ఖమ్మం

అట్టహాసంగా భద్రాద్రి కళాభారతి నాటకోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఫిబ్రవరి 3: భద్రాద్రి కళాభారతి 14వ అంతరాష్టస్థ్రాయి తెలుగు నాటకోత్సవాలు బుధవారం రాత్రి స్థానిక జూనియర్ కళాశాల క్రీడామైదానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, భద్రాచలం ఫస్ట్‌క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ బుల్లి కృష్ణ, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీసీ పీఎస్‌పీడీ జీఎం విజయసారథి, తాళ్లూరి పంచాక్షరయ్య, తిప్పన సిద్ధులు, తాళ్లపూడి రాము, చల్లగుల్ల నాగేశ్వరరావు, పి.సత్యనారాయణ, ప్రధానార్చకులు పొడిచేటి హరిజగన్నాథచార్యులు, నిర్వాహకులు అల్లం నాగేశ్వరరావు, నర్సింహారావు, పులి రాజారావు తదితరులు ఉత్సవాలను నటరాజ విగ్రహానికి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, జడ్జి బుల్లి కృష్ణలు మాట్లాడుతూ... నాటకోత్సవాల నిర్వహణ యజ్ఞం వంటిదని పేర్కొన్నారు. ఎంతో వ్యయ,ప్రయాసలకోర్చి నిర్వహిస్తున్నందుకు వారు ధన్యులు, అభినందనీయులు అని ప్రశంసించారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ...్భద్రాచలం కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన వాటిల్లో భద్రాద్రి కళాభారతి ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఏటా నాటికలు ప్రదర్శించి భద్రాచలంకు మంచి గుర్తింపు తెస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగులు అల్లం నాగేశ్వరరావు, పులిరాజారావు, నర్సింహారావు, ప్రతాప్‌లను కొనియాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆలోచింప చేసిన ప్రదర్శన
కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. సమాజానికి కుటుంబాలే పునాది. ఆ కుటుంబంలో తండ్రి బాధ్యతగా ఉంటే అందరికీ భద్రత ఉంటుంది. బలహీనతలకు బానిసై బాధ్యతారాహిత్యంగా నడుచుకుంటే కష్టాలకు, ప్రమాదాలకు దారితీస్తుంది. మనిషి అనేవాడు తన బతుకుతూ తన వాళ్లని బతికించాలే తప్ప కేవలం తన స్వార్థం, తన సుఖం చూసుకునేవాడు మనిషి అనిపించుకోడనే దానికి దృశ్యరూపకంగా ‘ఈ లెక్క..ఇంతే’ నాటిక ప్రేక్షకులను ఆలోచింప చేసింది. ఇందులో సత్యంగా మంచాల రమేశ్, రాజ్యంగా జ్యోతి, సుందరంగా సత్యనారాయణ, బుచ్చయ్యగా శివరాంలు చక్కటి అభినయంతో ఆకట్టుకున్నారు. ఈ నాటికకు సంగీతాన్ని కెఎస్‌ఎన్ శర్మ, ఆహార్యం గద్దె ఉదయ్‌కుమార్, రంగాలంకరణ గిరి చేపట్టారు.

జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం/ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 3: జిల్లాను సస్యశ్యామలం చేయటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని, అందుకు అనుగుణంగానే గోదావరి, కృష్ణా జలాలను జిల్లాకు రప్పించి, ప్రతి ఎకరాకు నీరందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం నగరంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వాటిని చూసే అనేక మంది టిఆర్‌ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని వెల్లడించారు. బుధవారం కాంగ్రెస్, సిపిఎం, సిపిఐల నుంచి అనేక మంది టిఆర్‌ఎస్‌లో చేరగా, వారిని ఆహ్వానించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని హితవు పలికారు. అంతకు ముందు ఆయన ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టు లేని భూములన్నింటిని గోదావరి, కృష్ణా జలాలతో ఎత్తిపోతల పథకాల ద్వారా సస్యశ్యామల చేస్తామన్నారు.
మండలంలోని గుర్రాలపాడు వద్ద కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం వెంకటగిరి నుంచి లక్ష్మీపురం వరకు 4.50 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు శంఖుస్థాపన చేశారు. ఆతరువాత సత్యనారాయణపురం వద్ద 63 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కాల్వ పైభాగంలో ఉన్న కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల భూములను ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 3,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇంటింటికీ మంచినీరిచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలలో 20వేల మెగావాట్ల విద్యుత్ అవసరముందని, అందుకోసం ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను కేటాయించినట్టు వెల్లడించారు. జిల్లాలో కొత్తగా మరో 58 విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని, వాటిలో కొన్ని ఇప్పటికే పనులు పూర్తయ్యాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సమస్య ఎంతో తీవ్రంగా ఉందని, సమస్య పరిష్కరించాలని అనేక ఆందోళనలు కూడా చేశామని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసి లక్షలాదిమందికి జీవనోపాధి కల్పించే గ్రానైట్ పరిశ్రమలకు ఊతమివ్వాలని సంకల్పించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్లను విస్తరించేందుకు 1350 కోట్ల నిధులను ప్రభుత్వ కేటాయించినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో బిటి రోడ్లు, మండల కేంద్రాలలో డబుల్ రోడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు మంత్రి చెప్పారు. జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పక్కా భవనం నిర్మిస్తామని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జెడ్పీటిసి భారతి, ఎంపిపి ఎం లలిత, వివిధ శాఖల అధికారులు, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పనులు సత్వరం పూర్తి చేయండి

దుమ్ముగూడెం, ఫిబ్రవరి 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న మిషన్ భగీరథ పనులను సకాలంలో పూర్తి చేయాలని తెలంగాణ సిఎం కార్యాలయపు అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని పర్ణశాల వద్ద నిర్మిస్తున్న వాటర్‌గ్రిడ్ పథకాన్ని ఆమె పరిశీలించారు. తొలుత పర్ణశాల గోదావరి నది ఒడ్డున నిర్మిస్తున్న ఇంటెక్‌వెల్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు తరచూ పనులను పరిశీలించి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో లోపాలను గుర్తించి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు జరిగేలా చూడాలని క్వాలిటీ కంట్రోల్ అధికారి భరత్‌ను ఆదేశించారు. పర్ణశాల వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో 199 గ్రామాలకు మంచినీరు అందుతుందని మిషన్ భగీరథ ఎస్‌సీ చెన్నారెడ్డి ఆమెకు వివరించారు. ఇప్పటికే రూ.1.30 కోట్లు విద్యుత్‌శాఖకు డిపాజిట్ చేశామని వివరించారు. అనంతరం పర్ణశాల క్రాస్‌రోడ్ వద్ద నిర్మిస్తున్న ఓహెచ్‌ఆర్, పంప్ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ఈ పథకం ద్వారా రెండు మండలాలకు అందించాల్సిన మంచినీటి సౌకర్యాల గురించి మ్యాప్ ద్వారా అధికారులు ఆమెకు వివరించారు. సమన్వయంతో అధికారులు పనులను పర్యవేక్షించి సకాలంలో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు, సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, అసిస్టెంట్ కలెక్టర్ ఆలీఫరూకీ, పంచాయితీరాజ్ ఎస్‌ఈ సుధాకర్‌రావు, వాటర్‌గ్రిడ్ ఈఈ రవీందర్, డీఎఫ్‌వో రాంబాబు, తహసిల్దార్ నాగేశ్వరరావు, దుమ్ముగూడెం, చర్ల ఎస్సైలు ప్రసాద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఎండు మిర్చీకి గిరాకీ
12వేలకు చేరిన క్వింటా ధర
ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 3: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఎండు మిర్చికి మంచి గిరాకీ లభిస్తోంది. రోజురోజుకి మిర్చి ధర పెరుగుతుండడంతో జిల్లా రైతుల్లో ఆనందోత్సాహాలు కనబడుతున్నాయి. బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా ఎండు మిర్చి 12వేల రూపాయల ధర పలికింది. జెండాపాట నిర్వహించిన అనంతరం వ్యాపారులు మార్కెట్‌లో పోటీ పడి పాటతో పాటు రైతుల సరుకుకి ధర చెల్లించి కొనుగోళ్ళు చేయడంతో లావాదేవిలు హుషారుగా జరిగాయి. అంతర్జాతీయంగా ఎండు మిర్చికి డిమాండ్ పెరిగిందని, విదేశాల్లో తేజా మిర్చికి గిరాకీ పెరగడంతో మార్కెట్ ధరల్లో తెడాలు వచ్చాయని మార్కెట్ వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ధర ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో
మనమందరం భాగస్వాములమే...
వైరా, ఫిబ్రవరి 3: బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మనమందరం భాగస్వాములమేనని సిఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె స్థానిక రిజర్వాయర్ వద్ద నిర్మాణం జరుగుతున్న వాటర్‌గ్రిడ్ పనులను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె వాటర్‌గ్రిడ్ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను కోరారు.
ఇక్కడ నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఇసుక అంత నాణ్యమైనదిలా లేదని అధికారులపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. వాటర్‌గ్రిడ్ పనులు త్వరితగతిన పూర్తిచేసి తెలంగాణ ప్రజలకు తాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశయమని అన్నారు. అంతేకాదు బంగారు తెలంగాణ ఆశయ సాధనలో ప్రతిఒక్కరు భాగస్వాములం కావాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో ఆమె ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్, ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పిచైర్మన్ జి.కవిత, కలెక్టర్ డి.లోకేశ్‌కుమార్, ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, జడ్పిటీసి బొర్రా ఉమాదేవి, ఎంపిపి బొంతు సమత, సర్పంచ్ బాణోతు వాలీ, తహశీల్దార్ డి.సైదులు, ఎంపిడీఓ జి. మధుసూదన్‌రాజు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పనులు నాణ్యతతో చేయాలి
కొణిజర్ల: వాటర్ గ్రిడ్ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మీతసబర్వాల్ సూచించారు. మండల పరిధిలోని తనికెళ్ళ సమీపంలో నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ పనులను ఆమె పరిశీలించారు. ట్యాంక్, సంప్ పనులను పరిశీలించిన అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ 2019నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయన్నారు. ఫారెస్ట్ సమస్యలు ఏమైనా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎమ్మెల్యే మదన్‌లాల్, ఆర్‌డబ్ల్యుఎస్ చీఫ్ ఇంజనీర్ సురేష్‌కుమార్, ఎస్‌ఈ చిన్నారెడ్డి, తహశీల్దార్ శ్రీలత, సర్పంచ్ వణిత, ఎంపిటిసి గాజుల కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు
* ఎమ్మెల్యే జలగం వెంకటరావు
కొత్తగూడెం, ఫిబ్రవరి 3: ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీకి తరలివస్తున్న యువతకు విస్తృత సేవలు అందించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే జలగం వెంకటరావు కోరారు. తెలంగాణ రాష్టస్థ్రాయిలో కొత్తగూడెంలో రెండవ విడతగా నిర్వహిస్తున్న ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీ ఏర్పాట్లను బుధవారం ఆయన అధికారులతో కలిస సందర్శించారు. మొదట పరుగుపందెం నిర్వహించే ప్రకాశంస్టేడియంను పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీ పూర్తయ్యే వరకు ప్రకాశం స్టేడియంను ఎల్లవేళల పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎల్‌ఐసి గ్రౌండ్ వద్ద ఏర్పాటుచేసిన భోజనశాలను పరిశీలించారు. దేశసేవ కోసం వస్తున్న యువతకు ఉచిత భోజన సదుపాయం కల్పించడంలో ప్రజాప్రతినిధులంతా అంకితభావంతో పనిచేసి యువత మన్ననలు పొందాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలని, ధృవీకరణ పత్రాలను క్షుణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జూనియర్ కళాశాల ప్రాంగణమంతా విద్యుత్‌దీపాల వెలుగులతో నింపాలని, తాగునీరు దుర్వినియోగం కాకుండా మరుగుదొడ్లు సక్రమంగా పనిచేసే విధంగా సిబ్బందిని ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. అర్థరాత్రి 12గంటల నుండి ఆర్మీ ఉద్యోగ ఎంపిక కోసం ఎత్తు, బరువు వంటి కొలతలను ఆర్మీ అధికారులు సేకరిస్తారని, అనంతరం వారికి కేటాయించిన బ్లాకులలో దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ఉంటుందని వివరించారు. గురువారం ఉదయం 5గంటల నుండి దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ప్రారంభవౌతుందని చెప్పారు. పరుగుపందెం, ఫిజికల్‌టెస్ట్, మెడికల్‌టెస్ట్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీ పూర్తయ్యే వరకు ప్రతిఒక్కరు అందుబాటులో ఉండి చిత్తశుద్దితో సేవలు అందించి విజయవంతం చేయాలని కోరారు. ఈసందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆర్మీరిక్రూట్‌మెంట్ విజయవంతానికి అవసరమైన చర్యలన్నింటిని చేపట్టినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పులిగీత, ఆర్డీఓ ఎంవి రవీంద్రనాధ్, డిఎస్పీ సురేందర్‌రావు, 1వటౌన్ సిఐ మడత రమేష్, సింగరేణి ఇఇ అశోక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ తాతారావు, మున్సిపల్ కమీషనర్ షఫీఉల్లా, వివిధ వార్డుల కౌన్సిలర్లు, టిఆర్‌ఎస్ నాయకులు జివికె మనోహర్, కంచర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరేస్తాం
ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 3: నీతివంతమైన పాలనవైపే ఖమ్మం నగర ప్రజలు ఉంటారని వీరి అండతోనే కార్పోరేషన్‌పై ఎర్రజెండా ఎగురుతుందని సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం స్ధానిక సుందరయ్యభవన్‌లో వై విక్రమ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా మాట్లాడారు. ఖమ్మం నగరంలో మున్సిపల్ పాలన ప్రారంభం నుండి చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, అఫ్రోజ్‌సమీనాలు విజయవంతమైన పాలన అందించారని తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటి నుండి కార్పోరేషన్‌గా రూపాంతరం చెందటానికి చిర్రావూరి వేసిన బీజాలే కారణమన్నారు. చిర్రావూరి ఆశయ సాధనకోసం ప్రతి కార్యకర్త పాటుపడాలని పిలుపునాచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్ తన అధికారాన్ని ప్రయోగించి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెగబడిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన హితవుపలికారు. నగరంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ది అంతా సిపియం పాలనలోనే సాధ్యమైందన్నారు. మ్మం నగరంపై పూర్తిస్ధాయి అవగాహన కల్గిన సిపియం పార్టీనే రాబోవు కార్పోరేషన్ ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, యర్రా శ్రీకాంత్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, జిల్లా కమిటి సభ్యులు అఫ్రోజ్ సమీనా, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు యాకయ్య, ఎంఎ ఖయూం, టి ఇవష్ణువర్ధన్, మండల కార్యదర్శులు వాసిరెడ్డి మల్లిఖార్జునరావు, నర్రా రమేష్, ఎంఎ జబ్బార్, మీరా సాహెబ్, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
విద్యార్థులు ఒత్తిళ్ళకు లోనవకుండా చదవాలి
నేలకొండపల్లి, ఫిబ్రవరి 3: విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిళ్ళకు గురి కాకుండా కాలమాన ప్రకారం చదివి సమస్యలను పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంసథ్ భారతదేశ ప్రతినిధి డాక్టర్ ఆర్ సతీష్‌బాబు, కూసుమంచి సిఐ కిరణ్‌కుమార్ అన్నారు. నేలకొండపల్లి సమీపంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నీతోడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆత్మహత్యలు-పరీక్షల సమయం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఒత్తిళ్ళు ఒక స్థాయికి మాత్రమే ఉండాలని, దాని వల్ల పెర్ఫామెన్స్ లెవల్స్ పడిపోతాయన్నారు. దేశంలో ఆత్మహత్యలకు కారణాలు సాంఘిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఆనారోగ్యం, అనుకోని సంఘటనలు అని వారన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు కాలమాన టేబుల్‌ను ఏర్పాటు చేసుకొని ఒత్తిళ్ళు లేకుండా చదువుకోవాలని, దీంతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటి అధ్యక్షుడు నందిగామ మనోహర్, నేలకొండపల్లి ఎంపిపి నందిగామ కవితరాణి, పాఠశాల ప్రిన్సిపాల్ కోనేరు వెంకటపద్మ, వైస్ ప్రిన్సిపాల్ శైలజ, స్పోకెన్ ఇంగ్లీష్ నిర్వాహకులు భాస్కర్, సొసైటి సభ్యులు, ప్రతినిధులు మహేష్, రాము, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎఐబిఇఎ కేంద్ర కమిటీ
సభ్యుడిగా కనకం
ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 3: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్(ఎఐబిఇఎ) కేంద్ర కమిటీ సభ్యుడిగా కనకం జనార్దన్‌రావును ఎంపిక చేసినట్లు అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రాజన్, నాగుర్‌లు బుధవారం ప్రకటించారు. తెలంగాణ కోఅపరెటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కనకంను కేంద్ర కమిటీలోకి తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. సంఘంలో ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై నిత్యం పోరాడుతున్న కనకంను కేంద్ర కమిటీలోకి తీసుకోవడంతో జిల్లా ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.