సాహితి

పంజరానికి చిక్కని కవి పొట్లపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతజయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా...
*
మిత్రులు పొట్లపల్లి వరప్రసాదరావుగారు ఈ మధ్య కలిసి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి తరం తెలంగాణ మేధావి, మరుగునపడిన మహాకవి పొట్లపల్లి రామారావుగారి శతజయంతి ఉత్సవాలు జరుపుతున్నామని తెలుపగానే చాలా ఆనందం కలిగింది. ఇంతకుముందు పొట్లపల్లి రామారావుగారి గురించి ఆ నోటా ఈ నోటా వినడమే గానీ వారి రచనలు చదివే అవకాశం మాత్రం లభించలేదు. వీరి పేరు కూడా నేను వినే అవకాశం కలగడానికి కారణం మా తండ్రిగారైన శ్రీ కోటగిరి వెంకట నరసింహ సత్యనారాయణరావు (బుచ్చినాయన) కూడా రచయిత కావడమే.
*
మాజిక తాత్విక చింతనలో కలాన్ని ముంచి జనహితం చేసిన కవులలో అగ్రగణ్యుడు. కవిత్వంతో ఆడుకున్నాడు. నాలుగు నాటకాలే రాసినా గ్రామీణ తైలవర్ణ చిత్రాలుగా మలిచాడు. ఏనాడూ కీర్తి ప్రతిష్ఠల కోసం వెంపర్లాడలేదు. అవి వచ్చి తన ముంగిట్లో వాలినా వాటి దిక్కు చూడలేదు.
ఏ రచయిత అయినా తన రచనలు చదవడానికి ఉపక్రమించే పాఠకుడిని ‘ఆదరభావంతో ఆహ్వానించి, ఆత్మీయుడిని చేసుకోవడం రచయిత విధి అయిపోతుంది’ అని రామారావుగారే చెప్పుకున్నట్లు... వీరి రచనలు చదువుతుంటే వీరు అదేవిధంగా పాఠకుడిని తన రచనలలోకి ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. బడికి సరిగా వెళ్లని కారణంగా బడినుంచి బహిష్కరించబడ్డ ఒక విఫల విద్యార్థి మానవ జీవితంలో అనివార్యమైన సుఖ దుఃఖాలను, లాభ నష్టాలను, అసూయా ద్వేషాలను, మనిషి జీవితంపై వాటి ప్రభావాన్ని అత్యున్నతంగా అర్థం చేసుకొని... వాటి ప్రభావానికి లోనైన మనిషి ప్రవర్తన ఎలా వుంటుందో, ఈ ప్రేరణలను అధిగమించి జీవితాన్ని ఎలా సాఫీగా గడపాలో తెలుపుతూ చాలా విలువైన సూచనలు తన రచనలద్వారా అందజేశారు. ఆయన చదివిన చదువులు, అధ్యయనం చేసిన శాస్త్రాలు, గడించిన అనుభవాలు ఏవీ లేవంటూనే - చదువులలో మర్మాన్ని, మానవ జీవితపు పరమార్థాన్ని ఔపోసన పట్టినట్లు అనిపిస్తుంది. లేకపోతే మనిషి నిరంతరం ఆత్మవిమర్శతో కూడిన ఆలోచనలు చేస్తూ ఉంటే అవి ఆచరణ రూపుదాల్చి మనిషిని శ్రేయోమార్గంవైపు నడిపించడంలో ప్రముఖ పాత్ర వహించగలవని ఇంత ఘంటాపధంగా ఎవరు చెప్పగలరు?
ఇక జీవితంలో నేను గడించిన అనుభవం లేదన్న వీరి మాట సాధారణంగా విజ్ఞులు ప్రకటించే వినమ్రతే తప్ప, వీరు మానవ జీవిత సారాన్ని కాచి వడబోశారని, వీరు తన రచనలలో చాలాచోట్ల అనుభవ సారాన్ని... వాస్తవాలుగా కళ్లకు కడుతూ పాఠకులను జీవితం పట్ల జాగరూకులను చేయడం చూసినప్పుడు అనుభవంలోకి వచ్చింది, తెలిసిన విషయాలే అయినా. వాటిని ఇంపైన పౌరాణిక, చారిత్రక, సమకాలీన ఉపమానాలతో సరళమైన రీతిలో మనసుకు హత్తుకునేలా పాఠకుల హృదయ ఫలకాలపై ముద్రించారు. ఒక అంతర్ముఖుడైన కవి, ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడే వ్యక్తి, సమాజాన్ని, దాంట్లో మనుషులను, వారి ప్రవర్తనలను ఎంతో గాఢంగా పరిశీలించి, అనుగమిస్తే తప్ప ఈ స్థాయి రచనలు చేయలేరేమో అనిపించడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో వారి ‘చుక్కలు’ కావ్యంలోని కొన్ని కవితలు పరిశీలిస్తే వారి వైశిష్ట్యం అవగతమవుతుంది.
‘పంజరంలో పక్షి మోస్తరు ఉన్నది నా బ్రతుకు
కామ, క్రోధ, లోభ, మద, గర్వాదులతో కూడిన
భౌతికావధులనతిక్రమించి, విశ్వాత్మలో లీనం కావాలని
ఆత్మ అనవరతం ఆరాటపడుతూ ఉంటుంది.
కానీ ఏమి ప్రయోజనం?
పంజరంలో పక్షిబ్రదుకు ఎంతో నా బ్రతుకు అంతే.’
స్వేచ్ఛకు సంకెళ్లు వేసుకొని మనిషి స్వార్థం అనే పంజరంలో బందీ అయి పడుతున్న బాధను చూసిన గ్రంథకర్త ఆవేదన చెందుతాడు. ఒంటరిగా వచ్చి - ఒంటరిగానే ఉత్త చేతులతోనే వెళ్లిపోయే మనిషి జీవితంలో అలా పంజరంలో పక్షిలా కాకుండా... స్వేచ్ఛగా, ప్రేమగా, ఏ కల్మషాలు లేకుండా అందరితో కలిసిపోయి బ్రతికి, మరణం వచ్చినప్పుడు ఏ బాదరబందీ లేకుండా విశ్వాత్మలో లీనం కాగలిగితే మనిషి జీవితం ధన్యమే కదా!
జీవితంలో ప్రతిసారీ విజయమే సాధించేవాడికి విజయం సాధించడంలో ఉన్న ఆనందం అంతుపట్టదు. విజయాన్ని సంపూర్ణంగా అనుభవంలోకి తెచ్చుకుని దాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే ఒకసారి అపజయాన్ని చవిచూడాలి. అందుకే రచయిత ‘చేదు మ్రింగ నేర్చినవాడే అమృత మాధుర్యాన్ని చవి చూడగలుగుతాడు’ అని తేల్చేశారు. అనునిత్యం అమృతమే తాగేవాడికి దాని రుచిలోని మాధుర్యం అర్థం కాదు. ఒకసారి చేదును మ్రింగితే గానీ అమృతపు మాధుర్యం అనుభవంలోకి రాదు కదా! ఇక మనిషి ఆనందం అనే అమృతాన్ని పొందాలంటే ఎంతో కష్టపడవలసి ఉంటుంది. మానసికానందం అనుభవంలోకి రావాలంటే మనిషి చాలా కష్టపడాలి. ఎంతో అంతర్మథనం జరుపుకోవాలి. ఈ అంతర్మథనంలో ఎదురయ్యే మనోక్లేశాలను దిగమింగుకోవాలి. మాయలో పడకుండా మనల్ని మనం కాపాడుకోగలగాలి. అప్పుడే సంపూర్ణ మానసికానందం కలుగుతుందని రామారావుగారి భావన.
ఇక ప్రభుత్వాల విషయానికొస్తే వాటిని నడుపుతున్న నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలను ఏవిధంగా భావిస్తున్నాయి. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఏమి చేస్తున్నారు. ఉచితాలు, సబ్సిడీల పేర్లతో పేదవారు, ప్రభుత్వంపై ఆధారపడేలా ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వాల వైఖరిని క్షమించవచ్చా? ఈ సందర్భంలో రామారావుగారు ఏమంటారో చూడండి...
‘ప్రభుత్వాలు ఎన్ని లోపాలు చేసినా క్షమించవచ్చు
ప్రతి స్వల్ప కార్యానికి, ప్రతి సాధారణ విషయానికి
తమ దిక్కు చూసేంత నిర్వీర్యులను, నిస్సహాయులుగా
ప్రజలను చేయడమనేది క్షమించరాని నేరం’
ఈ ధిక్కారం తరాలు మారినా పేదవారిని స్వయం పోషకులుగా తీర్చిదిద్దలేని వ్యవస్థ మీద... ఏ చిన్న సమస్య వచ్చినా నిస్సహాయంగా ప్రభుత్వంవైపు చూసే అభాగ్యుల దీన పరిస్థితిపైన... పేదవారిని తమ కాళ్లపై తాము నిలబడగల స్థాయికి తీసుకురాలేకపోతున్న ఈ ప్రభుత్వాల పనితీరు మీద... ఈ ధిక్కారంతో పాటు ఈ ప్రభుత్వాలు ఈ పేద ప్రజలను తమపై ఆధారపడకుండా జీవించగలిగేలా తీర్చిదిద్దాలనే ఆశ కూడా కనపడుతుంది.
ఇక ప్రతి మానవుడు కాంక్షించేది కీర్తి. మానవుడికి కీర్తి కూడా ఒక బలహీనతే. పొగడ్తలు మత్తుమందు లాంటివి. అవి మొదట మన అదుపులో ఉన్నట్లు అనిపించినా, క్రమక్రమంగా అవి లేకపోతే మనం జీవించలేని స్థితికి తీసుకువస్తాయి. ఒకసారి మనం ఈ కీర్తి మత్తులో మునిగితే... అది మన జీవితంలో అనివార్యమై ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని ద్వేషించడం కూడా మొదలవుతుంది. అది మన వ్యక్తిగత పతనానికి దారితీస్తుంది. ఈ కీర్తి గురించి రామారావుగారు ఏమన్నారో చూద్దాం.
కీర్తి చాలా బలవర్ధకమైన ఔషధం.
అంతేకాదు, అతి రుచికరమైనది.
దానితోబాటు ప్రమాదకరమైనది కూడా.
దానిని ఎంత తక్కువ మోతాదులో వాడితే
అంత పుష్టి ఇస్తుంది.
కాని రుచికి భ్రమసి అదేపనిగా తినడం ఆరంభిస్తే
శరీరం - బుద్ధి, ఇంద్రియాలు దేనికది స్తంభించి
ఎందుకూ పనికిరాకుండా పోతాయి.
కాబట్టి కీర్తి రాగానే పొంగిపోయి, అహంకరించి వ్యక్తిత్వ హననం చేసుకోకుండా... దాన్ని ఔషధమాత్రంగా స్వీకరించి మన పని మనం చేసుకోవడం మంచిదనే సూచన కూడా ఇందులో ఉన్నది.
‘జాతస్య మరణం ధృవం’ - అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఈ సత్యాన్ని మనిషి తొందరగా అంగీకరించలేడు. సాధ్యమైనంత వరకు మృత్యువును దరిచేరకుండా చేయాలని తపన. తరుముకొస్తున్న మృత్యువునుంచి తప్పించుకోవాలని తపన. మృత్యువును దరిచేరనీకుండా పోరాడాలని చూస్తే బడికి రానని మారాం చేసే పిల్లవాడిని ఈడ్చుకుపోయినట్లు ఈడ్చుకుపోతుంది మృత్యువు - అంటారు రామారావుగారు.
‘మృత్యువు పిలిచినప్పుడు
అభ్యాగతి ఇంటికి వెళ్లే అతిథి మోస్తరు
మర్యాదగా పోవడం మంచిది
లేకపోతే -
బడికి రాని బండ పిల్లవాడిని
ఈడ్చుకుపోయినట్లు
ఈడ్చుకుపోతుంది మృత్యువు.’
మృత్యువు పిలిచినప్పుడు మర్యాదగా వెళ్లకపోతే... బడికి పోని బండ పిల్లవానిని బడికి ఈడ్చుకుపోయినట్లు అనే ఉపమానం పడింది ఇక్కడ. బండ పిల్లవాడు రోడ్ల వెంట ఆడుతూ పాడుతూ తిరుగుతూ, ఇదే సుఖం, ఇదే ఆనందం, ఇదే శాశ్వతం అనుకొంటూ అజ్ఞానంతో బడికి వెళ్లనని మారాం చేస్తుంటాడు. అయితే అతని క్షేమాన్ని కాంక్షించే తల్లిదండ్రులు అతడిని ఈడ్చుకువెళ్లి బడిలో పడవేస్తారు. అదేవిధంగా ఈ జీవితమే శాశ్వతం అనుకొంటూ, ఇలానే జీవిస్తూ ఉంటానని మారాం చేసేవారి క్షేమాన్ని కాంక్షించే మృత్యువు కూడా తనవద్దకు ఈడ్చుకెళ్లిపోతుంది కాబట్టి మృత్యువు సమీపించినప్పుడు మర్యాదగా వెళ్లిపోవడమే మంచిదని పొట్లపల్లి భావన.
ఇలా పరిశీలిస్తూ పోతే వీరి ‘చుక్కలు’లోని ప్రతి కవిత్వపు చుక్క ఒక ప్రత్యేకమైన వెలుగుతో ప్రకాశిస్తూనే ఉన్నది. ఒంటరిగా ఉంటూ వీరి కాల్పనిక జగత్తులో వీరు తన అంతరంగ కాన్వాస్‌పై చిత్రించిన ప్రతి చుక్క తనను దర్శించిన వారి జీవనానికి ఒక చుక్కాని కాగల భావాన్ని తనలో ఇముడ్చుకొన్నది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అలానే రామారావుగారి ‘ఆత్మవేదన’ గేయాలు కూడా కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్లు మానవ జాతి యొక్క ఆత్మవేదనే. ‘రైతు-రాజు’లో రైతు చేసే శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని చాటిచెప్పినా, ‘దేవతలు వస్తారు’లో హృదయ దీపాన్ని వెలిగించి జాతికి దారిచూపే వారి వద్దకు దేవతలే వస్తారని చెప్పినా, ‘సాధన’లో పరుల పంచ జూడకుండా స్వశక్తిని నమ్ముకొన్నవారికి ఎదురే లేదని చెప్పినా, ‘హితోక్తి’లో అనుకరణలలో మ్రగ్గి ఆత్మను చంపవద్దని... తన ఆత్మనే స్పష్టంగా వ్యక్తీకరించాలని చెప్పినా, ‘జీవితము’లో నీ సుందర స్వప్నాలకు నిమిష, నిమిషమునకు నువ్వు నీ శక్తిని ధారపోస్తే అది సాక్షాత్కారమవుతుందని చెప్పినా... ప్రతి దానిలో ఒక నవీనత, భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శనం కనబడతాయి.
ఇదేవిధంగా రామారావుగారి ‘అక్షర దీప్తి’లోని కవితోక్తులు కూడా సమాజానికి వెలుగులు పంచగల దివ్వెలే. ఈ కవితోక్తులలో ఒకచోట వీరే చెప్పినట్లు ‘కవి ప్రయోగించిన శబ్దజాలంలో కవి ఆత్మశక్తి ప్రత్యక్షం కావాలె. ఆత్మశక్తి అక్షరబద్ధం చేయడం అంత తేలిక కాదు... ఎంతో సంకల్ప శక్తి, ఎంతో సంకల్ప శుద్ధి, సత్యంపట్ల కఠోర నిష్ఠ కావాలన్నట్లు’ వీరికి తన తగిన సంకల్ప శక్తి, శుద్ధి కలవు కాబట్టే వీరు వీరి ఆత్మదీప్తిని అక్షర దీప్తి చేయగలిగారు. ఇక భూపాల్‌రెడ్డిగారి సంపాదకత్వంలో కూర్చబడిన కవిత కుసుమాల మాల ‘నాలో నేను’ కూడా తన కవితా సౌరభాన్ని వెదజల్లుతూ, ఆఘ్రాణించే వారికి ఆహ్లాదాన్ని కలుగజేస్తూనే ఉన్నది.
ఇక రామారావుగారి వచన రచనలో మానవ జీవితంలో పలు పార్శ్వాలను స్పృశించే ‘జైలు’ కథా సంకలనం గానీ, అక్షర రూపంలో వ్యక్తీకరించడానికి అక్షరాలు సరిపోవు అనుకునే సైనికుల మానసిక సంఘర్షణను మాటల రూపంలో సమాజం ముందు పెట్టిన వీరి ‘సైనికుని జాబులు’ గాని, గ్రామీణ జీవిత చిత్రాన్ని మన కన్నుల ముందు సాక్షాత్కరింప చేసే గ్రామ చిత్రాలు, కథా సంకలనం గానీ, నిజాం కాలం నాటి దుర్భర పరిస్థితులు, ఆ రోజులలో తెలంగాణ ప్రజల వెతలను సరళమైన మాటలలో తెలిపే వీరి నాటికలు గానీ వేటికవే... రచయితగా వీరిని ఒక ఉన్నత స్థానానికి చేర్చాయి.
కొన్ని దశాబ్దాల క్రింద అనేక పత్రికలలో ప్రచురితం అయిన వీరి ముద్రిత రచనలను, ఇంకా అనేక అముద్రిత రచనలను భూపాల్‌రెడ్డిగారు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి సేకరించడం, దాన్ని వరప్రసాదరావు గారు తన పొట్లపల్లి ప్రచురణల ద్వారా జన బాహుళ్యంలోకి తీసుకురావడం చాలా మేలు చేసింది. రామారావుగారి రచనలను ప్రచురించిన వీరి శ్రమ వృథా కాలేదు. వీరి ప్రయత్నం కవి ప్రపంచంలో రామారావుగారిని చిరంజీవిని చేసింది.

- డా॥ కె.వి.పి. రామచంద్రరావు రాజ్యసభ సభ్యుడు 9868181184