ఆటాపోటీ

భారత క్రికెటర్లు వివాదాల్లో ఘనులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి అనుష్క శర్మతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెట్టపట్టాలేసుకొని తిరగడం క్రికెట్ వర్గాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. వారు వ్యక్తిగత జీవితంలో టూర్లకు వెళ్లి, షికార్లు చేస్తే ఎవరూ విమర్శించకపోతుండవచ్చు. కానీ, టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉన్నప్పుడు అనుష్క అక్కడికి చేరడం చర్చనీయాంశమైంది. సిరీస్‌లు, టోర్నీలు జరిగే సమయాల్లో ఆటగాళ్ల భార్యలుగానీ, గర్ల్‌ఫ్రెండ్స్‌గానీ వారితో కలిసి ప్రయాణించడానికి, వారు బస చేసిన హోటళ్లలో ఉండడానికి వీల్లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, కోహ్లీ దీనికి తాను అతీతుడినన్న రీతిలో వ్యవహరిస్తున్నాడు. అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉన్నప్పుడు భారత క్రికెటర్లకు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం లేకపోయింది. సమయపాలనకు, క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టే కుంబ్లే పట్ల కోహ్లీకి, అతని సహచరులకు వ్యతిరేకత ఏర్పడింది. అదే చివరికి కుంబ్లే పదవికి ఎసరుపెట్టింది. ప్రస్తుత కోచ్ రవి శాస్ర్తీని ఆటగాళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. కుంబ్లే క్రమశిక్షణపై ఎంత పట్టుబడతాడో రవి శాస్ర్తీ అంత ఉదారంగా ఉంటాడు. లేట్‌నైట్ పార్టీలను పట్టించుకోడు. గర్ల్‌ఫ్రెండ్స్‌తో క్రికెటర్లు షికార్లు కొట్టినా ఇదేమని ప్రశ్నించడు. వీలుంటే వారితో తాను కూడా చేరతాడు. బతకనేర్చిన వాడు రవి శాస్ర్తీ. అందుకే, ఆటగాళ్లకు జేకొడుతూ తన పదవిని కాపాడుకుంటున్నాడు. జట్టు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అదే చేశాడు. ఇప్పుడు కోచ్ హోదాలోనూ అదే సూత్రాన్ని అమలు చేస్తున్నాడు.
కొత్తేమీ కాదు..
భారత క్రికెట్‌లో ఈ విధమైన క్రమశిక్షణా రాహిత్యం, ఇష్టారాజ్యం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా క్రికెట్, వివాదాలు చెట్టపట్టాలేసుకొని సాగుతున్నాయి. ఏదో ఒకరమైన వివాదంలో చిక్కుకున్న క్రికెటర్లు ఎంతో మంది కనిపిస్తారు. ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ గురించి ముందుగా ప్రస్తావించాలి. 2015 ఐసిసి ప్రపంచ కప్ సమయంలో ఒక జర్నలిస్టుతో దురుగా ప్రవర్తించి, అతడిని దుర్భాషలాడి, తన నైజాన్ని బయటపెట్టుకుడున్నాడు. అనుష్కతో అతను ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని వచ్చిన వార్తే అతని ఆగ్రహానికి కారణం. తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ ప్రశ్నించ కూడాదని హుకుం జారీ చేశాడు. అయితే, నిజానికి ఆ వార్త రాసింది మరో జర్నలిస్టు. కోహ్లీ ఘర్ష పడింది వేరే పాత్రికేయుడితో. ఒక జర్నలిస్టును తిట్టడంపై సర్వత్రా విమర్శలు చెలరేగడం, పైగా ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని దూషించానన్న వాస్తవాన్ని గ్రహించడంతో కోహ్లీ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అంతకు ముందు, 2012లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు సిడ్నీ టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లీ అనుచితంగా ప్రవర్తించాడు. ప్రేక్షకులను అసహ్యకరమైన భంగిమతో వెక్కిరించాడు. ఈ చర్యపై ఆగ్రహించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అతనిని హెచ్చరించింది. మ్యాచ్ ఫీజులో సగం మొత్తాన్ని జరిమానాగా విధించింది. 2013 ఏప్రిల్‌లో ఐపిఎల్ మ్యాచ్‌లో జరిగిన ఘర్షణ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ వివాదం చోటు చేసుకుంది. నైట్ రైడర్స్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ వేసిన బంతిలో భారీ షాట్ కొట్టబోయిన కోహ్లీ అవుటయ్యాడు. పెవిలియన్‌కు వెళుతూ, మధ్యలో ఆగి, నైట్ రైడర్స్ కెప్టెన్ గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ పరస్పరం దూషించుకున్నారు. ఇద్దరూ బాహాబాహీకి దిగారు. అంపైర్, ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో వివాదానికి తెరిపడినా, ఇప్పటి వరకూ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తున్నారు. 2014 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతోనే జరిగిన టెస్టులో కోహ్లీ అసహనం విమర్శలకు తావిచ్చింది. ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్‌తో అతను వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ పరస్పరం తిట్టుకున్నారు. అయితే, ఆ మ్యాచ్‌లో కోహ్లీ 169 పరుగులు చేయడంతో, ఈ సంఘటనకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వలేదు. కోహ్లీకి వివాదాలు కొత్తకాదని, అతని దూకుడే చాలాసార్లు అతనిని సమస్యల్లోకి నెడుతున్నదని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
కోహ్లీతో కోల్‌కతాలో కొట్లాటకు దిగిన బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్ కూడా తక్కువేమీ తినలేదు. 2007లో పాకిస్తాన్‌తో కాన్పూర్‌లో జరిగిన వనే్డలో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. పాక్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీతో ఘర్షణ పడ్డాడు. పరిస్థితి ముష్ఠియుద్ధం వరకూ వెళ్లింది. మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించాడు. మ్యాచ్ ఫీజులో గంభీర్‌కు 95 శాతం, అఫ్రిదీకి 65 శాతం జరిమానా విధించాడు.
మర్డర్ కేసులో సిద్ధు
సిక్సర్ల సిద్ధుగా పిలిచే ఓపెనర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధు ఈరోజుల్లో చాలా మందికి టీవీ షోల్లో గెస్టుగా, రాజకీయ నాయకుడిగానే తెలుసు. కానీ, ఒకప్పుడు భారత క్రికెట్‌పై బలమైన ముద్ర వేసిన ఆటగాళ్లలో అతను ఒకడు. 1988లో పటియాలాకు చెందిన గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి మృతికి కారకుడయ్యాడంటూ మర్డర్ కేసు నమోదైంది. ఒక రోడ్డు యాక్సిడెంట్‌కు సంబంధించిన చిన్న ఘర్షణ పెద్దదిగా మారడంతో ఆగ్రహం పట్టలేక గుర్నామ్‌ను సిద్ధు చితకబాదాడని ప్రాసిక్యూషన్ ఆరోపణ. తీవ్ర గాయాలతో గుర్నామ్ మృతి చెందడంతో సిద్ధుపై హత్యా నేరం పడింది. 2006లో అతనిని ముద్దాయిగా తేల్చిన కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కొద్దికాలం జైలు శిక్షను అనుభవించిన తర్వాత అతను విడుదలయ్యాడు. ఆతర్వాత కామెంటేటరర్‌గా, టీవీ ప్రెజెంటర్‌గా, గెస్ట్‌గా, రాజకీయ నాయకుడిగా వివిధ రంగాల్లో బిజీగా ఉన్నాడు.
మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా వ్యవహరించిన హన్సీ క్రానే బుకీలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఢిల్లీ పోలీసులు బయటపెట్టిన తర్వాత, ప్రపంచానికి ఫిక్సింగ్ గురించి తెలిసింది. క్రికెట్ మ్యాచ్‌ల ఫలితాలను ఆటగాళ్లు ముందుగానే నిర్ధారించే అవకాశాలున్నాయన్న విషయం తొలిసారి అభిమానులకు అర్థమైంది. 2000లో అజర్‌పై బిసిసిఐ జీవితకాల సస్పెన్షన్ విధించింది. 2012లో కోర్టు ఈ కేసును కొట్టేసినప్పటికీ, అప్పటికే అతని కెరీర్‌కు తెరపడింది.
ధోనీపై కేసు
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో ఎప్పుడూ నింపాదిగా ఉంటాడు. ఒత్తిడికి లేదా అసహనానికి గురికావడం దాదాపుగా ఉండదు. అందుకే, అందరూ అతనిని ‘మిస్టర్ కూల్’ అని పిలుస్తారు. వివాదాలకు దూరంగా ఉండే అతనిపై 2015లో బెంగళూరు కోర్టులో కేసు నమోదుకావడం విచిత్రం. ఒక పత్రిక అతనిని విష్ణుమూర్తి రూపంలో చూపుతూ ప్రచురించిన ఫొటోపై వివాదం రేగింది. ఆ ఫొటో హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని, కాబట్టి ధోనీపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరాడు. ఈ కేసు బెంగళూరు నుంచి సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు ఏవీ లేవంటూ 2016 సెప్టెంబర్ 5న సుప్రీం కోర్టు కేసును కొట్టేసింది. ధోనీ ఊపిరి పీల్చుకున్నాడు.
నగ్మాతో గంగూలీ షికార్లు
మాజీ కెప్టెన్, ‘కోల్‌కతా ప్రిన్స్’ సౌరవ్ గంగూలీ, సినీ నటి నగ్మా మధ్య చాలాకాలం ప్రేమాయణం కొనసాగింది. ఇద్దరూ కలిసి అప్పట్లో షికార్లు చేస్తూ, ఎన్నోసార్లు మీడియాకు దొరికిపోయారు. 2001లో, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభాకి ముందు అతను శ్రీకాళహస్తి ఆలయానికి నగ్మాతో కలిసి వెళ్లి, సర్పదోష నివారణ పూజలు చేశాడు. వారి ప్రేమ వ్యవహారంపై అంత వరకూ ఉన్న అనుమానాలు నిజమయ్యాయి. ఇక కోచ్ గ్రెగ్ చాపెల్‌తో అతనికి ఉన్న విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోచ్‌పై బహిరంగంగానే విమర్శలు చేసిన తొలి భారత కెప్టెన్‌గా గంగూలీ చరిత్రలో నిలిచిపోయాడు. 2005లో కోచ్‌గా బాధ్యలు తీసుకున్న చాపెల్‌తో గంగూలీకి మొదటి నుంచి పడేది కాదు. జింబాబ్వే పర్యటనలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీమిండియాకు నాయకత్వం వహించేందుకు శారీరకంగా, మానసికంగా గంగూలీ అనర్హుడని బిసిసిఐకి చాపెల్ లేఖ కూడా రాశాడు. ‘విభజించి పాలించు’ అనే సూత్రాన్ని పాటిస్తున్నాడని ఆరోపించాడు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో, టీమిండియాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గంగూలీ పట్టుబట్టి మరీ చాపెల్‌ను సాగనంపేలా చేశాడు.
ఇలా చెప్తూపోతే భారత క్రికెటర్ల వివాదాల చిట్టా వస్తునే ఉం టుంది. టీమిండియా ఆటగాళ్లు వివాదారహితులనిగానీ, వారు చాలా శాంత స్వభావులనిగానీ అనుకోవడానికి వీల్లేదు. అయతే, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల క్రికెటర్లతో పోలిస్తే మన వాళ్లు ఎంతో నయం.
చిత్రం.. ప్రేయసి అనుష్కకు కోహ్లీ ఫ్లయంగ్ కిస్

- బివిఎల్ కృష్ణ మనోహర్