సాహితి

అనుభూతిని వీడదు.. వాస్తవాన్ని వదలదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Poetry lives its way to truth - Johnciard

కవిత్వం కేవలం పద్యంలోనే, వచన కవితగానే, లేదా పదో పాతికో ముప్పాతికో అక్షరాల పరిధిలోనే నిక్షిప్తం చేసేదిగా వుండాలనే నియమాన్ని వుంచడమన్నది, నియంత్రణ గీతల్ని విధించడమన్నది కవిత్వతత్వ విశృంఖలత్వాన్ని, కవి స్వేచ్ఛని బంధించడమే అవుతుంది. నిజమైన కవి వీటికి అతీతుడనే తెలుస్తుంది. అంతేగాక ఏ పలుకులు ఏ అక్షరాలు, ఏ కొలతలు, ఆ ప్రక్రియదారుడు నేర్పించాడో ఆ పలుకుల్ని ఆ అక్షరాల్ని మాత్రమే వినిపించడం వలన స్పందన కరువవుతుంది. కవి పంజరంలోని పక్షి కాదు, ఆకాశంలో విరబూసిన ఇంద్రధనసులపై నక్షత్రాల సొగసుల మధ్య వెనె్నల వెలుగులలో పూవుల పొదలపై స్వేచ్ఛగా ఎగిరే ఓ రంగురంగుల సీతాకోకచిలుక, ఓ రంగుల పక్షి.
కవిత్వం స్వచ్ఛతని స్పష్టతని సంతరించుకోవాలంటే కవిలో చెలరేగిన భావాలకి పరిపుష్టికరమైన అక్షర రూపాల్నివ్వడం, పటిష్టమైన వాక్య నిర్మాణాన్ని గావించడమేనన్న విషయాన్ని గుర్తెరిగి కావ్యాన్ని సృజించడమన్నది సాహిత్యాన్ని శాశ్వత సత్యమని భావించేవారు అంగీకరిస్తారు. నూతనంగా సాహిత్య సృజన చేసేవారు పై విషయాల్ని నిరంతరం గుర్తుంచుకోవలసి వుంటుంది. స్వచ్ఛమైన కవిత్వపు చెలమ కోసం తను పట్టుకున్న కలం వేళ్లతో కాగితం మీద అక్షరాల్ని తోడటం, అనుభవించిన ఆస్వాదించిన వాటిని సరైన ఆలోచనలతో కవితని కదపడం, తాను తపించి తన్నుతానుగా లోకంతో మమేకమవుతూ తన్మయత్వంలోంచి వొలికిన భావాన్ని పలుకులలో చిలకరించడమేగాక సమాజంపట్ల, కరుణతో కూడిన ఆవేదనని ఆవేశాన్ని వాక్యాలుగా కావ్యాలుగా విపులీకరించడం కవి సమయం.
లోకంలో ఒక్కో పువ్వు ఒక్కో విధంగా తన అందాల్ని మకరందాల్ని బహిరంగంగా చాటుకునే విధంగానే కవి తన భావాల రంగుల్ని వెదజల్లుతాడు. ఒక్కో భావాన్ని ఒక్కో కవి ఒక్కో రకంగా బహిర్గతపరుస్తాడు. పూలలో పలు రకాలున్నట్టే తాము స్పందించే తీరులో వివిధ గుణాలతో అనేక విషయాలతో ప్రతిస్పందించడం జరుగుతుంది. ఒక్కో పువ్వు ఒక్కో రకంగా వుండటమే గాక తనదైన స్వంత పరిమళాన్ని వెదజల్లడం సహజం. కవులు ఈ విషయాన్ని గమనిస్తే తమ కవిత్వంలో తమ తత్వమేమిటో స్వేచ్ఛగా స్వచ్ఛంగా వెదజల్లి తమదైన శైలితో సాహిత్యంలో అలరారడం జరిగి తీరుతుంది. ఒక్కో సంఘటనని, ఒక్కో పరిస్థితిని తాను సంఘర్షించే విధివిధానంలో లోకానికి అందించడంతో తన స్థితి పాఠకునిలో సహానుభూతిగా నిలిచిపోయే పరిస్థితి వుంటుంది. తాను అనుకున్నది వేరొకరిదిగా గాక, అరువు సరుకుగా గాక తనదిగా తనలోలినతనంగా మనకు అగుపిస్తుంది. వ్యక్తీకరణ అనుకరణ, అనుసరణ కానప్పుడు పదం, వాక్యం, కావ్యం నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. అక్షరం కూడా విలక్షణంగా ప్రకాశిస్తుంది. అలాకాని పక్షంలో ఆ కవిత్వం తనదిగా గాక వేరొకరి వాక్యాన్ని కావ్యాన్ని గుర్తుకుతెస్తుంది. తన్ను తాను కోల్పోవడమే గాక వేరొకరిని స్ఫురణకు తెస్తుంది.
Immature poets imitate, mature poets steal - T.S.Eliot

ఎందరు కవులైనా సరే, తీసుకున్న వస్తువు ఒకటే అయినా తాము ప్రదర్శించే తీరులో భిన్నత్వాన్ని, కొత్తదనాన్ని సంతరించుకుంటే సహచర సాహితీపరునికి, పాఠకునికి నూతనత్వాన్ని సందర్శింపజేస్తుంది. లోకమంతా కవితా ప్రపంచంగా అగుపిస్తుంది. కవితా దృష్టితోనే లోకాన్ని దర్శిస్తుండటం జరుగుతుంటుంది. ఏ పుస్తకాన్ని పట్టుకున్నా, ఏ కాగితాన్ని ముట్టుకున్నా చూపు కవిత్వానే్న వెదుకుతుంది. ఎక్కాల్లో సైతం నింగి చుక్కల అందం అగుపిస్తుంది. లోకమంతా కవితామయంగానే కనిపిస్తుంది. కవి విషయాలన్నింటిలనూ అంతర్ముఖుడై, బాహ్యసఖుడై తనలోని తనంతో లోకంతో తన్మయుడై స్పందించడం అందించడంతో రచన కొంగ్రొత్తని సంతరించుకుని ఆధునికతని కలిగించుకుని అగుపించడం జరుగుతుంది. సాహిత్యంలో ఆధునికత వస్తుపరంగానూ, వ్యక్తిపరంగానూ, వ్యవస్థపరంగానే గాక భాషాపరంగా అభివ్యక్తిపరంగా రచన నూతనత్వంగా అగుపించడం జరుగుతుంది. ప్రేమగాని, పేదరికంగాని, పోరాటాన్ని గాని ‘మడి’ ‘కట్టు’ పదాలతో ‘పడి’ ‘కట్టు’ నినాదాలతో గాక గుండె తడి కట్టు విధానాలతో సరికొత్త వాక్య నిర్మాణంతో భావాన్ని చెప్పడం వలన వస్తువు ఒకటే అయినా భిన్నంగా దర్శనమివ్వడం అనేక రూపాలుగా సందర్శనమివ్వడం కనిపిస్తుంది.
Poetry is the suggestion by the imaginations of
noble grounds for noble emotions - Jhon Roskin
పక్షుల కిలకిలరావాలతో నిండిన చెట్టును చూసిన ఒక కవి ఆ వృక్షాన్ని ఆకుపచ్చని వాయిద్యంతో పోల్చడంతో పాఠకుడు ఒక నూతనత్వాన్ని ఆస్వాదిస్తాడు. చెట్టుకి పూచిన తెల్లని పువ్వులన్నీ ఒక్కసారిగా నింగిలోకి ఎగిరిపోవడం చూసి అవి పువ్వులు కావు తెల్లని కొంగలని తెలుసుకున్నప్పుడు జరిగే విభ్రాంతితో కవితను చెప్పినప్పుడు సహానుభూతిపరుడు తన్మయవౌతాడు. కవితతో కవితో బాటు భావ వీధిలో విహరిస్తాడు.
ఒక రాయినో, మట్టిముద్దనో తీసుకున్న శిల్పి వివిధ ఆకృతుల్ని ఎలా నిర్మించగలడో, కవి అనుభూతిని తనదైన ఆలోచనాకృతుల్ని అనుసరించి వివిధ రూపాలుగా కవితని అలరింపజేయడం జరుగుతుంది. మిణుగురు పురుగు రాత్రివేళలో జ్వాలాకణిక ప్రాణులుగా, కాంతి రెక్కలు విప్పుకుని ఎగురుతున్న నక్షత్రాలుగా మనల్ని ఆశ్చర్యానికి గురిచేసినట్టే, కొత్తదనం సంతరించుకున్న వాక్యం, కవిత్వం, కావ్యం అద్భుతమనిపిస్తుంది. కవిత్వం వాస్తవాన్ని కాదనదు, అనుభూతిని వదలదు, వాస్తవ అనుభూతుల నడుమ సత్యాన్ని వీడదు. రసమయమైన ధ్వని, శే్లష విశే్లషణల శైలితో ఊరించి ఊరించి కవి తెలివిని బహిర్గత పరచనిదే ససేమిరా ఊరుకోదు.
కవులు తమ తొలి దశలో సామాజిక సిద్ధాంతాన్ని చర్వితచరణంగా కవితా చరణాల్లో గుప్పిస్తున్నారేగాని, సామాజికంగా మార్పు చెందుతున్న జీవన సిద్ధాంతాల్ని వాటి మార్పుల్ని గమనించడమన్నది అరుదైపోయింది. ఈ నేపథ్యంలో నాటి సాంఘిక ఆర్థిక మానసిక స్థితిగతుల్నే అనుసరించి, అనుకరించి, అనువదించి వ్రాయడంతో తాము మొదటి దశలోనే ఆగిపోవడం వలన మారుతున్న చారిత్రక అంశాల్ని గమనించకపోవడంతో తాము వ్రాస్తున్న వాటిల్లో నూతనత్వాన్ని అందించడంలో వైఫల్యం చెందడంతో పాటు అటు సైద్ధాంతికంగానూ, భాషాపరంగానూ, భావ పరంగానూ తమ రచనల్లో కొత్తదనం అగుపించక గత కాలం కొలమానంగా నిలిచిపోవడంతో స్పందన కనిపించక నిస్తబ్దత ఆవహించి రచనల్లో స్తబ్దత చోటుచేసుకోవడంతో సహానుభూతి పరంగా ప్రతిస్పందన కనుమరుగైపోతోందన్నది వాస్తవం.
వ్యక్తిగతంగా ఏకాంతాన్ని పొందగలిగినప్పుడు, వ్యవస్థాపరంగా సామూహిక ఆలోచనలతోపాటు ఆచరణ కలిగినప్పుడు తన కవిత్వాన్ని రసాత్మకంగా పొందుపరచి కవి అనుభూతిని పొందగలడు, సహానుభూతిని అందించనూగలడన్న విషయంలో ఏమాత్రం సందేహముండదు. ఏమాత్రం కించిత్తు స్పందన కలగనీయని రచన ఎవరిదైనా సరే వర్తమానంలోనే కనుమరుగవక మానదు. భవిష్యత్ సూచికకు ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. సాహిత్యమన్నది గత వర్తమాన భవిష్యత్తులో చెదిరిపోని చెరిగిపోని దశలో స్థిరంగా నిలుస్తుంది. స్థిరత్వాన్ని సంతరించుకున్న సాహిత్యాన్ని ఏ సిద్ధాంతమూ ఏ కాలమూ ఒక్క అక్షరం సైతం చెరపలేదు. కారణం కాలాతీత సత్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకొని కవిత్వం కాంతివంతంగా నిరంతరం ప్రకాశిస్తూ ప్రతిఫలించడమేనన్నది వాస్తవం. చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన రచనలన్నీ మనకు ఆ సత్యాన్ని తెలుపుతుండటం నిలువెత్తు నిదర్శనం. నాటి సాహిత్యంలో కాల్పనికత మార్మికత ప్రధానాంశాలుగా రచన సాగిందని విమర్శించినా ఆ కాలాన్ని దర్శించిన వారెవ్వరూ లేనందున వాటిలోని వాస్తవ విషయాల్ని నేటి సమకాలీన స్థితులతో సమీక్షించి విమర్శించడమే అవుతుంది. కాళిదాసు ఎక్కడ కూచొని మేఘసందేశం వ్రాశారో గాని భౌగోళిక పరిస్థితుల్ని, పర్వతాల శ్రేణుల్ని తన రచనలో ప్రస్ఫుటంగా విపులీకరించడం వాస్తవంగా అగుపించడం నేటికీ ఆ ప్రదేశాలుండటం గమనార్హం. విశ్వనాథ సత్యనారాయణ నేపాల్‌కి వెళ్లి ఎనే్నళ్లున్నారో లేక విజయవాడలోనే కూచొని నేపాల్ స్థితిగతుల్ని, అక్కడి ఆచార వ్యవహారాల్ని, రాజ ప్రసాదాల్ని, అందులో జరిగే వ్యవహారాల్ని వ్రాశాడో గమనిస్తే రచన ఊహని వాస్తవాన్ని ఏకీకృతం చేసే సత్యసాధనం. కవిత్వం జీవితానికి ఏకైక సత్యశోధన శాశ్వత జీవపరికరం అన్నది వాస్తవం.
కాలానుసారంగా చెట్టుకున్న ఆకులు పూలు రాలుతున్నా నేలలో వేళ్లు నిలదొక్కుకుని చెట్టు కూలిపోదు, కారణం శాశ్వతమైన మట్టితో అవి మమేకం చెందడమేనని మూలాల్లోంచి వచ్చిన రచన వృక్షమై శాశ్వతంగా సత్యమై నిలిచి భాసిస్తుందని తెలుస్తుంది. తాత్కాలిక సిద్ధాంతాలన్నీ ఎండి రాలిన ఆకులై, వాడిన పూవులై కాలగర్భంలో కలిసిపోవడం మనకగుపిస్తుంది. కవిత్వంలో ఎన్ని సిద్ధాంతాల్ని కూర్చి పేర్చినా కవిత్వమే సత్యప్రామాణికమైన ఏకైక సిద్ధాంతం. కవిత్వం లేని సిద్ధాంతం లోకాన అనవసరమైన రాద్ధాంతం. సిద్ధాంతాలు తాత్కాలికం కవిత్వం శాశ్వతం.

- యక్కలూరి శ్రీరాములు 09985688922