గుంటూరు

ఆగని కల్తీ కారం అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: జిల్లాలో కల్తీ కారం విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి. కొద్ది నెలల క్రితం టన్నుల కొద్దీ కల్తీ సరకు బయటపడినా ఇప్పటివరకు వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారానికి తెగబడుతున్నారు. హోటళ్లలోని తినుబండారాలు నాసిరకంగా ఉన్నట్లు తేలింది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ వ్యాపారంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని రైతుబజారు, హోటళ్లు, పెట్రోల్ బంకుల్లో గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, కల్తీలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తొలుత రైతుబజారులో తనిఖీ చేసి ఉల్లి, కూరగాయల ధరలపై వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. ధరల పట్టిక లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
కూరగాయలు నాసిరకంగా ఉన్నాయని, నాణ్యమైన సరుకులను విక్రయించాలని ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం ఉల్లిధరలు పెరిగిన నేపథ్యంలో విక్రయదారులకు నాణ్యమైన ఉల్లిని తక్కువ ధరలకే అందిస్తోందని, అవి మార్కెట్‌లో సరఫరా అవుతున్నాయా, లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుబజారులో ఏర్పాటుచేసిన కెజిఎన్ హోటల్‌ను తనిఖీ చేయగా కల్తీకారం ప్యాకెట్లు బయటపడ్డాయి. ప్యాకెట్లపై లేబుల్ లేకపోవడం, ధర, కంపెనీ చిరునామా ముద్రించి లేకపోవడంతో కల్తీ కారంగా నిర్ధారించారు. ఈ ప్యాకెట్లు ఎక్కడ నుంచి సరఫరా అవుతున్నాయనే విషయాన్ని అడుగగా సరైన సమాధానం రాకపోవడంతో ఈ కారం ఎక్కడ తయారవుతుందో తెలుసుకుని, శ్యాంపిల్స్‌ను పరిశోధనాశాలకు పంపాలని, కల్తీ కారం అని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వక్కపొడి సైతం తూకం, తయారైన తేదీ ప్యాకెట్లపై ముద్రించక పోవడంతో విస్మయం వ్యక్తంచేశారు. అలాగే శ్రీనివాసరావుతోటలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పదార్ధాలు వండుతున్న వంటగది పరిశుభ్రత, అందుతున్న ఆహారంతో పాటు ప్రభుత్వం అమృతహస్త పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పౌష్ఠికాహారం, మధ్యాహ్న భోజన పథకం తీరుపై ఆరా తీశారు. అలాగే కేంద్రానికి సరఫరా అవుతున్న కందిపప్పు, బియ్యంలో నాణ్యత లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తంచేశారు. పెట్రోల్ బంకులను తనిఖీ చేసి కొలతలు, విక్రయాల విషయంలో సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, జాయింట్ కలెక్టర్ కృత్తికాశుక్లా, సమాచార శాఖ అధికారులు కమలాకర్, పి రాజశేఖర్, తూనికలు, కొలతలు శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణచైతన్య, స్ర్తి శిశు సంక్షేమ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఆరు స్పోర్ట్స్ అకాడమీలు
నరసరావుపేట: రాష్ట్రంలో ఆరు స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని ప్రారంభించినట్లు క్రీడలు, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక కోడెల శివప్రసాదరావు స్టేడియంలో టెక్వాండో, వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని గురువారం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సభకు జిల్లా జాయింట్ కలెక్టర్-2 ముంగా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. గ్రామ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిజికల్ లిటరసీ, యూత్ పాలసీని ఏర్పాటు చేసిందన్నారు. విశాఖపట్టణం, కాకినాడ, గుడివాడ, నరసరావుపేట, నెల్లూరు, అనంతపురంలో స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేశామన్నారు. వాటర్ స్పోర్ట్స్ కింద విజయవాడలోని పున్నమి ఘాట్, కృష్ణాజిల్లాలోని నాగాయలంక, పశ్చిమగోదావరి జిల్లాలోని ఎర్రకాలువ, తాటిపూడి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అకాడమీల్లో 12-18 సంవత్సరాల వయసు కలిగిన వారికి శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో మెడల్స్ తెచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామీణ స్థాయిలో 3,050 ప్లేఫీల్డ్స్‌కు ప్రతిపాదనలు ఉండగా, వాటిలో 2,050 అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇవ్వడం జరిగిందని, వెయ్యి పూర్తి అయ్యాయని రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో విశాఖపట్టణం, అమరావతి, తిరుపతిలో స్పోర్ట్స్ సిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం జాబ్‌మేలాలు ఏర్పాటు చేస్తుందన్నారు. నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు 500కోట్లతో నిరుద్యోగ భృతి ఏర్పాటు చేశామని, రానున్న రెండు నెలల్లో యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందన్నారు. స్టేడియంలో వంద పడకల హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. స్వచ్ఛ్భారత్‌లో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదర్శమన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ స్టేడియంలో అకాడమీని ఏర్పాటు చేయడం నరసరావుపేట అభివృద్ధిలో కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. టెక్వాండో, వెయిట్ లిఫ్టింగ్‌లో అమ్మాయిలకు కూడా అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ అకాడమీకి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నిధులు సమకూరుస్తుందన్నారు. మున్సిపల్ ఆదాయంలో మూడు శాతం స్టేడియంకు ఇవ్వాలని, ఆ నిధులు శాప్‌కు ఇవ్వకుండా స్టేడియంకు వచ్చే విధంగా మంత్రి రవీంద్ర చర్యలు తీసుకోవాలన్నారు. నరసరావుపేటలోని విద్యాసంస్థల్లో ఆటస్థలం లేకపోతే ఈ స్టేడియంను ఉపయోగించుకుని, కొంత ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. అదే విధంగా కబడ్డీ, వాలీబాల్ అకాడమీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇటీవల కాలంలో పట్టణానికి చెందిన కోల వెంకటేశ్వరరావు మృతి చెందగా, అతని అవయవాలను దానం చేయాలని ఆయన కుమారుడు అనంత స్వరూప్ తెలపడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం అకాడమీ లోగోను అతిథులు ఆవిష్కరించారు. అంతేకాక ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 22,500 రూపాయల చెక్కును పొనుగోటి సాయిరమ్యకు స్పీకర్, మంత్రి అందచేశారు. చివరిగా స్టేడియం కమిటీ సభ్యులు మంత్రి కొల్లు రవీంద్రకు విజ్ఞాపన పత్రాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, కమిషనర్ భానూప్రతాప్, తహశీల్దార్ విజయజ్యోతికుమారి, శాప్ ఓఎస్‌డీ రామకృష్ణ, డిఎస్‌డివో మహేష్‌బాబు, రొంపిచర్ల ఎంపీపీ రామారావు, ప్రజారోగ్య శాఖ ఇఇ నాగమల్లేశ్వరరావు, కోచ్‌లు పవన్, రవిశంకర్, స్టేడియం ఇన్‌చార్జి ఆకుల సత్యం, మందాడి రవి తదితరులు పాల్గొన్నారు.

త్రికోటేశ్వరుని దర్శించుకున్న మంత్రి కొల్లు
స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించేందుకు నరసరావుపేట వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర గురువారం మండలంలోని కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలతోపాటు తీర్ధప్రసాదాలను అందచేశారు. మంత్రి కొల్లు రవీంద్రకు, శాప్ ఓఎస్‌డీ రామకృష్ణకు స్వామివారి చిత్రపటాన్ని స్పీకర్ డాక్టర్ కోడెల అందచేశారు. తొలుత మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు, దేవాలయ పాలక మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రైవేటు సిటీ బస్సులను నియంత్రిస్తాం
* మినీ బస్‌స్టేషన్‌కు మంత్రి ప్రత్తిపాటి శంకుస్థాపన
గుంటూరు (కొత్తపేట): నగరంలో తిరిగే ప్రైవేటు సిటీబస్సులు కండిషన్‌లో లేవని, అవి పాతబడ్డాయని, ప్రయాణిలకు ప్రమాదం పొంచివున్న దృష్ట్యా వాటిని నియంత్రించి, ఆర్టీసీకి చెందిన నూతన బస్సుల సంఖ్య పెంచి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం గుంటూరు ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్ ప్రాంగణంలో నిర్మించనున్న మినీ బస్టాండ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటి 75 లక్షల రూపాయలతో ఎకరం 26 శెంట్లలో 12 ప్లాట్‌ఫాంలు, ఎంక్వైరీ, రిజర్వేషన్ కౌంటర్లు, అత్యాధునిక హంగులతో మూడు నెలల్లోనే మినీ బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. గుంటూరు నుండి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, నగరంలో తిరిగే సిటీ బస్సులకు మినీ బస్టాండ్ ఉపయోగపడుతుందన్నారు. నగరంలో ప్రైవేటు సిటీ బస్సులను తొలగించే ప్రయత్నం చేస్తుండగా ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారని, ఈ అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారిందని, నగరంలో వైండింగ్, నాన్‌వైండింగ్ స్థలాలుగా గుర్తించి కార్పొరేషన్ అధికారులు రోడ్లను అక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అలాగే నగరంలో ఆటోల సంఖ్యను కూడా క్రమేపి తగ్గించి, ఆర్టీసీ బస్సులను పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి మాట్లాడుతూ ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లో దూరప్రాంతాల నుంచి వచ్చే సర్వీసుల సంఖ్య పెరగడం, కొత్తగా సిటీ బస్సులను ప్రవేశపెట్టడం వలన బస్టాండ్‌లో రద్దీ పెరిగిందని, నూతన ప్లాట్‌ఫారం ఏర్పాటుతో ప్రయాణికులకు వెసులుబాటు కలిగిందన్నారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 2డిపో గ్యారేజీలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృత్తికాశుక్లా, గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మద్దాళి గిరిధర్, వెన్నా సాంబశివారెడ్డి, ఆర్టీసీ అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

నిబంధనల మేరకే ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు
* మున్సిపల్ కమిషనర్ అనూరాధ
గుంటూరు (పట్నంబజారు): ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భవనాలకు ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లను మంజూరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా గురువారం కమిషనర్ శ్యామలనగర్, ఎన్జీవో కాలనీ, వెంకటరమణ కాలనీ, హెచ్‌బి కాలనీ, ఏటి అగ్రహారంలో పర్యటించారు. తొలుత ఎన్జీవో, వెంకట రమణ కాలనీ, సీతమ్మ కాలనీల్లో పర్యటించిన కమిషనర్ ఆక్యుపెన్సీకి అందిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్న భవనాలకు సర్ట్ఫికెట్లు మంజూరు చేశారు. కమిషనర్ పట్టణ ప్రణాళికాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్లు వారికి కేటాయించిన ప్లాట్లలో అనధికార నిర్మాణాలు జరగకుండా చూడాలని, బహుళ అంతస్థుల భవన నిర్మాణదారులు నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం మాత్రమే నిర్మాణాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. అలాగే బహుళ అంతస్థుల భవన నిర్మానదారులు భవనం యొక్క వేస్ట్ వాటర్ పోవుటకు అవుట్ ఫాల్ డ్రెయిన్‌కు అనుసంధానం చేయాలని, అలాగే ర్యాంప్‌లు రోడ్డుపైకి నిర్మించకుండా పర్యవేక్షించాలన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీ, ఏటి అగ్రహారం ప్రధాన రహదారిలో పర్యటించి ఆ ప్రాంతంలో నిర్మించనున్న డ్రైన్లు, కల్వర్టుల పనుల ప్రపోజల్స్‌ను పరిశీలించారు. ఏటి అగ్రహారం రిజర్వాయర్‌లో చేపట్టిన మరమ్మతులను తనిఖీ చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కమిషనర్ వెంట సిటీప్లానర్ చక్రపాణి, డిప్యూటీ సిటీప్లానర్ సత్యనారాయణ, ఎసిపి హర్జానాయక్, ఇఇ రాంనాయక్, ఎఇ లు, డివిజన్ ఇన్స్‌పెక్టర్లు, శానిటరీ ఇన్సపెక్టర్లు పాల్గొన్నారు.

వ్యవసాయంలో మెళకువలు పాటించాలి
* రైతులకు స్పీకర్ కోడెల విజ్ఞప్తి
సత్తెనపల్లి: వ్యవసాయాన్ని మొక్కుబడిగా కాకుండా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మెళకువలతో చేయాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు రైతులకు పిలుపునిచ్చారు.
స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆత్మ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జెడి కృపాదాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కోడెల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు సంక్షేమం కోసం చేస్తున్న కృషిని అభినందించాల్సిందేనని అన్నారు. రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారించి లాభాలు పొందాలని సూచించారు.
రైతులతో స్పీకర్ టెలీకాన్ఫరెన్స్
యార్టు సమావేశంలో రిలయన్స్ ఫౌండేషన్ సమాచార సేవల ద్వారా ఏర్పాటు చేసిన టెలీకాన్ఫరెన్స్‌లో స్పీకర్ నేరుగా రైతులతో మాట్లాడారు. రైతులకు కలిగిన అనుమానాలను శాస్తవ్రేత్తలతో నివృత్తి చేయంచారు. దాదాపు గంటన్నరపాటు కొనసాగిన ఈ కాన్ఫరెన్స్‌లో 25 మంది రైతులతో మాట్లాడారు. ఇంకా అనుమానాలున్నా, అదనపు సమాచారం కావాలన్నా టోల్ ఫ్రీ నంబర్ 1800 419 8800కు ఫోన్ చేయవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్తవ్రేత్తలు డాక్టర్ ప్రసాదరావు, డాక్టర్ భారతి, డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, ఎంపిపిలు ఉమాదేవి, బొర్రా కోటేశ్వరరావు, లక్ష్మీభాయి, మాజీ యార్డుచైర్మన్ ఆళ్ళ సాంబయ్య, పార్టీ అద్యక్షులు మక్కపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

అక్కరకు రాని బోర్లు తక్షణం పూడ్చండి
* పూడ్చకపోతే క్రిమినల్ చర్యలు
* సమాచారం అందించిన వారికి 10 వేల నజరానా
* అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు: జిల్లావ్యాప్తంగా ఉన్న బోరుబావులను 24 గంటల్లోగా పూడ్చివేయాలని, లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోన శశిధర్ హెచ్చరించారు. ఉమ్మడివరం సంఘటనలు పునరావృతం కాకుండా బోర్లు వేసి నిర్లక్ష్యగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ప్రజారోగ్య శాఖల మండల, గ్రామస్థాయి అధికారులతో ఈ విషయమై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను గుర్తించి తక్షణమే పూడ్చివేయాలన్నారు. నిర్ణీత గడువులోగా బోరుబావులను పూడ్చివేయకుండా నిర్లక్ష్యం వహించిన యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మరోసారి ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావుల వివరాలను అధికారులకు తెలిపిన వారికి 10 వేల రూపాయల నజరానా ప్రకటించడంతో పాటు, ఆ నగదును సంబంధిత యజమాని నుండి వసూలు చేయాలని, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని కోరారు. ఆర్‌డబ్ల్యుఎస్, ఎన్‌టిఆర్ జలసిరి కింద బోర్లు వేసి నీరురాక వదిలేసిన బావులను సంబంధిత శాఖ గుర్తించి పూడ్చివేతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో వీటి వివరాలను తమకు అందజేయాలన్నారు.

మంగళగిరిలో భారీ వర్షం
మంగళగిరి: పట్టణంలోను, పరిసర గ్రామాల్లోను గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండి సాయంత్రం భారీ వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన వీధిగా ఉన్న గౌతమబుద్ధ రోడ్డుపై మోకాలిలోతు వర్షపు నీరు వాగులా ప్రవహించింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే కార్లు, ద్విచక్ర వాహనాల వారు గంటసేపు నిలిచిపోవాల్సి వచ్చింది. పలువీధుల్లో వర్షపునీరు, డ్రైనేజీల్లో మురుగునీరు కలిసి రోడ్లపై ప్రవహించాయి.

రాజ్యలక్ష్మీ అమ్మవారికి
కాసులపేరు బహూకరణ
మంగళగిరి: శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారి అలంకరణకు వినియోగించేందుకు గాను గుంటూరుకు చెందిన శివ కన్‌స్ట్రక్షన్స్ అధినేత ఆళ్ల శివారెడ్డి, రాజ్యలక్ష్మి దంపతులు 2 లక్షల 70 వేల రూపాయల విలువైన 84 గ్రాముల బంగారు కాసులపేరును గురువారం బహూకరించారు. బంగారు కాసులపేరును శివారెడ్డి దంపతులు ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావుకు అందజేశారు.