మెయిన్ ఫీచర్

ఆమె ‘పంచ్’... పులి పంజా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూకుడు, చురుకుదనం, బలమైన ముష్టిఘాతాలతో బాక్సింగ్‌లో తనదంటూ ఒక శైలిని సృష్టించుకుని, నాలుగేళ్ళ కిందట సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ సబ్ జూనియర్ బాలికల బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది జమునా బోడో! అసోంలోని సోనిత్‌పూర్ జిల్లా బెల్సిరి గ్రామానికి చెందిన ఈ పంతొమ్మిదేళ్ళ అమ్మాయి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను చవిచూసింది. ఆమె తల్లి నిర్మల బోడో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. చాలా కాలం కిందట భర్తను పోగొట్టుకున్న నిర్మల తన ఇద్దరు కూతుళ్ళు, కొడుకును పోషించే భారం తనమీద వేసుకుంది. ఆమెకు తగ్గట్టుగానే జమున కూడా ఎన్ని కష్టాలనైనా భరిస్తూ దేశం గర్వపడేలా అనేక బాక్సింగ్ చాంపియన్ షిప్‌ల్లో పతకాలు సాధిస్తోంది. 2014లో బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన వరల్డ్ యూత్ చాంపియన్ షిప్‌లో బంగారు పతకాన్ని, 2015లో తైపీలో జరిగిన యూత్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మార్షల్ ఆర్ట్స్‌లోని ‘వూషు’ అంటే అమెకు అమితమైన ప్రేమ!
‘నా పదేళ్ళ వయస్సులోనే మా నాన్న చనిపోయారు. అప్పటినుంచి మా అమ్మే మమ్మల్ని సాకుతోంది. మా ఊళ్ళో మగపిల్లలు వూషు ప్రాక్టీసు చేసేవారు. అది చూస్తూ నేను కూడా దానిని అభ్యసించడం మొదలెట్టాను’ అని ఆమె చెప్పిందొక ఇంటర్వ్యూలో... అలా ప్రాక్టీసు చేస్తూనే జిల్లాస్థాయిలో జరిగిన వూషు పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. క్రమంగా కోచ్‌ల ప్రోత్సాహంతో బాక్సింగ్‌లో శిక్షణ పొందడం ప్రారంభించింది. అందుకు తగ్గ వసతులు ఆ గ్రామంలో లేకపోవడంతో 2009లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో బాక్సింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందే అవకాశాన్ని చేజిక్కించుకుంది. 2010లో తమిళనాడు ఈరోడ్‌లో జరిగిన మొట్టమొదటి సబ్ జూనియర్ వుమెన్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్ షిప్ 52 కిలోల విభాగంలో తొలి స్వర్ణపతకాన్ని సాధించిందామె. ఆ మరుసటి సంవత్సరం కొయంబత్తూరులో జరిగిన అదే చాంపియన్ షిప్ పోటీల్లో కూడా బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇంతగా పేరుప్రతిష్ఠలు తెచ్చుకున్నా ఇంట్లోని పరిస్థితుల్లో మాత్రం ఏ మార్పు లేదు. బెల్సిరి రైల్వే స్టేషన్ ఎదురుగా ఎప్పుడో కట్టుకున్న చిన్న పూరిపాకలోనే జీవనం సాగిస్తోందాకుటుంబం! ఆమె తల్లి నిర్మల కూడా ఇప్పటికీ కూరగాయలు అమ్ముకుంటూ, కూలీనాలీ చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తోంది. ఆమెనే ఆదర్శంగా చేసుకున్న జమున తనవంతు చేయూతనిస్తోంది. స్పోర్ట్స్ అకాడమీ బాక్సింగ్ ఎరినాలో అప్పుడప్పుడు అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ అనేక పోటీల్లో పాల్గొంటుంది. ‘ఒకసారి రింగ్‌లోకి ప్రవేశించాక నా ప్రత్యర్థి అబ్బాయా, అమ్మాయా అనేది గమనించను. వాళ్ళను మట్టికరిపించడమే నా లక్ష్యం’ అంటుందామె!
ప్రస్తుతం ఆమె దృష్టింతా 2020లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపైనే ఉంది. ఇండియా నెంబరు వన్ మేరీ కోమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రాక్టీస్ చేస్తోంది. ‘ముగ్గురు పిల్లల తల్లి ఆయినప్పటికీ మేరీ కోమ్ ‘పంచ్’ ఇప్పటికీ పులిపంజాయే!’ అంటోంది జమున. ‘ఆమే అంత శ్రమపడుతున్నప్పుడు నేనింకా ఎందుకు కష్టపడి ప్రాక్టీస్ చేయకూడదు?’ అని అనుకుంటుంది. మరిన్ని పతకాలు సాధించి, దేశం గర్వపడేలా కీర్తిప్రతిష్ఠలు పొందాలన్నది ఆమె ధ్యేయం! ఔత్సాహిక బాక్సర్లకు స్ఫూర్తిదాయకంగా ఆమె తన లక్ష్యాన్ని సాధించాలని కోరుకుందాం.
చిత్రం.. తల్లితో జమున

- జి.కె. మూర్తి