సబ్ ఫీచర్

భావి పౌరులను బ్రతికించుకోలేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమి చేయాలో తెలియని అయోమయావస్థ.. మంచి చేస్తున్నామని చెడు చేస్తున్నారు.. పునరాలోచన చేద్దాం రండి.. రేపటి పౌరులను తయారుచేయడంలో మనం వెనుకబడిపోతాం.. మానవ ఒనరే ముఖ్యమైనది.. ఎన్ని యంత్రాలున్నా వాటిని నడిపించడానికి, వాటిని తయారుచేయడానికి మనిషి కావాల్సిందే.. మీరు కూడబెడదామనుకుంటున్న డబ్బును తినడానికి మీ వారసులు ఉండనక్కర్లేదా? ఆలోచించండి..

కానీ మీరు పెంచి పోషిస్తున్న పోటీ పిల్లల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. వారిని ఎందుకూ పనికిరానివారిగా నిలబెడుతోంది. మీరు కేవలం చదువు ఒక్కటే చెప్తామని నిద్ర లేచినప్పటినుంచి పడుకునేదాకా మీ దగ్గర ఉంచుకోవడం, ఇంటికి వచ్చిన తరువాత ఫోన్ చేసి చదవండి అని చెప్పడం మంచిదా? వారికి వ్యక్తిత్వ వికాసం ఎలా కలుగుతుంది? మీరు చేసే పనులు విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం కాదు బండలు చేస్తున్నాయి. దీనివల్ల విద్యార్థిలో ఆత్మన్యూనత పెరుగుతోంది. వారిలో భయం పెరుగుతోంది. పరీక్షల్లో మార్కులు రావడంలేదు అని భయపడి అసలు బతుకే లేకుండా చేసుకుంటున్నారు. ఇది మంచి పని కాదు. మీరు చేసే పనులతో భారతజాతికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నారు.

నిద్ర లేచి పేపర్ చూస్తే విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు ప్రతిరోజూ ఏదో ఒక మూల పత్రికల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అందరూ చిన్నపిల్లలు! చదువుకుని రేపటి కోసం ఎన్నో ఆశలతో జీవితాన్ని ప్రారంభిస్తున్న మొగ్గలు. వారందరూ ఎందుకిలా ఆత్మహత్యలకు పూనుకొంటున్నారు. అందరూ మనుష్యులే. గొప్ప బీద తేడాలున్నట్లే బుద్ధిలోను, సామర్థ్యంలోను తేడాలున్నాయి. అవి ఎందుకు గమనించడంలేదు?
చిన్నారుల మెదడు అప్పుడప్పుడే వికసిస్తున్న పువ్వు వంటిది. పొద్దుతిరుగుడు పూవు వంటిది. మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది. కాని దానికి ఒక హద్దు ఉంటుంది. అది ఎంత తిరగాలో అంతే తిరుగుతుంది. కాని మనం బలవంతంగా పొద్దువాలకముందే పడమర వైపునకు తిరుగు అంటే తిరుగుతుందా? ఒకవేళ బలవంతంగా తిప్పామనుకోండి ఏవౌతుంది? అది కాడనుంచి తెగిపోతుంది. పిల్లలూ అంతే. వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారి ఇష్టాన్ని, కోరికను బట్టి చదివించడమో, క్రీడల్లోనో, ఎందులోనో వారి ఇష్టాన్ని బట్టి వారిని మలపాలి. కాని వారెవరో మూడేళ్ళకే లెక్కలన్నీ చేసేస్తున్నాడని విని మన పిల్లాడిని కూడా అట్లా చదివించాలి అంటే కుదురుతుందా?
ఎవరి మేధాశక్తి వారిది. అందరికీ మేధ ఉంటుంది కాని దానికి తగ్గ విద్యనే నేర్పించాలి. అంతేకాని బలవంతంగా ఏమీ చేయలేవు. అలా చేయబోతే ఇలా ఆత్మహత్యలు చూడాల్సి వస్తుంది. ఈ విద్యార్థుల్లో ఇలా చావాలన్న ఆలోచన రావడానికి తల్లిదండ్రులు కారణం కాదా? ఒకసారి ఆలోచించండి. కేవలం ఇంజనీర్లు, డాక్టర్లే మనుష్యులు కారు. ఆ చదువే పెద్ద చదువు కాదు. పెద్ద యంత్రాన్ని నడపడానికి చిన్న బోల్టు బిగించేవాడి చదువు కూడా ముఖ్యమైనదే. ఎందుకంటే ఆ బోల్టు లేకపోతే ఆ యంత్రమే తిరగదు. ఈ సంగతిని ఎందుకు మరచిపోతున్నారు?
‘‘నువ్వు ఏమి చేస్తావో మాకు తెలియదు, మేము ఇంత ఫీజు కడుతున్నాం, నువ్వు 99 శాతం తెచ్చుకోవాల్సిందే- లేకపోతే మేము చేసిందంతా వేస్టు, వృధా.
నువ్వు ఎలాగైనా రాత్రి పగలు చదువు, పక్కవాడు చూడు ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాడో, నీకు ఏమైంది రోగం? నీకెందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి.. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ పక్కవారితో పోల్చి చూపిస్తూ పిల్లల్లో అశాంతిని కలిగిస్తున్నారు. మేము చదువులో వెనుకబడితే అసలు జీవితమే లేదని వారు మానసికంగా కృంగిపోతున్నారు. ఆలోచించి వారికి ఏ ఆధారం దొరక్క భయపడిపోయి ఆత్మహత్యలకు దారి చూస్తున్నారు. ఈ తల్లిదండ్రుల ధోరణి మారాల్సిందే కదా.. మీరు ఇలానే చదువుకున్నారా? మీ తల్లిదండ్రులు మీకు ఇదే నేర్పారా? మీరు చదివి ఉద్యోగం చేస్తున్నారు కదా! మరి మీరు చెప్పినట్లు చదివి ఉన్నారా? ఒక్కసారి వెనక్కు తిరగండి!
పది, ఇంటర్ రిజల్ట్స్ వస్తే.. వందకు వంద మార్కులు మా స్కూల్‌కే.. మా కాలేజీకే.. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది మా కాలేజే.. మీరు మా కాలేజీలో చేరండి.. తిండి, నిద్ర, చదువు అంతా మేమే చూస్తాం.. తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండవచ్చు.. అంటూ ఊదరగొట్టేస్తారు. ఎన్ని ఫస్టుమార్కులు వస్తాయి? ఎన్ని కాలేజీలకు వస్తాయి? కొంతైనా ఆలోచిస్తున్నారా? ఎవరిని మోసం చేస్తున్నారు? పశువుల కొట్టాంలాంటి స్కూల్స్, అగ్గిపెట్టెల్లాంటి తరగతి గదులు.. వాటిలో 60 మందిని కూర్చోబెట్టి చదువు చదువు అంటూ హింసిస్తున్నారు. విద్యార్థిని కేవలం చదివితే ఏవౌతాడు? లోకజ్ఞానం అక్కర్లేదా? పోటీ ఉండాలి కానీ అది చదువులోనో ఆటల్లోనో విద్యార్థులకి సంతోషం కలిగించే పోటీ కావాలి. అది పెరుగుదలకు కారణం కావాలి. దీనికి ప్రభుత్వానికి కూడా బాధ్యత వుంది. ఇట్లాంటి విద్యాలయాలపై నియంత్రణ చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని విస్మరిస్తే చేజేతులా రేపటి పౌరులను మనమే కోల్పోవడానికి కారణం అవుతాం. కనుక తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, స్కూలు యాజమాన్యాలూ, ప్రభుత్వం కళ్ళు తెరవండి. పసివాడని పిల్లల్ని నాశనం చేయకండి. వారికి అందమైన భవిష్యత్తుపై ఆశ కల్పించండి. భయం కలిగించకండి.. మీ స్వార్థాన్ని వీడండి.. ఒక్క క్షణం అసలు ఏం జరుగుతుందో ఆలోచించండి.

-జంగం శ్రీనివాసులు