విజయవాడ

స్వప్న జాతకం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వప్న భయం భయంగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడికి వెళ్లడం ఆమెకి అదే తొలిసారి. సెక్యూరిటీ టిక్కెట్ చూపించి లోపలికి చేరుకుంది. చెకింగ్ పూర్తయిన తర్వాత విమానం లోపలికి చేరుకుంది. సీట్ నెంబర్ చూసుకుని కూర్చుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా స్వప్నకి టెన్షన్ తగ్గడం లేదు. సెల్ తీసుకుని ప్రియుడు విశేష్‌కి ఫోన్ చేసింది.
‘‘విశేష్.. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాను. చాలా భయంగా ఉంది. నువ్వు కోల్‌కతా ఎయిర్‌పోర్టుకి తొందరగా వచ్చెయ్’’ అంది.
‘‘స్వప్న నేను వచ్చేసాను. నువ్వు ఫ్లైట్ దిగగానే నీ ముందు ఉంటాను. అక్కడి నుండి వెంటనే గుడికి వెళ్లడం, పెళ్లి చేసుకోవడం నిముషాల్లో జరిగిపోతుంది’’ అంటూ చెప్పాడు విశేష్.
అది విని స్వప్న సంతోషించింది.
లోపల అలజడిగాను ఉండడంతో కళ్లు మూసుకుంది.
ఇరవై రెండేళ్ల యువతి స్వప్న. డిగ్రీ పూర్తి చేసింది. బ్యాంక్ పరీక్షలకు సిద్ధమవుతుంది. ఆమె తండ్రి స్నేహితుడి కొడుకు విశేష్ ప్రేమలో పడింది. వాళ్లది, విశేష్ తండ్రిది బంగారం వ్యాపారం. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే వాళ్ల కులాలు వేరు.
తమ ప్రేమ గురించి విశేష్ తండ్రికి చెప్పాడు. స్నేహం బంధుత్వంగా మారితే మంచిదే కదా అని ఇద్దరి జాతకాలు పండితుడికి చూపించాడు అతను.
పండితుడు వాళ్ల జాతకాలు సరిపోయాయని చెప్పాడు.
విశేష్, స్వప్న సంతోషించారు.
అయితే స్వప్న తల్లి అన్నపూర్ణాదేవి ఇష్టపడలేదు.
‘‘మనమ్మాయికి ఆర్మీ ఆఫీసర్లు, మెరైన్ ఇంజనీర్ల సంబంధాలు వస్తున్నాయి. మీ స్నేహితుడి కొడుకు, బంగారం వ్యాపారి అని విశేష్‌కి ఇద్దామని అనుకుంటున్నారు. అతనికంటూ హోదా ఉండాలి కదా’’ అని అడ్డుకట్ట వేసింది.
దాంతో వాళ్ల జాతకాలు మరొక పండితుడికి చూపించారు. అతను జాతకాలు సరిపోలేదని చెప్పాడు. ఇదే విషయం స్వప్న తండ్రి విశేష్ తండ్రికి చెప్పడంతో అతను కూడా సరేలే అని ఊరుకున్నాడు.
అలా కొన్నాళ్లు గడిచాయి. విశేష్‌కి కోల్‌కతాలో ఒక హోటల్లో మేనేజర్ ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు.
స్వప్న మాత్రం విశేష్‌ని దూరం చేసుకోలేక, ఇంట్లో వాళ్లు చూపించిన సంబంధం చేసుకోలేక సతమతమవుతోంది.
ఒంటరిగా ఉన్నప్పుడు తల్లి ఫలానా సంబంధం వస్తుంది రెడీగా ఉండు అంటూ చెబుతోంది.
అలాగే మెరైన్ ఇంజనీర్ సంబంధం వచ్చింది. జాతకాలు కూడా కలిసాయి. అతనికి లక్ష రూపాయల జీతం.
అయితే స్వప్నకి నచ్చలేదు. దాంతో తల్లి కోపగించుకుంది.
‘‘నీకు, విశేష్‌కి జాతకాలు కలవలేదు. కలిస్తే అతనితోనే నీ పెళ్లి జరిపించి ఉండేవాళ్లం’’ అంది.
‘‘ఒక పండితుడు జాతకాలు కలవలేదంటే మరో పండితుడికి చూపిద్దాం’’ అంది స్వప్న.
‘‘నీకు పొగరెక్కింది’’ అంది అన్నపూర్ణాదేవి.
స్వప్న విశేష్‌కి ఫోన్ చేసింది.
‘‘జాతకాలతో మన ప్రేమని అడ్డుకుంటున్నారు. నేను నీ దగ్గరకి వచ్చేస్తాను’’ అంది స్వప్న.
వెంటనే విశేష్ ఫ్లైట్ టిక్కెట్ పంపించాడు.
ఆలోచనల నుండి బయటపడి విమానం దిగింది స్వప్న.
ఎదురుగా ఉన్న విశేష్‌ని హత్తుకుంది.
ఇద్దరు కొంత మంది స్నేహితుల సమక్షంలో ఆర్య సమాజానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను వాట్సాప్ ద్వారా తల్లికి పంపింది స్వప్న.
వెంటనే స్వప్న తల్లిదండ్రులు కోల్‌కతాకి బయలుదేరారు.
‘‘స్వప్న ఇంటికి రా. అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. మేమే మీ పెళ్లి ఘనంగా చేస్తాం’’ అన్నారు.
‘‘సారీ అమ్మా. పెళ్లి ఘనంగా చేయడానికి జాతకాలు చూస్తారు. జాతకం బాగోకపోతే ఏం చేస్తారు. విశేష్ చాలా మంచివాడు. ఇది నా నిర్ణయం. దీనికి నేనే బాధ్యురాలిని’’ అని చెప్పింది స్వప్న.
దాంతో చేసేదిలేక స్వప్న తల్లిదండ్రులు వాళ్లని దీవించి అక్కడి నుండి వెనుదిరిగారు.

- నల్లపాటి సురేంద్ర, చరవాణి : 9490792553