కృష్ణ

గ్రామాల్లో జోరుగా అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ: నియోజకవర్గంలోని గ్రామాల్లో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో 14వ ఆర్థిక సంఘం నిధులు, నిధులు రూ.67లక్షల ఉపాధి నిధులతో నిర్మించిన సిసి రోడ్లు, సర్వశిక్షా అభియాన్ నిధులు రూ.6లక్షల 50వేలతో నిర్మించిన స్కూల్ భవనాన్ని శనివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు, ఎన్‌ఎస్‌పి డిసి చైర్మన్ నెలకుదిటి నాగేశ్వరరావు, సర్పంచ్ ఎన్ శిరీష, మండల ఎస్‌సి సెల్ ఉపాధ్యక్షుడు కొలగాని ప్రసాద్, పొట్టపింజర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా వనం మనం కార్యక్రమంలో భాగంగా స్థానిక డివిఆర్ కాలనీ, జిడిఎంఎం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్ వై పద్మావతి, యార్డ్ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు, జిడిఎంఎం కళాశాల చైర్మన్ డాక్టర్ జివి ప్రసాదరావు, పట్టణ తెదేపా అధ్యక్షుడు కొండూరు వెంకట్రావు, తెదేపా నాయకులు ఉన్నం నరసింహారావు, పులవర్తి కోటి, గౌస్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

పాములలంకను వణికిస్తున్న జ్వరం
తోట్లవల్లూరు: మండలంలోని పాములలంకలో శనివారం జ్వరం బాధితులు విపరీతంగా పెరిగారు. స్థానిక ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం రోగులతో కిటకిటలాడింది. వర్షాలు కురస్తూ వాతావరణం నెమ్ముగా ఉండటంతో శుక్రవారం రాత్రి జ్వరం బాగా పెరిగి తట్టుకోలేకపోయామని బాధితులు చెప్పారు. ఎక్కువ మంది నీరసించిపోయి, జ్వరం బాధితులు, బాడీ పెయిన్స్‌తో బాధపడేవారు చికిత్స కోసం ఉదయం నుంచే సబ్‌సెంటర్‌లో క్యూ కట్టారు. డాక్టర్ గోపాలనాయక్ రోగులకు పరీక్షలు నిర్వహించారు. రెండోరోజు వైద్య శిబిరంలో సుమారు 120 మంది చికిత్స పొందారు. వీరిలో ఐదుగురు కొత్త బాధితులు జ్వరంతో వచ్చారని తెలిపారు. జ్వరాలు తగ్గే వరకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని కొనసాగిస్తామని గోపాలనాక్ చెప్పారు. అలాగే పాములలంక ప్రత్యేక వైద్య శిబిరానికి నీరసించి వచ్చిన రోగులు సెలైన్ కోసం తోట్లవల్లూరు పీహెచ్‌సీకి ఆటోలలో వచ్చారు. పీహెచ్‌సీలో బెడ్‌లు పాములలంక జ్వరాల బాధితులతో నిండిపోయాయి. అదే విధంగా పాములలంక గ్రామం నుంచి జ్వరం బాధితులు సుమారు 50 మంది విజయవాడ, ఉయ్యూరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్ళారు. కొంత మంది ఆర్‌ఎంపిల వద్ద చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినప్పటికీ చాలామంది ప్రాణభయంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్ళిపోతున్నారని సర్పంచ్ పాముల శ్రీనివాసరావు చెప్పారు. ఇవి వైరల్ జ్వరాలేనని, ఎలాంటి ప్రాణాపాయం ఉండదని, బాధితులు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ గోపాలనాయక్ చెబుతున్నారు. ఎలాంటి జ్వరాలైనా తగ్గించే మందులు ఉన్నాయని భరోసా ఇస్తున్నారు. కాని సర్కారు వైద్యంపై నమ్మకం లేని వారు బయటకు వెళుతున్నారు.

ఘనంగా ప్రపంచ ఫొటోగఫీ డే

మచిలీపట్నం (కల్చరల్): పట్టణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అన్నం వీర రాఘవయ్య, రాఘవమ్మ కల్యాణ మండపంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ హాజరయ్యారు. కెమెరా సృష్టికర్త జాక్వస్ మెండే డాగురే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిలకలపూడిలోని శ్రీ వాసవీ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ రోజు రోజుకీ ఆదరణ కోల్పోతున్న ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పట్టణంలో అర్హులైన ఫొటోగ్రాఫర్లకు నివేశన స్థలాలు మంజూరు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తిన దాస్, టిడిపి నాయకులు అబ్దుల్ అజీమ్, కొండ్రు భాస్కరరావు, అసోసియేషన్ ప్రతినిధులు మస్తాన్ వలీ, సుధీర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చేనేత వస్త్రాల రిబేట్ అమ్మకాలు ప్రారంభం
మచిలీపట్నం (కల్చరల్): స్థానిక ది తమిళనాడు హ్యాండ్ లూమ్ వీవర్స్ కో-ఆపరేటీవ్ సొసైటీలో రిబేట్ అమ్మకాలను శనివారం ఆర్డీవో సాయిబాబు ప్రారంభించారు. వినాయక చవితి, టీచర్స్ డే సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం చేనేత వస్త్రాల అమ్మకాలపై ప్రత్యేక రాయితీలను ప్రకటించిందని ఆర్డీవో సాయిబాబు తెలిపారు. దీనిలో భాగంగా 30 శాతం రిబేట్ అమ్మకాలను ప్రారంభించిన కో-ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధి పి శివ శంకర్‌ను ఆర్డీవో అభినందించారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ ఎఎస్‌డబ్ల్యు టి చైతన్య, విశ్రాంత మేనేజర్ ఎన్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తే కఠిన చర్యలు

మైలవరం: గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ కెవి శివయ్య హెచ్చరించారు. మండల ఆహార సలహా కమిటీ సమావేశం శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో వినియోగదారుల నుండి అధిక ధరలు వసూలు చేస్తున్న విషయాన్ని, బుకింగ్ సమయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను, సిలిండర్ల లీకేజీలు, తూకంలో తేడాలుంటున్నట్లు సభ్యులు తహశీల్దార్ దృష్టికి తీసుకురాగా ఆయన సంబంధిత నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి సమావేశానికి సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులే రావాలని సభ్యుల ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఆదేశించారు. సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తే ఏజెన్సీల అనుమతిని రద్దుకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు. అదేవిధంగా హోటళ్ళలో నాశిరకం సరుకులు వాడుతూ వినియోగదారుల ఆరోగ్యాలను నాశనం చేస్తున్న విషయంపై కూడా ఫుడ్ ఇనస్పెక్టర్లను పిలిపించి వారిచే తనిఖీలు చేయిస్తామన్నారు. మాంసం మార్కెట్‌లపై తనిఖీలు నిర్వహించి నిల్వ ఉన్న మాంసం అమ్మేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడిచే మినరల్ వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవటంతోపాటు అవసరమైతే మూసివేస్తామన్నారు. మైలవరం రైతుబజారులో నిల్వ ఉన్న కూరగాయలు అమ్ముతున్నారని, పైగా సమయాలు పాటించటం లేదని సభ్యులు ఫిర్యాదు చేశారు. అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తున్నారని తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ వారంలోగా ఎస్టేట్ ఆఫీసర్, రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మైలవరంలో డంపింగ్ యార్డుకు స్థల సమస్య తీవ్రంగా ఉందని గుర్రాజుపాలెం సమీపంలోని పూరిగుట్ట వద్ద స్థలం అందుబాటులో ఉందని పంచాయతీ సర్పంచ్‌కు తెలిపారు. ఇందుకోసం ఏవైనా సమస్యలుంటే తాను పరిష్కరించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో సభ్యులు రేగళ్ళ రఘునాధరెడ్డి, పి వెంకటేశ్వరరావు, వివి కృష్ణారెడ్డి, వై రాధాకృష్ణ, తాతా పోతురాజు, గాళ్ళ సాంబశివరావు, బుద్ధారపు వెంకట్రావు, సాల్మన్‌రాజు, ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము, సర్పంచ్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

చెత్త నుండి సంపద యూనిట్లు
13 వేల గ్రామాల్లో ఏర్పాటు లక్ష్యం

కూచిపూడి: రాష్ట్రంలోని 13వేల గ్రామాల్లో చెత్త నుండి సంపద తయారు చేసి యూనిట్లు నెలకొల్పి జి వేస్ట్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్యపరచాలని గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కమిషనర్ జి బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో మొవ్వ యునిట్ జిల్లాలో రెండవ స్థానంలో ఉందన్నారు. శనివారం యూనిట్‌ను సందర్శించిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రహదారులపై చెత్తను వేయకుండా పంచాయతీ ఏర్పాటు చేసే డస్ట్‌బిన్‌లు వేసి గ్రామాలు పారిశుద్ధ్యంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ రెండు వేల యూనిట్లు వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. 4 వందల యూనిట్లలో వర్మికంపోర్టు తయారవుతున్నాయన్నారు. ఒక్కొక్క యూనిట్ ఏర్పాటుకు జనాభా ప్రాతిపదిన రూ. 4 లక్షల నుండి రూ. 10 లక్షల ఉపాధి హామీ పథకం ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ తయారీ వర్మికంపోర్టును బహిరంగ మార్కెట్‌లో రూ. 10 ఉండగా ప్రభుత్వం రూ. 15 కొనుగోలు చేసి పంచాయతీ అభివృద్ధికి ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిడి బి హేమంత కుమారి, టెక్నికల్ కోర్డినేటర్ కృష్ణవేణి, ఎంపిడిఓ వి ఆనందరావు, ఈఓపిఆర్‌డి జి రామ్మోహనరావు, ఎపిఓ పి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేత
విజయవాడ (కార్పొరేషన్): పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని యనమలకుదురు గ్రామంలో పలు అనధికార నిర్మాణాలను కూల్చివేసినట్టు ఎపిసిఆర్‌డిఎ డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ వి రాముడు పేర్కొన్నారు. సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆదేశాలతో శనివారం ఉదయం ఆ గ్రామంలో 3 భవనాలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్నారు. ఒక భవనానికి చెందిన 3వ అంతస్తు శ్లాబ్, మరో భవనానికి చెందిన 4వ అంతస్థులోని పెంట్ హౌస్, ఈ భవనం సమీపంలోనే ఇంకొక భవనానికి చెందిన 4వ ఫ్లోర్ శ్లాబ్‌పార్ట్, 3వ ఫ్లోర్ శ్లాబ్‌ను కూల్చివేసినట్టు రాముడు తెలిపారు. ప్రణాళికాబద్ధమైన రాజధాని రీజియన్ అభివృద్ధిలో భాగంగా ఎటువంటి అనధికార నిర్మాణాలను అనుమతించడం లేదని, ఇప్పటికైనా భవన నిర్మాణదారులు, యజమానులు ఈ విషయాన్ని గుర్తించి ప్లాన్ నిబంధనలకు విరుద్దంగా కానీ, అక్రమంగా నిర్మించే అదనపు ఫ్లోర్ నిర్మాణాలకు కానీ పాల్పడవద్దన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన ప్లాన్ మంజూరు ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, లైసెన్స్‌డ్ ఇంజినీర్ల నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించుకోవాలని తెలిపిన ఆయన అనుమతిలేని అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్లను కొనుగోలు చేయరాదని సూచించారు.

ఇసుక రవాణా ఛార్జీలపై దృష్టి
* అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ: జిల్లాలో ఇసుక అందుబాటులో ఉండడంతో పాటు రవాణా ఛార్జీలు నిర్దేశించిన విధంగా అమలు జరుగుతున్నది లేనిదీ పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరు తన క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, డిసిసి గజరావ్ భూపాల్, జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఇసుక రవాణాలో నిర్థిష్టమైన విధానం అవలంభిస్తున్నప్పటికీ ప్రజల నుండి సరైన స్పందన రావటం లేదన్నారు. రెవెన్యూ, పోలీసు, మైన్స్, రవాణా శాఖల అధికారులు, టాస్క్ ఫోర్స్ బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ రవాణా ఛార్జీలలో వ్యత్యాసం లేకుండా సరఫరా జరగాలన్నారు. జిల్లాలో మీ-సేవ ద్వారా రవాణా రుసుమును వసూలు చేసేవిధంగా సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టరు తెలిపారు. రీచ్‌ల వద్ద సిసి కెమెరాల ఏర్పాటుకు టెండర్లు పిలిచి వారం రోజుల్లో కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రవాణా చార్జీలను పై స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు సమాచారం వెళ్లాలని ఆర్డీవోలు, జిల్లా పంచాయతీ అధికారి, డిఆర్‌డిఎ, మెప్మా అధికారులు గ్రామస్థాయిలో పనిచేసే విఆర్వోలు, విఆర్‌ఎలతో పాటు గ్రామైక్య సంఘాలు, స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా ప్రచారం జరిగేవిధంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లో దండోరాలు వేయించాలని స్థానిక లోకల్ టివి ఛానెళ్లలో స్క్రోలింగ్ వేయించాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆయా శాఖ అధికారులను ఆదేశించారు.
విమానాశ్రయ విస్తరణపై సమీక్ష
గన్నవరం విమానాశ్రయం రన్‌వే విస్తరణకు సంబంధించి పనులను వేగంగా చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయం నుండి వివిధ దేశాలకు విమానాల రాకపోకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆర్‌అండ్‌బి, ఎస్‌పిడియల్ ద్వారా చేపట్టవలసిన రోడ్డు, విద్యుత్ పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం అయినందున ఇమ్మిగ్రేషన్ కొరకు కావలసిన టెలిఫోన్ లైన్లను సత్వరం అమర్చాలని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో మాట్లాడారు. గన్నవరం విమానాశ్రయం వద్ద విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతోందని దీనిని వెంటనే సరిచేయాలని ఎస్‌పిడియల్ సూపరింటెండెంట్‌కు సూచించారు.

అపరాధ రుసుము రూ.4.84 లక్షలు వసూలు
* బేస్ కిచెన్, ప్యాంటరీ కార్లలో అధికార్ల ప్రత్యేక తనిఖీలు
విజయవాడ (రైల్వేస్టేషన్): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో కమర్షియల్ అధికారులు ప్యాంటరీ కార్, సెల్, బేస్ కిచెన్‌లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి భారీగా అపరాధ రుసుముని వసూలు చేసినట్లు కమర్షియల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మధ్యకాలంలో రైళ్లలో, ప్లాట్‌ఫాంలపై ఉన్న స్టాల్ నిర్వాహకులపై వస్తున్న పలు ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ షిపాలి ఆధ్వర్యంలో ప్రత్యేక చేపట్టింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో కమర్షియల్ విభాగానికి చెందిన సూపర్‌వైజర్లు, మెడికల్, ఆపరేటింగ్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ మెకానికల్ విభాగాలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. 3వారాల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నామన్నారు. అపరాధ రుసుం కింద 4లక్షల 84 వేల రూపాయలు వసూలు చేశారు. 74 తనిఖీలను వివిధ రూపాలలో చేపట్టినట్లు తెలిపారు. వీటిలో వివిధ రైళ్లలోని 99 ప్యాంటరీ కార్లలో, 12 రైళ్ల వద్ద అమ్మే వారిపైన, వివిధ ప్రాంతాలలో రైల్వేకు చెందిన గుర్తింపు కార్డు లేకుండా తినుబండారాలు అమ్మే వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం కింద 4లక్షల 84 వేల 52 రూపాయలు వసూలు చేయగా మొత్తం 229 తనిఖీలు చేపట్టారని ఒక ప్రకటనలో తెలిపారు.

6నెలల్లో జలవనరుల శాఖ కార్యాలయ భవనాల నిర్మాణం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ: జలవనరుల శాఖ ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్యాలయ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంబంధిత అధికారులకు ఆదేశా లు జారీ చేయడం పట్ల ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక మ్యూజియం రోడ్డులోని జలవనరుల శాఖ ప్రాంగణంలో కార్యాలయ భవనాలు నిర్మించేందుకు గతంలో ప్రతిపాదనలు ఆమోదించినప్పటికీ పనులు చేపట్టంలో జరుగుతున్న జ్యాపాన్ని ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు దేవినేని దృష్టికి తీసుకొచ్చారు. కార్యాలయ ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు అనువైన భవనం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ము ఖ్యంగా ఉద్యోగినుల ఇబ్బందులు చె ప్పనలివి కావని, తాము మరింత సమర్థంగా పనిచేయటానికి సాధ్యమైనంత త్వరలో భవనాలు నిర్మించాలని మంత్రి ని కోరారు. దీనిపై దేవినేని స్పందిస్తూ సాధ్యమైనంత త్వరలో భవన నిర్మాణాలు పూర్తిచేయాలని, నిర్మాణ పనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పనుల్లో జాప్యం లేకుండా శరవేగంగా పూర్తిచేయాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను దేవినేని ఉమ ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు పనులు ప్రారంభించామని అధికారులు తెలిపారు. జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భవన నిర్మాణాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా రానున్న ఆరు నెలల్లో భవనాలు నిర్మించి ఉద్యోగులకు అందుబాటులోకి తేవాలన్నారు. జలవనరుల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి చిరంజీవిరావు, కార్యదర్శి లంకేశ్వరరావు, జివిఎం నాయుడు, సిహెచ్ సాయికిషోర్ పాల్గొన్నారు.

మధురానుభూతుల్ని అందంగా బంధించే కళ ఫొటోగ్రఫీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ: మానవ జీవితంలో ఎన్నో భావాలు, మధురానుభూతులకు సాక్ష్యంగా నిలిచేది ఫొటోగ్రఫీ అని శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్‌లో నిర్వహించిన నేషనల్ ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆయన ఫొటోగ్రాఫర్లతో కలిసి సెల్ఫీ దిగారు. 18వ శతాబ్దంలో ప్రారంభమైన ఫొటోగ్రఫీ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం మేళవింపుతో అధునాతన కెమెరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. 1837లో ఫొటోగ్రఫీ కళను ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ జెఎమ్ డాగ్యూరే, జోషప్ నైస్ ఫొరె ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఫొటోగ్రఫీ ప్రాసెస్ హక్కులను సొంతం చేసుకుని ప్రపంచానికి ఉచితంగా అందించిన రోజును పురస్కరించుకుని ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఫొటో రంగంలో ఫొటోగ్రాఫర్లు అద్భుతమైన ప్రకృతి అందాలు, సోయగాలతో పాటు మానవ జీవితానికి సంబంధించిన మధురానుభూతులను బంధిస్తారని ప్రశంసించారు. ఫొటోగ్రాఫర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫొటోగ్రాఫర్లను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫొటోగ్రాఫర్లలో నైపుణ్యాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించి వారిని సత్కరిస్తోందని కోడెల శివప్రసాదరావు వివరించారు.