సబ్ ఫీచర్

మావోలకు కష్టకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ధశాబ్దకాలంలో మావోయిస్టు పార్టీ పదిమంది కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులను కోల్పోయింది. 45 మంది రాష్టస్థ్రాయి నాయకులను, 11 మంది ప్రాంతీయ స్థాయి, 160 మంది జిల్లా స్థాయి నాయకులతోపాటు సుమారు 2,500 మందిని కోల్పోయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రకటిస్తూ, వార్షిక పనితీరుపైనా సమీక్షతో కూడిన సర్క్యులర్‌ను కిందిస్థాయి కార్యకర్తలకు పంపిణీ చేసింది. అనేక ఆసక్తికర అంశాలను, పార్టీ క్యాడర్‌ను నిరాశపరిచే ఎన్నో విషయాలను ఆ డాక్యుమెంట్‌లో నిక్షిప్తం చేసింది. తమకు చిరకాలంగా కంచుకోట లాంటి అబూజ్‌మడ్ దుర్గమ ప్రాంతంలోకి సైన్యం, పోలీసు బలగాలు చొచ్చుకువచ్చాయని, దండకారణ్యంలో ‘శత్రువు’గా పాగా వేసాడని, పార్టీ అగ్ర నాయకత్వమే లక్ష్యంగా నిఘా విభాగం, పోలీసులు, సైన్యం దూకుడు పెంచినట్టు మావోయిస్టు నేతలు అంగీకరిస్తున్నారు. వారు విడుదల చేసిన సర్క్యులర్ మేరకు పార్టీ ప్రమాదం అంచున వుందన్న దృశ్యం అవగతమవుతుంది. కాశ్మీర్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్ మాదిరి ప్రత్యేక దళాన్ని దండకారణ్యంలో ఏర్పాటు చేసందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, అది ఆచరణలోకి వస్తే అక్కడి స్థానిక నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం వుందని కూడా పేర్కొన్నది.
నగర, పట్టణ ప్రాంతాల్లో పార్టీ చాలా బలహీనపడిందని, కొన్ని ప్రాంతాల్లో శూన్య పరిస్థితి నెలకొందని, శత్రువు దూకుడును తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఇదంతా మావోయిస్టు పార్టీ అంటే గిట్టనివారు రాసినట్టుగా, చెప్పినట్టుగా అనిపిస్తుంది కాని అక్షరాలా మావోయిస్టు పార్టీనే ఈ విషయాలను తన వారికి లిఖిత పూర్వకంగా సమాచారం తెలియజేసింది. ఈ రకమైన నిరాశాజనక వాతావరణంలో మావోయిస్టు పార్టీ నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయగలదా? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. దండకారణ్యంలో పశ్చిమ కనుమల్లో పరిస్థితి సైతం నిరాశాజనకంగానే వుందని తమిళనాడు- కేరళ- కర్నాటక రాష్ట్రాల సరిహద్దుల్లో నెలకొల్పాలనుకున్న స్థావరాలను నెలకొల్పలేక పోయినట్టు, ఆ క్రమంలో కీలకమైన నాయకులను కోల్పోయినట్టు ఆ పార్టీ పేర్కొన్నది.
నక్సల్‌బరీ 50 వసంతాల సంస్మరణోత్సవాలు జరిపినా, అమరవీరుల వారోత్సవాలు జరిపినా, కారల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలను పాటించినా.. మరెన్నో కార్యక్రమాలు చేపట్టినా ఒరిగిన ప్రయోజనమేమిటని ప్రశ్నించుకుంటే.. ‘హళ్లికి హళ్లి- సున్నకు సున్న’ అన్న సమాధానం వస్తోంది. మరి- ఈమాత్రం దానికి 76 మంది, 40 మంది, 26 మంది.. ఇలా సిఆర్‌పిఎఫ్ జవాన్లను, పోలీసులను, పౌరులను ఈ విప్లవకారులు పొట్టన పెట్టుకోవడంలో ఏమైనా అర్థం ఉందా? వేలమంది తమవారిని కోల్పోయి, అంతకుమించిన సంఖ్యలో ఎదుటివారిని హతమారిస్తే 21వ శతాబ్దంలో గొప్ప సంక్షేమ సమాజం ఏర్పడుతుందని కాని, ఆధునిక సోషలిజం ఏర్పడుతుందని గాని చెప్పలేం. కమ్యూనిజం, సోషలిజం సమాజం ఏర్పాటుచేసే పరిస్థితులు ఎక్కడా లేవు, అయినా ఇలా రావణకాష్టం రాజేయడంలో ఏమాత్రం అర్థం కనిపించదు.
విప్లవాలకు గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచిన లాటిన్ అమెరికా దేశాల పరిస్థితి పరిశీలిస్తే ఎవరికైనా సత్యం బోధపడుతుంది. కొలంబియాలోని విప్లవకారులు అక్కడి ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని ఆయుధాలన్నీ అప్పగించారు, అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. వెనిజులాలో ఆధునిక సోషలిజం ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. ఇప్పుడు ఆ దేశం దివాలా అంచుకు చేరింది. అక్కడ ఊహించలేనంతగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఆకలి కేకలు వినబడుతున్నాయి. పసిపిల్లల ప్రాణాలను సైతం కాపాడే ఔషధాలు దొరక్క నరకం అనుభవిస్తున్నామని ఆ దేశ పౌరులు రోడ్డుమీదకొచ్చారు. నిత్యం ఆందోళనలు, ప్రదర్శనలతో ఆ దేశ రాజధాని కారకస్ అట్టుడికి పోతోంది. ఒకప్పుడు సోషలిస్టు దేశాలుగా చెప్పుకున్న తూర్పు యూరప్ గాని, క్యూబా గాని వెనిజులాని ఆదుకునే పరిస్థితి లేదు. ఇదంతా స్వయంకృతాపరాధం అని ప్రజలు, ప్రతిపక్షాలు వాపోతుండగా, ఏ క్షణంలో అక్కడ అసంతృప్తి బద్ధలవుతుందో ఎవరూ చెప్పలేని స్థితి. ఇదంతా ఏం చెబుతోంది? ప్రపంచమంతటా విప్లవకర పరిస్థితి నెలకొన్నది.. విప్లవ శక్తులు విజృంభిస్తున్న తీరును తెలియజేస్తున్నదా? లేదు..!
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోగాని, దక్షిణాసియా దేశాల్లోగాని, చివరకు దండకారణ్యంలోగాని పరిస్థితులు అనుకూలంగా లేవు. మన దేశంలో పెద్దనోట్ల రద్దు అనంతరం మావోయిస్టులు నగదుకు ఇబ్బంది పడుతున్నారని, ఆ పరిస్థితిలో ఇప్పటికీ పెద్దగా మార్పులేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా ఇటీవల ముంబైలో పేర్కొన్నారు. అనేకచోట్ల లొంగుబాట్లు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లు జరుగుతూ వున్నాయి. చత్తీస్‌గఢ్‌ను ఆనుకుని వున్న భద్రాచలం, చర్ల ప్రాంతంలోనూ అనేక లొంగుబాట్లు జరుగుతున్నాయి. చత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు సానుభూతిపరులు సైతం తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతున్నారు. సుకుమా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లోనూ మావోల అరెస్టులు, లొంగుబాట్లు సర్వసాధారణమైంది. ఝార్ఖండ్‌లో 12 మంది మావోయిస్టుల కోసం తీవ్రంగా వేట కొనసాగుతోంది. అందులో సుధాకర్, అతని భార్య నీలిమ వున్నారు. సుధాకర్ తెలంగాణకు చెందిన నాయకుడిగా చెబుతున్నారు. ఇప్పటికే 30 మంది మావోయిస్టులను అరెస్టు చేసామని కూడా పోలీసులు ప్రకటించారు. అనేకచోట్ల మావోయిస్టులకు ప్రతికూల పరిస్థితులే తప్ప ఏమాత్రం ఉత్తేజకర పరిస్థితులు కానరావడం లేదు.
చత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లా సాజాపహాడ్ గ్రా మంలో శ్యామ్‌లాల్ అనే ఆదివాసి ఒంటరిగా 27 సంవత్సరాలపాటు శ్రమించి ఒక చెరువును తవ్వి, చరిత్రను సృష్టించి ఆ ప్రాంతానికి ఆదర్శంగా నిలిచాడు. ఆ చెరువు నీళ్లిప్పుడు పంటలకు, పశువులకు ఉపయోగపడుతున్నాయి. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అతడిని గొప్ప కథానాయకుడిగా గౌరవిస్తున్నారు. తొలుత ఎద్దేవా చేసినవారే ఇప్పుడు అభినందిస్తున్నారు. ఇదికదా కావలసింది. ఈరకమైన వృద్ధి- అభివృద్ధి పనులే ఆదివాసీలకు కావలసింది. ఇప్పుడు సెల్‌ఫోన్లు సైతం దండకారణ్యంలో కనిపిస్తున్నాయి. విస్తృతంగా రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఈరకమైన అభివృద్ధిని ధ్వంసం చేస్తామని మావోయిస్టులు కంకణం కట్టుకోవడం విషాదకరం. దీనికి ప్రత్యామ్నాయంగా జనతన సర్కారు పనిచేస్తోందని చెబుతున్నారు. రష్యా, చైనా, తూర్పు యూరప్ తదితర దేశాల్లో విఫలమైన ఆ తరహా సర్కారు దండకారణ్యంలో సఫలమవుతుందా? కాదని కాలమే చెబుతోంది!

-వుప్పల నరసింహం సెల్: 99857 81799