దక్షిన తెలంగాణ

చిన్నారుల వ్యక్తిత్వ వికాసానికి బాలసాహిత్యం దోహదపడాలి (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల సాహిత్యం చిన్నారుల వ్యక్తిత్వ వికాసానికి దోహద పడాలని భావించే బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ విజేత వాసాల నరసయ్య కరీంనగర్ జిల్లా చౌలమద్ది గ్రామానికి చెందినవారు. స్కూల్ మాష్టారుగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పోస్ట్‌మాస్టర్‌గా పదవీ విరమణ చేశారు. కరీంనగర్ త్రివేణి సాహితీ సంస్థ అధ్యక్షునిగా, జాతీయ సాహిత్య పరిషత్తు నిజామాబాద్ వ్యవస్థాపక అధ్యక్షునిగా సేవలందించిన ఆయన ఆంధ్రప్రదేశ్ బాలల రచయితల సంఘం, తెలంగాణ బాల సాహిత్య పరిషత్‌లో క్రియాశీల సభ్యునిగా గుర్తింపు పొందారు. సెంట్రల్ హిందీ డైరెక్టరేటు న్యూఢిల్లీ వారి ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ పక్షాన వివిధ రాష్ట్రాల్లో నిర్వహింపబడిన హిందీ శిబిరాల్లో పాల్గొన్న అనుభవం ఆయనకుంది. అనేక సంస్థల ద్వారా పురస్కారాలు అందుకున్న ఆయన స్వయంగా వాసాల నరసయ్య బాల సాహితీ పురస్కారాలతో 2009 నుండి క్రమం తప్పకుండా బాల సాహితీవేత్తలను సత్కరిస్తున్నారు. ఎనిమిది బాలల కథల గ్రంథాలు, మూడు బాలగేయ సంకలనాలు, నాలుగు బాలల పొడుపు కథల గ్రంథాలు వెలువరించారు. అంతేగాక బాలల కోసం మహానుభావుల జీవిత చరిత్రలను గ్రంథస్థం చేశారు. బాలల రచనలకు సంబంధించిన అనేక పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. బాలల కోసం ఓ ఆరు వ్యాస సంపుటాలను ప్రకటించారు. వచన కవితా సంపుటాలు, నానీ సంకలనాలను వెలువరించారు. వీటితో పాటు తపాల సాహిత్యం రచించి అందరి దృష్టినీ ఆకర్షించారు. పలు బాలల పత్రికల్లో ఆయన రచనలు వెలుగు చూస్తున్నాయి! సాహిత్య అధ్యయనం అభిరుచిగా మలుచుకున్న ఆయనతో మెరుపు ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే..

ఆ మీరు ఎన్నో ఏట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు?
నేను పదవ తరగతి చదువుతున్నపుడు 1955 సంవత్సరంలో 12వ ఏట ‘సౌగంధిక హారణం’ వీధి నాటకం రచనతో నా రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించాను.

ఆ మీ మొట్టమొదటి రచన?
‘నా బంగారు కల’ మొదటి కథ 1960-61లో ముద్రణకి నోచుకున్నది. తర్వాత కొంత పరిపక్వతతో అధ్యయనం చేసిన పిదప రాసిన గేయ కవితలను సంకలనంగా ‘కర్షకుడా! కార్మికుడా..!’ 1978లో మొదటి ముద్రిత పుస్తకంగా తీసుకురావడం జరిగింది.

ఆ రచన పట్ల ఆసక్తి చూపడానికి మీకు ప్రేరణ ఇచ్చింది ఎవరు?
చిన్నప్పుడు మా నాన్నగారు వాసాల వెంకటయ్య, అన్నయ్య వాసాల దమ్మయ్య ఇద్దరూ వీధి నాటకాలు వేసేవారు. మా తల్లి వాసాల లక్ష్మవ్వ జానపద గాయని. వీరి సాంగత్యం, ప్రోత్సాహంతో సాహిత్యం చదవటం వ్రాయటానికి ప్రేరణ లభించింది.

ఆ బాల సాహిత్యం పట్ల మీరు మొగ్గుచూపడానికి గల కారణం ఏమిటి?
పిల్లలు మన ఇంటి సంపద మరియు దేశ సంపద. వ్యక్తిత్వపరంగా ఎదగాలంటే వారికి మంచి సాహిత్యాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ప్రేమ, వీరికోసం ఎన్నో కథలని చెప్పేవాడిని, గేయాలు వ్రాసి వినిపించేవాడిని. అన్ని ప్రక్రియలలో కవిత, గేయాలు, కథలు, వ్యాసాలు వ్రాస్తున్న నాకు సీనియర్ పాత్రికేయుడు పి.ఎస్.రవీంద్ర బాల సాహిత్యంలో కృషి చేస్తే బాగుంటుందని సూచించాడు. అదేవిధంగా ప్రముఖ పాత్రికేయుడు, రచయిత తిరునగరి వేదాంత సూరి గారి ప్రోత్సాహంతో పూర్తిగా బాల సాహితీ ప్రక్రియల్లో కథలు, బాల గేయాలు మొదలగు వాటిని వ్రాయటం జరిగింది.
ఆ ఇప్పుడు వస్తున్న బాల సాహిత్యంపై
మీ అభిప్రాయం ఏమిటి?
ఇప్పుడు కొంత బాల సాహిత్యం పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. అయితే తేలికపాటి పదాలు, వాక్యాలతో వ్రాయబడి విషయానికి అనుకూలంగా రంగు రంగుల బొమ్మలతో బాల సాహిత్యం ముద్రించబడాలి.

ఆ బాల సాహిత్యానికి వివిధ పత్రికలు ఇస్తున్న ప్రాధాన్యతపై మీ అభిప్రాయం?
గత కొద్ది కాలంగా అన్ని దిన, వార పత్రికలు బాల సాహిత్యానికి కొంతవరకు ప్రాధాన్యతని ఇస్తున్నాయి. వారంలో ఒక రోజు ఒక పేజీ లేదా అరపేజీ కేటాయిస్తున్నారు. కానీ ఇది సరిపోదు. మంచి రంగు రంగుల బొమ్మలతో కథలతో పాటు గేయాలకి, కవితలకి కూడా చోటు ఇవ్వాలి.

ఆ బాల సాహిత్యంలో ఏ అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని కోరుతారు? అంటే ఏ ప్రక్రియ ఎక్కువ ప్రయోజనకరం?
బాల సాహిత్యం పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి. దేశభక్తి, పెద్దల పట్ల మర్యాద మన్నన, కుటుంబ విలువలు, స్వీయ సంస్కారం, క్రమశిక్షణతో పాటు మానవత్వ విలువలు పెంపొందించేలా బాల సాహిత్యం రావాల్సి ఉంది.

ఆ మీకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెచ్చి పెట్టిన గ్రంథం గురించి
రెండు మాటలు చెబుతారా?
ప్రత్యేకంగా ఒక పుస్తకానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కలేదు. నేను మొత్తంగా వ్రాసిన 36 పుస్తకాలలో 28 బాల సాహిత్య పుస్తకాలన్నిటికీ కలిపి నా మొత్తం బాల సాహిత్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటించారు.

ఆ మీకు నచ్చిన బాల సాహిత్య సృజనకారులు?
బాల సాహితీ సృజనకారులల్లో రెడ్డి రాఘవయ్య గారు, భూపాల్ గారు, మరియు తిరునగరి వేదాంత సూరి గారు తదితరులు నా బాల సాహిత్య సృజనకు స్ఫూర్తినిచ్చారు.

ఆ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం పట్ల మీ స్పందన?
నాకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. నేను చేసిన నిరంతర బాల సాహితీ సేవకు తగిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇందుకు కేంద్ర సాహిత్య అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఆ కొత్తగా బాల సాహిత్యం రాస్తున్న కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు
మరియు సూచనలు?
సాహిత్యంలో కృషి చేస్తున్న అందరూ బాలసాహిత్యం వ్రాయాలని నేను కోరుకుంటున్నాను. సరళమైన పదాలతో మరియు వాక్యాలతో బాలల మనోవికాసాన్ని దృష్టిలో ఉంచుకొని బాల సాహిత్యం సృజించాలని కోరుతున్నాను. బాల సాహిత్యం వ్రాసేటప్పుడు ప్రౌఢ సాహిత్యం వ్రాసే రచయితలు పిల్లల స్థాయికి దిగి రాయాలని అనుకుంటారు. కానీ వారి స్థాయిని ఎరిగి ఎదిగి రాయాలని నేను అభ్యర్థిస్తున్నాను. బాలలది ఒక ప్రత్యేక ప్రపంచం. వారి ఊహాశక్తి మరియు సృజనాత్మతకు అనుగుణంగా పిల్లల స్థాయికి ఎదిగి రాయాలన్నదే నా సూచన.
వాసాల నరసయ్య
ఇం.నం.3-1-661/9
201, శ్రీలత అపార్ట్‌మెంట్
వావిలాలపల్లి, రామాలయం ప్రక్కన, కరీంనగర్
సెల్.నం.9490977459

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544