కర్నూల్

నంద్యాలలో పంచుతున్న డబ్బు ఎక్కడిది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో నీచాతినీచంగా ఓట్లకు నోట్లు పంచుతున్న డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో వైకాపా అధినేత జగన్ సమాధానం చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల టిడిపి కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుండి నంద్యాల పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా నేతలు రహస్యంగా డబ్బులు పంపిణీ చేస్తున్న విషయాన్ని పోలీసులు గ్రహించి వలవేసి పట్టుకున్నారని తెలిపారు. మొత్తం 67 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో 43 మంది డబ్బులు పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారన్నారు. మిగిలిన వారు డబ్బు పంపిణీ చేస్తున్న వారిని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. నంద్యాల పట్టణంలోని త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో వైకాపా నేతలు పంపిణీ చేస్తున్న డబ్బు రూ.6 లక్షలు టూటౌన్ పరిధిలో రూ.2 లక్షలు త్రీటౌన్ పరిధిలో రూ.4 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.8 లక్షలు స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. డబ్బులు పంచుతూ వైకాపా నేతలు పోలీసులకు చిక్కిన వారిలో కమలాపురం ఎమ్మెల్యే పిఎ బ్రహ్మానందం, వైకాపా అభ్యర్థి కిరణ్, ఇద్దరు వైకాపా కౌన్సిలర్లతోపాటు విద్యార్థులు కూడా పోలీసులకు పట్టుబడ్డారన్నారు. డబ్బులు పంచుతూ పట్టుబడిన వైకాపా నేతలు, వ్యక్తులు కడప జిల్లాకు చెందిన వారు 25 మంది కాగా, మిగతా వారు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాకు చెందిన వారు ఉన్నారని తెలిపారు. వైకాపా అధినేత కనుసన్నల్లోనే నంద్యాలలో ఓట్లకు డబ్బు పంచుతున్నారని, ఈ వ్యవహారం గత నాలుగు రోజులుగా నంద్యాలలో జరుగుతున్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుట్టు రట్టు చేసిందన్నారు. ఓటర్లకు స్లిప్పులు ఇచ్చేందుకు బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు స్లిప్పులు ఇస్తుండగా వైకాపా నేతలు డబ్బుల పంపిణీ తెరచాటున చేసేందుకు ఓటరు స్లిప్పుల పంపిణీ చేస్తున్నామని పోలీసులను, ప్రజలను మోసగిస్తున్నారన్నారు. వైకాపా నేతలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి స్లిప్పులతోపాటు కొన్ని చోట్ల నోట్లు ఇస్తున్నారని, మరికొన్ని చోట్ల పట్టణంలో వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి మహిళా సహకార్ బ్యాంకులో చిట్టి ఇచ్చి డబ్బులు తీసుకోవాలని చెబుతున్నారన్నారు. అలాగే మరికొంత మంది ఓటర్ల బ్యాంకు అకౌంట్ల నెంబర్లను కూడా తీసుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. వైకాపా నేతలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో పోలీసులు నిగ్టు తేల్చాలని, దీనికి జగన్ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఓట్లు రాబట్టుకోవాలే తప్ప ఎన్నికలను వ్యాపార దృక్పదంతో చూస్తూ నోట్లు పంపిణీ చేయడం దారుణమన్నారు. పది రోజులుగా ప్రతిపక్ష నేత ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడం, భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు, ఎక్కడా జరుగలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఇంతవరకు డబ్బు పంపిణీలో టిడిపి వారు లేరని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలకు చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు కార్యకర్తలుగా నంద్యాలలో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులందరిలో జగన్ అత్యంత ధనవంతుడని, ఉప ఎన్నికలో ఓటమి భయం పట్టుకోవడం వల్లనే నేలమాళిగల్లో దాచిన ధనాన్ని ఓటర్లకు పంచేందుకు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, తదితరలు పాల్గొన్నారు.
టిడిపి వెంటే బడుగు, బలహీన వర్గాలు
నంద్యాల: రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయని ముస్లీం మైనార్టీలు, కాపు బలిజలు కూడా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ది పొందుతున్నారని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ అన్నారు. శుక్రవారం నంద్యాల టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైకాపా వెంట ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. నంద్యాల నియోజకవర్గంలో కూడా ముస్లిం మైనార్టీలు, బలిజ సామాజిక వర్గీయులు, ఆర్యవైశ్య కులస్తులు తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు వెనుకబడిన కొన్ని కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ వాటికి నిధులు సమకూరుస్తూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నది చంద్రబాబునాయుడు కాదా అన్నారు. ఆర్యవైశ్యులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వైకాపా నైజం కాదు
బండిఆత్మకూరు/నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నైజం వైకాపాకు లేదని, అలాంటి చేష్టలు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకే చెల్లుబాటు అవుతుందని పిఎసి చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల వైకాపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలకు నెల రోజులు ముందే రాష్ట్ర క్యాబినేట్ మంత్రులను ఎమ్మెల్యేలను సూరజ్ గ్రాండ్ హోటల్‌లో మిని సెక్రెటరేటియట్‌గా ఏర్పాటు చేసుకొని గెలుపు కోసం కుట్ర చేస్తు వైకాపాపై నిందలు వేయడం అన్యాయమన్నారు. నంద్యాల ప్రజలు ధర్మానికి ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెబుతారన్నారు. తెలుగుదేశానికి ఓటు వేయకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబునాయుడు నేను వేసిన రోడ్లపై నడవరాదని, పెన్షన్లు నిలిపి వేస్తామని, అవసరం అయితే ఓటుకు రూ.5 వేలు ఇస్తామని అనడం ఆయన దాష్టికానికి నిదర్శనమన్నారు. రోడ్లు, పెన్షన్లు ఎవరబ్బ సొత్తు కాదని, సామాన్య ప్రజలు చెల్లించే పన్నులతో ప్రభుత్వం ద్వారా ప్రజలకు వివిధ రకాలుగా అందుతున్నాయన్నారు. సర్వే పేరిట గోదావరి జిల్లాల నుండి విద్యార్థులతో ఓటర్లను టిడిపికి ఓటు వేస్తే అన్ని లబ్ధి చేకూరుతాయని బెదిరించడం అన్యాయమన్నారు. దీన్ని నిరోదించేందుకు శ్రీశైలం వైకాపా ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి బట్టబయలు చేయగా, శేషారెడ్డిపైనే కిడ్నాప్ కేసు నమోదు చేశారని, అలాగే డా.రాకేష్ కేసుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్నారు.నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ అధికారం అంగబలం ఉందని, వైకాపాపై కుట్రలు చేయడం అన్యాయమని, పోలవరం, పురుషోత్తం పట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో కమిషన్ల కోసమే ప్రభుత్వం ఆర్భాటం చేస్తోందన్నారు. రాయలసీమపై ప్రేమ ఉంటే నా సొంత నియోజకవర్గంలోని ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల్లో ఉన్న రెండు పంపు మోటార్లను పురుషోత్తం పట్నంకు తరలించారని ఎద్దేశా చేశారు.
చైనా వస్తువులకు వ్యతిరేకంగా ఉద్యమించండి
* 20న బైక్ ర్యాలీ : స్వదేశీ జాగరణ్ మంచ్ కర్నూలు కన్వీనర్ కెవి.బద్రీనాథ్
కర్నూలు ఓల్డ్‌సిటీ: చైనా వస్తువులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క భారతీయుడు ఉద్యమించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కర్నూలు కన్వీనర్ డాక్టరు కెవి.బద్రీనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక స్వదేశీ జాగరణ్ మంచ్ కర్నూలు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ చైనా వసస్తువులకు వ్యతిరేకంగా స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలోమన దేశం చైనాకు రూ.58,500 కోట్లు విలువైన వస్తువులు ఎగుమితి చేస్తే, చైనా నుండి దిగుమతులు రూ.4లక్షల 17వందల కోట్లు అనగా రూ.3లక్షల 43వేల 200 కోట్లు వాణిజ్య లోటు ఏర్పడుతుందన్నారు. మనం ముడి సరుకు ఎగుమతి చేస్తున్నాం, పూర్తయిన ఉత్పాదనలను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. దీని కారణంగా మన ఉత్పాదక సైకాక్టర్ కూలిపోయిందని, చైనా వస్తువులు భారతీయ మార్కెట్‌తోపాటు మన ఇంటిని, కార్యాలయాన్ని ఆక్రమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన భారతీయ ఇంజినీర్లు, నిపుణత ఉన్న సాధారణ కార్మికులు, ఉద్యోగం సంపాదించుటలో విఫలమవుతున్నారని తెలిపారు. చైనా ముఖ్యంగా టెలికాం విభాగంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తు మన దేశ సాంకేతిక రంగాన్ని దెబ్బతియడానికి కుట్ర పన్నుతోందన్నారు. చైనా మన ప్రభుత్వంలోని సున్నితమైన శాఖలకు సంబంధించిన సమాచారాలను చాలా తేలికగా సేకరిస్తోందని, చైనా అధికారులకు గుఢాచారి చర్యలకు అవకాశం ఉండడంతో ప్రతి భారతీయుడు చైనా కంపెనీలకు పనులప్పగించే విషయంలో చాలా జాగ్రత్త ఉండాలన్నారు. ఇప్పటికే మన ప్రభుత్వం చైనా టపాకాయాలను, విగ్రహాలు, బొమ్మలు మొదలగు వాటిని నిషేధించడానికి తగు చర్యలు చేపట్టిందన్నారు. కాని చైనా నుండి పిన్ టు పెన్ దాకా విగ్రహాల నుండి కంప్యూటర్ల దాక, మొబైల్స్ మొదలగు వాటిని ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూనే ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా వస్తువులపై మనం ఖర్చు చేసే ప్రతి పైసా మనదేశ వ్యతిరేక శక్తులకు తరలిస్తున్నాయని ప్రజలు మరువకండని తెలిపారు. చైనా వస్తువులకు నిరసనగా 20న బైక్‌ర్యాలీ నగరంలోని స్థానిక పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమై సుంకేసుల రోడ్డు, రాజ్‌విహార్, కలెక్టరేట్, సి.క్యాంపు తదితర ప్రధాన కూడళ్ళలో కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్ మంచ్ కర్నూలు కో-కన్వీనర్ గాదే విశ్వంబర్, అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి వినయ్ పవార్ తదితరులు పాల్గొని కరపత్రాన్ని విడుదల చేశారు.
ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి
*ఆర్‌ఓ ప్రసన్న వెంకటేష్
నంద్యాల: సమర్థవంతంగా వాస్తవ ఓటర్లకు ఓటు వేసే హక్కును కల్పించడానికి చట్టంలోని 61వ విభాగంలో పొందుపరచిన ఓటరు స్థానే మరో వ్యక్తిని నియంత్రించాలనే ఉద్దేశ్యంతో పోలింగ్ సమయంలో వారి గుర్తింపును నిరూపించే నిమిత్తం ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డును పోలింగ్ కేంద్రానికి వెంట తెచ్చుకోవాలని ఆర్‌ఓ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఉప ఎన్నికల సందర్బంగా ఎన్నికల తేదీ కన్న ముందు ఓటర్లకు అధీకృత ఫొటో ఓటరు స్లిప్పులను అధికారుల ద్వారా పంపిణీ చేయాలని సంఘం ఆదేశించించిందన్నారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఉద్యోగ కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకం, పాన్‌కార్డు, స్మార్ట్ కార్డు, ఉపాధి జాబ్‌కార్డు, ఆరోగ్య భీమా స్మార్ట్‌కార్డు, ఫొటోగ్రాఫ్‌తో పెన్షన్ డాక్యుమెంట్, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటరు స్లిప్, ప్రజా ప్రతినిధులు అయితే అధికారిక గుర్తింపు కార్డులు, ఆధార్‌కార్డులు వీటిలో ఏదో ఒకటి తమ వెంట తెచ్చుకోవాలని ఆయన తెలిపారు.
మాజీ సైనికుల అభివృద్ధికి కృషి
నంద్యాల రూరల్: మాజీ సైనికుల అభివృద్ధి కోసం, వారికి వౌళిక సదుపాయాలు కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉండి కృషి చేస్తుందని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నంద్యాల మండలంలోని రైతునగరం సమీపంలో ఉన్న టీచర్స్ కాలనీ ఆవరణలో మాజీ సైనికుల ఉద్యోగులు, వారి కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అభిరుచి సేవా సమితి నిర్వాహకులు అభిరుచి మధు ఆధ్వర్యంలో టిడిపి అభ్యర్థి గెలుపుకు మాజీ సైనికుల సంఘం మద్దతు ప్రకటించి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కాలవ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ అభివృద్ధిని చూసి మాజీ సైనికులు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. దురదృష్టకరమైన పరిస్థితుల్లో నంద్యాలకు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. సాంప్రదాయానికి విరుద్ధంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అభ్యిర్థిని నిలబెట్టారన్నారు. 35 సంవత్సరాలుగా చంద్రబాబునాయుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేకర్‌రెడ్డి బద్ధ శత్రువులుగా రాజకీయం చేసినా వారి నాన్న చనిపోతే ఏకగ్రీవంగా వారికే వదిలిపెట్టామన్నారు. 20 సంవత్సరాలుగా ఉన్న సాంప్రదాయాన్ని వైకాపా మరచిపోయిందన్నారు. కక్షతోనే నంద్యాలలో పోటీ పెట్టారన్నారు. నంద్యాల ప్రజలు, మాజీ సైనికుల కుటుంబాలకు చెందిన వారు టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ప్రభుదాసు, జిల్లాపరిషత్ చైర్మన్ రాజశేఖర్, డా.గురురాజ కాలవను సన్మానించారు.
లక్ష్మమ్మ బ్యాంకు లాభం రూ.2.33 కోట్లు
ఆదోని: ఆదోనిలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ సహకార బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్లు 33లక్షల నికర లాభాన్ని ఆర్జించి లాభాల బాటలో నడుస్తోందని బ్యాంకు చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో రామయ్య మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.157కోట్ల డిపాజిట్లు సేకరించి రూ.98కోట్ల రుణాలను వివిద వర్గాలకు అందజేసినట్లు చెప్పారు. ఆర్‌బిఐ నిబంధనల మేరకు సాదారణ సేర్ మెంబర్లకు షేర్ ధనంపైన 10శాతం డివిడెండ్, వడ్డీ, అర్హత కల్గిన షేర్ మెంబర్లకు 20శాతం డిడెండ్ ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే తమ బ్యాంకు విధి విధానాలను పరిశీలించిన ఆర్‌బిఐ తమ బ్యాంకు గ్రేడ్ 1 బ్యాంకుగా సర్ట్ఫికెట్ అందజేసిందన్నారు. ఎన్‌పిఎ శాతం సున్నా అని అన్నారు. అలాగే రుణాల వసూళ్ళు 99శాతం వసూళ్లు చేయడం జరిగిందన్నారు. అలాగే సహకార రంగంలో ఎటిఎం సేవలు అందించడంలో ఆంధ్ర రాష్ట్రంలోనే తమ బ్యాంకుకు మూడవ స్థానం లభించిందన్నారు. త్వరలోనే తమ బ్యాంకుకు ఐఎంపిఎస్ సేవాలు, మొబైల్ బ్యాంకింగ్, స్వైప్ మిషన్ విధనాలు కూడా కల్పిస్తామన్నారు. స్టేట్ బ్యాంకు, కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా అవ్వ బ్యాంకు, సాంకేతిక రంగంలో పోటీ పడుతుందన్నారు. ఇప్పటికే ఎటిఎం సేవలు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులతో సమానంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఒకేషనల్, పిజి, ఎంబిఎ, ఎన్‌సిఎ, ఇంజినీరింగ్ విద్యల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం బంగారు పతకాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా స్థాపించి స్వామిజీలతో ఆధ్యాత్మిక ప్రవచనాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఉచిత కారుడ్రైవింగ్, ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రూ.కోటి 42లక్షల 80వేలు ఆదాయపు పన్ను చెల్లించి జిల్లాలోని సహకార బ్యాంకుల కన్నా ముందంజలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సిఇఓ గట్టు మురళీకుమార్, డైరెక్టర్లు అబ్దుల్ వాహబ్, దినాకర్‌రావు, అశ్వథనారాయణ, సుధాకర్‌బాబు, గోపాల్ కృష్ణ, హనుమంతరావులు పాల్గొన్నారు.

మహానందీశ్వరుని సన్నిధిలో మంత్రి సిద్ధా
మహానంది: మహానందిలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మలు ఆశీర్వదించగా ఎఇఓ ధనుంజయ, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు మెమొంటో, దుశ్శాలువాతో సత్కరించారు. వీరి వెంట గంగిశెట్టి మల్లికార్జున, భవనాశి రమణయ్య, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మహానందిలో దివ్యదర్శనం భక్తులు
మహానంది పుణ్యక్షేత్రంలో అనంతపురం జిల్లా లేపాక్షి మండలానికి చెందిన దివ్యదర్శనం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శుక్రవారం క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాలతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. స్థానిక అభిషేక మండపంలో వారిని వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.
20న కాపు, బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశం
నంద్యాల: తెలుగుదేశం ప్రభుత్వం కాపు, బలిజ వర్గీయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు, బలిజలకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని నంద్యాల ఉప ఎన్నికలో 90 శాతం బలిజ వర్గీయులు టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుకోసం కృషి చేస్తున్నట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తెలిపారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని బలిజ సంఘీయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు, బలిజ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నాయని, ఈ నెల 20వ తేదీన నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్‌హాలులో నిర్వహించే కాపు, బలిజ ఆత్మీయ సమావేశానికి సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావులతోపాటు పలు పదవుల్లో ఉన్న ఆత్మీయులందరూ హాజరవుతున్నారన్నారు. సిఎం బలిజ వర్గీయుల ఆత్మీయ సమావేశానికి హాజరవుతున్న సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలోని బలిజ వర్గీయులందరూ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిఎం కాపు, బలిజలకు ఇచ్చిన హామీ మేరకు బిసిల్లో చేర్చేందుకు మంజునాథ కమిషన్ ఏర్పాటు చేశారని, కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందిందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్లపై చట్టం రూపొందిస్తారని తెలిపారు. అంతేకాక కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి రూ.1000 కోట్లు కేటాయించడం వల్ల కాపు, బలిజ వర్గీయులు వేల సంఖ్యలో లబ్ధి పొందారన్నారు. కాపు, బలిజ సంఘీయుల్లో 1.42 లక్షల మందికి రుణాలు అందాయని, 65 వేల మంది యువత స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించారని, మరో 5 వేల మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేస్తుందన్నారు. ప్రతి జిల్లాలో రూ.5 కోట్లతో కాపు భవన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్లు వెదుర్ల రామచంద్రరావు, మురళి, నంద్యాల బలిజ సంఘం నాయకులు శాంతిరామ్ విద్యాసంస్థల అధినేత డా.శాంతిరాముడు, డా.రవికృష్ణ, వర్థంశెట్టి రాజారాం, రాజశేఖర్, ఎవి ఆర్ ప్రసాద్, జివియన్ ప్రసాద్, చింతల సుబ్బరాయుడుతోపాటు పెద్ద సంఖ్యలో బలిజ వర్గీయులు పాల్గొన్నారు.
అర్చకులు, పురోహితుల జీతాలు తగ్గించలేదు
కర్నూలు ఓల్డ్‌సిటీ: ఆర్చకులు, పురోహితుల జీతాలు తగ్గించ లేదని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారని ఎపి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ జిల్లా కన్వీనర్ సముద్రాల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో గల ఆలయాల్లో పని చేస్తున్న ఆర్చకులకు, పురోహితులకు జివో నెంబర్ 417 ప్రకారం నెలకు రూ.10వేలు రెమ్యూనరేషన్ ఫండ్ ద్వారా చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వనరులు లేక కనీస వేతనం కూడా పొందని, ధార్మిక సిబ్బంది విషయంలో వారికి దూపదీప నైవేద్యం పథకం ద్వారా లేక రెమ్యునరేషన్ నిధి నుండి గాని రూ.5000 చెల్లిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వేతనం పొందుతున్న ఆర్చ, పురోహితులకు తగ్గించలేదన్నారు.
జనగన్న అభిమానాన్ని చూడండి
నంద్యాల రూరల్: మోసపూరిత వాగ్ధానాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల వాగ్ధానాలు అమలు చేయని టిడిపి ప్రభుత్వాన్ని మెడలు వంచి జగనన్న అభిమానాన్ని చాటుతూ నంద్యాల గడ్డ వైఎస్‌ఆర్ అడ్డా అని ఉప ఎన్నికలో తీర్పు చెప్పి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నా రు. శుక్రవారం మడలంలోని మునగాల, రాయమాల్పురం, పులిమద్ది, భీమవరం, వైఎస్‌ఆర్ నగర్, నందమూ రి నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్బం గా ఆమె మాట్లాడుతూ రాష్టమ్రంతా నంద్యాల వైపు చూస్తోందన్నారు. ఐదు కోట్ల ప్రజల తలరాతలు మార్చే నం ద్యాల ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ న్యాయానికి ధర్మంగా ఉండి ఓటు వేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేయకుండ ఉప ఎన్నికలు రాగానే ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి వస్తున్నాడన్నారు. ఏ హామీ అమలు చేశాడో ముఖ్యమంత్రిని నంద్యాల ప్రజలు నిలదీయాలన్నారు. ఓటు వేయకపోతే నేను చేసిన అభివృద్ధిపై తిరుగవద్దనే ముఖ్యమంత్రి అనడం విడ్డూరంగా ఉందన్నారు. విశ్వసనీయతకు, వెన్నుపోటు రాజకీయాలకు జరుగుతున్న ఎన్నికలకు ప్రజలు తీర్పు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పని వాడన్నారు. తప్పుడు కేసులు పెట్టి జగన్‌ను జైలులో పెట్టారన్నారు. వైకాపా నుండి గెలిచి తమ సొంత లాభాల కోసం టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఓట్లు అడగాలన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, ఈ ఉప ఎన్నికలో నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునగాల రామచంద్రారెడ్డి, పులిమద్ది నతానియేలు, భీమవరం పార్థసారధిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
డిఎన్టీ హాస్టల్‌లో 100 మందికి భోజనం రద్దు..
దేవనకొండ: మండలంలోని డిఎన్టీ హాస్టల్‌కు చెందిన 100 మందిపైగా విద్యార్థులకు శుక్రవారం రాత్రి భోజనం రద్దు చేసినట్లు ఇన్‌చార్జి వార్డెన్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. డిఎన్టీ హాస్టల్‌లో నిబంధనలకు విరుద్ధంగా స్థానిక విద్యార్థులు ఉన్నందువలన వారికి భోజనం పెట్టలేదని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5కిలోమీటర్ల పైబడి ఉన్న విద్యార్థులు మాత్రమే హాస్టల్‌లో ఉండాలన్నారు. హాస్టల్‌లో 146 మంది విద్యార్థులు ఉంటే అందులో 100 మందికి పైగా స్థానికులే ఉన్నారన్నారు. స్థానిక విద్యార్థులైనందున వారికి భోజనం పెట్టలేదన్నారు. అయితే గతంలో పనిచేసిన వార్డెన్ 146 మందికి భోజనం పెట్టాడని, మీరెందుకు పెట్టలేదని వార్డెన్ నిలదీస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో అనుమతులు తెచ్చుకుంటే విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తామన్నారు. 5కిలోమీటర్ల లోపుల ఉన్న విద్యార్థులుకు హాస్టల్‌లో చేర్చుకోవద్దని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ గతంలో పనిచేసిన వార్డెను ఎలాచేర్చుకున్నాడో తమకు తెలియదని, ఇన్‌చార్జి వార్డెన్ తెలిపారు. విద్యార్థుల ఆందోళనకు వైకాపా నాయకులు మద్దతు తెలిపారు.