క్రీడాభూమి

ఆమ్లా హాఫ్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 13: పాకిస్తాన్‌తో ఇక్కడి గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవెన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈ జట్టుకు ఓపెనర్ హషీం అమ్లా అజేయ అర్ధ శతకంతో అండగా నిలిచాడు. చివరిలో తిసర పెరెరా విజృంభించి పరుగుల వరద సృష్టించడంతో, మరో బంతి మిగిలి ఉండగానే, మూడు వికెట్లకు 175 పరుగులు చేసిన వరల్డ్ ఎలెవెన్ జట్టు విజయభేరి మోగించింది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశించే ఉద్దేశంతో బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఓపెనర్లు ఫకర్ జమాన్, అహ్మద్ షెజాద్ మొదటి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. 13 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 21 పరుగులు చేసిన ఫకర్‌ను శామ్యూల్ బద్రీ ఎల్‌బిగా అవుట్ చేయడంతో పాక్ తొలి వికెట్‌ను కోల్పోయింది. రెండో వికెట్‌కు బాబర్ ఆజంతో కలిసి 59 పరుగులు జోడించిన షెజాద్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పెవిలియన్ చేరాడు. 34 బంతులు ఎదుర్కొన్న అతనిని డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టగా ఇమ్రాన్ తాహిర్ అవుట్ చేశాడు. పరుగుల వేటను కొనసాగించిన బాబర్ 38 బంతుల్లో, ఐదు ఫోర్లతో 45 పరుగులు చేసి శామ్యూల్ బద్రీ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కు చిక్కాడు. ఇమాద్ వసీం 15 పరుగులకు తిసర పెరెరా బౌలింగ్‌లో ఇమ్రాన్ తాహిర్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అదే ఓవర్‌లో కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ (0) వికెట్‌ను కూడా తిసర పెరెరా సాధించాడు. సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ కూడా వేగంగా పరుగులు రాబట్టడానికే ప్రాధాన్యతనిచ్చి, 23 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. అతనిని పాల్ కాలింగ్‌వుడ్ క్యాచ్ అందుకోగా బెన్ కట్టింగ్ ఇన్నింగ్స్ చివరి బంతిలో ఇంటిదారి పట్టించాడు.
చివరిలో విజృంభణ: మొదటి టి-20లో ఓటమిపాలైన వరల్డ్ ఎలెవెన్ రెండో మ్యాచ్‌లో 175 పరుగుల లక్ష్యాన్ని సాధ్యమైనంత వేగంగా అందుకునే ప్రయత్నంలో పడింది. అయితే, ఈ జట్టు ప్రయత్నానికి పాకిస్తాన్ గండికొట్టింది. 19 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23 పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్‌ను షోయబ్ మాలిక్ షార్ట్ ఫైన్‌లెగ్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టగా సోహైల్ ఖాన్ అవుట్ చేశాడు. 43 పరుగుల వద్ద వరల్డ్ ఎలెవెన్ తొలి వికెట్ కోల్పోయింది. హార్డ్ హిట్టర్ టిమ్ పైన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. కేవలం 10 పరుగులు చేసిన అతనిని ఇమాద్ వసీం క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన షహీం అమ్లాతో కలిసి జట్టు స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించిన కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ 14 బంతుల్లో 20 పరుగులు చేసి, షాదాబ్ ఖాన్ క్యాచ్ పట్టగా, మహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మూడో వికెట్ కోల్పోయే సమయానికి వరల్డ్ ఎలెవెద్ స్కోరు 106 పరుగులు. లక్ష్యాన్ని చేరడంలో వరల్డ్ ఎలెవెన్ వెనుకబడినట్టు కనిపించిన తరుణంలో, హషీం ఆమ్లాతో కలిసిన తిసర పెరెరా పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను కేవలం 19 బంతులు ఎదుర్కొని, ఐదు సిక్సర్ల సాయంతో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారీ సిక్సర్‌తో అతను మ్యాచ్‌ని ముగించడం విశేషం. 55 బంతులు ఎదుర్కొన్న హషీం ఆమ్లా 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 72 పరుగులు సాధించి నాటౌట్‌గా ఉన్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాకిస్తాన్ మొదటి మ్యాచ్‌ని గెల్చుకోగా, రెండో మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవెన్ గెలిచింది. ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలవడంతో, చివరిదై మూడో మ్యాచ్ ఫలితం సిరీస్ భవిష్యత్తును తేల్చనుంది.
స్కోరుబోర్డు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫకర్ జమాన్ ఎల్‌బి శామ్యూల్ బద్రీ 21, అహ్మద్ షెజాద్ సి డేవిడ్ మిల్లర్ బి ఇమ్రాన్ తాహిర్ 43, బాబర్ ఆజం సి డేవిడ్ మిల్లర్ బి శామ్యూల్ బద్రీ 45, షోయబ్ మాలిక్ సి పాల్ కాలింగ్‌వుడ్ బి బెన్ కట్టింగ్ 39, ఇమాద్ వసీం సి ఇమ్రాన్ తాహిర్ బి తిసర పెరెరా 15, సర్ఫ్‌రాజ్ అహ్మద్ సి ఇమ్రాన్ తాహిర్ బి తిసర పెరెరా 0, సొహైల్ ఖాన్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174.
వికెట్ల పతనం: 1-41, 2-100, 3-135, 4-156, 5-157, 6-174.
బౌలింగ్: మోర్న్ మోర్కెల్ 4-0-20-0, బెన్ కట్టింగ్ 4-0-52-1, శామ్యూల్ బద్రీ 4-0-31-2, పాల్ కాలింగ్‌వుడ్ 2-0-18-0, తిసర పెరెరా 3-0-23-2, ఇమ్రాన్ తాహిర్ 3-0-29-1.
వరల్డ్ ఎలెవెన్: హషీం ఆమ్లా 72 నాటౌట్, తమీమ్ ఇక్బాల్ సి షోయబ్ మాలిక్ బి సొహైల్ ఖాన్ 23, టిమ్ పైన్ బి ఇమాద్ వసీం 10, ఫఫ్ డు ప్లెసిస్ సి షాదాబ్ ఖాన్ బి మహమ్మద్ నవాజ్ 20, తిసర పెరెరా 47 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (19.5 ఓవర్లలో 3 వికెట్లకు) 175.
వికెట్ల పతనం: 1-43, 2-71, 3-106.
బౌలింగ్: ఇమాద్ వసీం 4-0-27-1, సోహైల్ ఖాన్ 4-0-44-1, ఉస్మాన్ ఖాన్ 1-0-10-0, రుమాన్ రయిస్ 3.5-0-36-0, మహమ్మద్ నవాజ్ 3-0-25-1, షాదాబ్ ఖాన్ 4-0-32-0.
చిత్రం.. హషీం అమ్లా (72 నాటౌట్)