నల్గొండ

పట్టణ విద్యుత్‌కు మెరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 26: పట్టణాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో లోవోల్టేజీ సమస్యలను నివారించడంతో పాటు కాలం చెల్లిన విద్యుత్ లైన్‌లన్నింటినీ ఆధునీకరించి ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు జిల్లాకు రూ.18.54కోట్ల నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం కింద భవిష్యత్ అవసరాలను సైతం అంచనావేసి మున్సిపాలిటీల్లో విద్యుత్‌లైన్‌లను మార్చడం, నూతనంగా లైన్‌లను నిర్మించడం, పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు.
మూడు పట్టణాలకు రూ.18.54కోట్లు
సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం (ఐపీడీఎస్) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిథులను కేటాయించారు. కేవలం పట్టణ ప్రాంతాల విద్యుత్ వ్యవస్థ ఆధునీకరించే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం మేర నిధులను కేటాయిస్తుంది. కాగా రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తన సొంత జిల్లా కావడంతో ప్రత్యేక చొరవ తీసుకొని రూ.18.54కోట్ల నిధులను మంజూరు చేయించారు. జిల్లా కేంద్రమైన సూర్యాపేటకు రూ.7.93కోట్లు, కోదాడ మున్సిపాలిటీకి రూ. 5.51కోట్లు, హుజూర్‌నగర్ నగర పంచాయితీకి రూ.5.08కోట్ల నిధులను కేటాయించారు. ఈనెల 3న జిల్లాకేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పనులను లాంఛనంగా ప్రారంభించడంతో పనులు ప్రారంభమై చురుకుగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో 10మాసాల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా పనులు దక్కించుకున్న నివిత సంస్థ వారు ఆరుమాసాల్లోనే పూర్తిచేసే దిశగా వేగంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
నూతన లైన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు
జిల్లా పరిధిలోని సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలతో పాటు హుజూర్‌నగర్ నగర పంచాయతీల్లో ఈ పథకం కింద లైన్‌ల ఆధునీకరణ పనులు ఆరంభమయ్యాయి. వాస్తవానికి ఇదే పథకంలో భాగంగా అవసరమైతే కొత్తగా విద్యుత్ సబ్‌స్టేషన్‌లను సైతం నిర్మిస్తారు. కాగా జిల్లా పరిధిలో డిమాండ్‌కు సరిపడా సబ్‌స్టేషన్‌ల సామర్థ్యం ఉండటంతో అంతరాయం లేకుండా విద్యుత్‌ను అందించేందుకు విద్యుత్‌లైన్‌ల నిర్మాణం, కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు చేపడుతున్నారు. లోవోల్టేజీ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ల సామర్ధ్యన్ని పెంచుతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు 500 ట్రాన్స్‌ఫార్మర్‌లు ఉండగా ఈ పథకం కింద ఏకకాలంలో 150 నూతన ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నిధుల ద్వారా ఐదు కిలోమీటర్‌ల మేర రూ.75లక్షలతో 33కేవీ లైన్‌లను నిర్మిస్తున్నారు. అదేవిధంగా రూ.86.5లక్షలతో పాతిక కిలోమీటర్‌లు 11కేవీ లైన్‌ను, రూ.2.18కోట్లతో 11కిలోమీటర్‌లు 11కేవీ లైన్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. రూ.1.09కోట్లతో కిలోమీటర్ వరకు హెచ్‌టీ కేబుల్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా రూ.2.91కోట్లతో 150 ట్రాన్స్‌ఫార్మర్‌లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా రూ.2.46కోట్లతో 110 ట్రాన్స్‌ఫార్మర్‌ల సామర్థ్యాన్ని పెంచుతున్నారు. రూ.2.52కోట్లతో 80కిలోమీటర్‌ల నూతన ఎల్‌టీ లైన్‌ను నిర్మిస్తున్నారు. రూ.6.78కోట్లతో మీటర్‌ల మార్పిడి, అదనపు బ్రేకర్‌లను ఏర్పాటుచేస్తున్నారు.
గడువుకు ముందే పనుల పూర్తి
* ఎ.శ్రీనివాస్- విద్యుత్ డీఈ, సూర్యాపేట
జిల్లాలోని సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్‌నగర్ నగర పంచాయతీల్లో చేపట్టిన ఆధునీకరణ పనులను గడువుకు ముందే పూర్తిచేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. పది నెలల్లో పనులు పూర్తికావాల్సి ఉన్నప్పటికి ఎనిమిది మాసాల్లోనే పూర్తిచేసే కార్యచరణతో ముందుకు సాగుతున్నాం. ఈపనులు పూర్తయితే మూడు పట్టణాల్లో విద్యుత్ సమస్యలన్నింటికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పనుల ప్రగతిని రోజువారిగా సమీక్షిస్తున్నాం.

ఃకొట్లాడి సాధించిన ప్రాజెక్టు ఉదయసముద్రం
ప్రాజెక్టు త్వరగా పూర్తయితే నా జన్మ ధన్యం
మార్నింగ్ వాక్‌లో ఉదయసముద్రం పనుల పరిశీలన *సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నార్కట్‌పల్లి, డిసెంబర్ 26: ఆలోచన వచ్చేదే తరువాయి.. అమలుచేస్తూ ప్రత్యర్థులపై సూటిగా ప్రశ్నలను సంధిస్తూ నిత్యం వార్తల్లోకెక్కుతున్న సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండలంలోని వెల్లంల గ్రామంలో హల్‌చల్ సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని సోమవారం రాత్రి తన స్వగ్రామమైన బ్రాహ్మణ వెల్లంలలో బస చేసిన సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా గ్రామంలో కలియతిరిగారు. కలిసిన వారిని పలుకరిస్తూ ప్రేమను చాటుతూ తనదైన ముద్రను చాటుకున్నారు. చిన్నారులతో సెల్ఫీలు దిగి ఉత్సాహాన్ని నింపారు. అంతటితో ఆగకుండా రోడ్డెక్కి మునుగోడు- నార్కట్‌పల్లి మీదుగా వెళ్లే వాహనాల ప్రయాణికులను పలుకరిస్తూ సందడి చేశారు. అనంతరం గ్రామంలో నిర్మితమవుతున్న ఉదయసముద్రం ప్రాజెక్టు పనులను కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఉదయానే్న రోడ్డెక్కిన మంత్రి సాధారణ దుస్తులతో ప్రజల్లో మమేకమై పాదయాత్ర చేస్తూ సందడి చేశారు. అనంతరం కోమటిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఉదయసముద్రం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే తన జన్మ ధన్యమమవుతుందని పేర్కొన్నారు. తన చిరకాల స్వప్నం రైతులకు నీరందించడమేనని, ఆ దిశగానే నాటి ముఖ్యమంత్రి వై ఎస్.రాజశేఖర్‌రెడ్డితో కొట్లాడి సాధించిన ప్రాజెక్టు ఉదయసముద్రం అని గుర్తు చేశారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నల్లగొండ జిల్లా ప్రజలకు నీరందిస్తే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడానికి సిద్ధమేనని అన్నారు. ఎమ్మెల్యే వెంట నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నార్కట్‌పల్లి జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్యయాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు మేకల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి
కోదాడ, డిసెంబర్ 26: ఈతకు వెళ్ళిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మృతిచెందారు. ఈ విషాద సంఘటన కోదాడ పట్టణంలోని బాలాజీనగర్ వద్ద గల ఎన్‌ఎస్‌పీ రెడ్లకుంట మేజర్ కెనాల్‌వద్ద జరిగింది. మంగళవారం ఇద్దరు విద్యార్థులు ప్రవీణ్ (16), వేణుమాధవ్ (18) ఇంట్లో చెప్పకుండా ఈతకు వెళ్ళారు. అయతే వారికి ఈత రాదు. ముందుగా ప్రవీణ్ కాలువలోకి దూకగానే అతనిని కాపాడే ప్రయత్నంలో వేణుమాధవ్ దూకాడని ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి అర కిలోమీటర్ నీటిలో కొట్టుకొని వచ్చారని పొలంలో పనిచేసే స్థానికులు తెలిపారు. కాలేజీకి సెలవు కావడంతో ఇద్దరు మిత్రులు ఈతకు వచ్చి బలైపోయారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది. కాగా వేణుమాధవ్ కోదాడ అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్‌ఇయర్ చదువుచుండగా, ప్రవీణ్ హుజూర్‌నగర్ ఐటిఐ కాలేజీలో చదువుచున్నాడు. ఇద్దరిదీ కోదాడలో ఒకే బజారు పక్క, పక్క ఇళ్ళు కావడంతో ఆ ప్రాంతవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సర్కార్
*కేసీఆర్ సర్కార్‌కు ఓటమి ప్రజాక్షేత్రంలో తప్పదు- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి విసుర్లు

నల్లగొండ రూరల్, డిసెంబర్ 26: తెలంగాణ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పరిపాలన కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి దుయ్యబట్టారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి తదితరులతో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల రాజకీయం చేస్తుందని, నిర్బంధంగా, అక్రమ కేసుల ద్వారా సామాజిక ఉద్యమ నేత, పేదల పక్షాన నిలబడే మంద కృష్ణమాదిగను జైలులో ఉంచడం తగదన్నారు. ఇందిరాగాంధీ సైతం ఎమర్జెన్సీ విధించి ఎందరినో జైళ్లలో పెట్టినా ప్రజాస్వామ్యం ముందు ఓడిపోయారన్నారు. రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ప్రజాస్వామ్యంలో కేసీఆర్ సర్కార్ ఓటమి చవిచూడక తప్పదన్నారు. స్వేచ్ఛకు భంగం కలిగించే విధానాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం భూ నిర్వాసితులు, విద్యార్థుల పట్ల అనుచిత వైఖరి అవలంభిస్తూ వారు ఆందోళన చేస్తుంటే అణచివేతకు పాల్పడటం తగదని, ప్రపంచంలో, మన దేశంలో నియంతృత్వ పాలన గావించిన వారికి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బంగారంగా తయారైందని, రాష్ట్రం అప్పుల తెలంగాణగా మిగిలిందన్నారు. బంగారు తెలంగాణ వస్తే బాధలు తొలగిపోతాయనుకుంటే బాధల్లో మునిగిపోతున్నామన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం ఇవ్వడం తదితర ఎన్నికల హామీలను విస్మరించారన్నారు. మాటి మాటికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మతతత్వ పార్టీ అని ఓట్ల కోసం మాట్లాడటం తగదని, పేదల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లండన్‌లో గల అంబేద్కర్ నివాసాన్ని మన ప్రభుత్వం కొనుగోలు చేసిందని, బడుగు, బలహీన, దళిత వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.. ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతూనే ఉన్నారన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తున్నామని, అధికారమే ధ్యేయంగా పని చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని, త్వరలో అమిత్‌షా, జాతీయ నాయకుల పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక సాంబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాకి పాపయ్య, బండారు ప్రసాద్, మేధావి విభాగం జిల్లా కన్వీనర్ ఎం.సైదులు పాల్గొన్నారు.

టిక్కెట్ అంటే.. బస్‌దా లేక రైల్‌దా..?
* పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చురక

తుంగతుర్తి, డిసెంబర్ 26: కాంగ్రెస్ టిక్కెట్ అంటే బస్ టిక్కెట్టా..! లేక రైల్ టిక్కెటా..? అంటూ పోటీదారులకు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సూటి ప్రశ్నవేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి చాలామంది పోటీకి దిగుతున్నారని, అయితే టిక్కెట్ విషయానికొచ్చే సరికి అది తమకంటే తమకే వస్తుందంటూ గొప్పలుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత కొంతకాలంగా పోటీదారులంతా గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ నుండి పోటీ చేసే అవకాశం తమకే వస్తుందని ఈమేరకు అధిష్ఠానం తనకు టిక్కెట్ ఇవ్వడం కూడా ఖాయమేనంటూ చెప్పుకోవడం దారుణమన్నారు. అసలు టిక్కెట్ అంటే వారికి తెలుసా...? అంటూ ప్రశ్నించారు. టిక్కెట్ అంటే వారికి సింపుల్ విషయంగా మారిందన్నారు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ చేసే అవకాశం ఎవరికైనా ఉండొచ్చు కాని టిక్కెట్ తనకే వస్తుందంటూ చెప్పుకోవడంలో అర్థం లేదన్నారు. గత ఎన్నికల్లో తాను తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి అతి తక్కువ ఓట్లతో ఓటమిచెందిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈసారి ఎన్నికల్లో 1:10 అనే నిష్పత్తిలో పోటీ ఉంటుందని చమత్కరించారు. ఇంతకాలం జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించానని, తద్వారా ఈప్రాంతం వైపు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయానన్నారు. ప్రస్తుతం తుంగతుర్తిపైనే తన దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. పోటీరంగంలోతాను కూడా ఈమారు ఉంటున్నట్లు తెలిపారు. అయితే పోటీదారుల్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో లేక ఇవ్వకూడదో అనే విషయం అధిష్ఠానం చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈసారి తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని పేర్కొన్నారు. ఈసమావేశంలో పార్టీ నాయకులు దొనకొండ రమేష్, బిక్కి శ్రీను, కాసర్ల రవి, సీహెచ్.రాములు, కలకోట్ల మల్లేష్, హన్మంతరావు, ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.