ప్రకాశం

జిల్లా తెలుగుదేశంలో కుమ్ములాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లాలోని తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండూ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు బహిర్గతంగానే కుమ్ములాడుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులను మార్చకపోతే భవిష్యత్తు కష్టమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే రెండు పార్టీలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీలో తలనొప్పులు తయారయ్యాయి. వైకాపాకు చెందిన శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంతో ఆ పార్టీకి కొత్తగా తలనొప్పులు తెచ్చిపెట్టాయనే చెప్పవచ్చు. జిల్లాలోని అద్దంకి, గిద్దలూరు, కందుకూరు, చీరాల, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గతంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉండేది. కాని ఆ నియోజకవర్గాలకు వైకాపాకు చెందిన శాసనసభ్యులు, స్వతంత్ర శాసనసభ్యుడిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవటంతో ఆ నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితి దేవుడెరుగు నేతలు ప్రతిరోజు బహిర్గతంగానే కుమ్ములాడుకుంటున్నారు. తాజాగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పార్టీకి సవాల్‌గా నిలిచారు. అదేవిధంగా అన్నా బాటలోనే మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాత, కొత్త నేతలతో అల్లాడుతోంది. గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, అన్నా రాంబాబుల మధ్య ప్రత్యక్ష యుద్ధమే జరుగుతోంది. దీంతో ఆ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు తెరపైకి వచ్చాయనే చెప్పవచ్చు. కాగా అద్దంకి నియోజకవర్గం పరిస్థితి చెప్పనక్కర్లలేకుండా పోయింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఇన్‌చార్జి కరణం బలరామకృష్ణమూర్తిల మధ్య యుద్ధమే జరుగుతోంది. ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు, నూతనంగా నిర్మించే పనులకు శంకుస్థాపనల సందర్భంగా శిలాఫలకాలను ఏర్పాటు చేయటం, వాటిని తొలగించటం జరిగింది. ఈ నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్‌దే పెత్తనం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పినప్పటికి ఎలాంటి మార్పులు అద్దంకి నియోజకవర్గంలో కనిపించటం లేదు. చీరాల నియోజకవర్గంలోను శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్, ఎంఎల్‌సి పోతుల సునీతల వర్గీయులు బాహాబాహీగానే తలపడుతున్నారు. చీరాల నియోజకవర్గంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పరిస్థితిలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంలోను శాసనసభ్యుడు పోతుల రామారావు, ఇన్‌చార్జి దివి శివరాంల మధ్య పరిస్ధితులు కూడా ఆశాజనకంగా లేవు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు, అక్కడి నాయకుల మధ్య సయోధ్య కూడా తక్కువగానే ఉంది. కాగా ఈ ఐదు నియోజకవర్గాల ప్ర భావం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై చూపుతున్నప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం మిన్నకుండిపోతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఏం ఉండదని ముఖ్యమంత్రికి తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్నప్పటికి ఆయన మాత్రం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా నామినేటెడ్ పదవులు రాక కొంతమంది తెలుగు తమ్ముళ్లు లోలోపల కుమిలిపోతున్నారు. అలాంటివారికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టడటంలో రాష్టప్రార్టీ వౌనంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌మాత్రం తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూనే మరోపక్క జిల్లా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న మెతక వైఖరి కారణంగానే జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు పెట్రేగిపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లాపై ముఖ్యమంత్రి దృష్టి సారించకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాదన ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది.
అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పలు నియోజకవర్గాల్లోను ఇన్‌చార్జిలను మార్చకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలోని కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికి నియోజకవర్గాల ఇన్‌చార్జీల పనితీరు మాత్రం సక్రమంగా లేదన్న వాదన పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. అదేవిధంగా పలు నియోజకవర్గాల్లోని వైకాపా నేతలను కొంతమంది కలుపుకోవడంలోను ఇన్‌చార్జీలు విఫలం చెందుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని మెజార్టీ ఇన్‌చార్జులను మార్చకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో పార్టీ మరింత పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న వాదన ఆ పార్టీ నుంచే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో వైకాపా ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ అనుచరులు సైతం జిల్లాలో పర్యటిస్తూ నియోజకవర్గాల్లో పార్టీని ఏ విధంగా పురోభివృద్ధి బాటలో పయనింపచేయాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా మేధావులు, జర్నలిస్టులతోపాటు పార్టీ ముఖ్య నాయకులతో పికె టీం బృందం చర్చించి వెళ్తోంది. కాగా వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇటీవల కాలంలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు దూసుకెళ్తున్నారు.కాగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాత్రం అనుకున్న స్థాయిలో ఊపందుకోవడం లేదు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి మాత్రం తనకున్న స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. అదే విధంగా భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పులి వెంకటకృష్ణారెడ్డి కూడా జిల్లాలో పార్టీ పురోభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో నిమగ్నమై ఉన్నారు. కాగా సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన నేతలు మాత్రం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మాత్రం పోరుబాట పడుతూనే ఉన్నారు. మొత్తంమీద తెలుగుదేశం, వైకాపా రెండూ సమస్యల్లోనే ఉన్నాయనే చెప్పవచ్చు.