సాహితి

బీద బతుకులలోనూ అవినీతి - ధనదాహం (శ్రీ విరించీయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొండ మీంచి చిన్న బండరాయి పట్టు తప్పి జారిపడింది. ఇసక్కొడి రాయి. గురిపెట్టి రామిగాడి నెత్తిమీద పడ్డది. బండ ముక్కచెక్కలయిపోయింది. రామిగాడి బుర్రా ముక్క ముక్కలయిపోయింది. ఠారుని చచ్చి కూలిపోయాడు. వాడి పుణికెలోంచి కొబ్బరి పువ్వులాగా మెదడు బైటికి వచ్చేసింది. మోచెయ్యి తెగిపోయి రెండు గజాల అవతల ఎగిరిపడ్డది. తెల్లగా రెండెముకలు బైటికొచ్చి వాటి చివర ఐదు వేళ్లతో చెయ్యిలాగే వుంది..’ - చావును ఇంత వివరంగా రాయడం ఎంతో పరిశీలనాత్మకత, దారుణాన్ని గురించి చదువరి మనసులో గొప్ప సానుభూతి తీసుకురావాలనే దృష్టిలేని రచయిత చేయలేడు. చాగంటి సోమయాజులు (చాసో అనే పేరుతో ప్రఖ్యాతి పొందిన విజయనగరం గంట స్తంభం దగ్గర పొడుగాటి చుట్ట తాగుతూ నిలబడే ఆయన) వ్రాసిన ‘బండపాటు’ కథలో రుూ వర్ణన. తోటి కార్మికుల స్పందన స్పష్టంగా కనిపించి, బీద బతుకులలో కూడా ‘అవినీతి’ (వాళ్లు దానిని వేరే పేరుతో పిలువవచ్చునుగాక), మానవ సహజమయిన ధనదాహం వుంటుందని చెప్పే గొప్ప కథ.
బండరాయి నెత్తిమీదపడి రాముడు చచ్చిపోతే, వాడి పెళ్లాం ‘నానే సెర్లో పడాలి దేముడో’ అని ఏడుస్తూ వుంటుంది. మేస్ర్తి సత్యం అనేవాడు కంట్రాక్టర్‌తో మాట్లాడి కొంత డబ్బు పరిహారంగా తీసుకున్నాడు. రాముడి భార్యతో మాత్రం ‘్భద్రంగా వుండు పార్వతీ! ఏడవకు తల్లీ’ అంటూ జాగ్రత్త చెబుతాడు. అంతకుముందే గుడిసెలోకి తీసుకువెళ్లి ఆమెకు మూడు వందల రూపాయలు- మూడంటే మూడు నోట్లు కొంగుకి గట్టిగా ముడివేయించి, బొడ్డులో దోపించాడు. ఇటువంటి చావుకు ఇంతకుపూర్వం వున్న పరిహారం రేటు యాభయి రూపాయిలే గనుక, రుూ మూడు వందలు గొప్ప విలువగా కనిపిస్తుంది ఇతర పనివాళ్లకు. కనకమ్మ అనే తోటి కూలీ మరో మొగుడ్ని ‘అదే కట్టుకుంటుంది. సచ్చినాడుగాక దానికి మరో మొగుడు ఉండనే ఉన్నాడు’ అంటుంది. శవం ఒక పక్కన సాగనంపుతూ వుండగానే, ఈ కనకమ్మ మొగుడు చనిపోయినాక, యిద్దరు పిల్లల్నీ తల్లికి అప్పజెప్పి మారు మనువు చేసుకుంది.
పనివాళ్లందరూ రోజంతా తప్పతాగుతూ పనులు మానుకున్నారు. ఈ తాగుడుకు డబ్బు కూడా కంట్రాక్టర్ దగ్గర మేస్ర్తి కొంత దౌర్జన్యం చేసి సంపాదించిందే. రాముడి తల్లి కూడా డబ్బుకోసం ఇక్కడికి వచ్చి చేరుతుంది. మేస్ర్తి సత్యం ఆమెకు ‘నెత్తికి చేతులే’ అని జవాబు చెపుతాడు సమర్థవంతంగా.
కనకమ్మ సానుభూతి వాక్యాలన్నీ మేస్ర్తి సత్యం ఆమెకు యిచ్చే ‘కోక’ కోసమే. ‘ఆడాళ్ల నోరు నొక్కి వెనకసాయం నీకు నానూ చేశాను’ అంటుంది ఆ మనిషి. తరువాత మరో రహస్యం కూడా బయటపెడుతుంది. ‘దాని మరో మొగుడు మొన్న రాత్రే దాని గుడిసెకు చేరుకున్నాడు.. ఇప్పుడు పాలెంలో గేదెను బేరమాడుతున్నాడు’ అని బాహాటం చేస్తుంది.
ఇంతకూ చనిపోయినవాడిమీద ఎవరికీ దయ, సానుభూతి, ‘అకాల మరణం’ అనే బాధ లేదు. ప్రతివాడు భార్య, తల్లి, మేస్ర్తి, అతని దయతో కనకమ్మ అందరూ చావుమీద దొరికిన డబ్బును తమ వంతు వాటా తాము సజావుగా పంచుకోవడం మీదనే దృష్టి వుంచుతారు.
1968లో మొదటి ప్రచురణ అయిన రుూ కథ అభ్యుదయవాద ధోరణికి చెందినదిగానే చూచినా, శ్రీమంతులే కాదు బీదవారు కూడా అవినీతికి జంకరు. తోటివారికి అన్యాయం చేయడానికి వెరువరు- అనే విషయాలను స్పష్టం చేస్తుంది.
చాగంటి సోమయాజులుగారు అనేక కథలు వ్రాయడమేగాక, కథకులను ప్రోత్సహించారు. కథా సంకలనాలు ప్రచురించారు. వారి కథలలో ‘వాయులీను’ అనేది, ‘ఏలూరెళ్లాలి’ అనేది ప్రముఖంగా చెప్పుకోదగినవి. పీడిత ప్రజల సమస్యలు వారి రచనలలో ఎక్కువగా కనిపిస్తాయి. ‘కుంకుడాకు’ కధ ప్రామణికమయినది. ప్రపంచ సాహిత్య ధోరణులను బాగా తెలుసుకుని జనాభ్యుదయానికి దోహదం చేసే ధోరణులను అవలంబించిన రచయితగా పేరుపొందారు.

- శ్రీవిరించి, 9444963584