దక్షిన తెలంగాణ

మారిన బ్రతుకులు! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులు ఒకరికొకరు
దూరం అవుతున్నారు
మనసులు మాటల్లేక
మూగబోతున్నాయి
మదిలోని భావాలన్నీ
శబ్దరూపం దాల్చకుండానే
గొంతులోనే గట్టిగా కుడుతున్నాయి
నిరుపయుక్త స్వరపేటిక
విలుప్తదశకు చేరుతుంది
శబ్దలయలూ, పద విరుపులు
ఆప్యాయ పలకరింపులు
కాలగర్భంలో పాత ఫ్యాషన్ అయ్యాయి
పక్కింటి దోస్తానాలు
పలుచనయ్యాయి
బంధువుల పలకరింపులు
బరువెక్కిపోయాయి
తలా ఓ దిక్కు..
మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు
ముచ్చట్లు అటకెక్కిపోయాయి
నిచ్చెన వేసి తీసే వారు లేరు
అంకుల్ ఆంటీ తప్ప
మాయమైన వరుసలు
ఆశ్రమాలు చేరుతున్న ఇంటి పెద్దలు
టెలిగ్రాంలు గతంలో కలిసాయి
ఉత్తరాలు ఉరిపోసుకున్నాయి
అక్షరాలు మర్చిపోయి
చేతివ్రాత చెదిరిపోతోంది!
ఆత్మీయ పలకరింపులు
అంతర్థానమవుతున్నాయి
యంత్ర భూతాలు ఇప్పుడు
యంత్రం చేతిలో
యంత్రంగా మారిన మనిషి
మునివేళ్లతో సమస్తం ఇప్పుడు
చాటింగ్, రేటింగ్, ముఖ పుస్తకాలు
క్లబ్బులు, పబ్బులు కొత్త పరిచయాల

మధ్య
మనిషి మారిపోయాడు!
స్పర్శను కోల్పోయాడు
స్వరాన్ని కోల్పోతున్నాడు!
మనిషి ఇప్పుడొక యంత్రం!
బ్రతికి వున్న నిర్జీవం!
తన స్వరం అవశేషం కాకముందే
కళ్లు తెరిచి
మనిషిగా బ్రతకడం
మొదలు పెట్టాలి
- గంజి భాగ్యలక్ష్మి
హన్మకొండ
సెల్.నం.9441993044

క్రీడా మైదానం
సాయంత్రం ఐతే చాలు
ఆ క్రీడా ప్రాంగణం
పిట్టలు వాలిన చెట్టయ్యేది!
రోజూ తనను తాకే పసిపాదాలతో
దానికి దోస్తీ కుదిరింది.
చివరి నిముషంలో పరాజితులైన వారి
వడలిన ముఖాలపై
మిగిలిన కన్నీటి చారికలను అది తుడిచేది!
అనుకోకుండా గెలిచిన అనూహ్య

విజయంతో..
ఉప్పొంగిన విజయ దరహాసాలకు
అది ప్రతినిధిలా నిలిచేది!
గుచ్చుకొని రక్తమోడుతున్న పాదాలకు
అది వెచ్చని మట్టిగంధాన్ని లేపనంగా

అద్దేది!
ఏ పాదాల సవ్వడి విన్పించని
ఏదో ఒక రోజు.. అదెంతో మథనపడుతూ..
నిశ్శబ్దాన్ని చుట్టుకొని..
ఒంటరి ద్వీపంలా ముడుచుకొని
తనపై ఎగరని పిట్టను
నా పిల్లలేరి? అని ప్రశ్నిస్తుంది
ఆ క్రీడా మైదానం..
భవిష్యత్ తరాలను సానబెట్టే కార్యశాల!
జీవితపు ఆటుపోట్లకు పాఠశాల!
- బి.కళాగోపాల్
నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9441631029

ఆమె!
చెలికాని జాడేదని..
నెలరాజు నవ్వులు ఓవైపు
విరజాజుల వెక్కిరింపులు మరోవైపు
కలువభామ కవ్వింపులు ఇంకోవైపు..
గిలిగింతలు పెడుతుంటే..!
ఆమె మోము మొగ్గలా..
సిగ్గుతో ముడుచుకుంది!
ఇంతలో.. మెలమెల్లన
చెంతకు చేరిన పిల్లగాలి
ఆమె ముంగురులను మృదువుగా
సవరించి..
చిన్నగా చెవిలో..
చెలికాని రాకను చేరవేసింది!
ఇంకేముంది?
నెల రాజుకు ధీటుగా
ఆమె వదనం విప్పారి
పుష్పం వోలే వికసించింది!
ఓవైపు మోముపై
చిరునవ్వులు నాట్యమాడుతుంటే..
మరోవైపు మెట్టెల చిరుమువ్వలు
తమ సవ్వడితో సడిచేస్తుంటే..
ఆనందంతో.. తడబడిన అడుగులను
సరిచేసుకుంటూ..
వడివడిగా నడుస్తూ చెలికాడైన..
తన పతి చెంతకు చేరింది!
- కె.శే్వత, కరీంనగర్, సెల్.నం.8074434134

ప్రశంస
నేటి కంప్యూటర్ యుగంలో
పరుగులెత్తే కాలగమనంలో
అడవి మృగాల వేటలో
అలసిన వేటగానిలా
మానవ సంబంధాలన్నీ
ఆర్థిక సంబంధాలుగా మారిన
ఆటవిక సమాజంలో
చంద్రునికై ఎదురుచూసే
చకోరంలా
తననెవరూ గుర్తించడం లేదని
విసిగిపోయిన ప్రశంస
తొలకరిలోని చిరుజల్లులా
బాలల భాషా సామర్థ్యాలలో
తనను చేర్చినందుకు
మురిసిపోయింది
భాషామతల్లికి జోహారులంది!
- ల్యాదల గాయత్రి
కాగజ్‌నగర్
సెల్.నం.9949431849

వాన చినుకులు..
వాన చినుకులతోనే కదా..
పుడమి తల్లి
పులకరిస్తుంది!
వర్షపు జల్లులతోనే కదా..
రైతన్న మోములో
వెలుగులు చూస్తాం!
అన్నదాత
కష్టాల కడలి దాటాలంటే
వరుణుడి
కరుణ కావాల్సిందే!
- చీకట్ల సంగీత
తంగళ్లపల్లి, జగిత్యాల జిల్లా
సెల్.నం.9618059689

కార్తీక పవనం!
అదిగో.. అదిగదిగో
వస్తున్నది వస్తున్నది!
చల్లగా.. మెల్లగా.. హాయిగా!
నా మోమును ముద్దాడుతున్నది..!
నా మేనును గిలిగింతలు పెడుతున్నది!
ఆ స్పర్శతో నా ముంగురులు
ఊయలలూగుతున్నాయి!
నా నయనాలు నిద్ర కోరుతున్నాయి..!
ఓ ఉషోదయ కార్తీక పవనమూ..!
తరంగాలుగా వచ్చి నా అంతరంగాన్ని
సేద తీర్చితివి..
నా మస్తిష్కంలో మధుర సులోచనాలు
ఆవిష్కరింపజేసింది..!
ఎచట నుండి వస్తున్నావో..!
ఎక్కడికి వెళ్తున్నావో..!
ఎందరిని పలకరిస్తావో..!
ఓ పవనమా....!
- అఖిలాశ జానీ తక్కెడశిల

‘నా తెలంగాణ
కోటి రతనాల వీణ’ అని
దాశరథి కొనియాడిన నేల ఇది!
రజాకార్ల దాష్టికాలను
ఎదిరించిన భూమి ఇది!
శాతవాహనులు, కాకతీయులు
ఏలిన పుడమి ఇది!
ఉద్యమాలకు ఊపిరులూది
ఎందరో అమరులైన గడ్డ ఇది!
కొమురం భీం, చాకలి ఐలమ్మలు
సమ్మక్క, సారక్కలు
కాళోజీ, జయశంకర్‌లు
నడిచిన ధరణి ఇది!
జానపదులు, జావళులు
సకల కళలకు నిలయం ఇది!
గోదావరి, కృష్ణమ్మలు ప్రవహించే
పుణ్య ప్రదేశం ఇది!
గోల్కొండ బురుజులు,
ఎన్‌టిపిసి వెలుగులు
నా తెలంగాణకు ఆభరణాలు!
బతుకమ్మ, బోనాలు
నా తెలంగాణ సంస్కృతికి
ప్రతిబింబాలు!
- కె.వినోద, కరీంనగర్
సెల్.నం.9441376119

ప్రియా!

కలలను కౌగిలించుకునే వేళ
నీవు నా దగ్గర లేకుంటే
ఈ ప్రపంచమే నాకొద్దని
విసుక్కుంటానా..
వెనె్నల దీపం వెలుగులో
నీవు నా చెంతనున్నప్పుడూ
ఈ ప్రపంచంతో ఇక పనేమిటీ
అని అనిపిస్తుంది
నీలోని అద్వితీయమైన
ప్రేమావేశాన్ని
కవితగానో..
మమతగానో..
నాపై కురిపించి వెళ్లిపోతావు!
ఆ మోహావేశం నుంచి
అంత సులభంగా బయటపడలేక..
దూరమైన ప్రపంచాన్ని
దగ్గరకు చేరదీయలేక..
నిలువెత్తున తడిపేసిన
నీ జ్ఞాపకాల చలిని తట్టుకోలేక
ప్రేమ ప్రకంపనలతో
అవస్థ పడుతున్నాను ప్రియా..
- గంజాం భ్రమరాంబ
సెల్.నం.9949932918