మంచి మాట

సున్నితత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనని తాను ప్రేమించుకోగలిగే వ్యక్తి సమస్త లోకాన్ని నిండు మనసుతో ప్రేమిస్తాడు. దినదినానికి తాను ఎదుగుతూ తనలోని సున్నితత్వాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఎదుటివారి బాధను తన బాధగా భావిస్తూ చేతనైతే చెయ్యగలిగితే వారి బాధను తొలగించే ప్రయత్నం చేస్తాడు. తనకు ఎవరి మూలంగా బాధ కలిగినా ఆ బాధకు నివారణోపాయాలను అనే్వషిస్తాడు తప్ప పరనిందకు పూనుకోడు. సహజంగానే సున్నితత్వం మానవత్వంవైపు, మానవత్వం దైవత్వంవైపు పయనించేలా చేస్తాయి. అవరోధాలు అనివార్యమైనా వాటిని అధిగమించడంలో సున్నిత మనస్కులు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూ జీవితంలో సహనం నేర్పే పాఠాలతో సత్ఫలితాలు సాధించడంలో ముందువరుసలోనే వుంటారు.
మనసనేది మహాగడసరి. అర్థం కాని మాయాజాలంగా గందరగోళంలో ముంచెత్తేదిగా, లిప్తపాటులో ఉన్న స్థితిని తలక్రిందులు చేసే మోసకారిగా, అదుపులో ఉంచుకోగలిగితే లెక్కలేనన్ని ఉపకారాలు చేయగల మహానేర్పరిగాను ఎవరి అనుభవాలు వారు తెలియజేస్తుంటారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన సున్నితత్వం వీడి కఠినంగా వ్యవహరించకపోవడం, నిత్య జీవితంలో అట్టహాసంగా కాక అందరికీ అందుబాటులో వుండాలనుకోవడం, అవహేళన తప్ప మరొకటి తెలియని వారిని సైతం ఆత్మీయంగా పలకరించాలనుకోవడం జీవితంపట్ల సదవగాహన కలిగినవారికి మాత్రమే సాధ్యమవుతుంది.
స్వార్థం, స్వాతిశయం, వంచన, పరనింద నరనరాల్లో జీర్ణించుకున్న వారికి ఎదుటివారి సున్నితత్వం బోధపడదు. త్యాగనిరతి, నిరాడంబరత, ఆత్మీయత, అనుబంధం తాలూకు ఫలితాలెంత అద్భుతంగా ఉంటాయో అనుభవానికి తెచ్చుకునే అవకాశమే వుండదు. ఎంతో చిన్నదనదగిన జీవితాన్ని స్నేహం, సేవ, భక్తి మార్గాల్లో సుసంపన్నం చేసుకునే వారెవరైనా కావలసినంత సున్నితత్వాన్ని పెంచుకుంటున్నవారే. ఎదురయ్యే అవమానాలను, అవాంతరాలను సైతం జీవితంలో ఒక భాగమేననుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నవారే. ఏమి తింటున్నామని కాక ఎలా వుంటున్నామన్న స్పృహతో జీవించగలగాలి. అవసరాలకు అనవసరాలకు మధ్య తేడా తెలుసుకోగలిగితే, విభేదాలకు వివాదాలకు మధ్య వ్యత్యాసాలు అర్థం చేసుకోగలిగితే, పట్టుదలకు, మొండితనానికి మధ్య తేడాలేమిటో తేల్చుకోగలిగితే సున్నితత్వానికి మదిలో సముచిత స్థానమివ్వడం కష్టంతో కూడుకున్నదే తప్ప అసాధ్యం ఎంత మాత్రం కాదు. ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరూ సాధించగలిగేదే తప్ప అందుకోలేనిది కాదు.
జీవితంలో లక్ష్యసాధన స్వాగతించదగిందీ ప్రోత్సహించదగిందీను. పట్టువిడుపులు అనివార్యమైనా సాధింపులు, కక్షపెంచుకోవడాలు సున్నితత్వాన్ని క్రమక్రమంగా దూరం చేసేవే. చనువున్న చోటే దూరానికి సైతం బీజం పడుతుందన్న అనుభవజ్ఞుల జీవితపాఠాన్ని ఎవరు మాత్రం కాదనగలరు? అతి చిన్న విషయాల్లోనూ అనర్థాలకే మూలమవుతుందని గుర్తించి గుర్తుంచుకోదగినది. సున్నిత మనస్కులైనవారిలో ఎదుటివారి పట్ల జాలి పొంగి ప్రవహిస్తుంటుంది. అపాత్రదానం తగదన్న జీవిత సత్యాన్ని ఎవ్వరూ విస్మరించరాదు.
జీవితంలో అనుకున్నది అనుకున్నట్లు జరగదని, జరగకూడదని ఏ దేవుళ్లకు మొక్కినా ఎంతగా మొరపెట్టుకున్నా జరగవలసింది జరిగి తీరుతుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఫలితాల మాటెలా వున్నా, పలువురి ఆలోచనలు ఏ బాటలో పయనిస్తున్నా మన ప్రయత్నంలో ఇంకా చెప్పాలంటే మానవ ప్రయత్నంలో ఏ లోపం ఉండదరాదు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే తీరు ఎంత మాత్రం మంచిది కాదని, తగినంత ముందుచూపు ఎవరికైనా ఎదిగేందుకు పనికొచ్చేదేనని, నిందించే తీరు కాని, నమ్మకద్రోహం కాని అపకీర్తిని గుట్టలు గుట్టలుగా మూట కట్టుకునేందుకు, సున్నిత మనస్కుల్ని అకారణంగా గాయపరిచేందుకు పనికొచ్చేవే తప్ప వ్యక్తి ప్రయోజనానికిగాని సమాజ హితానికి కాని పనికొచ్చే విషయాలు ఎంత మాత్రం కావు, కాబోవు. బలహీనుడిని పీడించడమో, అశక్తుడికి ఆపదలు కలిగించడమో బలం అనిపించుకోదు. పరుల బలహీనతలు సైతం తన బలం కాదని, కాబోదని సున్నితత్వం కలిగిన మనసులకే బోధపడుతుంది.

- కొల్లు రంగారావు