విశాఖ

వివాదాస్పద కల్యాణ మండపానికి ఎట్టకేలకు భూమిపూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం: ఎట్టకేలకు వివాదాస్పద కల్యాణ మండపం నిర్మాణానికి సర్పంచ్ దొమ్మెసి అప్పలనర్స గిరి నాటకీయ పరిణామాల మధ్య భూమిపూజలు నిర్వహించారు. గత కొద్దిరోజులుగా పట్టణ శివారు అన్నవరం గ్రామంలో 20లక్షల రూపాయలతో కల్యాణ మండపం నిర్మాణం సమస్య చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగుదేశం, అటు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఈ కల్యాణ మండపం నిర్మాణం విషయంలో విభేదాలు తలెత్తడంతో పోలీసులు 144సెక్షన్‌ను విధించారు కూడా. ఇరువర్గాలు కల్యాణ మండపం నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో శుక్రవారం సర్పంచ్ దొమ్మెసి అప్పలనర్స గిరి భూమిపూజలు నిర్వహించేందుకు అన్నవరం గ్రామానికి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న గ్రామస్తులు సర్ఫంచ్ వర్గీయులను శంకుస్థాపన పూజలు చేయకుండా అడ్డుకున్నారు. ఈ దశలో ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు, ఘర్షణలు తీవ్రస్థాయిలో తలెత్తడంతో సిఐ ఎం. శ్రీనివాసరావు, ఎస్‌ఐ మల్లేశ్వరరావుల ఆధ్వర్యంలోని సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల నుండి తరలివచ్చిన పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గూనూరు ఎర్రునాయుడు కూడా అక్కడకు చేరుకుని గ్రామంలో ఎటువంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా సమస్యను సామరస్య దోరణిలో పరిష్కరించాలని సూచించారు. పోలీసులు, అధికారులు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ఎవరికి వారే తమదైన దోరణిలో కల్యాణ మండపం కావాలి, వద్దు అంటూ నినాదాలు చేస్తూ పెద్దఎత్తున గందరగోళం సృష్టించారు. ఒక దశలో పాల ఉత్పత్తిదారుల సంఘ అధ్యక్షుడు పుల్లేటి సూరిబాబు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ గందరగోళం సృష్టించారు. దీనిపై సిఐ అతనిని వారించి తక్షణం సంఘటనా స్థలం నుండి ఇరువురు తొలగిపోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. ఎవరికి వారే తమ మొండి పట్టు వీడకపోవడంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామస్తులు ఏడుగురు మహిళలు, 14మంది పురుషులను పోలీసులు అరెస్టు చేసారు. ఈ దశలో వారు వాహనంపై కాకుండా ప్రదర్శనగా ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇదే అదనుగా భావించిన సర్పంచ్ కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అభివృద్ధి పనులను అడ్డుకోవడం అవివేకమన్నారు. అవసరమయితే మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి కృతనిశ్చయంతో ముందుకు రావాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు పలికారు. అరెస్టయిన వారితోపాటు గ్రామస్తులు కూడా పెద్దఎత్తున పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆందోళన జరిపారు. ఆందోళనకారులపై పోలీసులు కేసునమోదు చేసి వ్యక్తిగత పూచికత్తులపై విడిచిపెట్టారు. అరెస్టయిన వారిలో పుల్లేటి సూరిబాబు, పందిరి శ్రీను, పొట్నూరి సత్యనారాయణ, కోన సత్తిబాబు, పొట్నూరి లక్ష్మి, పుల్లేటి ధనలక్ష్మి, మజ్జి మంగమ్మ, గొన్నాబత్తుల కోటిబాబు, పి. సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పంచాయతీ రాజ్ డిఇ ప్రసాద్, ఇవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం సేవించి వాహనం నడిపితే లైసెన్సు రద్దు
జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ
అనకాపల్లి(నెహ్రూచౌక్): మద్యం సేవించి వాహనం నడిపినా, చిన్నపిల్లలచే వాహనాలు నడిపించినా వాహనాన్ని సీజ్‌చేసి లైసెన్సు రద్దుచేసామని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శుక్రవారం ఆయన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులపై ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అటువంటి ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా అనకాపల్లి సర్కిల్ పరిధికి చెందిన జాతీయ రహదారిలో జలగలమదుం, నూకాంబిక ఆర్చి జంక్షన్, ఉమ్మలాడ జంక్షన్, పిసినికాడ, తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.నూకాంబిక ఆర్చి జంక్షన్ వద్ద లైటింగ్ లేకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అక్కడ హైమ్యాక్సు లైటింగ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైవే రోడ్డు పక్కగా సుమారు 33 దాబాలు ఉన్నాయని, వాటిని రాత్రి 10 గంటలతో మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ 15 కిలో మీటర్లకు హైవే పెట్రోలింగ్ మొబైల్ వ్యాన్ రాత్రి సమయంలో పర్యవేక్షించి రోడ్డుపై ఎక్కడైనా వాహనం నిలిపినట్లు కనిపించినా వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. కలెక్టర్ ఆదేశాలమేరకు నెహ్రూచౌక్ కూడలిలో 4లక్షలుతో నాలుగువైపులా అధునాతనమైన టెక్నాలజీతో సిగ్నిల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో పట్టణంలో కొంతమేర ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. గంజాయి అక్రమరవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. జిల్లాలో ఇప్పటికి 160 కేసులు నమోదుచేసి 540మందిని ఆదుపులోకి తీసుకొని 22వేల కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో 600మంది కానిస్టేబుల్ పోస్టులు కాళీగా ఉన్నాయని ఈ మద్య కాలంలో 200మందిని ఎంపిక చేసి రిక్రూట్ చేసారన్నారు. ఆలాగే ట్రాఫిక్ సమస్యలతో సిఐ శ్రీనివాసరావును అడిగి తెసుకున్నారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశిలించారు. డిఎస్పీ వెంకట రమణ, పట్టణ సిఐ విద్యాసాగర్ ఉన్నారు.
రాష్ట్రంలో 10 లక్షల పక్కా గృహాలు మంజూరు
గొలుగొండ/ కె.డి.పేట , ఆగస్టు 17: రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులకు 10 లక్షల పక్కా గృహాలు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన గొలుగొండలో వెలుగు ఆధ్వర్యంలో అభివృద్ధి పథకాలు,ప్రారంభోత్సవాలు, ఎన్టీ ఆర్ గృహ సముదాయంపై సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులకు 10 లక్షల పక్కా గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క లబ్దిదారునికి లక్షా 50 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. 1983లో ఇందిరాగాంధీ హయాంలో కమ్మఇల్లు ఉండేవని, వీటిని గమనించిన పార్టీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు లబ్దిదారులను గుర్తించి శాశ్వత పక్కా గృహాలు కేటాయించిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కిందని మంత్రి అయ్యన్న కొనియాడారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో 4,018 పక్కా గృహాలు మంజూరయ్యాయన్నారు. ఒక్క గొలుగొండ మండలంలోనే 1,064 గృహాలు కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారన్నారు. నియోజకవర్గం పరిధిలో గొలుగొండ మండలానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేసామన్నారు. సి.సి. రోడ్లు, వాటర్ ట్యాంక్‌లు, మరెన్నో అభివృద్ధి పథకాలను ముఖఖ్యమంత్రి చంద్రబాబు కృషితో చేపట్టామన్నారు. ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయడం జరిగిందన్నారు. 800 రూపాయలు చెల్లించి గ్యాస్ కనెక్షన్లు పొందాల్సి ఉన్నప్పటికీ ఈనిధులను కూడా చెల్లించని వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించడం జరిగిందన్నారు.
వివిధ స్వయం సహాయక సంఘాల సభ్యులకు 65 లక్షల రూపాయలను చెక్కుల రూపంలో మంత్రి అయ్యన్న అందజేసారు. సమావేశంలో గొలుగొండ, నర్సీపట్నం ఎం.పి.పి.లు సుర్లలక్ష్మీనారాయణ, సుకల రమణమ్మ, వెలుగు పి.డి. సత్యసాయి శ్రీనివాస్, మండల దేశం పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, ఆర్డీవో కె.సూర్యారావు, తహశీల్దార్ పి. అంబేద్కర్, ఎం.పి.టి.సి. సి.హెచ్.వేణుగోపాల్, గొలుగొండ, చోద్యం పి. ఎ.సి. ఎస్. అధ్యక్షులు కొల్లాన కొండలరావు, భీమిరెడ్డి సత్యనారాయణతో పాటు వివిధ గ్రామాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలతో మోసాలకు అడ్డుకట్ట

పాడేరు: గిరిజన రైతులు తాము పండించే పంటలను విక్రయించుకునేందుకు తూనికలలో మోసాలకు గురికాకుండా ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను వినియోగించుకోవాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ కోరారు. స్థానిక ఎన్.టి.ఆర్. రైతు బజార్‌లో విశాఖ యూత్ కన్స్యూమర్ అండ్ డిసిప్లిన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు గిరిజనులకు ఎంతో ఉపయోగకరమైనవని అన్నారు. గిరిజనులు కాయకష్టం చేసుకుని పండించే పంటలను విక్రయించుకునేందుకు వారపు సంతలకు తీసుకువస్తే వ్యాపారులు తప్పుడు తూనికలతో వారిని మోసం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిని నివారించాలనే ఉద్ధేశ్యంతో యూత్ కన్స్యూమర్ అసోసియేషన్ ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను రైతు బజార్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. వారపు సంతలకు తమ సరుకులను విక్రయించుకునేందుకు తీసుకువచ్చే గిరిజన రైతులు ముందుగా ఈ యంత్రాలలో తూకం వేసుకుని ఎంత ఉన్నది నిర్థారించుకోవాలని ఆయన సూచించారు. దీనివలన తాము తీసుకువచ్చిన సరుకు విలువ రైతులకు నేరుగా తెలిసే అవకాశం ఉంటుందని, వ్యాపారులు తప్పుడు తూనికలతో మోసం చేసేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.గిరిజన రైతులు తమ ఫలసాయాలను తక్కువ ధరకే విక్రయించుకోవలసిన పరిస్థితిని నివారించేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. పాడేరు పట్టణంలోని కిరాణా దుకాణాలలో తప్పుడు తూనికలతో వినియోగదారులను మోసం చేస్తున్నట్టు తమకు పిర్యాదులు అందుతున్నాయని ఆయన అన్నారు. వ్యాపారులు తమ దుకాణాలలో ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను ఏర్పాటు చేసుకుని పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ ప్రతినిధి మర్రి సత్యనారాయణ, గిరిజన రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలే లక్ష్యంగా పనిచేయండి

తెలుగు తమ్ముళ్లకు ఎమ్మెల్యే కిడారి సూచన

పెదబయలు: రానున్న ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ కార్యకర్తలు పనిచేయాలని అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కోరారు. మండలంలోని గోమంగి గ్రామంలో శనివారం నిర్వహించిన అరకులోయ నియోజకవర్గం స్థాయి తెలుగుదేశం పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు. రానున్న ఎన్నికలను పార్టీ యంత్రాంగం అత్యంత ప్రతీష్టాత్మకంగా తీసుకుందని, దీనిని గుర్తించి కార్యకర్తలు పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేసి గిరిజనులలో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ సరైన ప్రచారం లేకపోవడం వలన గిరిజనులకు తెలియడం లేదని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలు ఈ విషయమై దృష్టి సారించి ప్రభుత్వ పథకాలను గిరిజనులకు తెలియచేసి వారిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. గోమంగి పంచాయతీ కేంద్రంలో కళామందిరాన్ని అభివృద్ధి చేసేందుకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం 110 మంది గిరిజన లబ్ధిదారులకు దీపం పథకం కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్‌లను, గిరిజన యువతకు వాలీబాల్ కిట్లను సర్వేశ్వరరావు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం.ఎల్.ఎ. సివేరి సోమ, దేశం నాయకులు పాంగి రాజారావు, సీకరి సన్యాసిదొర, కొర్రా తులసీరావు, గడ్డంగి రామ్మూర్తి, నియోజకవర్గంలోని అన్ని మండలాల దేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.