నెల్లూరు

భాషా బోషాణం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉచ్ఛారణకై నాలుక పదాలను తడిమినప్పుడు
ఆప్యాయంగా మనసుల్ని అల్లుకుని
షడ్రషోపేతమైన కడుపునింపే భాష!
‘అమ్మా’ అన్న పిలుపులోనే మమకారం
ఒలకబోయు తల్లిభాష!
చందమామనైన అందమైన వరుసగా మార్చి
దగ్గరచేసి
తెలుగు గుండెల్లో వెనె్నల్ని పూయించు భాష
రాజుల హృదయాల్ని కవితా సౌరభాలతో తాకి
కవి గాయకులతో అష్టదిగ్గజమై అలరారిన భాష!
అక్షరాలతో ఆటలాడుకునే వీలున్న
వీనులవిందైన భాష!
కమ్మగా పలికితేనే
గొంతులో గంధర్వరాగాలు ఆవిష్కరించి
పాటలపల్లకిపై రంజింపజేయు రమణీయ భాష!
మృదువుగా అన్నా కటువుగా అన్నా
గొంతులోని భావాల్ని సమర్థవంతంగా
తెలుపు భాష!
వర్ణనలోనైనా భావుకతలోనైనా
తనదైన చోటు కలిగున్న భాష!
చదువుకున్న నాగరికుడైనా
విద్యనేర్వని పామరుడైనా
నాజూకుగా పలికినా మాండలికాన పలికినా
మధుర తరంగమై మైమరింపజేయు
మన్మధబాణమీ భాష!
ఎన్నో సంధి సమాసాలు విభక్తులు
వ్యాకరణాలు అలంకారములతో మధింపబడి
అనునిత్యమూ స్వచ్ఛమైన నవనీతంలా ఊరిస్తూ
అచ్చమైన పదహారణాల పడుచుపిల్లలా
హొయలొలుకుతూ
ఎదిగిన ఆణిముత్యాల భాష!
పూర్వీకులు భావితరాలకై కనిపెట్టి
నశించకుండా కాపాడి విశ్రమించకుండా
సముద్ధరించి ఆస్తిగా నెంచి పోషించగా
భావితరాల చేతికి
తేటతేనెల భాషా బోషాణమై దొరికి
పులకించే పెదవులపై మేలిమి బంగారాలద్దిన భాష! మన ఈ తెలుగుభాష!
మనదై వనె్న తగ్గకనెపుడు వెలుగుభాష!!
- డేగల అనితాసూరి
చరవాణి : 9247500819

పైసా
డబ్బుల్లేకుండా బతకడమెలాగ
డబ్బు లేనప్పుడు
ఎండిపోయిన ఇంద్రధనస్సులా
వుంటుంది బతుకు
ఒక నిండు జీవితాన్ని నిర్మించుకోవడానికి
వైద్యశాలలో తెగిపడుతున్న శ్వాసల్ని
మరలా అతికించుకోవడానికి
బతకడానికి అనుభవం లేకున్నా
ధైర్యంగా బతికిపోవడానికి డబ్బుకావాలి
మెలకువతో బతుకు కరచాలనం చేయగానే
అందరికీ డబ్బు గురించి శోధన మొదలవుతుంది
పాల ప్యాకెట్టుతో మొదలై
చివరికంతా మరణించారని
తెలుసుకున్నాక కూడా
డబ్బు అవసరం వెంటాడుతూనే వుంటుంది

డబ్బు గురించిన సంభాషణలు
నవ్వుతూ మొదలైపోయాక
డబ్బవసరముందని తెలపాల్సి వస్తే
ఒక నిస్సహాయ ఆత్మ విషాదాన్ని ప్రకటిస్తుంది
మూడున్నర నిమిషాల ప్రేమని
డబ్బు పెట్టి కొనుక్కున్నాక
మట్టి పూతల్ని రాల్చుకున్న ముఖాలు
లాంతర్ల వెలుగుల మధ్య
అద్భుతంగా వేదాంతిస్తూ పోతాయి
కూలిన రాత్రుళ్లనీ
చెరిగిపోయిన పగళ్లనీ
డబ్బుతో నిర్మించలేమేమో గానీ
మనం వెతుక్కుంటున్న ప్రపంచాన్ని
మనదిగా చేసుకోవడానికి డబ్బుకావాలి

డబ్బుతో కవిత్వం నిర్మించలేమేమో గానీ
కవిత్వాన్ని అక్షరంగా మల్చి
పుస్తకంగా ఆవిష్కరించడానికి డబ్బుకావాలి
డబ్బుల్లేకుండా బతకడమెలాగ?
ఆకలిదప్పికలు లేని వాళ్లెవరయినా ఉంటే
వాళ్లు డబ్బుల్లేకుండా బతికిపోతారు
పోనీ
డబ్బుల్లేకుండా బతికిపోవడమెలాగో
మీకు తెల్సా?
- ఎస్‌కె.ఖాదర్‌షరీఫ్
చరవాణి : 9441938140

జాతికి జోతలు (కవిత)
జాతికి జోతలు పెడదాం
విజ్ఞాన జ్యోతులు వెలిగిద్దాం...
పౌరుల్లో దేశభక్తి నింపుదాం
శ్రీరాముడేలిన కర్మభూమి మనదని
ఎలుగెత్తి చాటుదాం
వేదాలు, రామాయణాది ఇతిహాస గ్రంథాలతో సరితూగగల గ్రంథం ఇంకోటి లేదని
ప్రపంచానికి తెలియజేద్దాం
తొలినాళ్లలో అశోకుడు, వౌర్యుడు శాతకర్ణి ప్రభువుల సుభిక్ష పాలనకు జేకొడదాం
ప్రాచీన కాలంనుంచి విచ్ఛిన్నం కాని
వివాహ వ్యవస్థ మాదే నని సగర్వంగా చాటి చెపుదాం
కుయుక్తితో భరతావనిని ఆక్రమించిన తెల్లదొరలను ఎదుర్కొన్న భరతవీరులను అభినందిద్దాం
కుయుక్తితో అఖండ భారతావనిపై జెండా పాతిన
ఆంగ్లేయుడిని తరిమికొట్టిన పటేల్, గోఖలే, బోస్, తిలక్‌ను పోరాట పటిమను స్మరిద్దాం
భరతమాత సంకెళ్లను తెంచాలని భావించిన భరతవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుందాం
సహనానికి పేటెంట్ హక్కు భారతీయులదని నలుదిశలా చాటుదాం
అహింసా విధానంతో భరత మాత దాస్య శృంఖలాలు తెంచిన బాపూజీ మాకు దైవసమానుడని అందాం
మన జోలికొస్తే శత్రువుకు కార్గిల్ తరహా
పోరాటాలు రుచిచూపిద్దాం
స్వతంత్ర పోరాట గాథలను
మన పిల్లలకు కథలుగా అందిద్దాం
స్వతంత్ర ఫలాలను
భావి భారత వారసులకు అందిద్దాం
కరెన్సీపై రెపరెపలాడే
బోసి నవ్వుల గాంధీని చూసి మురిసిపోదాం
మువ్వనె్నల జెండాను రూపొందించిన
పింగళికి నమస్కరిద్దాం
కాశ్మీర్ మాదేనని ప్రపంచానికి చాటిచెపుదాం
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగు దేశాలకు సింహస్వప్నమవుదాం
ఇస్రో విజయాలను మచ్చుకు చూపుతూ ఏరంగంలోనైనా ఎవరికీ తీసిపోమని ఛాలెంజ్ చేద్దాం
ఉగ్ర మూకలు విరుచుకుపడినా ధీరత్వంతో భారతావనికి కాపలాకాసే సైనికుడి తెగువకు వందనాలర్పింద్దాం
దేశాభివృద్ధికి సహకరిద్దామని ముందుకొచ్చిన విదేశీయులకు స్నేహ హస్తం అందిద్దాం
అఖండ భారతావనికి ఏమీ కానివ్వబోమని
ప్రతిన పూనుదాం
జాతి జెండాకు వందనం చేద్దాం
భరత జాతి మువ్వనె్నల జెండాకు
వందనం చేద్దాం
గౌతమి, 9347109377

మాతృభాషకు వందనం
తరతరాల సంస్కృతిలో
తలదించని ఖ్యాతి మనది
నరనరాల - మాతృప్రేమ
ప్రవహించే - జాతి మనది
నా తెలుగుభాష ఒక
అమృత జలపాతం
వసంత పరిమళ సౌరభం
ఆచంద్రతారార్కం
అమ్మపాల తీయదనం
తెలుగుభాష కమ్మదనం
మరువలేము - మనమందరం
కడలి అంచులు దాటి
ఎద లోతులు మీటి
పలుదిశల గొంతుకల
పలికింది తెలుగు
మధుర, మధురమైన
మన భాష కంటెను
చక్కనైన భాష - జగతి లేదు
తెలుగుభాష.. భరతమాత - వెన్నుపూస
నాగరికత.. తలకట్టు - తెలుగుభాష
జాతి మెలితిప్పిన మీసకట్టు నా మాతృభాష
అలాంటి - తెలుగుతల్లికి సమర్పిస్తున్నాం
వందనాల హారతులతో మల్లెపూదండ
- కొడవలూరు ప్రసాదరావు
చరవాణి : 8500757622