రాజమండ్రి

దూరం?.. దూరం! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును ఆమె దూరమవుతుంది. ఎంతంటే ఏంచెప్పాలి? కనబడే సముద్రం ముందే ఉంటుంది. అద్దరిలో ఆకాశం కలిసిన చోటంత ఆమె నాకు దూరమవుతుంది. ఈ దూరం తట్టుకోలేక పోతున్నాను. స్వచ్ఛమైన ఆ కళ్లల్లో ప్రేమని చూసి ఎన్నాళ్లయ్యిందో.. మేము ప్రేమించుకున్నప్పుడు ‘ఐ లవ్ యు! చెప్పుకోలేదు. అయినా ప్రేమగానే ఉన్నాం. ఐ కాంట్ స్టే వితవుట్ యు! అనుకోలేదు. అయినా ఒకరిని విడిచి ఒకరం ఉండలేక పోయేవాళ్లం. ‘ఈ మొద్దు మోము చూస్తేనే పొద్దు పొడిచేది’ అని భార్యాబిడ్డలు చిత్రంలో పాటలా సాగేది మా జీవితం. అదిగో వస్తుంది విభావసి!... వాళ్ల నాన్న తెలుగు పండితులు. మను చరిత్రలో స్వరోచి భార్యలలో ఒక భార్య పేరు పెట్టాడు.
ఏమండి! టిఫిన్ చేశారా! అందులో ప్రేమ లేదు. యాంత్రికత ఉంది. అసలు ఏమండి! అని ఈమధ్యే అంటుంది. తనను పేరు పెట్టి పిలిచేది త్రిగుణ్ అని.. కానీ కారణం తెలియదు. ఆ పేరు అప్పుడు ఎంత మధురంగా ఉండేదో...
అక్కడికీ ఓసారి అడిగాడు ఎందుకలా పిలుస్తున్నావని.. ఇద్దరి మధ్య మాట్లాడాల్సిన విషయం.. అమ్మని, వదెనను పిలిచి - ‘చూడండి ఆయన ప్రతిదీ ఎలా తప్పుగా తీసుకుంటున్నారో’ అనేసింది. తను మళ్లీ కిక్కురుమనలేదు... దూరం.. దూరం.. ఒక్కొక్కటీ ఇద్దరి మధ్య గోడ కట్టే సంఘటనలు.
‘విభా! ఏదైనా సినిమాకి వెళదామా?’
‘లేదు, డియర్. రేపు డబ్బులు వచ్చే ఒక టెండర్ ఉంది. ప్లీజ్! ఎంతో గోముగా చెప్తోంది. మళ్లీ వారం వెళదాం ఓకేనా! నుదుటిపై ముద్దు పెట్టింది. ఛీ! ఛీ! ఎంతసహ్యంగా ఉందీ ముద్దు... రేపు షాపింగ్‌కి వెళదామా! నీకిష్టమైన చీర, నాకిష్టమైన బట్టలు, మన మేరేజ్‌డే దగ్గరకొస్తుంది గదా!
‘మేరేజ్ డేనా! ఎప్పుడు? అని నాలుక కరచుకుంది విభావసి!’
బాణం ఈసారి దూరం కాదు, మేరేజ్‌డే గుర్తుంచుకోలేని భార్యని, భర్తని క్షమించకూడదు. అసలు వైవాహిక బంధం ఎంత పలుచనైంది. మళ్లీ దూరం.. దూరం.. అవును డబ్బు.. ఈ డబ్బు జీవితాలని శాసిస్తుంది. జ్వరంతో ఉన్న కొడుకు పక్కన లేకుండా చేస్తుంది. భార్య పక్కన భర్తని, భర్త పక్కన భార్యని లేకుండా చేస్తుంది. ముఖ్యాతిముఖ్యమైన ఘడియలను సైతం ఆవిరి జేసే శక్తి ఈ డబ్బుకి మాత్రమే ఉంది... ముందు భార్యపైన కోపం.. తరువాత జాలి... కోపం వచ్చిందేమిటి? అంటే ఇంకా తన భార్యపై తనకి ప్రేముందా! ఇద్దరి మధ్య విడిపోయేంత గొడవలు లేవు.. కారణాలు కూడా చూపించలేం... కలిసుండేంత సఖ్యత లేదు... కాని తెలుస్తుంది చూపుల్లో మనసుల్లో మమతల్లో దూరం. !ఏంటి డియర్! పెళ్లి రోజు గుర్తు లేదనా? సారీ!
‘ఈమె మాట్లాడకుండా ఉంటే ఎంత బాగుణ్ణు. తనికి ఈమె ఏమవుతుంది? ఛ..్ఛ! ఇంత విపరీతంగా ఆలోచిస్తున్నాడేంటి?..
‘నేను వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త!’ కారెక్కి వెళ్లిపోయింది విభా.
తను ఖాళీగా ఉన్నాడా! లేదు. లెక్చరర్‌గా పాఠాలు చెబుతూ బిజీ బిజీగా ఉన్నాడు. కొన్ని క్షణాలు కూడా ఎందుకు తన భార్య తనకి దగ్గరవడం లేదు. ఇక పిల్లలు ఏమైనా కథలు, బుక్స్ చదవండిరా అంటే.. బాబోయ్ ఎందుకు డాడీ! మీరు చదవినవన్నీ మేం చదవాలని రూలా? పోండి డాడీ! అంటూ సెల్‌ఫోన్‌తో ఆడుతూ కనబడతారు. విలువలు తెలియవు. ఆమధ్య అమ్మ ఇంటికొస్తే రెండవ వాడు ముసలిదానా! అని సినిమా ప్రభావంతో అన్నందుకు అమ్మ ఇంటికి రావడమే మానేసింది. తరువాత తను సారీ! చెప్పిండు. అప్పటి నుండి వాడి మనసంతా ద్వేషం. వాడిని తన రూట్‌లోకి తెచ్చుకోడానికి ఎన్ని గిఫ్టులివ్వాల్సి వచ్చిందో.
ఆలోచిస్తూ చీకటిపడటం కూడా గమనించలేదు. ఇంత ఒంటరితనం ఎప్పుడూ అనిపించలేదు. కూతురు, కొడుకు, భార్య ఎవరి పనుల్లో వాళ్లు బిజీ. పెళ్లయిన తరువాత ఉన్న వెనె్నల రాత్రులు, మల్లెపూలు, ప్రేమ సంభాషణలు ఏవీ లేవు. అప్పుడు డబ్బుండేది కాదు, ప్రేముండేది. ఇప్పుడు డబ్బు.. ఇంటి నిండా నౌకర్లు. కాని మనసులో దూరం. మనిషికి మనిషికి మధ్య దూరం.. ఏం చేయాలి... తనని బిజినెస్ మానమని చెప్పలేడు. లక్షల టర్నోవర్.. అలా అనేకన్నా విభా! తను చెప్పినా మానదని ఖచ్ఛితంగా తెలుసు. అవును పిల్లలు కుల గోత్రాలు చూడకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ రోజుల్లో కులాలేంటి? మొదట కులాలేం లేవు. ఇవన్నీ మనం సృష్టించుకున్నవేనని చెప్పుకుంటూ ఇష్టం లేకపోయినా తమ పిల్లలకు పెద్దరికం వహించి పెళ్లి చేసే తల్లిదండ్రుల్లా.. తను ఆమెను ఈ వ్యాపార రంగం నుండి బయటకు తేలేనని తెలుసు. అందుకే ముందు ఈ ఒంటరితనం పారద్రోలాలి. తమ్ముడింటికి వెళ్లాలి. ఈ వేసవి సెలవులు వాడి దగ్గర గడపాలి. ముఖ్యంగా అక్కడ అమ్ముంటుంది. గౌరవంగా చూసే తమ్ముడి పిల్లలు.. సెలవులివ్వగానే సఖినేటిపల్లి బయలుదేరాడు.
‘బామ్మగారు! బస్సు దిగగానే పెద్ద నాన్న వచ్చేశారని తెలిసింది. మేం పరిగెత్తుకుంటూ తీసుకొచ్చేశాం’ గీత, రవి చప్పట్లు కొడుతూ అమ్మతో చెబుతున్నారు. బస్సు ఆగేచోటుకి ఇల్లు దగ్గర.
‘మరి కాళ్లకి నీళ్లిచ్చారా?’ రాధమ్మ గారు అడుగుతుంది.
‘ఓ! నేను చిన్న బక్కెట్టుతో దోసకాయ చెంబుతో నీళ్లిచ్చా’ అన్నది గీత.
‘పెద్దనాన్నా! ఎప్పుడు బయలుదేరారు. అమ్మ కొబ్బరి నీళ్లు కొట్టించి ఫ్రిజ్‌లో పెట్టింది. త్రాగండి ప్లీజ్!’
‘తన పెంపకానికి, వీళ్ల పెంపకానికి తేడా! ఎంత ఉంది. పెద్ద వాళ్లు లేకపోయినా పిల్లలే సగం మర్యాద చేసేలా ఉన్నారు.
‘బావగారూ! ఎప్పుడు బయలుదేరారండి? అక్కా, పిల్లలు బాగున్నారా?’ మరదలు పరిమళ పలకరింపులో ఆత్మీయత ధ్వనిస్తోంది.
‘బాగున్నారమ్మా! నీ ఆరోగ్యం ఎలా ఉంది?
‘మీ తమ్ముడి గారి దయవల్ల బాగానే ఉంది బావగారూ! అత్తయ్య, ఆయన నన్నింకా పేషెంటులానే చూస్తున్నారు పనేం చేయనివ్వకుండా!’
మేం చెయ్యనివ్వకపోతే మాత్రం నువ్వెక్కడూరుకుంటావ్. చేసే తీరుతున్నావు గదా!
‘అదేంటత్తయ్యా! అమ్మలాంటి మీరు పనిచేస్తుంటే కూర్చుని తిననా! చూసిన వాళ్లు నవ్విపోరూ!’
‘మనం మనకోసం బ్రతకాలి గాని, వీళ్లకోసం.. వాళ్లకోసం కాదు. ఆ ముఖం చూడు జాడు చిప్పలా ఉంది.
‘మీరు మాత్రం బలంగా ఉన్నారేంటి?
‘నాన్నమ్మా! ఇదిగో ప్లేట్‌లో తేగల పౌడర్ తెచ్చి ఇచ్చాడు రవి.
!ఏంటమ్మా అది!’
‘తేగలు నీకు నలగవు కదా! అందుకే మిక్సీ ఆడి తెచ్చాను. మేమందరం తిని నీవు తినకపోతే బాగోదని మా అమ్మ చెప్పింది.’
‘నాన్నమ్మ నీకు తర్బూజా జ్యూస్ కూడా అమ్మచేసి పెట్టింది తెలుసా?! అంది గీత
‘నాన్నమ్మ సాయంత్రం నన్ను గుడిలో భజనకి తీసుకెళ్లాలి. నిద్ర లేపుతావు గదా! అన్నాడు రవి.
‘ఏం హరికథ చిన్నా‘ అన్నాడు త్రిగుణ్
‘్భక్త ప్రహ్లాద! నాన్నమ్మ చెబితే ఎంత బాగుందని పెద్దనాన్న గారూ! మీరు వస్తారా!’
‘తప్పకుండా’ అని బుగ్గలు పుణికాడు
‘నేను చందమామలో కథలు చదివి మీకు చెప్పనా పెద్దనాన్నగారూ! రెక్కల గుర్రం కథ ఎంత బాగుంటుందని!...’
‘నువ్వు కుమారి శతకంలో రోజుకోపద్యం అప్పజెప్పు. అప్పుడు తీసుకెళతాం.’
‘పెద్ద నాన్న గారూ! నాకు వేమన శతకం మొత్తం వచ్చింది తెలుసా! ప్రతి వేసవికీ ఒక్కో శతకం నాన్నమ్మ చదివిస్తుంది అన్నది గీత.
‘తనకు బాగా అర్థమయ్యింది. తనింట్లో లేలిది, ఈ ఇంట్లో ఉన్నది. ఇక్కడ డబ్బులేదు. ఒకరిపై ఒకరు విసుక్కున్నా మమకారం.
‘నువ్వు మరీ బుద్ధిలేకుండా ప్రవర్తిస్తున్నావు’ అమ్మ మరదలను కసురుతుంది!
‘అమ్మా తిడుతున్నావేంటి? అన్నాడు.
‘చూడరా! ఎంత వీక్‌గా ఉందో. గడ్డ పెరుగు, నెయ్యి అన్నీ నాకు, వాడికి, పిల్లలకి వేసిపెట్టి తనేం తినకుండా ఉంటుంది. చెప్పరా నీవైనా దీనికి బుద్ధి’
‘అయ్యో బావగారూ! అదేం లేదు. అత్తయ్యకు బలహీనంగా ఉన్నారని వేశాను. పిల్లలకు ఘృతేనా వర్ధతే బుద్ధి’ అని ఆవిడే పాఠాలు చెప్పారు గదా! చదువు బాగా వస్తుందని వాళ్లకు వేశాను. ఒక్కరోజు వేసుకోకపోతే ఇలా పేపర్లో వేస్తున్నారత్తయ్య!
ఒకరిపై ఒకరికి ఎంత ఆప్యాయతలు. అత్తగారు కష్టపడకూడదని కోడలు - కోడలు చిక్కిపోతుందని అత్తగారూ!, భార్యని గుర్తు పెట్టుకుని మల్లెపూలు తెచ్చే తన తమ్ముడు. ఆ రోజు వాళ్ల పెళ్లి రోజు. సున్నుండలు చేసింది మరదలు. పాయసం వండింది. ఏదో బంగారు షాపులో నెలకి ఓ వెయ్యి కట్టిందట. తమ్ముడికి ఉంగరం గిఫ్టుగా ఇచ్చింది సర్‌ప్రైజ్. వాడు ఇంత సంసారం మోస్తూ భార్యకు చైన్ తెచ్చాడు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో మావాళ్లు చెయిన్ చేయించలేదన్నదట. అది మూడు సంవత్సరాలు పట్టింది. వాడికి ఆ కోరిక తీర్చడానికి. త్రిగుణ్‌కి తమ్ముడు వరుణ్. అతని భార్య అన్యోన్యం ఎంతగానో నచ్చింది. వారి మనసులు ఎంత దగ్గరగా ఉన్నాయి. అమ్మ అంటోంది.
‘కోడల్నిమ్మంటే కూతుర్నిచాడు ఆ భగవంతుడు. శతకోటి నమస్కారాలు తండ్రి’
అమ్మ తనింట్లో ఇంత ఆనందంగా గౌరవంగా ఎప్పుడూ లేదు. బయలుదేరతానమ్మ అన్నాడు త్రిగుణ్
రెండు రోజులుండండి బావగారూ. సెలవు లేగా.
అమ్మకంటే తమ్ముడికంటే ముందే రియాక్ట్ అయిన మరదలు సంస్కారం అతని మనసు నిండా హాయి నింపింది.
‘మళ్లీ వస్తానమ్మా!’ త్రిగుణ్
ఈసారి అక్కని, పిల్లల్ని తీసుకురావాలి!
ఈ రెండు రోజులూ త్రిగుణ్ కనబడక విభావసికి పిచ్చెక్కిపోయింది. తను ఎండమావుల వెంట పరుగెడుతుంది. అతనికి ప్రేమ పలుకుల ద్వారా ఇచ్చేశాననుకుంటుంది. తనను విడిచి ఒక్క రోజు కూడా ఉండలేని అతను ఎక్కడో తమ్ముడి దగ్గరికి వెళ్లి ఉన్నాడంటేనే తమ మధ్య దూరం ఎంత పెరిగిందో తెలుస్తుంది. తన పిల్లలు ఎంత క్రమశిక్షణా రాహిత్యంతో పెరుగుతున్నారో త్రిగుణ్ అమ్మగారిని పిల్లలు ముసలిదానా! అన్నప్పుడు అతని కళ్లల్లో నిండిన నీళ్లే చెబుతున్నాయి. ఇక కచ్ఛితంగా భర్తని జాగ్రత్తగా చూసుకోవాలి. ముందు పదిరోజులు టిక్కెట్స్ ఎక్కడికన్నా వెళ్లి రావడానికి బుక్ చెయ్యాలి. మేనేజర్‌కి చెప్పింది. ఈ పది రోజులూ ఆయనే్న చూసుకోవాలని...’
గేటు తెరచుకుని వస్తున్న త్రిగుణ్‌కి ఇంట్లో నుండి ఘుమఘుమలు.. నోరూరించాయి.
‘త్రిగుణ్ కాళ్లు కడుక్కునిరా. వడ్డిస్తాను’ అనే అమృతపు పలకరింపు దూరాన్ని ఐస్‌క్రీమ్‌లా కరిగించి పారిపోయేలా చేసింది.
‘ఏమిటీ స్పెషల్!’ ఆశ్చర్యంగా అడిగాడు త్రిగుణ్
జ్ఞానోదయమని మంచి స్పెషల్ వడ్డిస్తూ చెప్పింది.
తనకిష్టమైన పనస పొట్టుకూర ఆవ పెట్టి వండింది. కొబ్బరి, మామిడికాయ పచ్చడి, పులిహోర, పూర్ణాలనబడే బూరెలు, పచ్చి శనగపప్పు, గోంగూర, కాకరకాయ ఫ్రై, సగ్గుబియ్యం పాయసం, వామ్మోవ్ భరించలేక పోతున్నాను. నీ ప్రేమని’ అన్నాడు త్రిగుణ్
తిన్నాక.. ఊటీ వెళ్లడానికి బుక్ చేశాను టిక్కెట్లు.
ప్రేమయాత్రలకు బృందావనం నందన వనమూ ఏలనో, సఖినెటి చూపుల చల్లదనంలో జగమునే ఊటి చేయగా అవును. ఈ శుభ సమయంలో నీకో గిఫ్టు తెస్తానుండు అని బయటకు వెళ్లి రెండు మూరల మల్లెపూల దండ తెచ్చాడు. ఆ వాలు జడలో స్వయంగా తురిమాడు. చెవి దగ్గర గుసగుసగా, నా ప్రేమ నాకు తిరిగొచ్చింది విభా.. అన్నాడు. చిన్నగా మురిపెంగా నవ్వింది విభా..

- సుధాశశిరేఖ సెల్: 9441599321