మెయిన్ ఫీచర్

అగ్గిరవ్వ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్నిమాపక దళంలో పనిచేస్తున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఆమె. పురుషాధిక్యం కొనసాగే ఈ దళంలో ఆమె ప్రవేశించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు పదేళ్ల కిందట నాగపూర్‌కు చెందిన 26 ఏళ్ల హర్షిణి కనేకర్ తన అనుభవాన్ని గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘నాజీవితంలో అత్యంత ఆనందదాయకమైన క్షణాలివి. నాగపూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు చరిత్ర సృష్టించబోతున్నానని అనుకోలేదు. ఎర్రరంగులో మెరిసిపోతు కనిపిస్తున్న ఆ కాలేజీ భవనంలో అడుగుపెట్టడమే జీవితంలో మరిచిపోలేని అపురూపమైన సంఘటన. దరఖాస్తు ఫారం కాలేజీ ఆఫీసులో ఇస్తున్నప్పుడు అక్కడవున్న ఒకాయన నావైపు జాలిగా చూస్తూ ఆర్మీ లేదా ఎయిర్ ఫోర్స్ కాలేజీలో చేరండి, అక్కడ విద్యార్థినులకు అనేకరకాల సదుపాయాలుంటాయి. ఇక్కడ మాత్రం అటువంటి సౌకర్యాలు మగవారికే ఉన్నాయన్నాడు.అయితే నేను మాత్రం నిరుత్సాహ పడకుండా అదే కాలేజీలో చదివేందుకు నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు. అప్పట్లో యూనియన్ సర్వీస్ కమిషన్‌లో ఈ కోర్సుకు సంబంధించి 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. 2002లో ప్రవేశ పరీక్ష పాసైన తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్‌కోసం వెళ్లినప్పుడు డాక్టర్లు కూడా ఈమెను నిరుత్సాహపరిచారు. ఫైర్ సర్వీసులో శిక్షణ కఠినంగా వుంటుందని, తట్టుకోలేవని వారు చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రారంభంలో ఒకాయన ఆమెను ‘ఈ పరీక్ష పాసైతే నువ్వు భారత ఫైర్ సర్వీసులో కిరణ్ బేడీ అవుతావు’ అని అభినందించాడు. ఆమాటలు తననెంతో ఉత్సాహపరిచాయని ఆ ఇంటర్వ్యూను విజయవంతంగా ముగించిన తర్వాత పైర్ సర్వీస్ యూనిఫారం ధరించే రోజులు దగ్గరపడ్డాయని ఆనందపడ్డానని ఆమె చెప్పింది.
కాలేజీలో చేరిన మొదటిరోజున తనను అప్పట్లో నిరుత్సాహపరిచిన వ్యక్తే తారసపడ్డాడని, మా కాలేజీ తలుపులు మీకోసం ఎప్పుడూ తెరుచుకునే వుంటాయని నవ్వుతూ ఆహ్వానించాడని హర్షిణి చెప్పింది. అంతటితో అయిపోలేదు. కాలేజీలో చేరడం అయితే జరిగింది కానీ తానేమిటో నిరూపించుకోవడం ఒక సవాల్‌గా స్వీకరించిందామె. ‘నేనెప్పుడు క్లాసులకు కానీ, పెరేడ్‌లకు కానీ ఆలస్యంగా వెళ్లకూడదు లే కపోతే అక్కడి మగవాళ్లంతా నన్ను ఎగతాళి చేస్తారు నా తర్వత ఈ కాలేజీలో చేరే అమ్మాయిలకు నేను ఆదర్శప్రాయం కావాలి’ అని ఆమె తన మనస్సులో నిర్ణయించుకుంది. నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో ఒక అమ్మాయి చేరింది అన్న వార్త దావానంలా వ్యాపించి కుర్రాళ్లంతా ఆమెను చూడ్డానికి పరిగెత్తుకుంటూ రావడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఆమెపై వెయ్యి కళ్లతో నిఘా వేసారు.
మగవారికేమీ తీసిపోనని నిరూపించా
‘ఎంతో బరువుగా వుండే వాటర్ పైపులు మోస్తూ తిరగడం, డమీలతో మాక్‌డ్రిల్ చేయడం శిక్షణలో భాగాలు. మగైనా ఆడ అయినా ఆ భారాన్ని భరించక తప్పదు. మగవారికి నేనేమీ తీసిపోనని నిరూపించుకోవడమే థ్యేయంగా పెట్టుకున్నాను. తెల్లవారుజామునే లేచి స్టోర్ రూంకు వెళ్లి నా అంతట నేనే ప్రాక్టీసు చేయడం అలవాటు చేసుకున్నాను. అదెంతో కలిసొచ్చి అందరిలోను తలెత్తుకుని తిరిగే ధైర్యాన్నికలిగించింది. అప్పటినుంచి నన్ను అవహేళన చేయడానికి ఎవరూ సాహసించలేదు’ అంటుందామె. అయిదు సంవత్సరాలపాటు అమ్మాయిల కాలేజీల్లో చదువుతూ వచ్చిన హర్షిణి ఈ ఫైర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏడు సెమిస్టర్ల రెసిడెన్షియల్ కోర్సులో చేరడంతో అక్కడి అధికారులు ఆమెకోసం ప్రత్యేక సదుపాయాలు సమకూర్చారు. అంతేకాదు క్లాసులు అయిపోయిన తరువాత తనను ఇంటికి పంపించడానికి ప్రత్యేకంగా హోం మంత్రిత్వ శాఖనుండి అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని, పైర్ సర్వీసులో కోర్సులను సులభంగా అధ్యయనం చేయడానికి అంతకుముందు తన ఎన్‌సిసి శిక్షణ ఎంతో కలిసొచ్చిందని ఆమె వివరించింది.
శివాని కులకర్ణి స్ఫూర్తిగా...
‘ఎన్‌సిసిలో శిక్షణ పొందే రోజుల్లో భారత వాయుసేనలోని మొట్టమొదటి మహిళా పైలట్ శివాని కులకర్ణిపై వెలువడిన వ్యాసాన్ని చదివాను. అప్పటినుంచి ఆమే నాకు స్ఫూర్తి! ఎన్‌సిసిలో అధికారులు యూనిఫారం ధరించి దర్పాన్ని ప్రదర్శించడం మరో స్ఫూర్తి! అదే యూనిఫాంమీద వ్యామోహాన్ని నాకు పెంచింది’ అని హర్షిణి చెప్పింది. అగ్నిమాపక దళంలో ఉద్యోగినిగా జీవితాన్ని ఆరంభించిన తర్వాత ఏన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వస్తోంది. 2005 దీపావళి రోజున ఆమె అయిదు అగ్నిప్రమాద సంఘటనల్లో సాహసోపేతంగా విధులు నిర్వహించింది. అందులో ఢిల్లీలోని శాస్ర్తీనగర్‌లో సంభవించిన ఒక సంఘటనను వివరిస్తూ ‘దీపావళి సందర్భంగా కాల్చిన రాకెట్ నేరుగా ఒక షూ ఫ్యాక్టరీలోకి దూసుకుపోయింది. ఆ భవనం పైఅంతస్తులో వున్న ఫ్యాక్టరీ గోదాంలో సరుకంతా ఈ రాకెట్‌వల్ల పూర్తిగా భస్మమైపోయింది. ఆ పేలుడుకు భవనం గోడలు ఒక్కసారిగా బీటలువారాయి. దీనిపై సమాచారం అందుకున్న తాము అక్కడికి చేరుకుని ఎదురుగా వున్న భవనం మీదకు ఎక్కి మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేసాం. దాంతో ఆ భవనం గోడ పగులగొట్టి మంటలకు దగ్గరగా వెళ్లడానికి ఫ్రయత్నించాం. కానీ పొగ దట్టంగా కమ్ముకోవడంతో మా ప్రయత్నాలు సాగలేదు. ఇక లాభం లేదనుకుని ప్రాణాలకు తెగించి బీటలు వారిన భవనంలోకి ప్రవేశించి ఆరు గంటలసేపు మంటలతో పోరాడి చివరకు వాటిని అదుపులోకి తీసుకొచ్చాం’అని తన అనుభవాన్ని వివరించింది. భళా మహిళా!
చిత్రం.. అగ్నిమాపక దళంలో మహిళా అధికారిణి హర్షిణి

- గున్నకృష్ణమూర్తి