ఎడిట్ పేజీ

మన మహానగరాల సొగసు చూడతరమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థికాభివృద్ధికి అనులోమానుపాతంగానే కాలుష్యం పెరుగుతుందని ఆర్థిక శాస్త్రం చెబుతుంది. దీనికి చక్కని ఉదాహరణ మన రాజధాని ఢిల్లీ నగరమే! గతంలో ఎన్నడు లేనంతగా, నవంబర్ మొదటి వారంలో గాలి కాలుష్యంతో ఊపిరి బిగపట్టుకోవాల్సి వచ్చింది. గల్ఫ్ నుంచి వచ్చే ధూళి కణాలు, పంట మిగుళ్ల కాల్చుట, స్థానిక పరిశ్రమలు, వాహనాలు విడుదల చేసే కారకాలు వెరసి గాలి కాలుష్యానికి కారణమని నిపుణులు నిగ్గుతేల్చారు. పరిశ్రమలు విడుదల చేసే సల్ఫర్ డయాక్సైడ్ (ఎస్‌ఒ2), నైట్రస్ ఆక్సైడ్ (ఎన్‌ఒఎక్స్)లు కలిసి సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థ కణాలుగా (పిఎమ్) అనగా మిల్లీమీటర్‌లో వెయ్యవవంతు (2.5ఎం/జి) మారి ప్రతి క్యూబిక్ మీటర్ వాయువులో 500కు చేరుకుంటే ప్రమాద హెచ్చరికగా గుర్తిస్తారు. నవంబర్ 7న మామూలు స్థాయికన్నా 9 రెట్లు పెరిగి 537కు, 8న 640 అతి ప్రమాద స్థాయికి చేరుకోవటంతో ఢిల్లీ నగర వాసులు ఊపిరి పీల్చుకోలేని స్థితి ఏర్పడింది. గత సంవత్సరం కూడా దాదాపు ఇదే పరిస్థితి. దేశంలోని మిగతా నగరాలు ఈ స్థాయికి చేరుకోకున్నా, ఇలాంటి ప్రమాద ఘంటికల్ని పసిగడుతూనే వున్నాయి.
వాయు కాలుష్యం ద్వారా కలిగే ఆరోగ్య దుష్ఫలితాలు 1990లో దేశంలో మూడో స్థానంలో వుంటే, నేడు రెండో స్థానానికి చేరుకుంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ (సిఎస్‌ఇ) విశే్లషణ ప్రకారమే, ఈ వాయు కాలుష్యం రక్తప్రసరణ, శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపడమేకాక, క్యాన్సర్ మహమ్మరిని ప్రేరేపిస్తుందని తెలిపింది. 1990లో 13వ స్థానంలో వున్న రక్తప్రసరణ సంబంధిత వ్యాధులు ప్రస్తుతం 3వ స్థానానికి, 5వ స్థానంలో ఉన్న గుండె జబ్బులు 1వ స్థానానికి, 22వ స్థానంలో ఉన్న చక్కెర వ్యాధి 5వ స్థానానికి, హార్ట్ అటాక్ 16 నుంచి 15కు మారాయని, గత 26వ సంవత్సరాల్లో చక్కెర వ్యాధి 174 శాతం పెరుగుదలతో, గుండె జబ్బులు 104 శాతంతో ప్రపంచంలోనే పై స్థాయిలో వున్నట్లు కూడా ఈ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది. ఈ మధ్యన చక్కెర వ్యాధి చిన్నపిల్లలకు కూడా సంక్రమించటం ఆందోళనకరం కాగా, ఈ వ్యాధిగ్రస్తులు 60 శాతం మహిళలే కావడం గమనార్హం! దీనికి కారణం పట్టణీకరణ, జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లేనని కూడా ఈ సంస్థ ధృవీకరించింది.
శీఘ్రవౌతున్న పట్టణీకరణను తగ్గించాల్సింది పోయి, 2014లో ఏర్పాటైన మోదీ ప్రభుత్వం 100 పట్టణాల చొప్పున దశలవారీగా స్మార్ట్ సిటీలుగా మార్చుచున్నది. 2030 నాటికి దాదాపు 50 శాతం ప్రజలు పట్టణాల్లో నివసించాలని (రోగగ్రస్తులుగా) ఆశిస్తున్నది. భారత్ లాంటి గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయ సంబంధ వృత్తులున్న దేశాన్ని, గ్రామాల్ని అభివృద్ధి చేసే పథకాలు రూపొందించాలి. కాని, దీనికి భిన్నంగా జరగడానికి గల కారణాలు, పట్టణాల్లోనైతే, వౌలిక సదుపాయాల కల్పన పేరున భారీగా నిధులను కేటాయించవచ్చని, అట్లైతేనే విదేశాల్నుంచి పెట్టుబడులు వస్తాయని, మెగా ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతున్నది. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారానే పాలకులకు వ్యక్తిగత రాబడి పెరుగుతుందనేది అచ్చుకెక్కని సత్యం! నిజానికి గ్రామాల్లో విద్య, వైద్య సదుపాయాల్ని (ఇప్పుడున్నాయిగా అనేవారున్నారు) ఆధునాతనపరిచి నాణ్యతతో అందిస్తే, పట్టణీకరణకు అడ్డుకట్ట పడుతుంది. తోడుగా వ్యవసాయ రంగాన్ని, సంబంధిత ఇతర రంగాల్ని, కులవృత్తుల్ని ప్రేరేపిస్తే, ఉపాధి అవకాశాలు కూడా మెండుగా వుంటాయి. కాని, భిన్నంగా గ్రామీణ భారతం మొత్తం పట్టణాలపైననే ఆధారపడేలా పథక రచన చేయడం రోజు రోజుకూ ఎక్కువైపోయింది. పట్టణాలపై ఖర్చు చేసే దాంట్లో 10-20 శాతాన్ని గ్రామాలపై చేసినా, ఓ దశాబ్దకాలంలో దాదాపు దేశంలోని ఆరు లక్షల గ్రామాలు బాగుపడతాయి. కాని ఇది జరగడంలేదు.
గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రక్రియ గ్లోబలీకరణతో ఊపందుకోవడం, ప్రపంచ స్థాయి బ్యాంకులు ఈ రకమైన వౌలిక (ఇన్‌ఫ్రా) సదుపాయాలకే అప్పులిస్తాననడంతో, రియల్ ఎస్టేట్ రంగం, దీంతోపాటు ఆటోమొబైల్ రంగం ఊపందుకున్నాయి. బ్యాంకులన్నీ అప్పులివ్వడంలో ముందంజలో ఉండడంతో, జనాలు ఎగబడి తీసుకోవడం, కొన్ని వర్గాల జీతాల్ని అనూహ్యంగా పెంచడంతో ఇవి మరింత జోరునందుకున్నాయి. రోడ్లు బాగుంటేనే ఆటోమొబైల్ సంస్థలు వికసిస్తాయని, పట్టణాలతోపాటు రోడ్ల వెడల్పును ముందేసుకున్నాయి. దీన్ని కలల ప్రపంచంగా చూపడంతో, ఈ అప్పుల్ని తట్టుకోలేక తనువులు చాలిస్తున్నవారు వున్నారు. అభివృద్ధినంతా కేంద్రీకరించి, రాష్ట్ర రాజధానులపైన ఖర్చుపెట్టడం మొదలైంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, చేపట్టాల్సిన పథకాలకు భిన్నంగా నివారణోపాయాలంటూ, చంద్రబాబు ఫ్లైఓవర్లకు శ్రీకారం చుట్టాడు. ఇవి అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోగా, అనేక కొత్త సమస్యల్ని తెచ్చి నగర అందాల్ని నాశనం చేసాయి. తర్వాత వచ్చిన వైఎస్‌ఆర్ మెట్రోకు శ్రీకారం చుట్టి మొత్తం హైదరాబాద్‌ను బంధించే పథక రచన చేశాడు. కాలం కలిసిరాక, ఆయన పోవడం, తెలంగాణ ఉద్యమం తోడుకావడంతో నత్తనడకన ప్రారంభమైన మెట్రో ఓ కొలిక్కి వచ్చింది. ఉద్యమకాలంలో మెట్రోను నిరసించిన కెసిఆర్ దీన్ని ఓ మణికంఠంగా భావిస్తున్నాడు. ఈ సంధి కాలంలో ఎల్ అండ్ టి నష్టాలకు గురయ్యానని, తెలంగాణ ప్రభుత్వం రూ.3,700 కోట్లు ఇవ్వాలని అంటున్నది. దీంతో కూడా కెసిఆర్‌కు లాభసాటి కాకపోవడంతో, 19 కూడళ్లలో స్కైవేల రూపకల్పనకు రూ.20 వేల కోట్లతో పథక రచన జరిగింది. ఇవి కూడా కెబిఆర్ పార్కు వద్ద, పరేడ్ గ్రౌండ్ బైసన్ పోలో దగ్గర, సికింద్రాబాద్ కంటోనె్మంట్ గార్డెన్ దగ్గర వివాదాస్పదంగా మారాయి.
ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ ట్రాఫిక్ ఫికర్ లేకుండా హాయిగా సుందరంగా వుంటుందనేది నాయకుల ఉవాచ! పోతే ఢిల్లీ అనుభవాలుగాని, ఇతర మెట్రో అనుభవాలుగాని గుర్తించని నాయకులు వీటినే అతి అభివృద్ధికరం అని ప్రచారం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ పరిస్థితేంటి, ప్రస్తుతం ఎందుకు ఇలా దిగజారింది. కారణాలేంటి, నివారణ చర్యలేంటి అనే అంశాల జోలికి పోకుండా, అభివృద్ధి అనే మంత్రదండాన్ని వాడుతూ వుంటారు. ఒకప్పుటి హైదరాబాదు, 500 పార్కులతో, సిటీ ఆఫ్ లేక్స్‌తో అలరారింది. 2000 సం.నాటి హైదరాబాద్ మెట్రో లెక్కల ప్రకారమే 20,400 హెక్టర్ల వైశాల్యంగల నీటి ఆవాస ప్రాంతాలున్నట్లు, ఇందులో 190 చెరువుల విస్తీర్ణం ఒక్కొక్కటి 10 హెక్టార్లకు పైనేనని తేలింది. ఇవన్నీ పట్టణీకరణతో అక్రమణకు గురయ్యాయి, అవుతూనే వున్నాయి. మూసీ వరదలకు అడ్డుకట్టగా 1920లో నిర్మించిన ఉస్మాన్‌సాగర్, 1927లో నిర్మించిన హిమాయత్‌సాగర్‌లు కనుమరుగు కాబోతున్నాయంటే ఆశ్చర్యం కాకమానదు. విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ, జవహర్‌లాల్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం సర్వే ప్రకారం 2000 సం.లోనే హిమాయత్ నీరు తాగే యోగ్యం లేదని తేల్చింది. కారణం, చుట్టూ ఏర్పడిన పరిశ్రమలు, విద్యాసంస్థలు, హార్టికల్చర్ ఫాంలు- ఇవి విడుదల చేసే వ్యర్థాలు నీటిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. ఈ విధానం ఇలాగే కొనసాగితే 2036 నాటికి హైదరాబాద్ ముఖచిత్రం నుంచి హిమాయత్‌సాగర్ కనుమరుగౌతుందని వీరి నివేదిక తేల్చింది.
నిర్మాణ దశలోనే అమరావతి ఇలాంటి సవాళ్ళనే ఎదుర్కోబోతున్నది. మొన్నటి గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను చూస్తే భవిష్యత్తు బాధాకరంగానే వుంటుందని అవగతవౌతున్నది. హైదరాబాద్ మెట్రోకు తానే బీజాలు వేసానని ప్రకటించుకున్న బాబు, అమరావతికి అదే సొబగును తీసుకురావాలని చూస్తుంటే, ఈ ప్రాజెక్టుల ద్వారా ఎంతగా వెనకేసుకోవచ్చోనని అనిపిస్తున్నది. కేంద్రం కూడా ఆం.ప్రకు ప్రత్యేక హోదాను కాదని అమరావతిని స్మార్ట్‌సిటీగా గుర్తించడం చోద్యం కాదా! ఉద్దానం కిడ్నీ సమస్యలు పట్టని బాబుకు అమరావతి నిర్మాణమైతే, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఇబ్రహీంపట్టణాల్ని కలిపి పంచవటి (అయిదు నగరాలు)గా అభివృద్ధి చేయాలని చూడడం వింత కాకపోవచ్చు! ఇది జరిగితేనే కదా, కార్పొరేట్ హాస్పిటల్స్ విరాజిల్లేది.
మరోసారి హైదరాబాద్‌ను నెమరువేసుకుంటే, 1940 ప్రాంతంలోనే ముత్యాల నగరంగా, కాలుష్య రహిత నగరంగా, భిక్షగాళ్లు, నేరస్థులులేని నగరంగా, దొంగతనాలు లేని నగరంగా విరాజిల్లేది. ప్రపంచంలో అప్పులంటూ తెలియకుండా అభివృద్ధి చెందిన నగరం. కాని, దీనికి భిన్నంగా పోటీపడి, హైదరాబాద్ రూపురేఖల్ని మారుస్తూ ఊపిరి ఆడకుండా చేస్తూ తాత్కాలిక ప్రయోజనాల్ని ఆశించి, దీర్ఘకాలిక రోగగ్రస్త నగరంగా మార్చివేస్తున్నారు. ఇప్పటికే పటాన్‌చెరువు ప్రాంతంలోని ఫార్మాసిటికల్ కంపెనీల వ్యర్థాలు ఆ ప్రాంత చెరువుల్లోని చేపల్ని బలిగొంటున్న కథనాల్ని చూస్తున్నాం. కెటిఆర్ లెక్కల ప్రకారం 12 వేల ఎకరాలకుపైగా భూముల్లో విస్తరించబోతున్న ‘్ఫర్మాహబ్’ ఇంకెంత విపత్తును కల్గిస్తుందో ఊహించడం కష్టమే. కాంక్రీట్ జంగిల్‌తో, సెల్లార్ల నిర్మాణంతో, విస్తరించిన రోడ్లతో భూమిలోకి కనీసం రెండు శాతం కూడా వర్షపు నీరు ఇంకడం లేదని మెట్రలాజికల్ డిపార్టుమెంట్లు చెపుతున్నాయి. దీంతోపాటు రేడియేషన్ పెరుగుతున్నది అనుభవిస్తూనే వున్నారు. ఒకసారి కాప్రా ప్రాంతంలోని జవహర్‌నగర్ డంప్ యార్డ్‌కు చూస్తే మన నగర సొగసుల మురికి, చెత్తా ఎంత ఘాటైనవో తెలుస్తుంది. కెటిఆర్, కెసిఆర్ ఆ ప్రాంతానికి పోతే (ప్రతి రోజు 4,500 మెట్రిక్ టన్నుల డంపింగ్ జరుగుతుంది) ఎంత బాగుంటుందో!
ఈమధ్యన ఎల్‌ఇడి వెలుగులంటూ గోల పెరిగింది. విద్యుత్ ఆదా అయితే కావచ్చుగాని, భూగోళమంతా రాత్రుల్లో ఈ వెలుతురుతో 2.2 శాతం చొప్పున సంవత్సరానికి ఉష్ణోగ్రత పెరుగుతున్నదని, క్యాన్సర్, డయాబెటిస్, తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరుగుతున్నదని సైన్సు అడ్వాన్సు పత్రిక తెలిపింది. పెట్టుబడి శక్తులు ఏది ఉత్పత్తి చేస్తే దాన్ని ‘ఓహో’ అంటూ కొని తెచ్చి వినియోగించడం తప్ప వాటి దుష్ఫలితాలు భవిష్యత్తులో ఎలా వుంటాయో ఏనాడూ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. పోనీ ఈ అభివృద్ధి నమూనాలు ఎంతకాలం సేవలందిస్తాయంటే ఎవరూ చెప్పరు. ఇపుడు నిర్మితవౌతున్న మెట్రో ఎన్ని సంవత్సరాలు సేవలందిస్తుందో లెక్కలేదు. ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, బెంగుళూర్‌తో సహా ఈ మెట్రో అక్కడి ట్రాఫిక్ కడగండ్లను తీర్చలేదనేది మనవారు గుర్తించడంలేదు.
మనం బాగా అభిమానించి, మన దేశమంటే, అభిమానం కలిగి, ఇప్పటికే బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించిన బిల్‌గేట్స్ నవంబర్ 17, 18 తేదీలలో భారత్‌ను, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘విమర్శ కోసంకాదు గాని, దేశ ఆర్థిక ఆదాయానికి అనుగుణంగా, విద్య, వైద్యంపై ఖర్చు చేయడం లేదని, దీంతో పిల్లల రెండో పుట్టిన (వెయ్యి రోజులు) రోజునాటికి అందాల్సిన పౌష్టికాహారం, పరిశుభ్రమైన నీరు అందక పెరుగుదలనే కాదు, బుద్ధిమాంద్యత కూడా తోడై ఉందని, భారత్‌కన్నా తక్కువ ఆదాయంగల దేశాలు జిడిపిలో 3 శాతంపైగా వీటిపై ఖర్చుచేస్తుంటే, సనాతన దేశంగానే భారత్ భావిస్తూ, కేవలం ఒక శాతం మాత్రమే ఖర్చుచేస్తున్నది..’’ అంటూ, అన్నమాటలు మన మోదీతో సహా బాబులాంటి నాయకులు ఎంతమేరకు స్వీకరించారోగానీ, వారి వీపులపై చరిచిన విషయాన్ని గుర్తించడంలేదు. ఎందుకంటే, మనవారికి తాగేనీటికన్నా సెల్‌ఫోన్లు, నీటి రీఛార్జింగ్ పాయింట్లు చాలా ముఖ్యం. నీరంటే కొని తాగొచ్చు, సెల్‌ఫోన్లు అమ్ముడుపోవాలంటే చార్జింగ్ పాయింట్లు అవసరమెంతో మన నాయకులు గుర్తించినట్లుగా ఏ నాయకులు గుర్తించరు కాబట్టి. అందుకే వీరు పట్టణీకరణ మార్గాన్ని ఎంచుకున్నారు.

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162