సబ్ ఫీచర్

అట్టడుగు నుంచి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్రను బహుజనాక్షరాలతో లిఖించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పటివరకు గత పాలకులంతా వెనుకబడిన వర్గాలను, కులాలను పధకాలుగా మాత్రమే చూశారు. కానీ నూతన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ వర్గీయులను అభివృద్ధి పథకాలుగా కాకుండా గొప్ప మానవ వనరుగా తీర్చిదిద్దుకుని దేశ సంపదగా తయారు చేయాలని అందుకు బీసీ కమిషన్ అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిశానిర్దేశం చేశారు. బీసీ కమిషన్‌ను నియమించిన తరువాత సీఎం కేసీఆర్ మూడు గంటలు సుదీర్ఘంగా వెనుకబడిన వర్గాలవారి జీవితాల గురించి చర్చించి అందుకు సంబంధించి లోతైన, సమగ్రమైన అధ్యయన నివేదికను అందించాలని ఆదేశించారు. తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా బీసీ వర్గాల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేసిఆర్ ఆలోచించి మాట్లాడారు. దానికి పునాదిగా విద్యాఉద్యోగాలలో బీసీ(ఈ) గ్రూపునకు చెందిన ముస్లింలకు 12 శాతం, ఎస్‌టిలకు మొత్తంగా 10 శాతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమాజంలో సగభాగానికి మించిన బీసీలకు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాలకు స్వతంత్రత ఇవ్వాలని కేంద్రంపై పోరాటం చేస్తానని కేసీఆర్ చెప్పటమేగాక ఈ అంశంపై అన్ని రాష్ట్రాలతో కలసి ముందుకు సాగుతానని అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ ముందుకు వచ్చారు. కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వర్గాలకు విద్యాఉద్యోగాలలో అత్యధిక శాతం రిజర్వేషన్లు ఇచ్చిన రాష్ట్రంగా తమిళనాడు అగ్రభాగాన నిలిచింది. పార్లమెంటులో షెడ్యూల్ 9 ద్వారా 69 శాతం రిజర్వేషన్లను తమిళనాడు సాధించుకుంది. ఇంత పెద్దమొత్తంలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన తమిళనాడు వైపునకు దేశమంతా చూస్తున్న తరుణంలో కొత్తగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం తమిళనాడు తరహాలోనే తన రాష్ట్రంలో రిజర్వేషన్లు సాధించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దేశంలోని అన్ని రాష్ట్రాలను ఈ అంశంపైకి ఒక దగ్గరకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫెడరల్ వ్యవస్థలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమకున్న జనాభాను ఆధారంగా రిజర్వేషన్లను ఇచ్చుకునే హక్కు కావాలన్న నినాదానికి కేసీఆర్ ఊపిరిపోస్తున్నారు. ఇందుకోసం బీసీ (ఇ) గ్రూపులో ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీని సమావేశపరచి సభ ఏకగ్రీవ తీర్మానానికి సన్నద్ధం చేయడం, అన్ని పార్టీలు అంగీకరించడం జరిగింది. ఆ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీసీలలోని ఇతర వర్గాలకు ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుకోవలసి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 85 శాతంగా బహుజన వర్గాలు ఉన్నందున వారి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉండాలన్న అంశంలో ఫెడరల్ స్ఫూర్తి ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఓబీసీ జాబితాలోకి రాని బీసీ కులాలు ఆయా రాష్ట్రాలలో ఉన్నాయి. ప్రధానంగా బీసీల వర్గీకరణ దగ్గరకు వస్తే తమిళనాడు, రాజస్థాన్‌ల తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నారు. బీసీలు 54 శాతం మంది ఇక్కడ ఉన్నారు. వీరికి 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇప్పుడున్న విధానాల వల్ల సాధ్యం కాదు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని ఇటీవలే రాజస్థాన్ రాష్ట్ర రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది. మరి దీనిని జయించాలంటే మళ్లీ కొత్తగా వ్యూహ రచన చేసుకోవలసి ఉంటుంది. ఈ రకమైన న్యాయబ్ధమైన విధానాలకు కూడా తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టవలసి ఉంది. కేసీఆర్ తమిళనాడు తరహాలో రిజర్వేషన్లని నినదిస్తున్నప్పటికినీ ఆయన ఆలోచనల్లో మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని ఉంది. అంటే బీసీ వర్గాలలో కొన్ని కులాలు సొంతకాళ్లపై నిలబడగలిగే స్థితిలో ఉన్నాయి. కొందరి పరిస్థితి దారుణంగా ఉంది. ఎస్సీ, ఎస్టీలకంటె దారుణంగా ఉన్న బీసీ వర్గాలు కూడా ఉన్నాయి. వీరిపై మొదట దృష్టి పెట్టవలసి ఉంది. ఈ కోణంలో చూసినప్పుడు బీసీల రిజర్వేషన్లను రీ-ఆర్గనైజ్ చేసి న్యాయం చేయవలసి ఉందని కొందరు కోరుతున్నారు. బీసీ ‘ఏ’ గ్రూపులోని సంచార జాతులు బీసీలలోని ఇతరులతో పోల్చితే బాగా వెనుకబడి ఉన్నారు. బీసీ ‘డీ’ గ్రూపులో ఉప్పర కులంతోపాటు మరో రెండు సంచార జాతుల వారు ఉన్నారు. ఇది తమకు తీవ్ర అన్యాయమని ఉప్పరలు అంటున్నారు. కొన్ని బీసీ కులాలతో పోల్చితే కొన్ని బీసీ కులాలు బాగా దెబ్బతిని ఉన్నాయి. అగ్నికుల క్షత్రియులు, మంగలి, చాకలి వంటి కులాలు బాగా వెనుకబడి ఉన్నాయి. వీరికి న్యాయం జరగాలి. చాకలి, మంగలి, వడ్రంగి, కంసాలి, మేర తదితర కొన్ని కులాలు కులవృత్తి ఆధారంగా జీవిస్తున్నాయి. సంచారజాతులను ఎంబీసీలను కలిపిచూస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. బీసీలలో ఉన్న ఎబిసిడి గ్రూపులలో మొత్తం 61కి పైగా సంచారజాతుల లక్షణాలున్న కులాలున్నాయి. ఎస్సీఎస్టీలలోని సంచారజాతులను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 85 కులాలుగా ఉన్నాయి. ముస్లిం గ్రూపులలో ఆరు సంచార జాతులవారున్నారు. ఫకీర్లు, బండలు పగులగొట్టే ఖాసీంలాంటి కులాలున్నాయి. సంచారజాతులను ప్రత్యేకించి ఒక గ్రూపులో ఉంచితే ఈ వర్గాలకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో లోతుగా అధ్యయనం చేసి ఒక నిర్ణయం తీసుకుంటే పెద్దమార్పునకు శ్రీకారం చుట్టినట్లవుతుంది. బీసీలలో ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు. కులవృత్తులను విడవనివారిని, ఆ వృత్తిని విడిచి వేరే వృత్తులలోకి అడుగుపెట్టినవారు, అలాగే తమ వృత్తిని వ్యాపారంగా మార్చుకుని నిలువగలిగినవారు ఉన్నారు. ఈ బీసీ కులాలకు ఎవరి ప్రత్యేకతలు వారికి ఉన్నాయి. అలాగే వెనుకబడి ఉన్నాయి. వీరిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ముదిరాజులు, ముతరాసుల కోసం చెరువుల్లో చేపలు వేయడం, యాదవులకు గొర్రెల పంపిణీ చేసి మాంసం ఉత్పత్తులు పెంచడం, గౌడ వృత్తిలోని వారికి అన్నిరకాలుగా అండదండగా నిలవడం, మగ్గాలకు బలైపోతున్న పద్మసాలీలను ఆదుకోవడం, వారికోసం పవర్‌లూమ్ పరిశ్రమ నెలకొల్పడం, టెక్స్‌టైల్ ఉత్పత్తులు పెంచడం వంటి ప్రభుత్వ నిర్ణయాలు ఆచరణ రూపం తీసుకున్నాయి.
తెలంగాణలో సగానికిపైగా జనాభా బీసీలే. వీరిలో సగం ఎంబీసీలు, సంచారజాతులవారు. ఇప్పుడు ఎంబీసీలు, సంచారజాతులపై సీఎం దృష్టి సారించారు. అట్టడుగు వర్గాలనుంచి అభివృద్ధి మొదలవ్వాలన్నది ఆయన ఆలోచన. అప్పుడే సమర్థవంతమైన తెలంగాణగా రాష్ట్రం తీర్చదిద్దబడుతుంది. అందుకు వీలుగా చక్కటి పథకాలు ఆయా వర్గాల వారికోసం రూపొందించాలి.
తమిళనాడులో ఇలా...
విముక్త జాతుల సంక్షేమం కోసం తమిళనాడు బీసీ సంక్షేమ సంఘం కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ప్రమాదబీమా కింది లక్ష రూపాయలు, మరణం సంభవించినా, అంగవైకల్యం కలిగినా, కర్మకాండలు, బాలికలు పదో తరగతి పాసయినప్పుడు, ఇంటర్‌లో, డిగ్రీ చదువుకు లక్ష నుండి 1500 రూపాయల వరకు వివిధ అవసరాల రీత్యా నగదు చెల్లిస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డిగ్రీ చదివే వారికి కూడా ఏడాదికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడా ఫెయిల్ కాకుండా డిగ్రీ పూర్తిచేస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు. ఐఐటి, దంతవైద్యవిద్య, వివాహం, ప్రసవం, చివరకు గర్భస్రావం జరిగినా 300 రూపాయల నుంచి 6వేల రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ముసలివారికి కళ్ల అద్దాల కోసం 500, వృద్ధాప్య పెన్షన్‌గా నెలకు 400 ఇస్తున్నారు. 18-60 ఏళ్ల మధ్య ఉన్న బీసీలు ఆ సంఘంలో పేరు నమోదు చేయించుకుని పాస్‌బుక్ పొందాలన్నది ప్రధాన నిబంధన. రెండేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. ఆ పాస్‌బుక్ పోతే కొత్తదానికోసం 20 రూపాయలు చెల్లించి పొందే అవకాశం కల్పించారు. ఇలా తమిళనాడు ప్రభుత్వం ఎంబీసీ, సంచార జాతుల వారి అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అక్కడి రాష్ట్ర సర్వీసుల్లో బీసీలకు 26.5 శాతం, బీసీ ముస్లింలకు 3.5 శాతం, బాగా వెనుకబడిన బీసీలు, నోటిఫైడ్ కమ్యూనిటీలకు 25 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. కర్నాటకలో విద్య, ఉద్యోగాల విషయంలో 32 శాతం రిజర్వేషన్లు అమలులో ఉంటే, కేరళలో ఓబీసీలకు 40 శాతం, మహారాష్టల్రో ప్రత్యేకంగా వెనుకబడిన కులాలకు 2శాతం, ఓబీసీలకు 19 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.
దేశంలో తమిళనాడు, రాజస్థాన్, కర్నాటక తరువాత బీసీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ కూడా ప్రభుత్వం బీసీలకు అనేక పధకాలు అమలు చేస్తోంది. 119 ప్రత్యేక గురుకుల పాఠశాలల నిర్వహణ, విదేశాలకు వెళ్లి చదువుకునే నిరుపేద బీసీ విద్యార్థులకు 20 లక్షల సాయం అలాంటివే. తమిళనాడు ప్రభుత్వం బీసీలు, ఎంబీసీలు అని విభజన చేసింది. కానీ ఎంబీసీలు, సంచారజాతులతో బీసుల మధ్య వౌలికమైన తేడాను చూడలేదు. అక్కడ ఎంబీసీ కేటగిరీలోనే సంచారజాతులున్నాయి. తెలంగాణలో అలా లేదు. అందుకే ఇక్కడ శాస్ర్తియ విభజన జరగాల్సి ఉంది. ఇది జరగకపోతే ఆయా వర్గాలకు కేంద్రం విడుదల చేసే నిధులు నిరుపయోగం అవుతాయి. జాతీయ స్థాయిలో సంచారజాతులకు ప్రత్యేకించి రిజర్వేషన్లు లేవు. వారికి న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలి. ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది.

-జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు