ఆంధ్రప్రదేశ్‌

రబీకి నీటి కరవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 18: గోదావరి నదిలో నీటి లభ్యత చాలా చిత్రమైన రీతిలో ఉంటోంది. ఖరీఫ్ కాలంలో వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన గోదావరి నీరు రబీ వచ్చేసరికి బొట్టు బొట్టు లెక్కపెట్టుకుని సాగునీటి అవసరాలకు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. గోదావరి బేసిన్‌లో ఈసారి రబీ సాగుకు కడగండ్లు తప్పేట్టు లేదు. ప్రస్తుత నీటి లభ్యత అంచనా ఆధారంగా ఈ ఏడాది రబీని కేవలం 71 శాతం ఆయకట్టుకే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. గత 20 ఏళ్ల నీటి లభ్యతను అధ్యయనం చేయడంద్వారా జలవనరుల శాఖ యంత్రాంగం రానున్న రబీకి సాగునీటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. నూటికి నూరుశాతం ఆయకట్టుకు నీటిని సర్దుబాటు చేయలేమని జల వనరుల శాఖ ఇంజనీర్లు అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా నీటిని పొదుపుగా వినియోగించుకుని, అవసరమైతే క్రాస్‌బండ్లు వేసి, శివారు మెట్ట ప్రాంతాల్లో వరికి బదులు చిరు ధాన్యాలు సాగుచేసుకుని రబీ నుంచి గట్టెక్కాల్సిన పరిస్థితి ఉందని అధికార్లు పేర్కొంటున్నారు. రైతులు ఈ పరిస్థితికి తగ్గట్టుగా సమాయత్తం కావాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.
వాస్తవానికి ఈ ఏడాది వరదల సీజన్‌లో గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో కూడా వరద రాలేదు. ఏడాది మొత్తం వరద సీజన్‌ను పరిశీలిస్తే గోదావరి నది కాటన్ బ్యారేజీ నుంచి అత్యధికంగా 5.6 లక్షల క్యూసెక్కులు మాత్రమే డిశ్చార్జి జరిగింది. మొదటి హెచ్చరిక జారీచేయాలంటే 11.75 అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉండాల్సి వుంది. ఆ సమయంలో సుమారు 11 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని సముద్రంలోకి విడిచిపెడతారు. ఆ స్థాయి వరదే ఈ ఏడాది గోదావరి చవి చూడలేదు. ఈ నేపథ్యంలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుందని అంచనావేసి, రబీ అవసరాలకు సాగునీరు పూర్తి స్థాయిలో అందించలేమని జల వనరుల శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
కేవలం 71 శాతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందించగలమని అంచనా వేస్తున్నారు. అయితే రైతులు మాత్రం నూటికి నూరు శాతం ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. నిర్ధేశిత ప్రణాళిక ప్రకారం గోదావరి బేసిన్‌లో డిసెంబర్ నెలాఖరుకల్లా ఖరీఫ్ పూర్తికానుంది. మొత్తం 10 లక్షల 13వేల ఎకరాల ఆయకట్టుకు గాను ఉభయ గోదావరి జిల్లాల్లో 8 లక్షల 96వేల 533 ఎకరాల సాగు జరిగింది. మొత్తం 120 టిఎంసిలతో ఖరీఫ్ సాగయిందని ధవళేశ్వరం ఎస్‌ఇ రాంబాబు చెప్పారు. అయితే రబీ అవసరాలకు ఇన్‌ఫ్లో చాలా తక్కువ వుంది. కేవలం 28 టిఎం సిలు మాత్రమే సహజ నీటి లభ్యత అంచనా వేశారు. సీలేరు నుంచి 49.5 టిఎంసిలు రావచ్చని అంచనావేస్తున్నారు. ఇందులో పంపిణీ నష్టం, ఏడున్నర టిఎంసిలు తాగునీటి అవసరాలకు పోను మిగిలిన జలాలతో కేవలం 71 శాతం ఆయకట్టుకు మాత్రమే సరఫరా చేసే అవకాశం ఉంటుందని అంచనావేస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ నెల 23వ తేదీన కాకినాడలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లా మంత్రుల సమక్షంలో జరిగే సాగునీటి సలహా మండలి సమావేశంలో చర్చించనున్నారు. రబీ నీటి అవసరాలకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అఖండ గోదావరి నది నీటి లభ్యతను బట్టి అంచనావేస్తారు. ఈ ఏడాది మాత్రం 2009 నాటి పరిస్థితి ఉత్పన్నమయ్యే స్థితి కన్పిస్తోంది. రబీ ఆయకట్టు అవసరాలు తీరాలంటే కనీసం 83 టిఎంసిలుండాలి. 20 ఏళ్లలో అతి తక్కువ నీటి లభ్యత ఉన్న కాలాన్ని ప్రామాణికంగా లెక్కవేస్తే కేవలం 24 టిఎంసిలతో సాగు చేశారు. 20 ఏళ్ల అధ్యయనంలో అతి తక్కువ నీటి లభ్యత, అతి తక్కువ నీటితో సాగు చేసిన రబీ సీజన్‌ను ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది 71 శాతానికి మించి ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే రైతుల నుంచి నూరు శాతం ఆయకట్టుకు నీరివ్వాల్సిందేననే డిమాండు తప్పనిసరిగా వినిపిస్తుంది. మధ్యేమార్గంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి వుంది. అయితే నీటి లభ్యత మేరకు 59 టిఎంసిల నీటితో పాటు కనీసం కనీసం మరో 10 టిఎంసిల నీటిని రాబట్టుకున్నప్పటికీ, 78 శాతం ఆయకట్టుకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ నీరివ్వలేని స్థితి ఈ సారి రబీకి గోదావరి బేసిన్‌లో ఎదురవుతుందని అంచనా.