రాష్ట్రీయం

అన్నీ తెగించే వచ్చా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 7: ‘కులాన్ని గౌరవిస్తా.. కానీ కులాన్ని వెనుకేసుకురాను.. ఇదే నా పార్టీ సిద్ధాంతం’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తనను ఓ కులానికి నాయకుడిగా చిత్రీకరిస్తే సహించేదిలేదని, తాను అందరివాడినని, ముఖ్యంగా భారతీయుడినని, అంతకుమించి మానవత్వం కలిగిన మనిషిని మాత్రమేనన్నారు. ఇక్కడ గురువారం జరిగిన ఉభయ గోదావరి జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు, ఎంపీలవుదామనే ఆశతో తన వెంట రావొద్దని, మార్పు కోరుకునే వారు మాత్రమే తనతో రావాలని అదే జనసేన కార్యాచరణ అన్నారు. ప్రతిపక్షానికి సత్తా ఉంటే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చని వైసిపికి చురకలు అంటించారు. దేహాన్ని నడిపించడానికి రక్తం కావాలని, అలాగే పార్టీని నడిపించడానికి శక్తి కావాలని అది మీరేనని కార్యకర్తలనుద్దేశించి పవన్ అన్నారు. ప్రభుత్వాల చేత పని చేయించడానికే రాజకీయాలని, అందుకు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేదన్నారు. ప్రకృతి వనరులను అందరికీ సమానంగా పంచడమే రాజకీయమన్నారు. ప్రతిపక్షం బలంగా ఉంటే అద్భుతాలు చేయొచ్చని, రాష్ట్రంలో ప్రతిపక్షం ఆ పని చేయలేకపోతోందన్నారు. తాను ఈ రోజు నుంచే
ప్రజాక్షేత్రంలో ఉంటానన్నారు. మానసిక శుచి, శుభ్రత లేకుండా రాజకీయాల్లో రాణించలేమని, ప్రస్తుత రాజకీయాలు జుగుప్సాకరంగా తయారయ్యాయన్నారు.
ప్రత్యేక హోదాపై ఒకప్పుడు పాములా పడగవిప్పిన పరకాల ప్రభాకర్ ఈరోజు ఎందుకు నరేంద్ర మోదీ ముందు మాట్లాడలేకపోతున్నారని పవన్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి తాను మాట్లాడ్డం లేదని విమర్శించే పరకాల తన భార్య కేంద్ర కేబినెట్‌లో ఉండగా ఏమి సాధించారని ప్రశ్నించారు. అందుకే అంకిత భావం లేని వ్యక్తులు జనసేనలో వుండకూడదని జాగ్రత్త పడుతున్నానన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం అంకితభావం లేకపోతే రాజకీయాలు వృథా అన్నారు. లోకేష్, జగన్‌లకు వాళ్ళ తండ్రులు ఇచ్చినట్టు తనకు తన తండ్రి ఆస్తులు ఇవ్వలేదని, ఒక సామాన్య పోలీసు కొడుకునని పవన్ అన్నారు.
‘మోదీ ప్రధానిగా పార్లమెంట్‌కు వెళ్లే మొదటి రోజు మొదటి మెట్టుకు దణ్ణం పెట్టుకుని లోనికి వెళ్లడం చూశా.. పార్లమెంట్‌ను మోదీ అంతటి పవిత్రంగా చూశారు, కానీ నేడు అటువంటి పార్లమెంట్‌లోకి వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టినవారు, కాంట్రాక్టర్లు ప్రవేశిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బల ప్రదర్శన వల్ల తెలంగాణ రాలేదని, ఒక ఆలోచనా విధానంతో వెళ్ళారు కాబట్టే వచ్చిందన్నారు. వచ్చే జనవరిలో 15వేల మంది కార్యకర్తలతో రెండు రోజుల పాటు సైద్ధాంతిక సదస్సును జనసేన నిర్వహించనుందని, ఆ సందర్భంగా సమస్యల పరిష్కారానికి, కాపు రిజర్వేషన్లపై తమ విధానం ప్రకటిస్తామన్నారు. కాపులకు 15 శాతం రిజర్వేషన్లు కోరినపుడు నాలుగైదు శాతంతో సరిపుచ్చడం సరికాదన్నారు. విందు భోజనం పెడతానన్నపుడు విందు భోజనమే పెట్టాలి గానీ, పెదాలకు అవకాయ రాయకూడదన్నారు. కాపు రిజర్వేషన్లపై విమర్శలు గుప్పిస్తున్న ఆర్ కృష్ణయ్య ఈ అంశాన్ని ఎన్నికల హామీగా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినపుడు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.

చిత్రం..కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పవన్