శిక్షణ ఇస్తాను’’
‘‘గుడ్ ఆల్‌ది బెస్ట్. నూతన జీవితాన్ని ప్రారంభించండి’’

- ఎం.వి. స్వామి, చోడవరం, విశాఖపట్నం-531036. సెల్ : 9441571505.