తెలంగాణ

జీవో 39ని రద్దు చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జివో నెం.39ను వెంటనే రద్దు చేయించాలని అఖిలపక్ష నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, టిడిపి మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి, కిసాన్, ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి తదితరులు కలిసి, ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు చేస్తే తప్పేమిటీ? అని ప్రశ్నించారు. అందుకు రమణ, చాడ స్పందిస్తూ రైతు సమన్వయ సమితుల ఏర్పాటును తాము తప్పుపట్టడం లేదని, పూర్తిగా టిఆర్‌ఎస్ కార్యకర్తలతో నింపకుండా గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి రైతులకు లబ్ది చేకూర్చాలన్నదే తమ అభిమతమని చెప్పారు.
రెవెన్యూ శాఖ అధ్వర్యంలో రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని, వీటి ఏర్పాటుకు ముందు కనీసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఉంటే బాగుండేదని మిగతా నాయకులు గవర్నర్‌తో అన్నట్లు సమాచారం. గవర్నర్‌తో సమావేశానంతరం భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ జివో నెం. 39 కేవలం టిఆర్‌ఎస్‌కు సంబంధించిన రాజకీయ అవసరాలు తీర్చడానికే ఉపయోగపడుతుందని విమర్శించారు. తాము చేసిన ఫిర్యాదుకు గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ జివో 39 రాజ్యాంగ విరుద్ధమని, రైతు సమన్వయ సమితుల పేరిట టిఆర్‌ఎస్ నాయకులకు, కార్యకర్తలకు దోచి పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన అని విమర్శించారు. ఈ జివోను రద్దు చేసేంత వరకూ తాము పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతు సహకారం పేరిట టిఆర్‌ఎస్ నేతలు ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ మాట్లాడుతూ జివో నెం.39పై త్వరలో అన్ని సంఘాలతో కలిసి హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. 15న వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట దీక్ష చేపడతామని ఆయన తెలిపారు. వచ్చే నెల 2న అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. విపక్షాల విన్నపాన్ని గవర్నర్ చాలా ఒపికగా విన్నారని ఆయన తెలిపారు.