రివ్యూ

ప్చ్.. జారిపడ్డాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * మేడమీద అబ్బాయి
తారాగణం: అల్లరి నరేష్, నిఖిలా విమల్, హైపర్ ఆది, అవసరాల శ్రీనివాస్, తులసి, శివారెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, సుధ, జయప్రకాష్ తదితరులు
సంగీతం:షాన్ రెహమాన్
కథ, స్క్రీన్‌ప్లే: వినీత శ్రీనివాసన్
నిర్మాత: బొప్పన చంద్రశేఖర్
దర్శకత్వం: జి.ప్రజిత్
సాధారణంగా ముందు కథ అనుకొని, తర్వాత దానికనువైన పేరుని సినిమాకు పెట్టడం మామూలుగా చిత్రసీమలో జరిగే విధానం. కానీ ఈ సినిమా విషయంలో ముందుగా అందరికీ ‘క్యాచీ’గా వుంటుందని ‘మేడమీద అబ్బాయి’ అని పెట్టేసి తర్వాత దొరికిన కథను దానికి అతికించేసినట్లు అనిపించింది. అందుకే ఆ అతుకు కథ పేరు విషయంలోనే కాక, సన్నివేశం- సంభాషణలూ, సీన్ల కదలిక- ఇలా అన్ని విషయాల్లోనూ ఏదీ కలవక అతుకుల బొంతగా తయారైంది. ఆఖరికి నరేష్ సినిమా అంటే హాయిగా నవ్వుకోవచ్చు అనుకుంటే అది ఆయన పరంగా పెద్దగా పలకకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక వివరాల్లోకివెళితే... ఇంజనీరింగ్ చదువులో విఫలమై ఇంటి బాటపట్టిన శీను (నరేష్)కి ఎలాగైనా గొప్పవాడినై డబ్బు సంపాదించేయాలని కోరిక ఏర్పడుతుంది. అందుకు సినిమా ఫీల్డే శరణ్యమని అక్కడ దర్శకుడిగా వెలిగిపోవాలన్న కోరికతో హైదరాబాద్ ట్రైన్ ఎక్కేస్తాడు. అందులోనే ప్రయాణం చేస్తున్న తన పొరుగింటి సింధు (నిఖిలా విమల్)ని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఆమెకు తెలియకుండా ఆమెతో సెల్ఫీ కూడా తీసుకుని అది స్నేహితుడు బండ్ల బాబ్జీ (హైపర్ ఆది)కి పంపిస్తాడు. అది తెలిసిన వాళ్లందరి సెల్‌ఫోన్లలోకీ వెళ్ళి ప్రచారమూ పొందేస్తుంది. ఈలోగా తన సినీ ప్రయత్నాలు పరాజయం పాలై తిరిగి ఊరు ఆత్రేయపురం చేరిన తనపై సింధుని నువ్వే తీసుకెళ్లావు, ఏమైంది? అని ఊరి వారందరూ ప్రశ్నిస్తారు. మరి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి శ్రీను ఏం చేశాడన్నది మిగతా కథా కమామీషూ!
‘ఒరు వాడిక్కన్ సెల్ఫీ’ అన్న మలయాళ చిత్రం రీమేక్‌గా ‘మేడమీద..’ మనకొచ్చింది. అయితే కథలో అవతలివారికి తెలియకుండా సెల్ఫీ తీయడం, అది పలువురికి ఫార్వార్డ్ చేయడంవల్ల వచ్చిన ఇబ్బందులు తెలియజెప్పడం వరకూ బాగానే వుంది. కానీ మరి అదే ఆలోచనను ఒక అమ్మాయి తప్పిపోతే ఆమె చేతిలో వున్న సెల్‌ఫోన్‌తో చేస్తున్న కాల్స్ ద్వారా ఆమెను ఇట్టే పట్టేయచ్చు అన్నదానిపై దర్శకుడు దృష్టి పెట్టకపోవడం చిత్రాతిచిత్రం. ఎందుకంటే తప్పిపోయిన అమ్మాయి సింధు తల్లిదండ్రులు, ఆమె గురించి తక్షణం ఆలోచించక పై చెప్పిన మార్గాలను (సెల్‌ఫోన్ల సిగ్నల్స్) సంబంధిత వర్గాల ద్వారా అనే్వషించక శ్రీనుపై దాడి జరపడం, తిరిగి వాళ్లు హైదరాబాద్ వచ్చి వెదకడం వగైరాతో ద్వితీయార్థం గడపడం ఎంతో హాస్యాస్పదంగా వుంది. ఇది చాలదన్నట్లు ప్రైవేట్ డిటెక్టివ్ యుగంధర్ (శ్రీనివాస్ అవసరాల)నంటూ ఆ పాత్ర చేసిన హడావుడి కూడా చాలా సిల్లీగా వుంది. ఎక్కడైనా తప్పిపోయిన అమ్మాయిని పట్టుకోవడానికి ప్రాధాన్యమిస్తారు కానీ, ఆ మాటున ఆర్థిక నేరగాళ్లను పట్టుకోవడానికి ఈ జాప్యం అని సంజాయిషీ ఇవ్వడం పరిశోధన ప్రక్రియనే అపహాస్యం చేసినట్లైంది. ఇలా కధ కీలక విషయంలోనే ఉచితానుచితాలను గాలికి వదిలేసి దర్శకుడు ఎడాపెడా తీసిన సన్నివేశాల్ని చూపడం ప్రేక్షకులకి ఎనలేని శిరోభారమే. ఎప్పుడూ అలవాటైన హాస్యబాటకు బదులుగా మరో కొత్త కోణం స్పృశించాలన్న నాయకుడు నరేష్ లక్ష్యం మంచిదే అయినా, అందుకు ఎన్నుకున్న కథలో కావలసినన్ని కంతలు ఉండటంతో అసలుకే ఎసరొచ్చింది. అయితే నటనాపరంగా తనవంతు కృషి చేశాడు. సినిమా మొత్తంలో ఎక్కువ, ఒకరకంగా నాయక పాత్రనే డామినేట్ చేసిన రోల్ బండ్ల బాబ్జీ. దీన్ని హైపర్ ఆది బాగా చేశారు. ఎటొచ్చీ ఆయనున్న సన్నివేశాలన్నీ వారికి ఎనలేని పేరుతెచ్చిన చిన్నితెర జబర్దస్త్‌నే పోలి ఉండటంతో పెద్ద తెరపై జబర్దస్త్ చూస్తున్నామా అన్న భ్రాంతీ ఆడియన్స్‌కొచ్చింది. షార్ట్ ఫిలిమ్ గొప్పదనాన్ని ‘దాన వీర శూర కర్ణ’లోని ఎన్టీఆర్ ‘ఏమంటివి? ఏమంటివి?’ బాణీలో చెప్పడం అలరించింది. శ్రీనివాస్ పోషించిన యుగంధర్ పాత్రపరంగా లాజిక్ శూన్యమైనా దాన్ని తన శైలిలో ఆయన సంతృప్తికరంగానే నటించారు. సింధుగా నిఖిలా విమల్ పాత్ర పరిధి పెద్దగా లేదు. ఉన్నంతలో ఆమె బాగానే నటించారు. మిగిలిన పాత్రలకు గుర్తించదగ్గ పనిలేదిందులో. సినిమాలో డైలాగ్స్ గురించి కాస్తంత చెప్పుకుతీరాలి. సాధారణంగా సినిమాలో సందర్భానుసారం పంచ్‌లు డైలాగ్స్‌లో దట్టిస్తారు. కానీ ఇందులో పంచ్‌లు కోసం సీన్లను సృష్టించేశారు. ‘ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇలియానా రాలేదని ఒకడేడ్చాడట’, ‘మేటర్ లేనోణ్ణి మ్యాటర్ లేదని చెప్పాలి కానీ నువ్ దగ్గుబాటి రానా అని దగ్గరుండి నెట్టకూడదు’, జీవితంలో బాగా ఎత్తు ఎదగాలి.. ఎందుకు? వీధిలైట్ల బాగు చేసే ఉద్యోగమొచ్చిందా?, ‘ప్రభాస్, అనుష్కల మధ్య ఎవరున్నారు?’ ..రానా లాంటి పంచ్‌లు ఎగ్జాంపుల్. అయితే యూట్యూబ్‌కి సెటైర్‌గా సైకిల్ ట్యూబ్, ఏం బిజినెస్ చేస్తున్నావ్ అంటే ‘మైండ్ యువర్ బిజినెస్’ అనడం, ‘ఎక్కడైనా ఇంట్లో చెత్త వుంటుంది కానీ ఇక్కడ చెత్తలోనే ఇల్లుంది’, ‘మనం కోరుకోనివి జరగకపోవడమే జీవితం’ వంటి సంభాషణలు ఓకే. షాన్ రెహమాన్ (ఈ చిత్ర మలయాళ మాతృకకి వీరే సంగీత దర్శకులు) బాణీల్లో ‘నోట్లో వేలుపెడితే కొరకలేని’ పాటొక్కటే ఆకట్టుకుంది. ‘ఒంటరి మనసా వేదన వలదే..’ బాణీకన్నా అందులోని సాహిత్యం బాగుంది. ఒరిజినల్ చిత్ర దర్శకుడే (జి.ప్రజిత్) రీమేక్ చిత్రానికీ డైరెక్టర్‌గా ఉండటం ఉత్తమ ఫలితాలకు వేదికన్న ఆలోచన ఓకే కానీ, ఆ దర్శకుడు తెలుగు నేటివిటీకి సాధ్యాసాధ్యాలకి చోటిచ్చి ‘మేడమీద..’ను రూపుదిద్దివుంటే ప్రజిత్ పనితనం వెలుగులోకొచ్చేది.

-అనే్వషి