రాష్ట్రీయం

భద్రాద్రికి కొత్త శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: భద్రాచలం ఆలయాన్ని దేశంలోనే అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రస్తుత దేవాలయానికి ఉత్తరం, పడమర వైపునున్న స్థలాలతో కలిపి దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి పర్చడానికి చిన్నజీయర్ స్వామి చేసిన సూచనలకు అనుగుణంగా ఆలయ శిల్పి ఆనంద్‌సాయి బృందం రూపొందించిన దేవాలయ అభివృద్ధి నమూనాలపై ప్రగతి భవన్‌లో బుధవారం మంత్రు లు, అధికారులతో సిఎం చర్చించారు. గోదావరి నది సరిగ్గా భద్రాచలం ఆలయం దగ్గరే మలుపు తిరిగి తూర్పునకు ప్రవహిస్తుందని, కొద్దిదూరం పోయిన తర్వాత ఉత్తర వాహినిగా మారుతుందని సిఎం అన్నారు. శ్రీరామచంద్రుడు కూడా పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు వచ్చి ఇదే ప్రాంతంలో నడియాడాడన్నారు. ఈ కారణాల వల్ల భద్రాది ఆలయానికి ఎంతో స్థల మహత్యం, పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందన్నా చెప్పారు. భద్రాద్రి ఆలయాన్ని ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా అభివృద్ధి చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. శ్రీరామ చంద్రుడిని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా పూజించడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారన్నారు. రాముడు అందరి దేవుడు. ఆయన కొలువుదీరిన భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఒరిస్సాల నుంచీ పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజిస్తారన్నారు. సీతారామ కళ్యాణం సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లక్షలాది మంది తరలివచ్చినా ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా భగవంతుడి దర్శనం, గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడానికి అనువుగా ఏర్పాట్లు ఉండాలన్నారు. భక్తులు ఇక్కడికి రావడానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగూడెం- భద్రాచలం మధ్యన విమానాశ్రయం నిర్మిస్తున్నాం. అలాగే కొత్తగూడెం వరకూ ఉన్న రైలుమార్గాన్ని భద్రాచలం వరకు పొడిగించే ప్రతిపాదనలను ఇప్పటికే రైల్వేశాఖకు పంపించినట్టు సిఎం గుర్తు చేశారు. గోదావరి, ప్రాణహిత నదులవెంట రహదారి నిర్మించడం వల్ల మహారాష్ట్ర వరకు రహదారి సౌకర్యం కలుగుతుందన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అటు చత్తీస్‌గడ్, ఒరిస్సా రాష్ట్రాలకు కలిపే రహదారులు నిర్మిస్తున్నామన్నారు. అలాగే గోదావరిపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జితోపాటు మరో బ్రిడ్జి నిర్మిస్తున్నామని వివరించారు. గోదావరిలో ఎల్లవేళలా నీరు నిలువ ఉండేలా ప్రాజెక్టులు కూడా వస్తున్నాయన్నారు. యాత్రికులు పడవ ప్రయాణం కూడా చేయవచ్చన్నారు. అన్ని విధాలా భద్రాచలం ఆలయాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
యాదాద్రి, వేములవాడ, భద్రాచలం తరహాలోనే బాసరకూ స్తపతులను పంపించి దేవాలయ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
15న అర్చకులతో సమావేశం
అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ఈనెల 15న ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నట్టు సిఎం చెప్పారు. అర్చకుల వేతనాలు పెంపు, చెల్లించే విధానం, దూప, దీప నైవేద్యం తదితర అంశాలపై చర్చించనున్నట్టు చెప్పారు. దేవాలయ భూముల పరిరక్షణ, ఆలయాల పరిరక్షణ జరగాలన్నారు.
చిత్రం.. హైదరాబాద్‌లో బుధవారం అధికారులతో ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్