హైదరాబాద్

చిరు జల్లులకే రోడ్లు చిత్తడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్: కురుస్తున్న చిరు జల్లులకే రహదార్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. కంకర, మట్టి తేలి గుంతలమయంగా తయారవుతున్నాయి. ప్రధాన రహదార్లతో పాటు గల్లీ రోడ్ల పరిస్థితి బురదతో అధ్వాన్నంగా తయారవుతున్నాయి. దీంతో వచ్చీపోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉప్పల్ పట్టణంలోని వరంగల్ జాతీయ రహదారి మరీ అధ్వాన్నంగా గుంతలమయమైంది. రింగ్‌రోడ్డు నుంచి నల్ల చెరువు పీర్జాదిగూడ చౌరస్తా వరకు గతుకుల రహదారిలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. ఇరుకైన రహదారితో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న వాహనదారులు వర్షం కారణంగా బురదమయంగా తయారై మరీ అవస్థలు పడుతున్నారు. చిల్కానగర్ ప్రధాన రహదారిలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇరువైపులా ఫుట్‌పాత్ కబ్జాలు ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రామంతాపూర్, హబ్సిగూడ ప్రధాన రహదారితో పాటు స్ట్రీట్ నెంబర్ 8లో ఇదే పరిస్థితి నెలకొంది. గల్లీ రహదార్లలో జిహెచ్‌ఎంసి సిబ్బంది ఎప్పటికప్పుడు గుర్తించి మరమ్మతులు చేపడుతున్నారు. జాతీయ రహదారిలో సంబధిత నేషనల్ హైవే విభాగం అధికారులు మరమ్మతులను మరిచిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో గుంతలలో పడి ప్రమాదాల బారినపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పడిన రహదార్లకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ట్రాఫిక్ క్లియర్‌కు పోలీసుల శ్రమ
ట్రాఫిక్‌కు నిలయమైన ఉప్పల్‌లో ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేయడానికి శ్రమిస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ జంగయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలు, సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు రహదార్లలో విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇతర శాఖలు సహకరిస్తే సమస్యను శాశ్వతంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

హెచ్‌సిఎ ఎన్నికలను రద్దుచేయాలి
* మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్
ఖైరతాబాద్: నిబంధనలకు విరుద్ధంగా జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ఎన్నికలను రద్దుచేయాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ డిమాండ్ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఆదరణ కరువైందని వాపోయారు. హైదరాబాద్ క్రికెట్ జట్టు నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఉద్దేశపూర్వకంగా రంజీ ట్రోఫీకి ఎంపిక చేయడం లేదని ఆరోపించారు. ఈ విషయం తనను ఎంతగానో ఆవేదనకు గురిచేసిందని, దీనంతటికీ కారణం హెచ్‌సిఎలోని సభ్యులే కారణమని అన్నారు. లోధా కమిటీ సిఫార్సులకు అనుగుణంగా క్రీడాకారులను ఎంపిక చేసేందుకు ప్రస్తుతం ఉన్న సెలక్షన్ కమిటీకి ఎలాంటి అర్హత లేదని చెప్పారు. వెంటనే ప్రస్తుత కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న కమిటీని అనేక అవినీతి చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. ఎవరినీ నిందించేందుకు తాను ఆరోపణలు చేయడం లేదని, కేవలం ఎంతో ప్రతిష్ట కలిగిన హెచ్‌సిఎకు మచ్చ రాకూడదన్నదే తన తపన అని స్పష్టం చేశారు.

రష్యన్ జానపద కథలు పుస్తకావిష్కరణ
ఖైరతాబాద్: పిల్లలకు అందమైన కథలు అందించేందుకు అనిల్ బత్తుల అనువదించిన ‘రష్యన్ జానపద కథలు’ పుస్తకాన్ని శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఆర్టిస్ట్ మోహన్, చైతన్య పింగళి, కుమార్ కూనపరాజులు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో బాలలకు ఉపయుక్తంగా ఉండే జానపద కథలను అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు.

శాంతియుతంగా పండుగలు జరుపుకోండి
గచ్చిబౌలి: పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని మాదాపూర్ ఎసిపి రమణకుమార్ సూచించారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితిని మండపాల నిర్వాహకులు వివరాలను స్థానిక పోలీసులకు అందించాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా అనుమతి తీసుకునే వారు సైబరాబాద్ వైబ్‌సైట్ సూచించిన నిబంధనల ప్రకారం అనుమతి పొందవచ్చని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ వారి నుండి అనుమంతి తీసుకోవాలని వినాయకుడిని పెట్టే స్థలం ప్రైవేటుదైతే సంబంధిత యజమాని నుండి అనుమతి తీసుకోవాలన్నారు. రహదారి పక్కన మండపాలు ఏర్పాటు చేయకూడదని, వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలని చెప్పారు. మండపాల వద్ద వలంటీర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని.. 24గంటలు ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు. నిమజ్జనం ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకువెళ్తారో వివరంగా తెలియచేయాలని చెప్పారు.

రామమందిర నిర్మాణ వ్యతిరేకులు దేశద్రోహులే..!
* విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి డా. సురేంద్రకుమార్ జైన్
కాచిగూడ: రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ సౌభాగ్యం ఉంటుందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రకుమార్ జైన్ అన్నారు. బజరంగ్‌దళ్ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం బర్కత్‌పురలోని పటేల్ ఘన్‌శ్యామ్ భవన్‌లో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రామానామ జపం ద్వారా దేశాన్ని బలోపేతం చేయాలన్నదే తమ ముఖ్య కర్తవ్యమని అన్నారు. ఆయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని వ్యతిరేకించే వారు దేశద్రోహులు, ఉగ్రవాదులేననీ.. వారు ఉన్నంత వరకు రామమందిర నిర్మాణం జరగదని పేర్కొన్నారు. శ్రీరాముడు రావణుని ఏవిధంగా వధించాడో అదే విధంగా దేశద్రోహులను బజరంగ్‌దళ్ కార్యకర్తలు ఎదుర్కొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, మతమార్పిడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి, హనుమన్ జయంతి, యాత్రలను విజయవంతంగా నిర్వహిస్తూ హిందూ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

ఫొటోగ్రాఫర్లకూ పథకాలు
ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవంలో ఎంపీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: ఫొటో సంభాషణ తెలుపుతుందని తాను చూసిన సన్నివేశాన్ని ఫొటో ద్వారా లోకానికి తెలుపగలిగేవారు ఫొటోగ్రాఫర్లని ఈ ఫొటోగ్రాఫర్లకు జర్నలిస్టులతో సమానంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తామని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటోగ్రాఫర్ల సంఘం తరఫున గత ఐదు రోజులుగా నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌లో గెలుపొందినవారికి కవిత బహుమతి ప్రదానం చేసారు. ఒక సన్నివేశాన్ని ఫొటోగ్రాఫర్ రకరకాలుగా చూపించగలరని రాబోయే బతుకమ్మ ఉత్సవాలకు ఫొటోజర్నలిస్టులకు పోటీని నిర్వహిస్తామని కవిత పేర్కొన్నారు. తొలుత ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల పథకాలను ఫొటోగ్రాఫర్లతోపాటు వీడియో గ్రాఫర్లకు కూడా వర్తింపచేస్తామని అన్నారు. రెండు పేజీల కథనాన్ని ఫొటోగ్రాఫర్ ఒక్క ఫొటోతో తెలపగలడని చెపుతూ జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని ప్రోత్సాహకాలను కలుగచేయడంలో ఆసక్తి చూపుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో గెలుపొందిన ఫొటోగ్రాఫర్లకు బహుమతి ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.