మెయన్ ఫీచర్

పెండింగ్ కేసుల పరిష్కారానికి కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట్లాది కేసులు పేరుకుపోయి పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయన్న విమర్శలనుండి బయటపడేందుకు సుప్రీంకోర్టు చొరవతో వివిధ హైకోర్టులు కార్యాచరణ రూపొందించాయి. వాటికి కేంద్రప్రభుత్వం సైతం ప్రత్యేక పథకం ద్వారా ఊతం అందిస్తోంది. సత్వర న్యాయం ఎంతో దూరం లేదని కోర్టులు చాటిచెబుతున్నాయి. ‘్భరతదేశాన్ని దేవుడు కూడా రక్షించలేడు, పరిస్థితులు చూసి నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప’ .... ఇది ఏ రాజకీయ నాయకుడో మరొకరో అన్న వ్యాఖ్యలు కాదు, స్వయంగా సుప్రీంకోర్టు బెంచ్ చేసిన వ్యాఖ్య ఇది. అధికార నివాసాల్లో కొనసాగడానికి సంబంధించి వచ్చిన పిటీషన్‌ను విచారించిన సందర్భంగా జస్టిస్ బిఎన్ అగర్వాల్, జస్టిస్ జిఎస్ సాంఘ్విలతో కూడిన డివిజన్ బెంచ్ చేసిన వ్యాఖ్య ఇది. వాస్తవానికి ఈ వ్యాఖ్య న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులకూ వర్తిస్తుందేమో. పెండింగ్ కేసుల వ్యవహారంపై న్యాయస్థానాలనే మనం నిందించలేం. న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలు, అసంపూర్ణ వౌలిక సదుపాయాలు, ఖాళీలు, చట్టాల్లో లోపాలు, ఫిర్యాదుదారుల తెలివితేటలు, స్వాతంత్య్రానికి పూర్వం వందేళ్లు, రెండు వందల సంవత్సరాల క్రితం నాటి బూజుపట్టిన చట్టాలు ఇలా సవాలక్ష కారణాలున్నాయి. పెండింగ్ కేసుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానానికి సైతం మినహాయింపు లేదు. అందుకే మరింత పారదర్శకంగా వ్యవహరిస్తూ అన్ని గణాంకాలను దేశ ప్రజల ముందుంచడం ద్వారా జవాబుదారీతనాన్ని ప్రదర్శిస్తోంది.
1950లో సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఏడుగురు మాత్రమే న్యాయమూర్తులు ఉండేవారు. ఆ సంఖ్యను 1956లో 11కు, 1960లో 14కి, 1986లో 26కి, 2008లో 31కి పెంచారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒకపుడు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఏడుగురు న్యాయమూర్తులు కలిసే అన్ని కేసులను పరిశీలించేవారు, కేసులు పెరిగి, న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణలు జరపడం ప్రారంభించింది. అత్యున్నత న్యాయస్థానంలో సైతం న్యాయమూర్తుల సంఖ్య చాలదనే వాదన వినిపిస్తోంది. పెండింగ్ కేసుల్లో 12 శాతం ముసలి వారికి, మరో 12 శాతం మహిళలకు సంబంధించినవే. వాస్తవానికి పెండింగ్ కేసుల గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఇంత వరకూ హైకోర్టులు 1.12 కోట్ల కేసులను పరిష్కరించాయి. కాకపోతే మరో 29 మిలియన్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ పద్ధతి ప్రకారం పరిష్కరించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో 40 ఏళ్లు పడుతుంది. తొందరగా వీటిని పరిష్కరించాలంటే అత్యవసరంగా కొన్ని చర్యలను తీసుకోకతప్పదు. కేసు విచారణ ఓ దశాబ్దకాలం పాటు ఆలస్యమైనందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల క్షమాపణలు చెప్పింది. ఒక కేసుకు సంబంధించి జిల్లా స్థాయి కోర్టు, ఉత్తరాఖండ్ హైకోర్టు రెండూ పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇవ్వడం వల్ల కేసు విచారణ ఆలస్యమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫోర్జరీ సంతకాలతో తన సోదరుడు దుకాణాన్ని ఆక్రమించినట్టు 2004లో రూర్కీకి చెందిన శ్యామలత అనే మహిళ హరిద్వార్ పొలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో జిల్లా స్థాయి కోర్టు ఇచ్చిన వేర్వేరు తీర్పులను సవాలు చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఎవరు దాఖలు చేసిన కేసులో వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ పంచాయతీ 2009లో సుప్రీంకోర్టుకు చేరింది. ఈ క్రమంలో బాధిత మహిళ చనిపోయింది. విషయం తెలిసి కోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన మొదటి తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు విచారణ నిలిపివేయాలని ఇచ్చిన రెండో జడ్జీ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది. దేశంలో న్యాయవ్యవస్థ గురించి ప్రస్తావించినపుడు నిట్టూర్చే వారికి తమ వాదనను బలపరిచే అంశమిది.
పెండింగ్‌లో 2.7 కోట్ల కేసులు
దేశంలోని హైకోర్టుల్లో 2.58 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. లెక్కా పత్రం లేని మరో 15.41 లక్షల కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. దిగువ స్థాయి కోర్టుల్లో ఉన్న కేసులు అదనం.
చట్టాల్లో అస్పష్టతే కారణమా?
చట్టాల్లో అస్పష్టత అధికంగా ఉన్నందునే న్యాయస్థానాల్లో లక్షల సంఖ్యలో కేసులో పెండింగ్‌లో ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. చట్టాల్లో పది రకాల వ్యాఖ్యానాలు ఉండటం వల్ల కూడా కేసులు పెండింగ్‌కు మరో ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. నిపుణుల కొరత వల్ల చట్టాల్లో లోపాలను తగ్గించలేకపోతున్నామని, కీలక విధానాల తయారీకి న్యాయ నిపుణులు సహకరించాల్సి ఉంటుందని కూడా ప్రధాని సూచించారు. ముసాయిదా చట్టాలను ఆన్‌లైన్‌లో పెట్టి, వాటిపై న్యాయ నిపుణుల సలహాలు, అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నా ఇంకా ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. జడ్జీల కొరత వల్ల, అసలైన నిందితులు సాక్ష్యాలను తారుమారు చేయడం వల్ల, నాయకులు, బడాబాబులు కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల చాలా కేసులు కనీసం ఒక్క వాయిదాకు కూడా రావడం లేదు. ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ సక్రమంగా ఉంటేనే కోర్టుల్లో తీర్పు రావడానికి ఏళ్లూపూళ్లూ పడుతోంది. అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో కేసుల పరిష్కారం ఎప్పుడన్నది తేల్చడం కష్టం. దీనివల్ల నిరపరాధులు, అమాయకులు, కేవలం అనుమానాలతో రిమాండ్ అనుభవించే వారు అన్యాయంగా శిక్షను అనుభవిస్తున్నారు. ఈ అంశం దేశ న్యాయవ్యవస్థ ఉనికినే ప్రశ్నిస్తోంది.
దేశవ్యాప్తంగా కారాగారాల్లో 4.19 లక్షల మంది ఉండగా, వారిలో విచారణ ఖైదీలే 2.54 లక్షల మంది ఉన్నారని జస్టిస్ బి ఎస్ చౌహాన్ అందించిన లా కమిషన్ రిపోర్టు(268)లో పేర్కొంది. నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో రూపొందించిన నివేదికలో మొత్తం జైళ్లలో సామర్ధ్యం 3.66 లక్షలు కాగా, ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య 4.19 లక్షలు. అందులో శిక్ష పడిన వారు 1.34 లక్షల మంది కాగా మిగిలిన వారంతా విచారణ ఖైదీలే. ఇందులో 42.2 శాతం మంది పదో తరగతి లోపు చదివిన వారు. మిగిలిన 28.5 శాతం మంది నిరక్షరాస్యులు. వీరిలో చాలా మంది న్యాయస్థానాలు, బెయిల్ తదితర అంశాల గురించి తెలియదు. కనీసం ఐదేళ్లపైబడి విచారణ ఎదుర్కొంటున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాస్తవానికి పలు కేసుల్లో 60 శాతం మేర అరెస్టులు అనవసరం. బెయిల్ జారీలో ఉన్న నిబంధనల కారణంగా వారంతా కారాగారాలకు వెళ్తున్నారు. ఫలితంగా కారాగారాలపై 42.3 శాతం అదనపు ఆర్థిక భారం పడుతోంది. నేరాభియోగాలు రుజువైతే విధించే శిక్షాకాలంలో సగానికి పైగా కారాగారాల్లో మగ్గిపోయిన వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. న్యాయస్థానం గుమ్మం ఎక్కిన వారికి సత్వర న్యాయం లభించాలంటే ఏం చేయాలనే విషయమై ఎప్పటికపుడు అటు న్యాయవ్యవస్థ, ఇటు ప్రభుత్వం మార్గానే్వషణ చేస్తున్నా లా కమిషన్ చేస్తున్న సిఫార్సులు మాత్రం అటకెక్కుతున్నాయి. 2008 ఉగ్రదాడిలో గాయపడిన బ్రిటిష్ పౌరుడు తాజ్ గ్రూప్ నుండి పరిహారం కోరుతూ పిటీషన్ దాఖలు చేసినపుడు భారత్‌లో కేసు తేలాలంటే కనీసం 20 ఏళ్లు పడుతుందని లండన్ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు విస్మరించలేం. దేశవ్యాప్తంగా పదేళ్లకు మించి పెండింగ్‌లో ఉన్న కేసులే దాదాపు 23 లక్షలు ఉన్నాయని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. కొన్ని న్యాయస్థానాలు వేగంగా కేసులను పరిష్కరిస్తున్నా కేసుల సంఖ్య మరోవైపు పెరుగుతూనే ఉంది.
మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో ఏం జరిగిందో అధ్యయనం చేసి ఆచరిస్తే పెండింగ్ సమస్య ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పంజాబ్, హర్యానా హైకోర్టు తన పరిధిలోని చండీగఢ్, పంజాబ్, హర్యానాల్లో ఒక నిర్వహణ వ్యవస్థను రూపొందించింది. ఒక కేసు దాఖలైనప్పటి నుండి పరిష్కరించే వరకూ ప్రతి దశలోనూ పర్యవేక్షణ ఉండే ఈ వ్యవస్థ కేసుల స్వభావాన్నిబట్టి వాటిని వర్గీకరించింది. న్యాయాధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. పాత కేసుల పరిష్కారానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. త్రైమాసిక సమీక్షలు కూడా నిర్వహిస్తూ వచ్చింది. అదే సమయంలో లక్ష్యసాధన పేరుతో కేసు లోతుపాతుల్లోకి పోకుండా హడావుడిగా తీర్పు ఇచ్చే ధోరణులు తలెత్తకుండా చూసింది. క్రిమినల్ కేసులకు సంబంధించినంత వరకూ నిందితులు రెండేళ్లకు మించి కస్టడీలో ఉన్న కేసులకు ప్రాధాన్యత ఇచ్చారు. మాదకద్రవ్య కేసులపై శ్రద్ధ పెట్టారు. క్రియాశీలకంగా వ్యవహరించి కింది కోర్టుల పనితీరును నిశితంగా పర్యవేక్షిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో చెప్పడానికి పంజాబ్, హైకోర్టు సాధించిన విజయమే ఉదాహరణ. అదే దారిలో హైదరాబాద్ హైకోర్టు సైతం ప్రయత్నించి లక్షలాది కేసులను పరిష్కరించింది. న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో పడడానికి తగిన సంఖ్యలో న్యాయాధికారుల నియామకం జరగకపోవడం ఒక ప్రధాన కారణం. న్యాయాధికారులకు సహకరించే దిగువ స్థాయి సిబ్బంది నియామకం, వౌలిక సదుపాయాల కల్పన కూడా ఒక సవాలుగా ఉంది. కోర్టులను పెంచకపోవడం, జనాభా ప్రాతిపదికగా న్యాయాధికారులను నియమించకపోవడం, ఏళ్ల తరబడి పాత లెక్కలకు అనుగుణంగా మాత్రమే నియామకాలు జరపడం మరో కారణం. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారాన్ని విశే్లషించినపుడు తమిళనాడు కింది కోర్టుల్లో సగటున ఒక సివిల్ కేసులో విచారణకు 2.95 ఏళ్లు పడుతోంది. అరియళూరు జిల్లాలోని ఒక కోర్టులో సగటు 4.65 ఏళ్లు ఉంటుందని అదే అధ్యయనం తేల్చింది. అలాగే చెన్నైలోని కింది కోర్టులు క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరిస్తుండగా, కోయంబత్తూరులోని కోర్టుల్లో నత్తనడకన నడుస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ఈ కోర్టుల్లో న్యాయాధికారులు సమంగానే ఉన్నారు. కేసుల పెండింగ్ బెడద తీరడానికి లా కమిషన్ తన 230వ నివేదికలో అనేక సూచనలు చేసింది. కేసుల్లో వాయిదాలు ఇవ్వడానికి కూడా నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉండాలని పేర్కొంది. చట్టానికి సంబంధించి సంక్లిష్టతలున్న సందర్భాల్లో తప్ప వౌలికమైన వాదనలకు ఇచ్చే సమయాన్ని తగ్గించడం, కేసు తిరిగి అప్పీలుకు వెళ్లేందుకు వీలులేని విధంగా విస్పష్టమైన నిర్ణయాత్మకమైన తీర్పు ఇవ్వడం అవసరమని చెప్పింది. ఉన్నత న్యాయవ్యవస్థలో సెలవుల సంఖ్య కూడా తగ్గాలని సూచించింది. ఇవన్నీ చేస్తూనే జనాభా నిష్పత్తికి అనుగుణంగా న్యాయాధికారుల సంఖ్య ఉండేలా చూడటం అవసరం.
న్యాయస్థానాలను పెంచడం, పెద్దఎత్తున నియామకాలు, కోర్టు హాళ్ల నిర్మాణం, ఆధునికీకరణ చేపట్టడంతో పాటు బూజుపట్టిన చట్టాలను అటకెక్కించి, వాటి స్థానే ఆధునిక అవసరాలకు అనుగుణంగా తేలికైన చట్టాలను అమలులోకి తేవడం వంటివి కొన్ని సూచనలు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 3320 కోట్ల రూపాయిల వ్యయంతో ‘నేషనల్ మిషన్ ఫర్ జస్టిస్ డెలివరీ అండ్ లీగల్ రిఫార్మ్సు’ కార్యక్రమం అమలులోకి తెచ్చింది. ఎప్పటికపుడు నిరంతర సమీక్ష ద్వారా పెండింగ్ కేసుల కారణాలను విశే్లషించి తదనుగుణ దిద్దుబాటు చర్యలు చేపడితే న్యాయవ్యవస్థ గాడిలో పడటం పెద్ద కష్టమేమీ కాదు.

-బి.వి.ప్రసాద్