రాష్ట్రీయం

ముక్కోటి ఉత్సవాలకు భద్రాద్రి ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం డిసెంబర్ 27: ముక్కోటి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబైంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న శ్రీరామ దివ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి ఉత్సవాల వేళ దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఎటు చూసినా స్వాగత ద్వారాలు, చాందినీ వస్త్ర అలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం పరిసరాలు కళకళలాడుతున్నాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా గురువారం పవిత్ర పావన గోదావరి నదీ తీరంలో స్వామివారి తెప్పోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం వేడుక జరగనుంది. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు డిసెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. నిత్యం స్వామివారికి వివిధ అలంకారాలు నిర్వహిస్తున్నారు. జనవరి 8వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనుండగా, జనవరి 9 నుంచి 11 వరకు విలాసోత్సవాలు, 13న విశ్వరూప సేవ నిర్వహించనున్నారు. ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో ప్రధాన వేడుకైన తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనాన్ని ఘనంగా నిర్వహించేందుకు రూ.50 లక్షలతో ఏర్పాట్లు చేశారు. నేడు సాయంత్రం స్వామిని ఊరేగింపుగా గోదావరి నదీ తీరానికి తీసుకెళ్లి హంసాలంకృత వాహనంలో స్వామిని ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం స్వామి జల విహారం ప్రారంభమవుతుంది. వేడుకను తిలకించేందుకు గోదావరి తీరాన్ని చదును చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. తాత్కాలిక వసతి, మంచినీరు, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామాలయంలో ఉత్తరద్వారం వద్ద స్వామివారి వేడుకను కనులారా తిలకించేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. ప్రత్యేక ప్రసాద కౌంటర్లు సిద్ధం చేశారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య బుధవారం భక్తులకు శ్రీ కృష్ణావతారంలో దర్శనమిచ్చి అభయమిచ్చారు. ఈ రూపంలో ఉన్న స్వామిని భక్తులు తిలకించి పులకించిపోయారు. ఉదయం బేడా మండపంలో ఆళ్వార్లతో కూడిన స్వామివారి ఉత్సవమూర్తుల వద్ద వేద పండితులు 200 పాశురాల దివ్య ప్రబంధం పఠించారు. అనంతరం కృష్ణుడిగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం తిరువీధి సేవగా స్వామిని ఊరేగించారు.